స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Wednesday, 2 July 2014

ఆకాశానికెత్తేస్తున్నారు మోడీని, నిజానికి అంతుందా?

నేను రాసిన ఒక మల్లె...
"ఓడినోడి కారణాలు వినేదెవ్వడు
గెలిచినోడ్ని కారణాలు అడిగేదెవ్వడు"

ఆహా మోడీ, ఓహో మోడీ అని మీడియా, మన జీవితాల్లో గొప్పమార్పొస్తొందోయ్ అని ఒక సామాన్యుడి ఆకాంక్ష, రానున్న రోజుల్లో చిన్న పరిశ్రమలకి పెద్దపీఠని ఎదుగుతున్న వ్యాపారస్థుడి ఆశాభావం, నదుల అనుసంధానమట అన్ని కాలాల్లో నీటి ఎద్దడి ఉండనే ఉండదట ఒక సన్నకారు రైతు ఆశ... ఇలా అన్ని వర్గాలవారు ఆశగా ఎదురుచూస్తున్న పరిపాలన... ఇదంతా జరిగి సస్తుందా అని ఒక నిరాశావాది మూతి విరుపు (చివర్లో కొసమెరుపు). బీజేపీ సర్కారనో, NDA సర్కారనో కాకుండా ఇస్ బార్ మోడీ సర్కార్ అని ఊదగొట్టేస్తున్న మీడియా... ఇలా నమో మంత్రం జపిస్తున్న ప్రజలకి ఇతగాడు ఏం జేస్తాడంటారు? వీటన్నిటికి ఇతగాడు అర్హుడేనా? టీ కప్పుల స్థాయినుంచి, పార్లమెంటు మెట్లెక్కిన ఇతగాడు అదృష్టవంతుడా? అద్వితీయ ప్రతిభావంతుడా?

వివరాల్లోకి వెళితే... అదే కె.కె విశ్లేషిస్తే
అంతః కలహాలు:
ఇంట గెలిచి, రచ్చ గెలవాలన్నది పెద్దల మాట. సంవత్సరం క్రితం సైన్యాధ్యక్షుడిగా నియమించ బడ్డప్పుడు, పెదవి విరిచిన పెద్దలెందరో... అద్వాని, సుష్మా, మురళీ మనోహర్ల రూపంలో... అందరిని ఒప్పించి, మెప్పించి ఒక తాటిపైకి తీసుకు వచ్చాడు.

వ్యక్తిగత విమర్శలు:
మత చాందసవాదిగా ముద్రవేసి ప్రచారం చేసిన మైటీ కాంగ్రెస్, సాక్ష్యంగా గోద్రా ఉదంతం... గుజరాత్ రాష్ట్ర అభివృద్ధిని ఉదాహరణ చేసి ఆ మచ్చని తుడిచేసాడు.

రాజకీయ నాయకుడు:
మతతత్వ పార్టీగా అభివర్ణిస్తూ, పార్టీకి పూర్తి మెజారిటీ వస్తే లౌకిక రాజ్యం రూపురేఖలు మారతాయంటూ ప్రచారం చేసిన UPA కి అదేరీతిలో సమాధానం చెప్పి వారి అవినీతి పాలనని ఎండగట్టిన వైనం.

రాజనీతి:
బలమైన ప్రాంతీయ పార్టీలున్నాయని గ్రహించి స్నేహహస్తం అందించే ప్రయతం... కాదన్న వారితో బల ప్రదర్శనకి దిగిన వైనం.
చివరగా ...
నాయకుడు:
1. పార్లమెంటు గుమ్మానికి తన తల తాకించిన భక్తిభావం.
2. పెద్దలెందరో పెదవి విరుస్తున్నా సార్క్ దేశాలకు పదవీ స్వీకరణ మహోత్సవానికి ఆహ్వానంతో సంఘీభావం.
3. UPA ప్రభుత్వం అనుసరించిన మంచి కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని ప్రకటించి, శతౄవు హృదయాలని కొల్లగొట్టిన వైనం
4. ధీటుగా పోటీ ఇచ్చి గెలుపొందిన తమిళ, బెంగాలీ సోదరీమణులతో కలిసి పనిచేద్దాం అని ప్రకటించి, వారుకూడా NDA వైపు మొగ్గుచూపే తరహాలో ప్రోత్సహించడం.
5. పదవులకోసం సిఫార్సులొద్దని ఖరాకండిగా మాట్లాడిన పాలనా దక్షత.
6. కక్ష్య సాధింపులు ఉండవని తేల్చిజెప్పిన ముక్కుసూటి వ్యక్తిత్వం.
7. చెప్పినట్టుగానే నల్లధనంపై, తొలి ఉక్కుపాదం మోపేందుకు చర్యలు చేపట్టిన కార్య నిర్వహణాధికారం.

ఇన్ని లక్షణాలున్నప్పుడు "నమో" అని జపించడంలో తప్పులేదేమో? ఏమంటారు?

నేను రాసిన మరో మల్లె...
"ముందు నడిచేవాడు కాదు,
ముందుకి నడిపించేవాడు,
నాయక్య్డంటే"

కడుపా... నీకు సలాం

సమయం 1.30, ఆకలి దంచేస్తోంది. ఖర్మ... ఆదివారంకూడా ఆఫీసు ఏమిటో, బాసు పెళ్లాం ముండమొయ్య. ఆదివారం అలార్మ్ మోగిన వినపడి చావదుగా మనకి... అది మన బద్దకానికి పరాకాష్ట. వెళ్లాలని ముందే తెలిసినప్పుడు ఒక్క అరగంట ముందే పక్కమీదనుంచి లేస్తే, కాస్త టిఫిన్ తిని ఆఫీసుకి తగలడేవాళ్లం. ఈ బండివాడికి ఆదివారం వచ్చేసరికి, బండి ప్రాబ్లంస్ గుర్తొస్తాయి. డ్రాపింగు మాత్రమే చెయ్యగలను సార్ అని, డ్రాప్ చేసి చక్కా ఉడాయించాడు. ఖర్మకాలి వేరేవాడి బండి ఎక్కాల్సి వచ్చింది. ఈ బండివాడు వీధి,వీధి తిరిగే మున్సిపాలిటి ఎద్దులా అన్ని చోట్ల ఆపేస్తున్నాడు. దానితోపాటు పెద్ద సౌండుతో హిందీ పాటలొకటి. ఖర్మ... చెమటకంపుతో చస్తున్నాం ఆ ఏ.సీ. కాస్త పెంచి చావరాదు. ఈ చర్చి రూట్లో తీసుకొచ్చి చచ్చాడు. రోడ్డుమొత్తం జాం అయ్యి చచ్చింది. ఈ బళ్లు తీసేదెప్పుడు? నేనింటికి తగలడేదెప్పుడు? రోడ్లు తవ్వేసారు... వీళ్ల మొహమ్మండ, ఈ పైపులైను వర్క్ వీల్లెప్పుడు చేసి తగలడతారో... అయినా వీటి గురించి ఎంత తక్కువ మాట్టాడుకుంటే అంత మంచిది. ఎవడికైనా బుర్రుండి సస్తేగా. ఒకడు రోడ్డువెయ్యడం, వేరేవాడు తవ్వడం. అబ్బో నాతిట్లు పూర్తవ్వకముందే ఇల్లు చేరుకున్నానే... అబ్బే 2.30 అయ్యింది. తొందరగానే తగలడ్డాం. ఏం వండిందో ఏమో? కాస్త రెండు చెంబుల నీళ్లు ఒంటిమీద పోసుకుని రావాలి. అబ్బో టమాటా పప్పు, వంకాయ కొత్తిమెర కారం,సాంభార్, ఫేవరెట్ ఆవకాయ... గడ్డ పెరుగు. శెహభాష్.

అమ్మయ్య... ప్రాణం కాస్త కుదుట పడింది. ఒక్క దమ్ము వెలిగిస్తే మజాగా ఉంటుంది.


సమయం 3.30 పాపం ఆ బండి ఆయన ఇలా అందరినీ డ్రాప్ చేస్తూ ఆయనెప్పుడు ఇల్లు చేరతాడో? ఆయనెప్పుడు తింటాడో? Happysu సోమవారం మద్యాహ్నం ప్రెసెంటేషన్ రెడీ అయిపోయింది, లేకపోతే బాసుతో సైతం నేనూ పరుగులెత్తాల్సి వచ్చేది. అయినా ఆయన మాత్రం కావాలని ఆదివారం రమ్మన్నాడా? ప్రెషర్ అలాంటిది. ఆయన ఎక్స్పీరియన్స్ ముందు మనమెంత? ఆ కిషోర్ కుమార్ పాట చాలా బాగుంది. మళ్లీ, మళ్లీ గుర్తొస్తోంది. కనీసం ఆ మాత్రం కాలక్షేపమైనా లేకపోతే డ్రైవర్ చిరాకెత్తిపోడు. పాపం అదే ఏ.సీలో వాళ్లూ రోజూ తిరుగుతున్నారు, ఎంత కష్టమో? పాపం చర్చిదగ్గర ప్రార్ధన చేసుకుంటుంటే ఎంత తప్పుగా అనుకున్నాను. మనం చేసే భజనలకి వాళ్లెప్పుడన్నా అలా అనుకున్నారా? మూడు రోజులకో పూజచేసి మనం ఊదర గొట్టెయ్యమూ. మంచినీళ్ల కోసం పైపులైను వేసేవాడు తవ్వక చస్తాడా? మనకు ముందే తెలిసిన ఆఫీసు పనిని సరిగ్గా ప్లాన్ చేస్కోలేదు. ఇంత పెద్ద ఊరికి కావాల్సిన నీళ్లు ప్లాన్ చెయ్యడం అంత సులభమా? ఎంత శ్రమ పడితే వాళ్లు ఈ స్థాయికొచ్చారు. అబ్బా... భుక్తాయాసంగా ఉంది. పాపం నాకు వేడి,వేడి అన్నం వడ్డించి... నేను తిన్నాక తను తిని, అన్నీ కడుక్కుంటోంది. డామిడ్... నేను ఉదయం సరైన టైముకి లేవక, వీళ్లందరినీ ఇన్ని మాటలు అనుకోవడం తప్పుగదూ...
ఓసి నీయమ్మ కడుపుమాడ, జానెడు లేవు... బారెడు మనిషి ఎన్ని తప్పులు చేయించావే. కడుపా... నీకు సలాం.

చాకిరేవు-01

వారం,వారం "చాకిరేవు" అనే శీర్షిక పేరుమీద నేటి కాలానికనుగుణంగా ఉన్న సామాజిక విషయాలపై నా శైలిలో విశ్లేషణ చేద్దామని నిర్ణయించాను. తళ,తళలాడే స్వచ్చమైన ఆలోచనలకోసం మేధోమదనం చెయ్యడమే "చాకిరేవు" ముఖ్యోద్దేశం. ఇందులో బాబాయ్, అబ్బాయ్ అనే రెండు పాత్రలుంటాయి. ముఖ్యంగా యువతనుద్దేశించి సాగే ఈ శీర్షికలో మంచి ఆలోచనలు జనిస్తే నా ఈ ప్రయత్నానికి ప్రయోజనం చేకూరినట్లే... బాబాయ్ అంతగా చదువుకోకపోయినా జీవితాన్ని చదివిన వ్యక్తి, కష్టపడి ఎదిగిన వ్యక్తి. అబ్బాయ్ తొందరపాటు స్వభావం ఉన్నవాడు, పైగా బాబాయ్ అంటే ఒక పెద్ద నస... అనేదే అతని భావం. కానీ ఆయనింట్లో ఉండి చదుకుంటూండడం వల్ల తప్పనిసరై గౌరవం ఇస్తూ ఉంటాడు.అందులో భాగంగా, ఈరోజు సోషల్ మీడియాపై "చాకిరేవు-01" రాసాను. మిత్రులంతా చదివి సలహాలు, సూచనలు అందజేయగోరుతున్నాను.
కె.కె.//చాకిరేవు-01//
**************
"ఏరా అబ్బాయ్ ఎక్కడికో అడావిడిగా బయల్దేరినట్టున్నావ్, టిపినికూడా సేసినట్టులేదు. అంత యమర్జంటుగా ఎందాకో?" అన్నాడు బాబాయ్ చదువుతున్న తెలుగు పేపర్ కాస్త పక్కనబెడుతూ...
ముసిలోడికి అన్నీ కావాలి అని మనసులోనే తిట్టుకుంటూ,
"నిజంగానే చాలా అర్జంటు పని బాబాయ్. ఇదొక సంచలనం, ఇదొక విప్లవం, యావద్భారతదేశం గర్వించదగ్గ రోజు. ఎందుకంటే సోషల్ మీడియాలైన ఫేస్ బుక్, ట్విట్టెర్, వాట్సప్, లింకడిన్ లాంటి అన్నింటిమీద వేటు వెయ్యాలని ప్రభుత్వమ్మీద ఒత్తిడి తేవాలని నిర్ణయించాం. మొదట మా కాలేజీతో ప్రారంభించి, తర్వాత జిల్లా మొత్తం, ఆ తర్వాత రాష్ట్రం మొత్తం, ఆ పై తర్వాత దేశం మొత్తం మాతో కలిసేలా మా పోరాటం సాగించాలని నిర్ణయించాం. స్టూడెంట్ యూనియన్ లీడర్ గా నా పేరు దేశమ్మొత్తం మారుమోగిపోతుంది. " అని అత్యుత్సాహంగా చెప్పాడు అబ్బాయ్.
"అబ్బో సాలా పెద్ద పనే... ఇంతకీ ఇయన్నీ ఇంత అర్జంటుగా ఎందుకు మూసియ్యాలో?" అన్నాడు బాబాయ్.
"రోజూ పేపర్ మూడు గంటలసేపు, కూడబలుక్కుని మరీ చదివేస్తుంటావ్. టీవీని గంటలు,గంటలు చూసేస్తున్నావ్. అయినా ఎందుకని అడుగుతున్నావ్ అంటే నాకు నవ్వొస్తోంది. వార్తలు చదవడమంటే బొమ్మలు చూడ్డం కాదు బాబాయ్, అర్ధం చేసుకోవాలి." అన్నాడు అబ్బాయ్.
"అది సరేలే, నేను ఎలా సదివితే నీకెందుగ్గానీ... ఇంతకీ నీకొచ్చిన ఇబ్బందేటో, అది సెప్పు." అన్నాడు బాబాయ్ తాపీగా.
" ఈ మద్య మా క్లాస్ మేట్ ఒక అమ్మాయి... చాలా బాగా పాటలు పాడుతుందిలే, ఫేస్ బుక్ లో ఒక రాస్కెల్ ఇచ్చిన ప్రకటనచూసి సినిమాలో చాన్స్ ఇస్తాడని వెళ్తే, వాడు చెయ్యి పట్టుకున్నాడు. ఎలాగోలా బయట పడింది. హైదరాబాదులో ఒక కాలేజీ స్టూడెంట్ చాటింగ్ చేస్తూ ఉంటే, 18 యేళ్ల అమ్మాయినని చెప్పి చాటింగ్ చేసింది, తీరా చూస్తే 42 యేళ్ల ముసిల్ది అని తెలిసింది. రాజస్థాన్లో ఒక వ్యక్తిని బిజినెస్ లో పార్టనర్ చేస్తానని 5 లక్షలు కొట్టేసారు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక ఫేక్ కంపెనీ పెట్టి సుమారు 50 లక్షలు కొట్టేసారు, ముగ్గురు ప్రభుద్దులు. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో... అయినా ఇవన్నీ నీకు తెలీవులే." అన్నాడు వ్యంగ్యంగా అబ్బాయ్.
"మరీ అంత తీసి పారీకు. నా సెల్ ఫోనులో కూడా ఫేస్ బుక్కూ, టిట్టెరు ఉన్నాయి. నేనూ, రోజూ ఓ పాలి సూసాకే తొంగునేది." అన్నాడు బాబాయ్.
"అదే కదా నా దౌర్భాగ్యం" అన్నాడు అబ్బాయ్ గొణిగినట్లు...
"ఇనపడిందిలే గానీ... నేనో ప్రశ్నేత్తాను, జవాబు సెప్పరా అబ్బాయ్. ఈ రోజు మన బిజినెస్సు రెండేళ్ల కితం ఉన్న 60లచ్చలనించి, ఇయ్యాల 6 కోట్లకి టర్నోవర్ ఎలా పెరిగిందంటావ్?" అన్నాడు బాబాయ్.
"పిన్ని అదృష్టం, లేదా నీకు ఎక్కడో పెద్ద పుట్టుమచ్చ ఉండుంటుంది." అన్నాడు అబ్బాయ్ వెటకారంగా...
"మరియ్యే పిల్ల సేస్టలు, కారు కూతలు అంటే" అన్నాడు బాబాయ్. మళ్లా అతనే ప్రారంభిస్తూ...
"సూడొరేయ్ అబ్బాయ్, తలనొప్పెస్తే ఏసుకునే గొళీకూడా నొప్పి తగ్గించినా నీలో దమ్ముకూడా తగ్గించేస్తది. అన్నిటి కాడ కాస్త మంచి ఉంటది, సెడూ ఉంటది. అది మనం వాడుకునే పద్దతిలో ఉంటది. నేను సేసే ఈ సేపల బిజినెస్సుకి సినీమా యాట్టర్నో, కిరికెట్ ఆడివోడ్నో తెచ్చి సేపలు కొనండోస్ అని సెప్పించలేను. అందుకే పేస్ బుక్కులో ఒక పేపరెట్టాను. అది సూసిన పతోడు మన సాపుకి పోన్ చేసి ఆడ్రు ఇస్తన్నారు. మనం డెలివరీ సేసి డబ్బులు తీసుకుంతన్నాము. ముందు ఒక సాపు మాత్రమే ఉండేది, తరవాత ఒక గొడోన్ పెట్టాము, ఇప్పుడు నాలుగు బోట్లు కొన్నాము. ఇంటింటికీ తిరిగి పోస్టర్లు అంటించినా... ఇంత పెచారం జరిగుండేది కాదు. మరి దీనికేటంటావు." అన్నాడు బాబాయ్. నిర్ఘాంత పోయాడు అబ్బాయ్.
"అంటే నేను చెప్పిన ఎక్జాంపుల్స్ సంగతేంటి?" అన్నాడు అబ్బాయ్ ముందుకన్నా కాస్త సౌండు తగ్గించి.
"దానికీ వస్తొన్నాను అబ్బాయ్, ఊ... కంగారు పడమాక."
అసలు కాలేజీకెల్లే పిల్లలకి, సాటింగులు ఎలా సేస్తన్నారు? ఆల్ల అమ్మా,బాబుల్ని పొడువాటి పోను కొనీదాక తినీసి... ఆటిలోని సదువుసెప్పే పంతుల్లమీద ఎదవ జోకులేసుకుంటారు. ఈ ఎదవ సోదంతా సూసే మరో ఎదవ, ఆల్లకి మెల్లగా గేలం ఏస్తాడు. ఇంతకీ ఆయమ్మి అంత పాడగలిగితే అయేయో పాడుతా తీయగా,ఉప్పగా, సప్పగా అని బోల్డు పోటీలవుతున్నాయి. అందులోకెల్తే ఆల్లే సూసుకుంటారు. అయన్నీ ఒగ్గేసి ఆడెవడో కోట్లు పెట్టి సినీమా తీసి ఈవిడసేత పాడిత్తాడా?" అని బాబాయ్ అనేసరికి, అబ్బాయ్ మతికాస్త అదుపుతప్పింది.
"సదువుకోండ్రా అని బడికి పంపిస్తే, అదొగ్గీసి పేమ,దోమ అంటూ ఎదవ సక్కర్లు కొట్టి ఆ తర్వాత ముసల్దని లబో,దిబో మంటే ఆ తప్పు ఎవడిది?"
"ఎవడో ముక్కూ,మొకం తెలీనోడితో బిజినెస్ సేస్తానని బయల్దేరాడంటే ఆడెంత ఎదవో అప్పుడే తెలిసిపోయింది. ఆడు ఇక్కడ కాకపోయినా, ఎక్కడో దగ్గిర దెబ్బయిపోవడం కాయం. ఆ సేతులో ఉన్న 5 లచ్చలు కర్సైపోతే ఆడే కుదురుగా ఉంటాడు."
"ఇక ఉద్యోగాలంటావా, ఆల్లు పనిసెప్పి, సేయించుకుని జీతమిస్తే దాన్నీ ఉజ్జోగమంటారు. అంతేగాని నీకాడ డబ్బులు తీసుకొని ఆడు ఉజ్జోగమివ్వడేమట్రా... అబ్బాయ్. పతోడికి పేనుకింద కూసొని, సంతకాలెట్టే పనే కావాలంటే దొరుకుద్దేటి? అందరు కూసుంటే పంజేసివోడెవడు? అందువల్ల సేత ఆ పొజిషన్ మనం సంపాదించుకోవాల. అప్పుడు పేను గాదు, ఇదిగోరేయ్ అబ్బాయ్ ఏ.సీ.లో దొరుకుద్ది సీటు." అన్నాడు బాబాయ్. అంతే దభీమని కూర్చుండిపోయాడు అబ్బాయి.
"కత్తితో కూరలు కోసుకుని కూరొండి తినొచ్చు, పీకలుకోసి జైల్లో కూసోవొచ్చు. ఏటి సెయ్యాలన్నది మనమే, మరి ఆ మంచి సెడ్డా సూస్కోవాలా. ఏటి? మరంచేత నువ్వేటి సెయ్యాలన్నది నువ్వే సూస్కోవాల." అని అక్కడినించి వెల్లిపోయాడు బాబాయ్.
బుర్ర గోక్కుంటూ కూర్చున్నాడు అబ్బాయ్.

ట్రాఫిక్-గజల్

చిరాకెందుకోయ్... నలుగురితో అడుగులేసి నడవడానికి,
చిరాకెందుకో... ట్రాఫిక్ రూల్స్ పాఠిస్తూ సాగడానికి
.............................................................................................
జుట్టూడుతూ పట్టగా మారిపోతోందా, బొచ్చుకన్న బతుకు విలువ ఎక్కువ కాదా,
చిరాకెందుకోయ్... నెత్తిమీద హెల్మెట్టుని పెట్టడానికి,
.............................................................................................
జోరుగెళ్తే దూరమేమో దగ్గరౌతదా,పొరబాటుతో జీవితమే బుగ్గైపోదా,
చిరాకెందుకోయ్... సహనంతో వాహనాన్ని, నడపడానికి,
.............................................................................................
సెల్ఫోనులో రింగొస్తే అంత ఆత్రమా, సర్కస్సు చేసేందుకు ఇదేమీ చిత్రమా,
చిరాకెందుకోయ్... చిత్తంతో గమ్యాన్ని చేరడానికి
.............................................................................................
మందేసి తొంగుంటే భలే మజాలే, బండెక్కితే పక్కోడికి అదే సజాలే,
చిరాకెందుకోయ్... మనిషిలాగ రహదారిన గడపడానికి,
...............................................................................................
ఇంటికాడ చిరునవ్వుల ఎదురుచూపులు, ఇనలేవులే ఎన్నటికి బెదురుమాటలు,
చిరాకెందుకోయ్... "కోదండ" మాటకి తల ఊపడానికి
==============================================
Date: 26.06.2014

ప్రయాణం-గజల్

అనుభవాలు ఎన్నున్నా, తుదకు మిగిలేవి కొన్నే
అనుబంధా లెన్నున్నా, ఎదను మీటేవి కొన్నే
...........................................................
పడినపుడే బడిగంట, గుర్తు చేసుకోమంట
పరుగులెన్ని పెడుతున్నా, అడుగులు నేర్పేవి కొన్నే
...................................................................
దొరలచెంత చేరినంతనే, మరిచావా మాతృభూమినే
పూటకూళ్లు ఎన్నున్నా, ఆకలి తీర్చేవి కొన్నే
...................................................................
నీ కాలిన ముల్లు విరిగితే, తన కంట్లో నీరు చిమ్మెనా
పరిచయాలు ఎన్నున్నా, స్నేహం పంచేవి కొన్నే
..................................................................
మీ నాన్న చెమట వాసన, మరచిపోకు విమానయాన
జ్ఞాపకాలు ఎన్నున్నా, బోధన చేసేవి కొన్నే
..................................................................
"కోదండ" జీవనయానం, అంతులేని ఓ ప్రయాణం,
వీడుకోలు లెన్నున్నా, బరువైన గుండెలు కొన్నే
===============================
Date: 24.06.2014

గుప్పెడు మల్లెలు-77

1.
కురులు చిక్కగావుంటే,
కొప్పు కుదరడం సులభం,
మంచోడన్నాక...గుర్తింపు సహజం
2.
చెప్పేదెప్పుడూ తెలిసిందేగా,
వినడం మొదలెట్టు... సామిరంగా,
ఒక్క విషయమైనా తెలుస్తుంది...నీ మీదొట్టు. 
3.
ఒంటి సత్తువ తగ్గిందంటే,
ఉండదులే పెదవిమోహం,
కట్టె కాల్తున్నా... చావదులే పదవిదాహం.
4.
సృజనశక్తి నశిస్తే,భజనపాటే శరణ్యం,
రోజూ నువు కొత్తగా పుట్టకపోతే,
నీ ఉన్నతి అన్నది శూన్యం.
5.
తంబాకు నోటికి, జిలేబి సహిస్తుందా?
పెడమాటలు వినే చెవికి,
ప్రియసూక్తి రుచిస్తుందా.
6.
పెరిగిన జుట్టుకి, పెట్టిన విగ్గుకి
తేడా గుర్తించడం ఏమంత కష్టం,
కళ్లలోకి చూడు,తాత్పర్యం స్పష్టం.
7.
పదార్ధాల కల్తీ పాడుచేసేది దేహాన్నే,
పడకండిరా యువతా! మత్తులో...
పూర్తిగా ఆర్పేస్తుంది దేశాన్నే
8.
నటించే చిరునగవుల కన్నా,
నయం సుమా కసిరే బెత్తం,
మాట కాదు... మనసు చూడరా నేస్తం.
9.
అందమైన చందమామది,
మచ్చనెందుకు వెదుకుతున్నావ్?
చచ్చేటంత చిరాకుతో, బ్రతికి ఏం సాధిస్తావ్.
10.
కుక్కలు విస్తరికై కుమ్ముకుంటున్నాయ్,
పదవికోసం నాయకుడొకడు...
'చీ'అంటే అవి పోతాయ్, ఏమనాలో ఇపుడు.
==========================
Date: 17.06.2014

గుప్పెడు మల్లెలు-76

1.
భయమెందుకోయ్,బ్రతుకంటే
బయటికంపేదెవ్వడు,
బతికుండగా నిన్ను
2.
మధువిచ్చి దీవించాడు దేవుడు,
మహాప్రేమ మనిషంటే,
రోదిస్తున్నాడు,మంచినీళ్లబదులు వాడేస్తుంటే
3.
జాలిపడే విషయం ఏంటంటే,
గాలివాటం మనం మార్చలేం,
తెలివైనోడికే తెలుస్తుంది దాన్ని వాడుకోవడం
4.
నీకు గుర్తుపట్టడం తెలిస్తే,
పక్కనున్నోడి ప్రతిభని...
నీ ప్రతిభ తెలుస్తుంది,ఎవ్వరైనా కొలిస్తే
5.
తప్పదులే... అప్పుజేసైనా
ఆర్భాటంగా చేస్కోవాలి,
పెళ్లి,చావు పదిసార్లు రావుగా
6.
నీ అనుమతిలేకుండా,
చిన్నబుచ్చేదేదీలేదు,నిను లోకంలో
బాల్యంలోనే బలమొస్తుందోయ్ శోకంలో
7.
చీకటిని,మరో చీకటి తొలగిస్తుందా?
ఎవడో 'చీ' అన్నాడని,పేచీపడకు,
ప్రేమే గెలుస్తుందోయ్ కడకు
8.
విజ్ఞానికే హద్దులు... ఊహలకుంటాయా?
నువు వినని కధలున్నాయ్, నీలో
విను... నిజాలవ్వక ఊరుకుంటాయా?
9.
సివరాకరికి సివాలెత్తేది,
ఆడెవడో తిడితే కాదు,
మనోడు... అన్నోడు, మాట్టాడకుంటేనే
10.
నిరీక్షణ బాధిస్తుంది,
మరిచిపోవడం వేధిస్తుంది,
కానీ, ఆ గాయం శోధిస్తుంది.
=======================
Date: 13.06.2014