స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Tuesday, 31 January 2012

బ్రతుకు నౌక

ఎందు కొరకో ...ఎవరి కెరుక??
ఎగుడు,దిగుడుల ఈ బ్రతుకు నౌక

చిగురు పెడితే వసంతమ్మని
ఆ ఘనత నీ సొంతమని
పురుగు పడితే వాసిలేదని
ఆ దేవుని దయ రాసిలేదని
వగచి,వగచి...సొగసిపొవుటేగాని

ఎందు కొరకో ...ఎవరి కెరుక??
ఎగుడు,దిగుడుల ఈ బ్రతుకు నౌక

ఆటు,పోటుల చీట్ల పేకలా
నేసిరెవ్వరో... ఆశ,నిరాశల బ్రతుకు కోకలా
అరుణ కాంతి కౌగిట్లొ...చీకట్లు కమ్ముకొస్తయి
అలముకొన్న కారురేయి లొగిట్లొ... సిరి దివ్వెలు పుట్టుకొస్తయి

ఎందు కొరకో ...ఎవరి కెరుక??
ఎగుడు,దిగుడుల ఈ బ్రతుకు నౌక

బ్రతుకెప్పుడు కాదు వ్యర్ధం
పరికిస్తే ఉంటుంది అర్ధం
మనిషిగ బ్రతుకుటే నీ ధర్మం!!!
 

K.K.

Sunday, 29 January 2012

నేను???

ప్రగతి పథానికి శ్రీకారం నేను
ప్రజాస్వామ్య ప్రాకారం నేను

నవచైతన్యానికి పల్లకి నేను
జనపద జాగ్రుతి పల్లవి నేను

పసి పాపల చిరు నవ్వుని నేను
స్నేహానికి సిరిమువ్వని నేను

మతం మత్తు వదిలించే మాత్రని నేను
గతం గుర్తు చేసె పాత్రని నేను

అవినీతిని వణికించె చురకత్తిని నేను
శ్రమగీతిని పలికించే స్వరకర్తని నేను

మౌనంగ ఉంటూనే అక్రమాన్ని ప్రశ్నిస్తా
మంచితనం మంటల్లో ఆ క్రమాన్ని కాల్చేస్తా

K.K.

Wednesday, 25 January 2012

నీ మనసు లోకానికి దర్పణం

 కరగనిదే కొవ్వొత్తి, కాంతి పంచుతుందా???
 మరగనిదే మంచినీరు, మబ్బు రూపు కడుతుంద???
 
అరగనిదే మంచిగంధం పరిమళం ఇస్తుందా???
విరగనిదే చెట్టు కొమ్మ, సెయ్య ఉద్భావిస్తుందా???  
 
తరగనిదే శిల కడుపున శిల్పం పుడుతుందా???
తిరగనిదే మరయంత్రం, ధాన్యం బియ్యం అవుతుందా???
 
 ఫలితం వచ్చేది ఎపుడూ, పెను ప్రళయం తర్వాతే
 కష్టాలను ఓర్చినపుడే, మనిషిగా గెలిచినట్లు
 
గదిలోన దాక్కుంటే, కాలగమనం ఆగుతుందా???
మదిలోన చోటుంటే, లోకం నీ నుంచి దాగుతుందా???
 
లోకం ఎపుడూ నీ మనసుకి దర్పణం సుమా...
ప్రతిబింబం అందంగుంటే,  దేవునికి అది అర్పణం అని అర్ధం నేస్తమా!!!
 
కే.కే.

Monday, 16 January 2012

నేటి సిని గీతాలు

దీర్ఘం, తలకట్టు లేని అక్షరాలు,
ముచ్చటైన పడికట్టు లేని స్వరాలూ,
మనస్సాక్షి మడికట్టు లేని మంత్రాలు,
ఇవి మన నేటి సిని నేపధ్య గీతాలు

కసరత్తులు చేస్తూ నృత్యాలు అంటున్నారు,
బిసకత్తులు తినే పిల్లలు వాటిని చూస్తున్నారు,
సిగారోత్తులు కాల్చేందుకు పెద్దలు బారులు తీస్తున్నారు,
మరమ్మత్తు తెలీని కార్ఖానా నడిపిస్తున్నారు"
ఇవి మన నేటి సిని నేపధ్య గీతాలు

వాద్యాల హోరుకే ప్రాధాన్యం,
వాక్యాల తీరు, తెన్నూ శూన్యం,
ఎండమావిలా దప్పిక తీర్చే మాధుర్యం,
పాడాలంటే, వాడక తప్పదు 'న' గుణింతం (న, ని, న, నే)
ఇది నేటి మన  సిని నేపధ్య సంగీతం"

కృష్ణ శాస్త్రి పంచి ఇచ్చిన లాలిత్యం,
సముద్రాల వడ్డించిన సుమధుర సాహిత్యం,
శ్రీ శ్రీ పూరించిన విప్లవ శంఖం,
సినారే పూసిన (వ్రాసిన) ఇగిరిపోని గంధం,
వేటూరి అందించిన వెన్నెల వసంతం,
అన్నీ అయినవి చరిత్ర పుటలకే అంకితం..

వెర్రి తలలు వేస్తోంది తెలుగు సాహిత్యంలో  పాశ్చాత్యం
ఇది నేటి మన  సిని నేపధ్య సంగీతం"

ఈ తెగులుకి మందు ఇచ్చే వైద్యం ఎప్పుడో ???
మన తెలుగుతల్లి  పచ్హని చేలో  సేద్యం ఎన్నడో ??? 

K.K.

చెప్పాలనివుంది

చెప్పాలనివుంది... మోసంతో నా ఎద గుచ్చిన ముళ్ళున్నాయని...
చాటాలనివుంది... లోకంలో పొగ చిమ్మే విషనాగుల కళ్ళున్నాయని...

పలకరించే ప్రతివాడు, హితుడేనని తలచా ఇన్నాళ్ళు...
చెప్పాలనివుంది... కాటేసే కౌగిళ్ళున్నాయని...
చాటాలనివుంది... మాటేసె కొడవళ్ళున్నాయని...

బ్రతుకు, నటన రెండూ వేరని భావించాను ఇన్నాళ్ళు...
చెప్పాలనివుంది... వంచించే కన్నీళ్లున్నాయని...
చాటాలనివుంది... ముంచేసే పరవళ్ళున్నాయని..

అడవిలోనే... ఆపదలుండని ... అనుకున్నాను ఇన్నాళ్ళు...
చెప్పాలనివుంది... జడిపించే పొదరిళ్ళున్నాయని...
చాటాలనివుంది... కనిపించే నరకాలున్నాయని...

చెప్పాలనివుంది... మోసంతో నా ఎద గుచ్చిన ముళ్ళున్నాయని...
చాటాలనివుంది... లోకంలో పొగ చిమ్మే విషనాగుల కళ్ళున్నాయని...

K.K.

భక్తీ అంటే???

భక్తీ అంటే???
"రాజ వీదులందు, రతనాల రధమునేక్కి...
 సామాన్యుని జీవితాన్ని, నలు వీధుల నిలుపుజేసి...
 నిర్జీవ పాషాణ విగ్రహంబును నీట ముంచుటయ???"
  
"అగరొత్తుల పొగలతో...కర్పూరపు వాతలతో...
 సిరిగంధపు పూతలతో...విరి పూవుల మాలలతో...
 హాహాకారాలతో...నడివీధిన చిందులేయుటయ  ???"

 "ఉపవాసం పేరుజెప్పి, రెండురెట్లు ఫలహారం ఆరగిస్తూ...
  దీక్షబూని, పాదరక్ష విదిచినానని జెప్పి...
 బహు చక్రపు వాహనాన సవారి జేయుటాయా???"

"అలంకరణ చేస్తామని... విధ్యుత్తుని  వెచ్చిస్తూ...
 అభిషేకం కోసమంటూ... పాలు,నేలపాలు చెస్తూ...
 ప్రసాదాలు దేవునికని...మిటాయిలని నములటయా???"

"చందాలని,హుందాగా...ప్రతి ఇంట వసూల్జేసి...
 దక్షిణలని, హుండీలో దండీగా జమచేసి...
 చిందులేయడానికి...మందుని, మంచితీర్ధంలా సేవిన్చుటయా???"

కాదు, కాదు...
"జగమంతా, హృదయంలో బంధించేదే భక్తీ!!!
 పరులబాధ, మనబాధ గా భావించేదే భక్తీ!!!
 సహజీవుల సేవలో తరించేదే భక్తీ!!!
 ఎదుటవాని కాలి ముళ్ళు గుచ్చుకుంటే,నీ కంట నీరు చిమ్మేదే భక్తీ!!!

"మానవసేవను మించిన, మాధవ సేవ ఉన్నదా ఈ ధరిత్రిలో...
 మానవ జన్మ చరిత్రలో..."
 k.k.

నా అంతరాత్మ హెచ్చరిక

జాగ్రత్త తమ్ముడా!!!!!!
ఇదే నా హెచ్చరిక........
        
       " నేనొక "కవి"నని విర్రవీగి ఏవేవో రచనలు చేస్తే...
         నీ దేశపు దరిద్రాన్ని అక్షరంగా మలిస్తే...
         నీ సమాజం అన్యాయాలను ...కవితగా నువు వినిపిస్తే...
         నీ రాష్ట్రపు మతపిచ్చిని... పాటగా గానం చేస్తే...
         నువు విన్న ఆకలి కేకలు... గేయంగా స్వరపరిస్తే...
         నాయకుల  దురాక్రమణలు ...వ్యాసంగా ప్రశ్నిస్తే..."
 
"దేశభక్తులు ఆగ్రహిస్తారు...
 దేశద్రోహిగా ముద్ర వేస్తారు...
 నీ కాగితాలు చించేస్తారు...
 నీ మేధస్సుని చంపేస్తారు..."
 
"కాలువలై పారే మురికిని...
 నేలపై పరిచిన  పట్టు పరికిణి అని కీర్తించు...
 ఏరుగ పారే నెత్తురు...
 ఎరుపు రంగు అత్తరుగా వర్ణించు..."
 
జాగ్రత్త తమ్ముడా!!!!!!
ఇది నా హెచ్చరిక!!!
ఇదే నా హెచ్చరిక !!!!!
 
కే.కే.