స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Friday, 29 March 2013

నేనే... నీ మనసుని

ఓయ్ మనిషీ!
నిన్నేనోయ్ మనిషీ!
నీలోనే దాక్కున్న నేను పిలుస్తుంటే,
దిక్కులు చూస్తున్నావెందుకు?
గుర్తు పట్టలేదా... నన్ను.

రెక్కలులేకున్నా అంబరాన ఎగిరేది నేనే,
పాదాలు లేకున్నా నేలంతా పరుగులుతీసేది నేనే,
కెరటాల గుర్రమెక్కి,సాగరాన్ని చుట్టేది నేనే,
పర్వతాలెక్కి ప్రకృతిని పలకరించేది నేనే,

నువ్వు పక్కదారి తొక్కబోతే,నీ డొక్కలో పొడిచి
చక్కనైన దారిలో పెట్టేది నేనే,
నువ్వు మంచితనంవైపు మొగ్గుచూపిస్తుంటే,
వంచనవైపు మొగ్గలేయించేది నేనే,
నీకు చుక్కాని నేనే,
నీ భవిష్యత్ చెక్కేది నేనే,

నాకు రూపం లేదు,
నువ్వుచూసే అన్ని రూపాల్లో నేనే
నాకు బరువే లేదు,
నువ్వు మోసే బరువంతా నేనే,
రంగు,రుచి లేదు,
నీక్కనిపించే ప్రకృతి మొత్తం నేనే,
దేవుడికి నిర్వచనం లేనట్లే,
నాకూ నిర్వచనం లేదు.

నువ్వు చేసే మంచి,చెడులకు ప్రతినిధిని నేనే.
మంచి గ్రహించడం,చెడు విసర్జించడం
నీ విజ్ఞత చెయ్యాల్సిన పని.
నన్ను మనస్సు అంటారు.
నిన్ను మనిషి అనిపించుకో...
=====================
తేదీ: 29.03.2013

Monday, 18 March 2013

గుప్పెడు మల్లెలు-25

1.
ఆకృతి లేదు,
అయినా కృతులెన్నో,
పిచ్చిమనసు.
2.
వేళ్లు దృఢమైతే
కొమ్మలూగుతాయి హాయిగా,
బాల్యం జాగ్రత్త
3.
తీరినకొద్ది,
ఊరుతుంటాయ్.
కోరికలు
4.
ఆలోచనలన్నీ
గాలిపాలే,
చిత్తశుద్ది లోపిస్తే
5.
ఆలోచనతో గిలకొట్టు,
తేలుతుంది నురగలా
సమాధానం.
6.
ఉతికారేసినట్టుంటుంది,
మనసుని...
తప్పు, ఒప్పుకుంటే
7.
నయనాలకున్న సౌకర్యం,
శ్రవణాలకి లేదు.
నప్పకుంటే,కప్పడానికి
8.
అవయవబేధం
ఎరగనిది దురద,
అంతరాలెరగనిది నోటిదురద
9.
పొద్దువాలుతున్న దశలోనూ
నిద్దురలేస్తుంది ఆశ,
బాల్యాన్ని తొడుక్కుంటే
10.
బుసకొడుతుంది విసుగు,
చెప్పిందే చెబితే...
కొత్తనీరే రుచి
===================
తేదీ: 18.03.2013

Thursday, 28 February 2013

హెచ్చరిక

నిద్దరోతున్నారా,నాయకోత్తములారా?
బాతాకానీ కొడుతున్నారా?
విదేశాల్లో ఖాతాలోపెన్ జేసి,
డబ్బులు లెక్కెడుతున్నారా?
అలికిడయ్యిందని తెలిసినా, నిద్రలేవని
మీ నిర్లక్ష్యం,మరో మారణఖాండకి సాక్ష్యం.
పూటకో జెండామార్చినా,పేటకో పార్టీపెట్టినా
మిమ్మల్ని కుర్చీమీద కూర్చోబెడుతున్నాం.
నాయకుడ్ని జేసి మిమ్మల్నెన్నుకున్నాం,
నావికుడై మా బ్రతుకు నౌక నడుపుతారని,
కానీ అవుతోంది నేడు భాగ్యనగరం,
మానవ మృగాలకు స్థావరం.

గ్లోవ్స్ తొడుక్కున్న తోడేళ్లు తిరుగుతున్నాయ్,
వాటి పంజాలను గుర్తుపట్టేదెలా?
నడివీదుల్లో అగుపించని మృగసంచారం,
నేలమీద ఎర్రమార్కులు ముద్రిస్తున్నాయ్,
వాటిని కనిపెట్టేదెలా?
మీ ప్రవచనాల సాక్షిగా సమస్తం పవిత్రమే,
కానీ ఇక్కడ నరరక్తవాసనలు గుప్పుమంటున్నాయ్.
దెయ్యాలు,దైవభాష రిహార్సల్స్ చేస్తున్నాయ్.
మీ అనుమతి లేకుండా మీ ఇంట్లోకెవడొస్తాడు.
మీ అధికారులు కలవకుండా మన నగరానికెవడొస్తాడు.
మీ అనునాయులు చేరకుండా మంటలెవ్వడు రేపుతాడు.

డబ్బు,జబ్బుచేసిన చెట్టుని నరికేయ్,
మా కన్నీరు ఉప్పెనై ఉవ్వెత్తున లేవక ముందే,
లంచం తెగులు సోకిన పైరుని పెరికేయ్,
మా సహనం ప్రజ్వలించే దావాగ్నిగా మారకముందే,
నిద్దురమత్తుని వదిలేయ్, మా కోపం హద్దులు దాటకముందే
ఇది హెచ్చరిక.... హెచ్చరిక
=================================
తేది:28.02.2013

Saturday, 16 February 2013

గుప్పెడు మల్లెలు-24

1.
క్రమం తప్పకుండా
క్లాస్ తీసుకుంటాయ్,
గడియారం ముళ్లు
2.
ఆశని నడిపించే
ఊతకర్ర,
నిట్టూర్పు
3.
స్లోమోషన్లో దిగుతుంటే
సుఖమే,
ఊబి అని తెలిసేవరకు 
4.
నరాల్లో ప్రవహిస్తే ఏముంది రక్తం,
కరుణతో కరిగి
కన్నీరవ్వకుంటే
5.
పగలంతా భయపడుతుంది, 
రాత్రైతే భయపెడుతుంది
చీకటి
6.
బోరుకొడితే
జారుకుంటారు,
ప్రేమలేఖని పొడిగించకు
7.
మెరుపులాంటిది జీవితం,
వెలుగుండగానే చూడు,
లేకుంటే చీకటే
8.
ఏం బాగుంటుంది వహ్వా లేని కవిత,
ఏముంటుంది
వహ్వా అనిపించకపోతే ఘనత
8.
విశ్వాసం వెళ్ళిపోయాక, 
రమ్మంటే వస్తుందా
వినయo
9.
ద్వేషాన్నైనా
భరించొచ్చు,
కానీ శూన్యాన్నెలా?
10.
గోడకి దిగాల్సినవి
గుండెలోకి దిగితే,
మిగిలేది జీవచ్చవమే
===================
Date: 15.02.2013

Thursday, 14 February 2013

బోసినవ్వు-గజల్



బోసినవ్వు విసురుతాడు, మంచు కురిసినట్లుగా,
చిన్నిముద్దు చిలుకుతాడు,మనసు తడిసినట్లుగా,

విరిగినవి,చిరిగినవి పారేస్తుంటే,
భద్రంగా దాస్తాడు, నిధులేవో దొరికినట్లుగా,

అరచేతిని ఆకుచేసి, అన్నం పెడుతుంటే,
నలుమూలల తిరుగుతాడు, తననెవరో తలచినట్లుగా,

ముద్దు,ముద్దు మాటలతో కధలే చెబుతుంటే,
ప్రశ్నలెన్నో అడుగుతాడు, నా మనసే అలసినట్లుగా,

నా చేతిని ఊతచేసి, నడిపిస్తుంటే,
పరుగులు పెడుతుంటాడు, జగమంతా గెలిచినట్లుగా,

అందమైన అల్లరితో అలరిస్తుంటే,
కలుసుకో కోదండ, నీ బాల్యం పిలిచినట్లుగా
=================================
తేది: 14.02.2013


Wednesday, 6 February 2013

మా ఊరి పిన్ కోడ్ మారిపోయింది

ఊరెళుతున్నా, మా ఊరికెళుతున్నా
రెండు పుష్కరాల తర్వాత,
ఊరికే కాదులెండి,
ఊరొదిలెళ్లిన ఇన్నిరోజుల తర్వాత,
నా చిరునామా వెదకడానికి,
నన్ను,నేను కలుసుకోడానికి,

మట్టిరోడ్డు మీదే నడిచినా,
రెండుపక్కలా పచ్చని గొడుగులుండేవి,
వాటిమీద ఊరపిచ్చుగ్గూళ్లు,
అక్కడక్కడ వేళాడే తాళ్లు...అవే ఊడలు,
నడుమొంపులు తిరిగిన చెరువు,
పక్కనే నక్కివున్న చాకిరేవు,

అక్షరాలు దిద్దిన బడి,
పచ్చకోక చుట్టిన వరిచేల మడి,
మేము నాటకమేసిన రాములోరి గుడి,
పక్కూరోళ్లతో ఆడిన కబ్బాడి,
మా హీరో గొప్పంటే,మా హీరో గొప్పంటూ
గిల్లికజ్జాల రచ్చబండ... త్రినాద్ కిళ్లీషాపు,
ఈశ్వర్రావు చేసిన చిరంజీవి క్రాఫు,

పరమేశ్వరి టూరింగుటాకీసులో చూసిన 'లేడీస్ టైలర్
తోటలో కాయలుకోస్తూంటే, చిరిగిన నా కాలర్,
భోగీ ముందురోజు పాతకర్రల దొంగతనం,
జోగీ గాడి మేడమీద చేసిన శివరాతిరి జాగారం,
ఎక్కడుందో...
నా చిరునామా వెతకాలి,
నన్ను,నేను కలుసుకోవాలి.
***************************
ఊరే... మా ఊరే....
నేలతల్లి నోరుతెరిచి చూస్తోంది,
గుక్కెడు నీళ్లతో గొంతు తడుపుకోడానికి,
నా చేతులు జేబులోకి పోయాయి,
రుమాలుతో కళ్లు తుడుచుకోడానికి,
ఊరంతా కాంక్రీటు అస్థిపంజరాలు,
భూ బకాసురులు వదిలెళ్లిన కళేబరాలు.
నా చిరునామా పోయింది,
మా ఊరి పిన్ కోడ్ మారిపోయింది.
======================
తేదీ:04.02.2013

Tuesday, 29 January 2013

యుద్ధం చేద్దాం

చస్తూ బతకొద్దు ప్రతీక్షణం,
బతకడానికి రోజూ చావాల్సిన పనిలేదు.
బడిపిల్లలం కాదుకదా మనం,
బూచోడున్నాడని జడుసుకు చావడానికి.
ఎవడో కనుబొమ్మ లెక్కుపెట్టాడని,
స్వాభిమాన శిరస్త్రాణం పాదాక్రాంతం చేస్తే ఎలా?

పుట్టుక ఒక్కసారే,చావూ ఒక్కసారే,
ఈ జనన,మరణాల మద్య జీవితం కదనుతొక్కాలి.
చిరిగిన చొక్కాకాదు జీవితం,
కుట్లు వేసుకుంటూ గడిపెయ్యడానికి.
ఆవులుకూడా కొమ్ములెత్తుకునే తిరుగుతాయ్,
కసాయి కత్తి గొంతుకోసేవరకు.
మనకెందుకయ్యా ఇంత భయం,
నిజం నిర్భయంగా చెప్పడానికి.

తప్పెక్కడో... ఈరోజు డిల్లీలో జరిగింది,
రేపు నీ చెల్లే కావొచ్చు,మీ గల్లీలోనే కావొచ్చు,
అందుకే చెబుతున్నాను మిత్రమా...
తప్పు ఎక్కడ జరిగినా తుప్పు వదిలించాలి.
అది ఒక వ్యక్తైనా, ఒక వ్యవస్థైనా.

తిరుగుతున్న ఫాను ఎక్కడ పడుతుందోనని, 
అరగంటకోసారి లైటేసి చూస్తూవుంటే,
అది జాగ్రత్త కాదు, 
జడుపుకత్తితో చేసుకున్న ఆత్మహత్య.

అందరం కాలం విత్తుకి పుట్టిన మొక్కలమే,
కొన్ని కంచెముళ్ళ మొక్కలున్నాయని,
తిరిగి మట్టిపొరల్లోకి వెళతామా???
జనన,మరణాల మద్య స్వచ్చందంగా ఎదగటం మనహక్కు.
బ్రహ్మరాసిన మన తలరాత మీద,
ఎవడో మూర్ఖుడు పిచ్చిగీత గీస్తానంటే
వాడి చేతివేళ్ళని,చీపురుపుల్లల్లా విరిచెయ్యాలిగా...
ఒకడు చంపితే హత్య,
లక్షమంది లక్ష్యంగా చంపితే యుద్ధం.
రండి.... యుద్ధం చేద్దాం.
=============================================
తేదీ: 22.01.2013