స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Friday, 21 June 2013

ఆనందం

సృష్టిలో నిర్వచనాల్లేని పదాలున్నాయ్,
కొలమానం లేని ప్రమాణాలున్నాయ్,
అవధుల్లేని అనుభూతులున్నాయ్,
అందులోని ఆనందం ఒకటి.

ఎవడిపిచ్చి వాడికానందం,
అన్నాడొక మహా పిచ్చోడు.
కాని అది పరమ సత్యం.
నిజంగా ఎవడి ఆనందానికి వాడే కర్త.

మునిపంటితో గాటు చేస్తూ,
చనుబాలుని తాగుతుంటే,తల్లి పడే ఆనందం.
తప్పటడుగులేస్తూ తానొస్తుంటే,
వినిపించే చప్పెట్లమోతకి,బిడ్డపడే ఆనందం.
చెమటోడ్చి పెంచిన కొడుకు,
తోడొచ్చి కాసేటప్పుడు,రెక్కలొంగిన తండ్రి పడే ఆనందం.
మనసిచ్చిన లలనామణి,
మురిపిస్తూ చెంతచేరితే,ఆ ప్రియుడి ఆనందం.
పుట్టినరోజుకి,పట్టుచీరతో
అభినందిస్తే,భార్యపడే ఆనందం.

అలుపులేని శోధనతో,
అంతుచిక్కని రహస్యమేదో భేదించిన,శాస్త్రవేత్త ఆనందం.
ఏడాది కష్టం,ఏపుగా పెరిగి,
గాలికి తలలూపుతుంటే,రైతుపడే ఆనందం.
కలెక్టరైన కుర్రోడు,కాళ్ళకు దండంపెట్టి
మీ ఓనమాల భిక్షే అంటే,మాస్టారి ఆనందం.

ఎన్నో ఆనందాలు,ఎన్నెన్నో ఆనందాలు...
ఆనందానికి కొలమానం మరో ఆనందమే.
==========================
Date:14/10/2012

గుప్పెడు మల్లెలు-32

1.
ఇంకొన్నాళ్ళో... 
నువ్వొకగుడిలా...
నేనొకమసీదులా.
2.
చెడగొట్టేదే లేదు.
అన్నీ మేసేగాడిదలే... 
రాజకీయంలో
3.
పుకార్లంటే ఇవేనేమో...
స్వతంత్రానికి
అరవయ్యేళ్ళంట!!!
4.
ఐదేళ్ళపరిపాలనతో,
పాతికేళ్ళ
తిరోగమనం
5.
స్వాతంత్ర్యమా
నీ ఉనికెక్కడ?
ఆగష్టు 15న మాత్రమే
6.
తరాలుమారినా...
ఈశ్వరల్లా
స్వరాలు మారలేదు.
7.
అతిగాఆశపడకు...
ఏ పార్టీ అయినా
ఇండియావాళ్ళే
8.
గాంధిబొమ్మచూస్తేనే...
ప్రభుత్వోధ్యోగి పనిచేసేది.
దేశభక్తి
9.
చారిటీట్రస్ట్ లో చారిటీ...
బందరులడ్డూలో
బందరులాగే
10.
విభజించు-పాలించు
దేవుడేనేర్పాడేమో?
ఇన్నికులాలతో
==============
Date: 15.06.2013

ఏమో?

వడదెబ్బకి,దడపుట్టి పగుళ్లొచ్చిన నేల,
తొలకరి చినుకుల సాంగత్యంతో,
ఆకుపచ్చ కోక,ఆరుబయట ఆరేసింది.

అడుగంటా నీరింకి, శల్యమై,
డొక్కనిండా,పక్కటెముకలు తేలి,
దిక్కులు చూసే ఏరు,
ఆకాశపు ఆశీస్సుల అక్షింతలతో,
సర్రునలేచి జలతాండవం చేస్తోంది.

పండుటాకులు, పక్కనేవున్న ఎండుటాకులు,
దుడుకుగాలి,దూకుడుతో రాలిపోతే,
నగ్నంగా నిలబడ్డ తరుశాఖ,
వసంతం,ప్రశాంతంగా పలకరిస్తే,
పచ్చ జెండా ఎగరేస్తోంది.

బెణికిన కాలు.. కాస్త వనికించిన,
తర్వాత కాస్త విసిగించినా,
కాలమనే ఔషధాన్ని సేవిస్తూ,
క్రమ,క్రమంగా పునఃస్థితికి చేరుకుంది.

నేలపగులుకి, వానచినుకు,
ఏరు ఎండితే, జోరు వాన,
ఆకురాలితే, నవ్య వసంతం,
కాలు బెణికితే, కాల ఔషధం.
ఎక్కడికక్కడే,ఎప్పటికప్పుడే,
ప్రతీ ప్రశ్నకూ, సమాధానం.

మరి గుండె పగిలితే...
ఒక మనసు విరిగితే...
సమాధానం????????
ఒక జీసస్ నెత్తుటిచుక్కా?
ఒక మహాత్ముడి అమృతవాక్కా?
ఏమో?ఏమో??ఏమో???
===========================
Date:12.06.2013

Wednesday, 5 June 2013

గుప్పెడు మల్లెలు-31

1.
రాతిపలక మీద,
నీటి ఓనమాలు,
టీనేజీ ప్రేమలు
2.
పశుత్వాన్ని కూడా
క్షమించేస్తావ్.
పసితనం గుడ్డవాడు
3.
ఎదిగేమొక్క ముదిరిపోద్ది,
పెద్దోడయ్యే కొద్దీ,
పలకరింపు తగ్గిపోద్ది.
4.
దహించే అగ్నికికూడా,
గ్రహించే గుణముంటుంది.
ఓపికుండాలంతే....
5.
ఎలుగెత్తి పిలిస్తే,
గుహకూడా బదులిస్తుంది.
సిగ్గు ముడివిప్పేయ్.
6.
మసిలాగ,నిసిమూస్తే
మిణుగురు ఆగిపోద్దా,
స్వయంప్రకాశం ఉండాలంతే
7.
ఊరంతా
కాంక్రీటు అస్థిపంజరాలు.
గాడితప్పిన సూరీడు.
8.
బ్రహ్మరాతమీద,
ఉన్మాది పిచ్చిగీత,
ఉగ్రవాదం.
9.
అందరం కాలంవిత్తుకి
పుట్టిన మొక్కలం.
శిక్షణుంటే,వృక్షం అవుతాం.
10.
ఎంత నీరున్న కూరైనా,
ఉడికిస్తే ఇంకిపోతుంది.
పరుషవాక్యం పవర్ఫుల్.
=================
Date: 27.05.2013

అలక ఆడవారి జన్మహక్కు

నా చూపులు రోడ్డుని కొలుస్తున్నాయ్,
మా మేడ మీదనుంచే...
నిర్మానుష్యం,గ్రీష్మతాపం కదా.
ఇంతలో అవి ఎదురింటి డాబా
పిట్టగోడ మీదకెక్కాయ్.

పేరుకి తగ్గట్టు అది పిట్టగోడే,
అక్కడో పావురం మెడరిక్కించి,
ఆదిక్కు,ఈదిక్కూ చూస్తోంది.
ఆచూపులో నిరీక్షణ,నాచూపు తాకింది.
సహచరుడికై తహ,తహలాడుతున్నట్టుంది.
అప్పుడప్పుడు,బొంగరంలా
ఉన్నచోటే తిరుగుతోంది.
మెడని కరుచుకుంటోంది.
రెక్కలు దులుపుకుంటోంది.
అబ్బో.. నిరీక్షణకి
అసహనం ఎక్కువే అనుకున్నాను.

వేచిచూసిన సహచరుడు
తటాలున చేరుకున్నాడు.
ఆనందంతో ఉప్పొంగి,
అతిశయాన్ని ప్రకటించింది.
అంతలోనే అలక ఆరంభించింది.
కాస్త దూరంజరిగి పెడముఖం పెట్టింది.

సహచర పక్షికి దిక్కుతోచక,
ప్రదక్షిణలతో ప్రసన్నం చేసుకునేందుకు,
ప్రయత్నం మొదలెట్టింది.
అయినా అలక,ఒక కొలిక్కి రాలేదు.
బహుసా ఇదంతా అలవాటే కాబోలు,
విప్పారిన రెక్కలతో విన్నపాలు సమర్పించింది.
దానిముందు సాగిలపడింది.

ఇంకేముంది...అలక దూదిపింజ అయ్యింది.
జంటముక్కుల జాతర మొదలయ్యింది.
జోరు,జోరుగా హోరువానలా మారింది.
వెంటనే కింద గదిలోకి నా ప్రయాణం మొదలయ్యింది.
అవునులే...
నా ముందు చాలా ప్రపంచం,
మా ఇల్లాలికి నేనే ప్రపంచం.

అయినా
అలక ఆడవారి జన్మహక్కు.
అది తీర్చడంలో ఉన్న సుఖం,
అనుభవించాలే తప్ప...
అధిక్షేపించడానికి మనమెవ్వరం.
వాట్ డూయూ సే ...
మై డియర్ కె.కె.
===========================
Date:31.05.2013

Thursday, 23 May 2013

గుప్పెడు మల్లెలు-30

1.
వయసేదైనా
ఒకటే
ఎదగాలనుకుంటే
2.
పూడ్చినా మొలకెత్తుతాయ్
ప్రవచనాలై,
పసవున్న అక్షరాలు
3.
అన్నీ ఊరేగింపులే
తొట్టెతో మొదలు,
పాడెతో ముగింపు.
4.
కష్టం కొలిచే
తూకం రాళ్లు,
చెమట చుక్కలు
5.
నీడకూడా భూతంలావుంది
ప్రతీవాడి చంకలోనూ,
స్వార్ధపు సంచి చూసి
6.
మైత్రీ ధూపం
పరిమళాలు,
నెత్తుటివాసన పోయేందుకు
7.
"నేను" అనేది గానుగ,
నిన్ను తిప్పేది...
అక్కడక్కడే
8.
పల్లెకు భయమేసింది.
అదిచూసి
పట్టణానికి జడుపు జ్వరం
9.
మనిషొక్కడే,
పడే ఊబి
మాదకద్రవ్యం
10.
ఒగురుస్తూనే
భరిస్తున్నాం,
వగరెక్కిన సమాజాన్ని
===================
Date: 17.05.2013

Monday, 6 May 2013

గుప్పెడు మల్లెలు-29

1.
జ్ఞాపకాల నిధులిచ్చి,
నిష్క్రమిస్తుంది.
గతం
2.
నన్నెప్పుడు నగ్నంగా
చూస్తారోనని ఆరాటం,
ఆఖరిపేజీకి
3.
అంబరాన్నీ,అవనీస్థలిని
కలిపే బంధం
చినుకు
4.
పిలిస్తే పలకదు,
చిటికిస్తే రాదు
చేరాల్సిన దూరం
5.
"కారు"కూతలతో
'పిచ్చెక్కీపోతుంది.
ఏకాంతం
6.
అడుగుతో నడక,
నడకతో పరుగు,
అవే కాళ్లు
7.
ఝుమ్మని ఎగిరొస్తూ,
గుమ్మంలో పావురం
వార్తాపత్రిక
8.
దుర్బల జ్ఞాపకశక్తికి
ప్రతీక
క్యాలెండర్
9.
వాతావరణం వడపోస్తే
పార్కు పుట్టింది,
ఖర్మ... అడివి చచ్చింది
10.
చుక్కలెన్నో రాలుతున్నా,
పక్క తిరగేస్తోంది
మేధావి మౌనం.
==================
తేదీ: 03.05.2013