స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Monday, 6 May 2013

గుప్పెడు మల్లెలు-28

1.
చిగురులా ఉండాలి యోగ్యత,
జిగురులా కాదు,
ఏ పదవికైనా
2.
ముందు నడవడం కాదు,
ముందుకు నడిపించడం,
నాయకత్వం.
3.
అధర్మానికి చతుర్భుజాలు,
అలసినప్పుడే చేతిమార్పు,
మరోపార్టీకి
4.
మైక్ సెట్ల బకెట్లతో,
నినాదాల వేన్నీళ్లు,
దేశభక్తిని కడిగేస్తూ
5.
మాడుకంపు కొడుతోంది,
మానవత్వం,
విలువలు అడుగంటాయ్
6.
వాగ్ధానాల వలల్లో
ఊరపిచ్చుకలు
నువ్వూ,నేను
7.
ఉద్యమాల ప్రవాహం,
మద్యలో కట్టేసారు
పచ్చనోట్ల ఆనకట్ట
8.
లంచంపట్టిన మెడకాయ,
ఉరెయ్యాలోయ్,
చేతులుకలుపు
9.
తప్పొప్పుల పోస్ట్ మార్టం,
కళ్ళగంతలతో,
ఏమిటో ఈ దేశం.
10.
ప్రతీనేరం వెనుకా
వీరే,
కీర్తి,కాంత,కనకం
==========================
తేదీ:30.04.2013

ఆ కళ్లలో

నాగుండెలో వేల సితార్
లుషారుగా మోతపెడతాయ్,
అన్ని సితార్ల తంత్రులొకేసారి,
సుధాశృతిలో ఆలపిస్తాయ్.
విసిరేసిన,
నీఒక్క ఓరచూపుకే...

వెలుగునో, వెన్నముద్దనో,
పూవునో,అమృతాన్నో,
మధువునో,మరేదాన్నో
జడిగానో,చిత్తడిగానో కాక,
పొంగిపొర్లే వరదలా,
పూర్ణకల్లోల ఏరులా,
తాండవిస్తోంది మనస్సు,
ముసి నవ్వుల,
నీ కంటి బాసకే...

దారి దొరకక,
నా గళద్వారసీమ చెంత,
రిక్తహస్తాలతో, విముక్తికోసం
పరుగులెడుతోంది నాపాట,
క్షీరసాగరాన మునుగుతూ,
లయ తప్పని,
నీ కనురెప్పల సవ్వడికే...

శీతాచల శిఖరోజ్వల,
హిమపీఠాగ్రమున కెగసి,
శిరమునెత్తి, కరములెత్తి
ప్రార్ధిస్తుంది నా హృదయం,
విల్లు ఎక్కుపెట్టిన,
నీ కనుబొమ్మలు చూస్తే...

ఇన్ని మాటలేల,
ఆ కళ్లు,
అంబరాన దాగున్న పొదరిల్లు.
చూసిన ప్రతిసారి
స్పురిస్తుంది ఎదో మధురానిభూతి,
కాని అది అర్ధంకాని భావగీతి.
=========================
Date:24.04.2013

చీకటి


నవ్వోస్తోందిరా నాకు,
మీ అమాయకత్వాన్ని చూస్తే,
తెల్లారగానే నేనెళ్లిపోతాననుకుంటారు,
నలుపొక్కటే నా రంగు అనుకుంటారు.
పాపం... మీకేం తెలుసు,
వెలుగు దుస్తుల్లో దాగున్నది నేనేనని,
నాలో దాగున్న రంగులు వందలు,వేలని,
పట్టపగలే నా పక్కలో పొర్లే,
పచ్చి వ్యభిచారులెందరో ఉన్నారని,

అసలు నేను లేనిదెక్కడ?
రంగులు మార్చే కండువాల,
ప్రచార ప్రసంగాల గుప్తనిధిలో ఉన్నా,
చట్టం చక్రాలు నడిపే,
నోళ్లు పలికే భాష నాదే,
స్వదేశంలో చోటు చాలక,
విదేశీ బాంకుల్లో నిద్దరౌతున్నా,

దేశాన్ని కొల్లగొట్టే దొంగనాయాళ్లకు,
నల్లకోటు మడతల్లోంచి బెయిల్లుగా మారేది నేనే,
ఆకు పసరుతో పోతేదానికి,
ఆపరేషనంటూ భయపెట్టి,
చిల్లుగుడ్డని కొల్లగొట్టే,
తెల్లకోటు జేబులో సూదిమందుని నేనే,
ఎల్కేజీ చదువులకే ఎకరాలమ్మించే,
కార్పొరేట్ విజ్ఞాన కేంద్రం నేనే,

నేను... నేనే...
చీకటిని నేనే...
పగలే చీకటి,
నీ మాడు పగిలే చీకటి.
=========================
తేదీ: 15.04.2013 

Monday, 8 April 2013

గుప్పెడు మల్లెలు-27

1.
ఎక్కడో శిఖరంపై గమ్యం,
పారే నీటికింద రాయిలా
జనం
2.
జంట సూర్యుళ్ల మద్య
మండిపోతున్నా,
జడిపిస్తుంది రాత్రి
3.
ఇక్కడ బాల్యంకొనబడును
ఇట్లు,
చైల్డుకేర్ సెంటర్
4.
పెనుచీకటి ప్రస్థానం,
తొలికిరణంతో సరి
వెలుగు నీ ముందే
5.
ప్రతీ పున్నమికీ
సెలయేట్లోకడుక్కున్న,
మచ్చ పోదెందుకో... చంద్రుడికి
6.
జగమంతా ప్లాస్టిక్,
రంగు,రంగుల పువ్వుల్లో...
చాలామంది నవ్వుల్లో
7.
అక్షర దుస్తుల్లో
ముస్తాబయ్యే బ్యూటీ,
కవిత
8.
ఎందరు తాగేసినా
ఖాళీ కాదు ఎప్పటికీ,
సరుకున్న పుస్తకం
9.
ఒకప్పుడు ఓన్లీ న్యూస్,
ఇప్పుడన్నీ వాళ్ల,వాళ్ల వ్యూస్,
మన మీడియా
10.
పాలైనా,నెత్తురైనా,
రుచి తేడాలేదు
దోపిడీకి.
====================
Date:06.04.2013

Friday, 5 April 2013

//విజయనామ ఉగాది//


వచ్చేసింది,వచ్చేసింది ఉగాది,
చైత్రరధం పైన,నవచైతన్య పథంలోన,
కుసుమలతా పతాకనెగరేస్తూ,
కుహూ,కుహూ రాగాలు పలికిస్తూ,

పగిలిన కాయలో,
కాస్త బీరు మిగలకుంటుందా,
మసిలాగ,నిసి మూస్తే,
వేగుచుక్క ఊరుకుంటుందా?

చెక్కిటకెక్కిన,కన్నీటి మరకలు చెరిపేయ్,
నెత్తిన చేరిన బరువుని, నలుదుక్కులా విసిరేయ్,
బతుకుబండి,బరువు గొడవ ఇప్పుడెందుకోయ్,
తీరుతున్న కొద్దీ,ఊరే కోర్కెలపై ఊరేగవోయ్,
ఆశల గుర్రమెక్కి హాయిగా సవారిచెయ్.

బుసకొడుతూ వేసవి సై,సై అంటోంది,
నసపెడుతూ చలికాలం బై,బై అంటోంది,
మద్యలో వచ్చగా నిద్దరోతూ,
మరు మజిలీకి ఒక్క ఉదుటన దూకెయ్యాలోయ్.

ఊరికే రాలేదులే,ఈ విజయనామ ఉగాది,
నీ ఆశల సౌధానికిది, చక్కని పునాది.
*****************************
తేదీ: 04.04.2013

Friday, 29 March 2013

నేనే... నీ మనసుని

ఓయ్ మనిషీ!
నిన్నేనోయ్ మనిషీ!
నీలోనే దాక్కున్న నేను పిలుస్తుంటే,
దిక్కులు చూస్తున్నావెందుకు?
గుర్తు పట్టలేదా... నన్ను.

రెక్కలులేకున్నా అంబరాన ఎగిరేది నేనే,
పాదాలు లేకున్నా నేలంతా పరుగులుతీసేది నేనే,
కెరటాల గుర్రమెక్కి,సాగరాన్ని చుట్టేది నేనే,
పర్వతాలెక్కి ప్రకృతిని పలకరించేది నేనే,

నువ్వు పక్కదారి తొక్కబోతే,నీ డొక్కలో పొడిచి
చక్కనైన దారిలో పెట్టేది నేనే,
నువ్వు మంచితనంవైపు మొగ్గుచూపిస్తుంటే,
వంచనవైపు మొగ్గలేయించేది నేనే,
నీకు చుక్కాని నేనే,
నీ భవిష్యత్ చెక్కేది నేనే,

నాకు రూపం లేదు,
నువ్వుచూసే అన్ని రూపాల్లో నేనే
నాకు బరువే లేదు,
నువ్వు మోసే బరువంతా నేనే,
రంగు,రుచి లేదు,
నీక్కనిపించే ప్రకృతి మొత్తం నేనే,
దేవుడికి నిర్వచనం లేనట్లే,
నాకూ నిర్వచనం లేదు.

నువ్వు చేసే మంచి,చెడులకు ప్రతినిధిని నేనే.
మంచి గ్రహించడం,చెడు విసర్జించడం
నీ విజ్ఞత చెయ్యాల్సిన పని.
నన్ను మనస్సు అంటారు.
నిన్ను మనిషి అనిపించుకో...
=====================
తేదీ: 29.03.2013

Monday, 18 March 2013

గుప్పెడు మల్లెలు-25

1.
ఆకృతి లేదు,
అయినా కృతులెన్నో,
పిచ్చిమనసు.
2.
వేళ్లు దృఢమైతే
కొమ్మలూగుతాయి హాయిగా,
బాల్యం జాగ్రత్త
3.
తీరినకొద్ది,
ఊరుతుంటాయ్.
కోరికలు
4.
ఆలోచనలన్నీ
గాలిపాలే,
చిత్తశుద్ది లోపిస్తే
5.
ఆలోచనతో గిలకొట్టు,
తేలుతుంది నురగలా
సమాధానం.
6.
ఉతికారేసినట్టుంటుంది,
మనసుని...
తప్పు, ఒప్పుకుంటే
7.
నయనాలకున్న సౌకర్యం,
శ్రవణాలకి లేదు.
నప్పకుంటే,కప్పడానికి
8.
అవయవబేధం
ఎరగనిది దురద,
అంతరాలెరగనిది నోటిదురద
9.
పొద్దువాలుతున్న దశలోనూ
నిద్దురలేస్తుంది ఆశ,
బాల్యాన్ని తొడుక్కుంటే
10.
బుసకొడుతుంది విసుగు,
చెప్పిందే చెబితే...
కొత్తనీరే రుచి
===================
తేదీ: 18.03.2013