స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Friday, 5 July 2013

Kanipiste

గుప్పెడు మల్లెలు-34

1.
గుడ్డిగా నమ్ము ఎవడోకడ్ని,
ఐతే గుణపాఠం,లేదా 
స్వచ్చస్నేహం నీసొంతం.
2.
విశ్వమంతా గాలివున్నా,
పంఖా కావాలి. 
అన్నిచోట్ల దేవుడున్నా గుళ్లందుకే
3.
ఎక్కువ వాడుకలో
ఉన్న భాష...
మౌనమే...
4.
గుడ్డు పగిలితే జననం,
పగలగొడితే మరణం,
నీలోంచే రా...
5.
ఒంటరితనం ఒక బడి,
అన్నీ నేర్పుతుంది.
బడిదాటితే అన్నీఉన్నట్టే
6.
నీకు తెలియని గొప్ప వేస్ట్.
నువ్వున్న స్థితి,
ఉండాల్సిన స్థితిలమద్య తేడా.
7.
మరుస్తావ్ వింటే,
గుర్తుంటుంది చూస్తే,
కానీ...అర్ధమవుద్ది చేస్తే.
8.
ఎక్కేస్తే నీదైపోదు కొండ.
గాలేస్తే కాలిముద్రల్లా...
అంతా అశాస్వతం.
9.
సమస్యలు చుట్టుముట్టాయా?
అంతా మన మంచికే,
ఎదురుదాడి ఎటువైపైనా పర్లేదు.
10.
ఇష్టమైన కష్టం,
స్వయంకృత నష్టం,
బాధించని బాధలు.
===================
Date:01.07.2013

గుప్పెడు మల్లెలు-35

1.
క్రాంతికీ,బ్రాంతికి
మద్య గీత,
నీ మనసు.
2.
వెల్లివిరిసే
ఉత్కంఠకు ప్రతీక,
ఎదురుచూపు.
3.
కొలతలకి
అందని ఎత్తులు
ప్రేమికుల ఊహలు.
4.
అక్కునజేర్చుకుంటాయ్.
అందం అగుపిస్తే,
అక్షరాస్యతున్న చూపులు.
5.
రింగుల జుట్టుకు,
పాపట కుదరనట్టు,
మనసు వినదు,ప్రేమిస్తే.
6.
పారేఏరు ఆగదు,
పసవున్నోడు...
విశ్రాంతి కోరడు.
7.
కల్తీలేని వెలుగు,
కళ్లముందే...
చీకట్లను వడబోస్తే.
8.
చెట్టు మోడు,చేను బీడు,
ఇదంతా తాత్కాలికం.
ప్రశ్న-జవాబు,ఆలు,మగలు.
9.
నోటిదురద
పరిసమాప్తం.
పీడితశ్రోత అంతర్ధానంతోనే
10.
చూపులొక అయస్కాంతం,
విసిరేయ్...
రంగుల దృశ్యాలొస్తాయ్.
===================
తేదీ: 05.07.2013

Saturday, 29 June 2013

//కనిపిస్తే//

కష్టాలు మానులకు కాదు, మనుషులకే అని ఎంతోమంది చెబుతున్నా... ఆ కష్టాలని ఓర్చుకునే శక్తి కూడా కొంతవరకే. పదే,పదే పరీక్షిస్తే బండ రాయైనా, బతుకుబండిలాగే మనిషైనా బ్రద్దలవ్వక తప్పదుగా. అలాంటి మనుషులు అయితే వ్యసనాలకి, లేదా సన్యాసానికి... మరీ నీరసపడితే ఆత్మహత్యలకి చేరువవుతారు. మత్తులో ఉన్నవాడు ఆ బాధలకి మొదటగా విమర్శించేది ఆ దేవుడినే, అలాంటి ఒక వ్యక్తి ఆ దేవుడిని ఇలా ప్రశ్నిస్తున్నడు....

పల్లవి:
----------
కనిపిస్తే నిను నిలదీస్తామని,
వినిపిస్తే నిను కదిలిస్తామని,
శిలవైనావా సామీ...
నీ మనసులో ఉన్నది ఏమీ...
నువు బదులే చెప్పరా సామీ...

చరణం:
----------
పాలతోటి తానాలు సేసి, నువు పట్టుబట్టలే కట్టి,
ఆలితోటి ఆ గోపురాన, నువు కాపురాన్నే పెట్టి,
పండగలొసే పల్లకిలోన ఊరేగే ఓ సామీ...(2)
మా ఆకలి కేకలు, ఊరేగింపులో ఇనపడకున్నాయా?
మా చిరిగిన బతుకులు, ఎలగని దివ్వెలు అగుపడకున్నాయా?
నీకు అగుపడకున్నాయా........... //కనిపిస్తే//

చరణం:
---------
దూపమేసి గంధాలు పూసి, నీకు మాలలెన్నో సుట్టి,
లాలిపాటతో ఊయలూపి, నిను నిద్దురలోనే పెట్టి,
దోపిడి సేసి, దచ్చినలిచ్చే దొరలమద్యలో సామీ...(2)
మా తడిసిన కన్నులు, ఇడిసే నీరుకి మురిసే పోయావా?
మా మడుసుల జాడని, గుడిసెల దారిని మరిసే పోయావా?
నువ్వు మరిసే పోయావా..........//కనిపిస్తే//
======================================
29.06.2013

Friday, 28 June 2013

గుప్పెడు మల్లెలు-33

1.
వెక్కిరింతంత బాగా,
కౌగిలింత నేర్వలే...
మాయలోకం.
2.
పెరిగేకొద్దీ,తరిగిపోద్ది
దాక్కునే జాగా
ముళ్ల కీర్తి కిరీటం.
3.
మన బెస్టిచ్చినా,
ఒక్కోసారి
మనం బెస్టు కాపోవచ్చు.
4.
కళ్లగంతలే
దుఃఖానికీ
సుఖానికీ
5.
ఇంటికొక్కడు చొప్పున,
రాముడొదిలేసిన,
రావణ సైన్యం.
6.
నిదురించే సింహం...
ఎవడి గురించి,
వాడనుకునేది.
7.
ముక్కు చెక్కితే బాణం,
మద్య పొడిస్తే గానం,
వెదురు బహుచిత్రం
8.
రెండే దిక్కులు.
ఉత్తరం,దక్షిణం
ఉద్యోగానికి
9.
బాధించేవన్నీ
చెడ్డవికావు.
నాన్న కొట్టిన దెబ్బల్లా
10.
తెల్లోడొదిలెల్లిన మచ్చలు...
సారి, థాంక్స్...
తప్పుకైనా,మెప్పుకైనా
===========================
తేదీ: 25.06.2013

ప్రకృతి-వికృతి

గబ్బిలంలా ఆకాశాన్ని
అతుక్కున్న మేఘం,
వర్షం రూపంలో
విషం కక్కుతోంది.

తన పిల్లల్ని తనే తినే,
పెద్ద పులిలా...
ఉత్తరాన ఎత్తుగావున్న కొండచెరియ,
ఊడిపడి విద్వంశం సృష్టిస్తోంది.

కీటకాన్ని చప్పరించే
రాకాసి బల్లిలా...
సాయానికెళ్లిన హెలికాప్టర్ని,
ఈదురుగాలి కూలుస్తోంది.

కోడిపెట్టని ఎత్తుకెళ్లే గుంటనక్కలా,
మందాకిని, మందిని ముంచేస్తోంది.
శివాలయం మొత్తం
శవాల కంపుతో నిండిపోయింది.

ఎవడంటున్నాడు ఇంకా ఇక్కడ,
ప్రకృతి అందమైనదని...
ఇన్ని వికృతి చేష్టలు చూసాక కూడా...
======================
Date: 28.06.2013

Saturday, 22 June 2013

ప్రయాణం

ఇదొక ప్రయాణం,
రహదారిలా కనిపిస్తుంది,
ఎడారిలా ఎదురవుతుంది.
ఎంత లోతుకెళ్ళినా ఒక్కోసారి,
చమురుచుక్కైనా చెమరించదు.

ఇదొక ప్రయాణం,
రోడ్డుమీద,నడ్డివిరుస్తూ నడవాలనిపిస్తుంది,
అంతలోనే అడ్డదారి సందుల్లో కాలు నడుస్తుంది.
మందలో ముందుకు పోయే ముఖాన్ని,
ఎవరు గుర్తు పడతారులే అనుకుని,

ఇదొక ప్రయాణం,
ఒక సుదీర్ఘ వాక్యం. 
పాడెక్కినప్పుడే ఫులుస్టాప్,
వాక్యం పూర్తి చెయ్యాలనుంటుంది.
కామా మంచం మీద 
కునికిపాట్లు పడుతుంటుంది.

ఇదొక ప్రయాణం,
జారిపడని కాలుంటుందా???
గాయపడని గుండె ఉంటుందా???
రంకెలేసి గర్జించాలని ఉంటుంది.
సంకెలేసిన గొంతు సకిలింతలతో సరిపెడుతుంది.

కానీ... ఇదొక ప్రయాణం,
ప్రయోగం చేస్తేనే ప్రకాశం,
ప్రయత్నిస్తేనే వికాశం,
మంచుపొగలా మూల్గుతావెందుకు అనుదినం, 
మండే నిప్పులా గుప్పుమనాలి కనీసం ఒక్క క్షణం.
===============================
22.09.2012