స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Wednesday, 2 July 2014

ప్రయాణం-గజల్

అనుభవాలు ఎన్నున్నా, తుదకు మిగిలేవి కొన్నే
అనుబంధా లెన్నున్నా, ఎదను మీటేవి కొన్నే
...........................................................
పడినపుడే బడిగంట, గుర్తు చేసుకోమంట
పరుగులెన్ని పెడుతున్నా, అడుగులు నేర్పేవి కొన్నే
...................................................................
దొరలచెంత చేరినంతనే, మరిచావా మాతృభూమినే
పూటకూళ్లు ఎన్నున్నా, ఆకలి తీర్చేవి కొన్నే
...................................................................
నీ కాలిన ముల్లు విరిగితే, తన కంట్లో నీరు చిమ్మెనా
పరిచయాలు ఎన్నున్నా, స్నేహం పంచేవి కొన్నే
..................................................................
మీ నాన్న చెమట వాసన, మరచిపోకు విమానయాన
జ్ఞాపకాలు ఎన్నున్నా, బోధన చేసేవి కొన్నే
..................................................................
"కోదండ" జీవనయానం, అంతులేని ఓ ప్రయాణం,
వీడుకోలు లెన్నున్నా, బరువైన గుండెలు కొన్నే
===============================
Date: 24.06.2014

గుప్పెడు మల్లెలు-77

1.
కురులు చిక్కగావుంటే,
కొప్పు కుదరడం సులభం,
మంచోడన్నాక...గుర్తింపు సహజం
2.
చెప్పేదెప్పుడూ తెలిసిందేగా,
వినడం మొదలెట్టు... సామిరంగా,
ఒక్క విషయమైనా తెలుస్తుంది...నీ మీదొట్టు. 
3.
ఒంటి సత్తువ తగ్గిందంటే,
ఉండదులే పెదవిమోహం,
కట్టె కాల్తున్నా... చావదులే పదవిదాహం.
4.
సృజనశక్తి నశిస్తే,భజనపాటే శరణ్యం,
రోజూ నువు కొత్తగా పుట్టకపోతే,
నీ ఉన్నతి అన్నది శూన్యం.
5.
తంబాకు నోటికి, జిలేబి సహిస్తుందా?
పెడమాటలు వినే చెవికి,
ప్రియసూక్తి రుచిస్తుందా.
6.
పెరిగిన జుట్టుకి, పెట్టిన విగ్గుకి
తేడా గుర్తించడం ఏమంత కష్టం,
కళ్లలోకి చూడు,తాత్పర్యం స్పష్టం.
7.
పదార్ధాల కల్తీ పాడుచేసేది దేహాన్నే,
పడకండిరా యువతా! మత్తులో...
పూర్తిగా ఆర్పేస్తుంది దేశాన్నే
8.
నటించే చిరునగవుల కన్నా,
నయం సుమా కసిరే బెత్తం,
మాట కాదు... మనసు చూడరా నేస్తం.
9.
అందమైన చందమామది,
మచ్చనెందుకు వెదుకుతున్నావ్?
చచ్చేటంత చిరాకుతో, బ్రతికి ఏం సాధిస్తావ్.
10.
కుక్కలు విస్తరికై కుమ్ముకుంటున్నాయ్,
పదవికోసం నాయకుడొకడు...
'చీ'అంటే అవి పోతాయ్, ఏమనాలో ఇపుడు.
==========================
Date: 17.06.2014

గుప్పెడు మల్లెలు-76

1.
భయమెందుకోయ్,బ్రతుకంటే
బయటికంపేదెవ్వడు,
బతికుండగా నిన్ను
2.
మధువిచ్చి దీవించాడు దేవుడు,
మహాప్రేమ మనిషంటే,
రోదిస్తున్నాడు,మంచినీళ్లబదులు వాడేస్తుంటే
3.
జాలిపడే విషయం ఏంటంటే,
గాలివాటం మనం మార్చలేం,
తెలివైనోడికే తెలుస్తుంది దాన్ని వాడుకోవడం
4.
నీకు గుర్తుపట్టడం తెలిస్తే,
పక్కనున్నోడి ప్రతిభని...
నీ ప్రతిభ తెలుస్తుంది,ఎవ్వరైనా కొలిస్తే
5.
తప్పదులే... అప్పుజేసైనా
ఆర్భాటంగా చేస్కోవాలి,
పెళ్లి,చావు పదిసార్లు రావుగా
6.
నీ అనుమతిలేకుండా,
చిన్నబుచ్చేదేదీలేదు,నిను లోకంలో
బాల్యంలోనే బలమొస్తుందోయ్ శోకంలో
7.
చీకటిని,మరో చీకటి తొలగిస్తుందా?
ఎవడో 'చీ' అన్నాడని,పేచీపడకు,
ప్రేమే గెలుస్తుందోయ్ కడకు
8.
విజ్ఞానికే హద్దులు... ఊహలకుంటాయా?
నువు వినని కధలున్నాయ్, నీలో
విను... నిజాలవ్వక ఊరుకుంటాయా?
9.
సివరాకరికి సివాలెత్తేది,
ఆడెవడో తిడితే కాదు,
మనోడు... అన్నోడు, మాట్టాడకుంటేనే
10.
నిరీక్షణ బాధిస్తుంది,
మరిచిపోవడం వేధిస్తుంది,
కానీ, ఆ గాయం శోధిస్తుంది.
=======================
Date: 13.06.2014

Saturday, 14 June 2014

గుప్పెడు మల్లెలు-75

1.
భోజనం అరక్కపోతే,
డైజీన్ గోళీలుంటయిరా,

కారణాలు చెప్పాలంటే,పురాణాలే ఆసరా
2.
సుఖమైనా,దుఃఖమైనా కన్నీళ్లే,
కోరుకోరోయ్ ముందు నెంబరే,
టైం మిగులుద్ది, తుడవక్కర్లే
3.
కాంతివేగం లేదులే,
ఏ చరానికి లోకంలో...
ౠజుమార్గం లేని రూమర్లకు తప్ప
4.
ఈత రానోడు ఏట్లో పడ్డట్టే,
కొత్తగా మనం ఏం నేర్చుకుంటున్నా,
గజీతగాడైనా, మొదటిరోజది మామూలే
5.
గుడ్డుమార్నింగ్ అన్నమాటే,ప్రతీనోట
శుభం ఆడికో, ఈడికో చెప్పకుండా
నమస్కారాలు మునిగినట్టున్నాయ్ నట్టేట
6.
ఈ ప్రపంచం ఒక నాటకరంగం,
మనమంతా పాత్రదారులం,
ఓరి దేవుడా! ఏమిటీ చెత్త నటవర్గం.
7.
సారాయి మరిగినోడైనా,
బారునొదిలేస్తాడేమో కాని,
గ్రంధం మరిగినోడు,ఆ బంధం వీడిరాడు.
8.
ఒట్టేసి మరీ చెబుతారు అబద్దాలు,
అదేదో బులెట్ ప్రూఫ్ జాకెట్లా,
నిజం షార్ప్ షూటర్రోయ్, గురెప్పుడూ బుర్రకే
9.
మరుపన్నది అలవాటైతే,
మంచి సాధన చేసినట్లే...
విచక్షణలో గౌరవ డాక్టరేట్ పొందినట్లే
10.
విజయం నాదేనంటే... అవకుండానే యుద్ధం,
విషయమ్మీద అవగాహన లేదని అర్ధం,
దానికి మరోపేరే అహంకారం.
==========================
Date: 03/06/2014

గుప్పెడు మల్లెలు-74

1.
గంట, ఘడియైపోద్ది అమ్మాయితో మాట్లాడుతుంటే,
ఘడియ, గంటైపోద్ది ఇంటర్వ్యూలో కూర్చుంటే,
కె.కె. తేడా ఎక్కడుందంటావ్?
2.
పాడులోకం అనుకుంటే అంతా ఈజీనే,
బాగుచేద్దాం అనుకుంటేనే...
రోజు ప్లానింగైనా కష్టమే
3.
"నేనేమనుకున్నానంటే"
అని ఎప్పుడూ అనకు,
ఎందుకనున్నావో కూడా చెప్పాల్సొస్తది.
4.
మతం చెబుతోంది మనుషుల్నొదిలేసి....
అక్కడెక్కడో దేవుడున్నాడని,
డబ్బులిస్తేనే కనబడతాడని.
5.
చరిత్రకి జాలెక్కువేమో,
అస్సలు కాదనదుగా...
కధలెన్ని అల్లిచెప్పినా...
6.
చాలాసార్లు...నోరు డెలివరీ చేసేలోపే,
బుర్ర నాలిక్కరుచుకోమంటుంది,
అందుకేనేమో థింక్ ట్వైస్ అనేది.
7.
కాలం ఒక మహా ఔషధం,
ఎక్కువగా వాడితే...
అయిపోతుందోయ్ అదే విషం
8.
బాల్యం,యవ్వనం,వృద్ధాప్యం...
అన్నింటికీ ఉందోయ్ కాల పరిమితి,
అజ్ఞానమ్మాత్రం ఒదిలేసావెందుకోయ్ భగవతి.
9.
పక్కోడు చేసిన తప్పులైనా,
అవన్నీ నీకు పాఠాలేరా నాన్నా,
అంత టైంలేదు అవన్నీ ఓసారి చేద్దామన్నా
10.
కష్టపడితేగానీ గెలవలేం,
గెలిచాక మరింత కష్టపడతాం,
అందుకు ఆనందిస్తున్నోళ్లెందరోనని
=========================
తేదీ: 15.05.2014

Thursday, 8 May 2014

గుప్పెడు మల్లెలు-73

1.
నిన్న భూతం,రేపు అనుమానం,
నేడొక్కటే నిజం, అందుకే...
అది కాలం అందించిన "వర్తమానం"
2.
అందరికీ తెల్సిందే జీవితం చిన్నదని,
అయినా వీళ్ల దుంపతెగ,
తొంగి చూడ్డమెందుకో పక్కోడి జీవితంలోకి...
3.
అడిగింది లేదని చెప్పకుండా,
ఉన్నదేదో తెచ్చేసే హోటల్ సర్వర్లా,
అదృష్టం బహుచిత్రం సుమీ
4.
బాల్యంతోనే బతుకు ముగిసిపోద్ది,
మిగిలిందంతా చావే,
కప్పెట్టడమో,తగలెట్టడమో లేట్... అంతే
5.
ఇప్పటి బిజీలైఫ్ 120లో పరిగెడుతోంది,
చమురుకోసం చూసి 40లోకి తెచ్చామో,
చెమట చమురుతో నడపాల్సొస్తోంది.
6.
ప్రతీ కుక్కకి ఓ రోజుందట,
ఆ రోజు ఎప్పుడొచ్చిందో,
ఎప్పుడు పోయిందో తెలీలా... పాపం.
7.
పిల్లల బతుకుల కోసం,
బిల్డింగులు కడుతున్నారు,
చెట్లునరికి సమాధులూ కడుతున్నారు.
8.
"బాలు" మైకు బదులు బ్యాటు పట్టుకుంటే,
ఆయనా తిట్టుకునేవాడు నీలాగే,
అందరూ ప్రతిభున్నోళ్లే... ఎక్కడుందో తెలీదంతే
9.
పుస్తకాల్లో ఆరోగ్యం చదవకు,
అచ్చుతప్పు పడిందో...
అనుమానంతోనే పోతావ్.
10.
చాతీ సంకోచ,వ్యాకోచాలు పీల్చే దమ్ము మీదే,
జీవితంలో చీకటి,వెలుగులు
కె.కె. నువ్వు చూపించే ధైర్యమ్మీదే
=====================
Date: 05.05.2014

Monday, 5 May 2014

గుప్పెడు మల్లెలు-72

1.
దీపం ఉంటేనే వెలుగివ్వగలమా?
దీపాన్ని అద్దంలో చూపించినా వెలుగే,
మనసుండాలంతే... మార్గాలెన్నో
2.
పచ్చిమాంసం తినేవాడికి,
బచ్చలికూర రుచిస్తుందా?
వాగ్దానాలు ఎన్నిజేసినా......
3.
అర్ధంకాని పద్యంలో
అలంకారాలు ఎన్నుండి ఏం లాభం?
పై,పై మెరుగులతో రాదులే ఆత్మసౌందర్యం
4.
చీకట్లను తోలే పొద్దంటే,
గుడ్లగూబకు చిరాకే,
మంచిజేసినా మాటొస్తది, ఒదిలేయ్.
5.
సుష్టుగాతిని తొంగుంటే అది భోగం,
పక్కనోళ్లు కాకుల్లా పొడుస్తున్నా,
పక్కమీద ఒళ్లుమరిస్తే, అదే యోగం.
6.
జుట్టన్నాక చిక్కుపడుతుంది,
సర్దుకుంటే పాపట కుదురుతుంది,
అదేపనిగా దేవుడ్ని చిరాకెట్టీక
7.
చెట్టు పచ్చగుంటుందా, చీడ వేరుచేరాక,
బడికెళ్లే బచ్చాగాడికెందుకోయ్,
కులం కాలమ్మ్... చెరిపేయ్.
8.
దొంగరాకుండా కట్టడిచేస్తావ్,
దుస్వప్నం రాకుండా ఏం జేస్తావ్?
మంచోడిగా బతకాలంతే... వేరే దారేలేదు.
9.
ఎద్దు వీపుమీద పుండుని,
గెద్ద,కాకి ఎందుకు పొడుస్తాయ్?
నోటిదురదకి మందులేదు, ఎదవల్ని వెలేసెయ్.
10.
పుట్టిన బిడ్డని, కుట్టిన గుడ్డని
చూసినప్పుడు ఎవరికైనా తృప్తే,
ఎవరు ఆనందించరోయ్ కె.కె, మంచిమాట చెప్తే.
==========================
Date: 07.04.2014