స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Thursday 4 June 2020

అంతర్జాలం
============
ప్రతీ పదేళ్లకు, ప్రపంచం తన రూపురేఖలు మార్చుకుంటోంది. ప్రగతిపధంలో ప్రయాణిస్తోంది. కాలానుగుణంగా పరుగులు తీస్తోంది.
"అంతర్జాలం" అనేది ఒక సాంకేతిక విప్లవంగా అభివర్ణించవచ్చు.
- కాగితపు ఖర్చు తగ్గింది, ఆన్లైన్ డాటా బేస్ తో
-వ్యాధి మూలాంతరాలని తెలుసుకో గలుగుతున్నాం, వైధ్యశాస్త్ర ఆధునిక పరికరాలతో
-ప్రపంచంలో ఏ మూల, ఏం జరిగినా తెలుసుకో గలుగుతున్నాం, మీడియా మాధ్యమంతో
-ఎంత దూరాన్నైనా అవలీలగా ప్రయాణిస్తున్నాం, మోటార్ వాహనాలతో
-రానున్న ప్రకృతి వైపరీత్యాలని ముందే పసిగడుతున్నాం, స్పేస్ టెక్నాలజీతో
-ఎంత దూరాన్నున్నవారితోనైనా మాట్లాడగలుగుతున్నాం, మొబయిల్ ఫోన్ సౌలభ్యంతో
ఇలా చెప్పుకుంటూపోతే సాంకేతిక విజ్ఞాన సౌలభ్యానికి, సౌకర్యానికి అవధులు లేవనే చెప్పాలి.
"ప్రతీరోజూ ఒక కొత్త రూపం... ఇదే సాంకేతికరంగ ప్రస్థుత స్వరూపం"
మనిషి జీవనశైలి సులభతరం అవుతూనే ఉంది, అయినా పరిశోధన కొనసాగుతూనే ఉంది.
అయితే సాంకేతిక విజ్ఞానం రెండువైపులా పదునున్న కత్తిలాంటిది.
ఎవరినైనా ఎలా ఉన్నావ్? అని ప్రశ్నిస్తే... వచ్చే సాధారణ సాంప్రదాయ సమాధానం ఒక్కటే...
ROUTINE MECHANICAL LIFE
-మన మద్యనే ఉన్నా, మనతో కన్నా మొబయిల్ తోనే ఎక్కువగా మాట్లాడుతున్నాడు.
-రెండు,రెళ్లు ఎంత అన్నా, కాలక్యులేటర్ వాడుతున్నాడు.
-కోట్లతో నిర్మించిన సినిమాని, పైరసీతో ఫ్రీగా చూసేస్తున్నాడు.
-కడుపులో బిడ్డని, కనకముందే కనిపెట్టి... కన్య అని తెలిస్తే కడతేరుస్తున్నాడు.
-పక్కవాడి డబ్బుల్ని నకిలీ చెక్కువాడో లేదా కంప్యూటర్ జిమ్మిక్కు వాడో దోచేస్తున్నాడు.
-అమ్మాయిల నగ్న చిత్రాలని, అంతర్జాలంలో ప్రదర్శిస్తూ...ఆడతనాన్ని ఉరేస్తున్నాడు.
-ఏకాంతజీవితాన్ని, అయస్కాంతంలా లాగేస్తున్నాడు.
ఈ పరిస్థితినుంచి బయటకి రావాలి, మార్పు కావాలి. మానవత్వపు విలువలు పరిమళించాలి.
చూపు, స్పర్శ, మాట ఇవే సంఘహితాన్ని, సంఘటితాన్ని కాపాడేవి అని తెలుసుకోవాలి.
మన అన్నవారితో, కాస్త సమయం వెచ్చించాలి.
"మనిషి, మనిషిగా బ్రతకలేనప్పుడు... అది ఎంత గొప్ప విజ్ఞానమైనా, వివేక రహితమే"
"భవిష్యత్తు అంతా సాంకేతిక విజ్ఞానానమే...
కాని, జరగాల్సింది మానవ కళ్యాణమే"
స్పూర్తి
========
ఒలింపిక్ క్రీడల సంబరాలు, అంబరాన్ని అంటుతున్న తరుణంలో...
మనకి దేశభక్తి అప్పుడప్పుడు గుర్తొచ్చే ఆగష్టుమాసంలో...
ఒక గొప్ప క్రీడాస్పూర్తిని తలుచుకోవడం సమంజసం అని ఈ వ్యాసం.
"రెండు వేరు, వేరు గుడ్డల్ని కలిపికుట్టే సూది, తను మాత్రం మద్యలోంచి జారిపోతుంది."
అలాగే క్రీడాస్పూర్తి రెండు వేరు, వేరు జట్లను ఆడుతున్నంతసేపు పోరాడమన్నా, ముగిసాక మనస్పూర్తిగా కొనియాడమంటుంది.
అది ఆగష్టు 15, 1936 అంటే సరిగ్గా స్వతంత్ర్యానికి 11సం. ముందు, ఒలింపిక్ క్రీడల్లో హాకీ ఫైనల్ జరగనుంది. ఒకపక్క ఆతిథ్య దేశం జర్మనీ జట్టు, మరోపక్క అన్యాక్రాంతమైన భారత జట్టు. ఒకపక్క అందరి మనసుల్లో జర్మనీ విజయంపై ధీమా, మరోపక్క భారత్ కు సరిగ్గాలేని క్రీడా సరంజామా. ఈ నేపథ్యంలో ఆట మొదలయ్యింది. భారత్ కు ప్రతికూలంగా ఉండేందుకు గ్రౌండులో నీళ్లు ఎక్కువగా చల్లి తయారు చెయ్యబడింది. బూట్లకు స్పైకులు కూడాలేని పరిస్థితి కావడంతో, పరిగెడుతూ జారిపడడం భారత్ క్రీడాకారుల సహనాన్ని పరీక్షించింది. అయినా మొక్కవోని పట్టుదలతో పోరాడి భారత్ 1-0 ఆదిక్యంతో మొదటి అర్ధబాగాన్ని ముగించింది. జర్మనీ జట్టుని ప్రోత్సహించడానికి స్వయంగా హిట్లర్ రావడం విశేషం.
ఇంతలో రెండో అర్ధబాగం మొదలయ్యింది. తిరిగి అదే పరిస్థితి గమనించిన భారత జట్టు కెప్టెన్ తన బూట్లని విడిచి ఆట ఆడటం ప్రారంభించాడు, అది గమనించిన మరికొందరు సహక్రీడాకారులు అతడిని అనుసరించారు. అంతే.... భారత్ స్వైరవిహారం ముందు జర్మనీ జట్టు తలవంచింది. భారత్ తిరుగులేని ఆదిక్యంతో (8-1) విజయం సాధించింది. బంగారు పతకాలు జట్టు సభ్యుల మెడలో ఆభరణాలయ్యాయి. అప్పటి ఆ స్పూర్తిదాయక కెప్టెన్ మరెవరోకాదు ధ్యాంచంద్. గెలుపుకోసం, భారతదేశపు కీర్తి బావుటాని ఎగరెయ్యటం కోసం అలుపెరగని సూర్యుడిలా, వెన్నుచూపని వీరుడిలా పోరాడిన ధ్యాంచంద్ చిరస్మరణీయుడు.
ఆట పూర్తికాగానే హిట్లర్నుంచి ధ్యాంచందుకి పిలుపొచ్చింది. కాస్త ఆందోళనతోనే హిట్లర్ను కలుసుకున్నాడు. తను భారతదేశం సైన్యంలో సైనికుడిగా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. వెంటనే హిట్లర్ అతడి ఆటకి తను ముగ్దుడినయ్యానని, తమ దేశపు పౌరసత్వం తీసుకుంటే తన సైన్యంలో ఉన్నత పదవిలో నియమిస్తానని, తమ హాకీ జట్టుకి కెప్టెన్గా వ్యవహరించాలని కోరాడు. ధ్యాంచంద్ చిరునవ్వుతో అతడి ఆహ్వానాన్ని మర్యాద పూర్వకంగా తిరస్కరించి, ధన్యవాదాలు తెలియజేసి "భారతదేశం మా అమ్మ, అమ్మ ఒడిలో నేను ఆనందంగా ఉన్నానని" చెప్పి వచ్చేసాడు. అకుంఠిత క్రీడాస్పూర్తికి, అంతులేని దేశభక్తికి ధ్యాంచంద్ ఒక సరైన నిర్వచనం అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో.
125 కోట్ల జనాభా ఉన్న ఎడారిలో, ఒక్క మెడల్ అనే ఒయాసిస్ కోసం అలమటిస్తున్నాం. సగటు మనిషి కట్టిన పన్నులతో ప్రభుత్వ కాలేజీల్లో చదివి, పరాయి దేశాల్లో పైసల సంపాదనకి పరిగెడుతున్నాం. పతకంకోసం ప్రయత్నించే క్రీడాస్పూర్తి కంటే, పదకంతో అధికారాన్ని అందుకోవడానికి , అందలమెక్కడానికే మక్కువ చూపిస్తున్నారు. ఇప్పటి యువతకి ధ్యాంచంద్ చరిత్ర ఒక భగవద్గీతలా వినిపిస్తే బావుంటుందేమో???

Sunday 27 January 2019

//హలో! ఆత్మారాం//

మొన్న 31,డిసెంబర్,2018 న ప్రదర్శించడానికి నేను రాసిన నాటిక. ఒక లుక్కెయ్యండి. ఎలావుందో చెప్పండి.
                                                          //హలో! ఆత్మారాం//కె.కె.
Preamble
ఇక్కడకొచ్చిన విజ్ణులకి, ప్రజ్ణులకి, రసజ్ణులకి మా కళాభివందనాలు. దేవుడు మహా గొప్పోడు. సృష్టిలో ఎన్నో వేల జీవులున్నా, మనిషికి మాత్రమే ఆలోచించే శక్తినిచ్చాడు. ఆ ఆలోచనతో ఎదగమన్నాడు, బ్రతకమన్నాడు. కాని, మనిషికి పొదుపెక్కువ కదా, అందుకే అప్పుడప్పుడు వాడుతుంటాడు. కాలేజీకి డుమ్మాకొట్టి, ప్రైవేటు క్లాసుందని అమ్మకిచెప్పి, అమ్మాయితో చక్కర్లు కొట్టేటప్పుడో... క్వార్టర్ మందుకోసం, మదర్ సీరియస్సనో, బ్రదర్ బేవార్సనో కధలు చెప్పేటప్పుడో... సరిగా చెప్పాలంటే నిజంలో కంటే, నిద్రలో ఎక్కువ వాడేస్తుంటాడు.
నేనేగనక ధోని అయితే, ఎలిజిబెత్ రాణితో బోణీ కొడుదును అంటాడొకడు, పిల్లలు బంతాడుతుంటే బౌండరిలైన్ బయట సిమెంటు కుర్చీలో సిగరెట్టు కాలుస్తూ...
నేనేగనక అబ్దుల్ కలాం అయ్యుంటే, అమెరికా సలాం కొట్టేది, ఆఫ్రికా గులాం అయ్యేది అంటాడు మరొకడు, పుస్తకాలబూజు పనివాడితో దులిపిస్తూ...
నేనే అంబాని అయితే, ముంబాయిని సింగపూరు చేసేస్తానంటాడు మరో ప్రభుద్దుడు, మంగలిషాపులో మూడురూపాయిలు అప్పెట్టి గెడ్డం చేయించుకుంటూ...
పదోక్లాసు ప్యాసయితే ప్రపంచం గెలిచినట్టు, డిగ్రీ చేతికొస్తే డిల్లీకి రాజయినట్టు ఫీలయిపోయి, రియల్ లైఫులో ఫూలయిపోతున్నది నేటి యువతరం. అనుకున్నది జరగలేదని, ఫ్యానుకింద కూర్చొనే నౌకరీ దొరకలేదని, దేశాన్ని తిడుతూ, దేవున్ని విసిగిస్తూ గడిపేస్తోంది యువతరం.
దేవుడు అప్పుడప్పుడు మనం లేటుగా వచ్చామని తలుపేసేస్తాడు. కానీ,మరో తలుపు తెరుస్తాడు. మనం మాత్రం, ముందు తలుపు దగ్గరే ఏడుస్తుంటాం. అలాంటి యువతం మార్పుకోసమే మా, ఈ ప్రయత్నం. "WORK IS WORSHIP" అని చెప్పిన వివేకానందుడి మాటలు, యువతరానికి వేదవాక్కులు కావాలని కోరుకుంటూ
"హలో!ఆత్మారాం"
By K.K.Rao
========================================
పాత్రలు
1) కడియాల సీతారాముడు B.Tech.( రాం)
2) ఆత్మారాం (రాం అంతరాత్మ)
3) ఆఫీసర్ (రాముని ఇంటర్వ్యూ చేసేవాడు)
4) రాజు (రాం స్నేహితుడు)
5) తండ్రి (రాం తండ్రి)
=======================================
హలో! ఆత్మారాం
==================
(తెర తీయగానే... ఒక పార్కులో రాము, ఒక కుర్చీలో నిద్ర పోతుంటాడు. చేతిలో ఫైలుకూడా ఉంటుంది. మెల్లగా కళ్లు విప్పి, బద్దకం విరుచుకుని లేచి నిలబడతాడు. కుర్చీ వెనకనుంచి తెల్ల బట్టలతో, రామూలాంటి మరో ఆకారం ఎదురుగా వచ్చి నిలబడుతుంది.)
రాం: మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి.
ఆత్మారాం: అలాగా... బహుశా ఏదో బార్ లో చూసుంటారు.
రాం: అబ్బే కాదండి. ఎక్కడో చూశాను.
ఆత్మారాం: అయితే, ఏ అమ్మాయినో ఫాలో అవుతుంటే చూసుంటారు.
రాం: ఊహున్... అద్దంలో... అద్దంలో చూశాను.
ఆత్మారాం: అవునయ్యా, వెర్రి రామయ్యా. నేనే నువ్వు, నువ్వే నేను. నేను, నువ్వు ఒకటే. నేను నీ అంతరాత్మని.
రాం: అలాగా?
ఆత్మారాం: నన్నే గుర్తు పట్టకపోతే ఎలా? నువ్వు మందు కొడుతుంటే, నీ గొంతులో పద్యాలు పలికించేను. ఎవరెవరికో ప్రేమలేఖలు రాస్తుంటే కవిత్వాన్ని ఒలికించేను. నన్ను మర్చిపోతే ఎలా???
రాం: ఓహొహోహో... నైస్ మీటింగ్ యూ. నీ పేరేమిటి హ్యాండ్సం. ఇంతకీ ఆత్మలకి పేర్లుంటాయా? ఆ... ఉన్న,ఉండకపోయినా... రాముడి ఆత్మవి కాబట్టి రామాత్మ అనో, లేదా ఆత్మారాం అనో పిలుస్తాను. ఎమంటావ్? బై ద వే... ఆత్మారామే బాగున్నట్టుంది.
ఆత్మారాం: ఓ... అలాగే కానీ.
రాం: ఇంతకీ నువ్వు లోనెక్కడో ఉండాలి కదా, షడన్ గా ఈ ఎంట్రీ ఏంటి?
ఆత్మారాం: కాస్త నీతో మాట్లాడదామని వచ్చాను. అంతే...
రాం: అలాగా, అయితే సరే. చెప్పు, ఏ విషయమ్మీద చర్చిద్దాం. సినిమావోళ్ల అఫైర్లమీదా, రాజకీయాల రూమర్లమీద, క్రికెట్ మ్యాచుల బెట్టింగులమీద లేదా ఐక్యరాజ్య సమితి పోలసీలమీద. ఏదైనా సరే నేన్రెడీ.
ఆత్మారాం: మేడ ఎక్కడానికే బద్దకమన్నోడు, మౌంటైన్ ఎక్కుతానన్నాడంట. అలాగ... అవన్నీ మనకెందుకు గాని, మనగురించి మాట్లాడుకుందాం. కాకపోతే నేను, నీతో అస్సలు పరిచయం లేనట్టు మాట్లాడతాను. సరేనా...
రాం: ఓ.కే... అప్పుడప్పుడు కాస్త వెరయిటీ కావాలి కదా. లేదంటే లైఫ్ బోర్ కొట్టేస్తుంది.
ఆత్మారాం: హలో రాం! ఐ యాం ఆత్మారాం. ఎలా ఉన్నావ్?
రాం: హలో! ఆత్మారాం. నాకేం మూడు విస్కీ పెగ్గులు, ఆరు చికెన్ ముక్కలుగ వెలిగి పోతున్నాను.
ఆత్మారాం: ఏం చేస్తున్నావ్ ఇప్పుడు?
రాం: నిరుద్యోగం... ఈ దేశంలో చాలామంది చేస్తున్న మహత్తర ఉద్యోగం. B.Tech చదివాను, హై.టెక్ సిటీలో ఫుడ్డుకి లాటరీ కొడుతున్నాను. కనపడిన ప్రతీ కంపెనీకి అప్లికేషన్ పెడుతున్నాను. ఇంటర్వ్యూలలో అడ్డమైన ప్రశ్నలకి సమాధానాలు చెబుతుంటాను. నాన్న పంపే డబ్బులకోసం ఎదురుచూస్తున్నాను. అప్పుచేసి బారుకెళ్లి, బీరు కొడుతుంటాను. ఎవడు చీ... అన్న, పట్టువదలని విక్రమార్కుడిలా కత్తి తిప్పుతూనే ఉంటాను. నాకు బుద్ధి రాదు, ఈ దేశానికి సిగ్గులేదు.
ఆత్మారాం: ఏ ఒక్కరూ ఉద్యోగం ఇవ్వడం లేదా? అలా ఎలా జరుగుతోంది?
రాం: అదెలా జరుగుతుంటుందో, ఇలా ఒక్కసారి చూస్తే తెలుస్తుంది...
X==========X LIGHTS-OFF X==========X
(ఆఫీసర్ కూర్చొని ఉంటాడు. రాం కొంచెం తలుపుతీసి...)
రాం: మే ఐ కమిన్ సార్...
ఆఫీసర్: ఏస్... కమిన్... టేక్ యువర్ సీట్.
రాం: థాంక్ యూ సార్.
ఆఫీసర్: నీ పేరేమిటి?
రాం: కడియాల సీతారాముడు, భి.టెక్. సర్.
ఆఫీసర్: అబ్బా, చిన్నప్పుడే నీకు బి.టెక్ అని పేరెట్టెసారయ్యా. జ్యోతిష్యుడు ఎవడన్నా చెప్పుంటాడు.
రాం: అయ్యో, అది నా క్వాలిఫికేషన్ సర్.
ఆఫీసర్: అలాగా, మరి నేను పేరు మాత్రమే అడిగానే...అడిగింది చెప్పు చాలు. అతిగా కిత,కితలొద్దు.
(వెంటనే రాం ముఖంలో నవ్వు ఆగిపోయి, మిలిటరీ సైనికుడిలా అలర్ట్ అయిపోతాడు.)
రాం: సారీ సర్. అర్ధమయ్యింది సర్.
ఆఫీసర్: ఈ సర్టిఫికెట్లన్ని ఒరిజినల్లేనా?
రాం: యస్ సర్, ఆల్ ఒరిజినల్స్ సర్.
ఆఫీసర్: మీ నాన్నగారు ఏం చేస్తుంటారు?
రాం: రిటైర్డ్ టీచర్ సర్, ఆయన పెన్షనే మా ఇంకం సర్.
ఆఫీసర్: ఒర్నీ దుంప తెగ, అడిగిందానికి సమాధానం చెప్పు అన్నాను గానీ, ఇలా బిగుసుకు పొమ్మన్నానా. కాస్త మామూలుగా కూర్చో.
(రాం కొంచెం రిలాక్స్ అవుతాడు.)
ఆఫీసర్: సరే, వాట్ ఈస్ కరెంట్?
రాం: ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ సర్.
ఆఫీసర్: ఎలక్ట్రాన్ ని ఎవరు కనిపెట్టారు?
రాం: నో ఐడియా సార్.
ఆఫీసర్: వాట్ ఈస్ ఎ బ్యాటరీ?
రాం: కెమికల్ ఎనర్జి కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ సర్.
ఆఫీసర్: లెడ్ యాసిడ్ బ్యాటరీలో ఉండే యాసిడ్ ఏమిటి?
రాం: నో ఐడియా సార్.
ఆఫీసర్: వెల్, మిష్టర్ రాం. నువ్వు సగం ప్రశ్నలకి ఆన్సర్ చెప్పావు, సగం చెప్పలేదు. అంటే నీ చాన్సెస్ కూడా 50-50. అయితే ఆ చాన్సు 50 నుంచి 100 అవ్వాలంటే, కాస్త కాంపన్సేషన్ ఖర్చవుతుంది. లేదా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలున్నాయి. వాటికి 50 అయినా సరిపోద్ది. కాకపోతే టెంపరరి ఉద్యోగం, డైలీ వైస్ పేమెంట్.
రాం: టెక్నికల్ అసిస్టెంటా, చ..చ... నేను బి.టెక్ సర్… వైట్ కాలర్…
కానీ… ఆ ఇంజనీర్ ఉద్యోగానికి 50నుంచి 100ఎలాగో చెప్పండి సర్. అర్ధం కాలేదు.
ఆఫీసర్: ఒక మేగ్నెట్టుని గాలిలో వేళాడదీస్తే ఏ దిశలు చూపిస్తుంది?
రాం: ఉత్తర, దక్షిణాలని చూపిస్తుంది.
ఆఫీసర్: ఒక బిల్డింగు ప్లాన్ డ్రాయింగులో రిఫరెన్సుకి ఏ దిక్కులు మార్క్ చేస్తారు?
రాం: ఉత్తర్ అండ్ దక్షిణ్ సర్.
ఆఫీసర్: అంత గొప్పవి ఉత్తర, దక్షిణాలు. అవి అంత గొప్పవిగనకనే, మొత్తం దేశం ఫాలో అవుతోంది. అదంతా సైన్సు. ఇప్పుడర్ధమయ్యింది అనుకుంటాను.
రాం: ????????????
ఆఫీసర్: చూడు బాబు, ఇందాక నువ్వు చెప్పినట్టు, మీనాన్న పెన్షన్ మీఇంట్లో ఓన్లీ ఇంకం ఎలాగో... మా ఇంట్లోనూ నేనొక్కడినే సంపాదిస్తాను. అన్నీ ప్రశ్నలకి సమాధానం చెప్పినోడికి ఎలాగూ ఉద్యోగం ఇవ్వాలి. ఇలా కొన్ని చెప్పే వాళ్లలో, కొందరు ఉత్తర దిశనుంచి వస్తారు. వాళ్లనీ కాదనలేం. ఇంక నాకు మిగిలింది దక్షిణం ఒక్కటే. కనక, అదేదో నువ్వు చూసుకుంటే... నీ ఉద్యోగం ఖాయం చేస్తాను.
రాం: మీరేం చెబుతున్నారో నాకు అర్ధం కావడంలేదు సర్.
ఆఫీసర్: అన్నన్నన్నా... నువ్వు మరీ అమాయకుడివైనా అయ్యుండాలి లేదా మహా గడుగ్గాయివైనా అయ్యుండాలి. సరే, ఓపెన్ గానే చెప్పేస్తాను. నీలా అర,కొర ఆన్సర్లు ఇచ్చేవాడికి ఉద్యోగం కావాలంటే ఉత్తరం అంటే రికమండేషన్ లేదా దక్షిణం అంటే లంచం. ఇలా ఏదో దిశలోంచి రావాలి. నీకీ ఉద్యోగం కావాలంటే 5లక్షలు కావాలి.
రాం: సార్, నా పరిస్థితి ఇందాకే మీకు చెప్పాను. అంత డబ్బు నేను ఇచ్చుకోలేను సర్.
ఆఫీసర్:అలాగా పాపం. ఉత్తర, దక్షిణాలు కాదంటే ... ఇంకో దిక్కుంది. అదే తూర్పు.
రాం: తూర్పా... అంటే????
ఆఫీసర్: తూర్పు తిరిగి దండం పెట్టూ అని. ఇంక బయల్దేరొచ్చు. నెక్స్ట్...
(దిగులుగా… రాం ఫైలు పట్టుకొని భారంగా అడుగులేస్తూ బయటకు నడుస్తాడు.)
X==========X LIGHTS-OFF X==========X
(రాం, ఆత్మారాం మళ్లీ ఎదురెదురుగా ఉంటారు)
రాం: హలో!ఆత్మారాం, ఏ ఇంటర్వ్యూ కెళ్లినా ఇదే తంతు. దొంగముండా కొడుకులు, నేనేదో వాళ్లకి అప్పున్నట్టు లక్షలు తెమ్మంటారు. వాడిదే ఆ కంపెనీ అన్నంత బిల్డప్పు. వాడుకూడా ఉద్యోగమేగా చేసేది. వాడు ఉత్తర, దక్షిణాలంటాడు. నేను తెలీదంటాను. వాడు పొమ్మంటాడు. నేను పడమటి సంధ్యారాగం అని పాడుకుంటూ, తూర్పువైపుకి పోతాను. ఛ,ఛ... దేశంలో దుర్మార్గం,... దరిద్రం పెరిగినట్టు పెరిగిపోతోంది. ఎవ్వడికీ రెస్పాన్సిబిలిటీ లేదు.
ఆత్మారాం: రెస్పాన్సిబిలిటీయా, అంటే ఏమిటో???
రాం: ఎవడిపని ఆడు చెయ్యడం. అదికూడా... ఎవడూ చెప్పకుండా చెయ్యడం, ఎవ్వడికీ అప్పచెప్పకుండా చెయ్యడం.
ఆత్మారాం: ఓహో, మరి రిటయిరైన తండ్రి, పెళ్లికెదిగిన చెల్లి ఉన్న మీ రెస్పాన్సిబిలిటి ఏంటో???
రాం: హలో!ఆత్మారాం, సెటయిర్లొద్దు. నేనూ... ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. అది రాగానే చెల్లిపెళ్లి చేస్తాను, నాన్నని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను.
ఆత్మారాం: చాలా సంతోషం. మరి ఇందాక ఆ ఆఫీసరు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం ఇస్తానన్నాడు కదా.
రాం: ఛ,ఛ...ఆకలేస్తోందని సిమ్హం, గడ్డి తింటుందా. నేను ఇంజనీర్ని, వైట్ కాలర్. ఏ జాబ్ పడితే అది చెయ్యను.
ఆత్మారాం: మరి రెస్పాన్సిబిలిటి ఉండాలన్నావ్?
రాం: అవును అన్నాను, నాకుంది అనికూడా అంటున్నాను. అందుకే ఉద్యోగం రాకపోతే పోయింది అని, మాంచి బిజినెస్ ప్లాన్ చేసాను. జస్ట్ 25 లక్షలు ఉంటే, సంవత్సరం తిరిగేలోపు... కోటి రూపాయిలు టర్నోవర్ చూడొచ్చు.
ఆత్మారాం: అ…బ్బా…, మరి ఆ ఆఫీసరు 5లక్షలు అడిగితేనే లేదన్నావే. 25 లక్షలు ఎలా తెస్తావ్?
రాం: ఉద్యోగం అంటే మనకి మాత్రమే జీతం ఇస్తారు. ఇది యాపారం,... ఎంతమందితో అయినా పార్టనర్షిప్ ఉండొచ్చు. అందుకే డబ్బున్న ప్రతీ ఫ్రెండుని కలిసాను. నా ఐడియా చెప్పాను. దొంగముండా కొడుకులు, ఒక్కడు ముందుకి రాలేదు, ఎవ్వడూ అందుకు రాలేదు.
ఆత్మారాం: అయ్యో, అదేం పాపం. డబ్బంటే చేదా? 25 లక్షలు ఏడాదికే కోటి అన్నాసరే ముందుకు రాలేదా. ఎందుకలా?
రాం: ఎందుకలాగా...... ఒకపాలి సూడు ఇలాగా...
X==========X LIGHTS-OFF X==========X
(ఫ్రెండు రాజు ఎవరితోనో ఫోనులో మాట్లాడుతూ ఉంటాడు. రాం రావడం చూసి పలకరింపుగా చెయ్యి ఊపుతాడు. మూగ సైగలతోనే కాసేపు మాట్లాడిన తర్వాత, ఫోను కట్ చేస్తాడు రాజు.)
రాం: బావా, ఎన్నాళ్లయ్యిందిరా నిన్నుచూసి...
రాజు: అదేంట్రా, మొన్న మద్యాహ్నమేగా జంక్షన్లో కలిసి 500/- బాదావ్.
రాం: ఏమోరా, నాకు మాత్రం చాలాకాలం తర్వాత కలిసినట్టుంది.
రాజు: ఉంటదుంటది. తెగిన దండనుంచి పూసలు రాలినట్టు, పైసలు రాలుతుంటే... ఉండదుమరీ, ఉంటది.
రాం: ఛ, అవేం మాటల్రా. మనం చైల్డుహుడ్ ఫ్రెండ్స్. డబ్బుకోసం ఫ్రెండ్షిప్ చేసినట్టు మాట్లాడతావేం?
రాజు: సరే,సరే...సరదాగా అన్నానుగానీ. టీ తాగుతావా?
రాం: తెప్పించరా, టీతో పాటూ కాస్త ఉల్లిపాయ పకోడి కలిపావంటే, ఆర్డర్ అదిపోద్ది.
రాజు: ఇంకా నయం, పెసరట్టుప్మా అన్నావ్ కాదు. ఇప్పుడవేం దొరకవుగానీ, బిస్కెట్లున్నాయి, ఫ్లాస్కులో టీ ఉంది. ఇవ్వాల్టికి కానీ.
రాం: సరే,సరే... చెల్లెమ్మ ఇంట్లో లేదా? సందడే లేదు.
రాజు: లేదు పుట్టింటికెళ్లింది. వెళ్లేముందు, నీతో తిరిగితే విడాకులిస్తానని చెప్పి మరీ వెళ్లింది.
రాం: ఆ... అవన్నీ ఉత్తుత్తి మాటల్రా. అయినా ఎందుకురా, పెళ్లాలకి భయపడి చస్తారు.
రాజు: నువ్వూ పెళ్లి చేస్కో, అప్పుడు తెలుస్తాది. అవునూ... నువ్వు పెళ్లెప్పుడు చేసుకుంటావురా?
రాం: నిరుద్యోగంటే లోకానికి చిన్నచూపురా, ఇంకా పిల్లనెవడిస్తాడు. పైగా ఇంటా, బయట వాయించేస్తన్నారు.
రాజు: ఒరేయ్ అలాగే లేట్ చేసావంటే, ఉద్యోగానికి ఏజుబారు అయినట్టు, పెళ్లికికూడా పనికిరాకుండా పోతావ్.
రాం: అందుకేగా నీ దగ్గరకొచ్చాను. ఉద్యోగం అయితే ఏజ్ ఎక్కువయ్యిందనో,తెలివి తక్కువయ్యిందనో రిజెక్ట్ చేస్తున్నారు. అదే వ్యాపారం అయితే, మన తెలివి, మన ఏజ్... అంతా మన ఇష్టం.
రాజు: అమ్మయ్యా... మొత్తానికి నీకు దేవుడు మంచి బుద్దిచ్చాడు. నువ్వింక ఈ జన్మకి మారవేమో అనుకున్నాను. గుర్తుందా... ఇంజనీరింగులో సంవత్సరం మొత్తం ఆడుకోవడం, లాస్టు పదిరోజులు ముక్కునపట్టి పరీక్షలు రాయడం. అత్తెసరు మార్కులతో "మమా" అనిపించడం. లాస్టు సెమిస్టర్లో 18 పేపర్లు నేను, 21 పేపర్లు నువ్వూ రాసి, జస్ట్ గట్టెక్కాం. మీనాన్న తిడతాడని నువ్వు, మానాన్న కొడతాడని నేను చదివాంగానీ... నిజంగా ఏమన్నా నేర్చుకున్నామా. పైగా అద్దెకి రూం తీసుకొని కాంపిటేటివ్ ఎక్సాంసని పేరు పెట్టి సినిమాలు షికార్లు తిరిగేవాళ్లం.
రాం: అదంతా లోకజ్ణానం కోసమ్రా... కాలేజీ చదువు అలాగే చదవాలి.
రాజు: నీ పిండాకూడు, రూం తీసుకున్నాక ఒక్కసారైనా పుస్తకంవంక చూసామా? మనం చూడని సినీమా లేదు. వెంట తిరగని అమ్మాయి లేదు. పైగా ఏదో కష్టపడిపోతున్నట్టు బార్లు, బీర్లు,... అదా లోకజ్ణానం.
రాం: ఒరేయ్ బావ, ఆ ఏజ్ మళ్లా రమ్మంటే వస్తుందా? రాదు. ఆ లెక్క అంతే. ఆ ఈక్వేషనుకి అది సరిపోద్ది. ఇప్పుడు బిజినెస్ ఐడియాతో వచ్చా, ఈ ఈక్వేషనుకి ఇది సరిపోద్ది. కాకపోతే, పెట్టుబడి నువ్వు పెట్టాలి.
రాజు: తప్పకుండా, నావల్ల అయ్యే సాయం చేస్తాను. నాకు తెలిసినంతలో ఇక్కడ మిల్క్ బూత్ విత్ ఫ్రూట్ జ్యూస్ షాప్ పెడితే బావుంటది. ఫాస్ట్ ఫూడ్ సెంతర్, ప్లాన్ చేసినా సూపర్. ఒక 50,000/- లో మేనేజ్ చెసియ్యొచ్చు. బ్యాంకులోనుకి ట్రై చేద్దాం. ముందుగా నేను కొంచెం సర్దుతాను. అంటే ఒక 10/15 ఎరేంజ్ చేస్తాను.
రాం: ఏం మాట్లాడుతున్నావ్ బావా??? నేను ఇంజనీర్ని రా, వయిట్ కాలర్. మిల్కు బూతు, ఫాస్టు ఫుడ్డు అంటూ ఏవో బూతులు మాట్లాడుతున్నావ్. నేను సూపర్ ప్లానుతో వచ్చాను. మన బడ్జెట్ 25 లక్షలు. సంవత్సరం తిరిగేసరికి ఒక కోటి రూపాయిలు టర్నోవర్ మన ప్లాన్. అంతకుమించి టచ్ చేసినా ఆశ్చర్య పోవక్కర్లేదు బావా.
రాజు: ఛ,ఛ... నువ్వేదో మారావనుకున్నాను. అవే పేకమేడలు. నిన్నాదేవుడే బాగుచెయ్యాలి.
రాం: పేకమేడలు అంటావేంట్రా. ఒక్కసారి ప్లాన్ విను. నువ్వే, నా వెనకపడతావ్, ఎప్పుడెప్పెడు అని.
రాజు: సరే చెప్పు... ఏం చెప్తావో. నీ బిజినెస్ ప్లాన్.
రాం: ఊరవతల 600గజాల జాగా చూసాను. ఆడికి ఎడ్వాన్సిచ్చి, అక్కడ అపార్టుమెంటు లేపేస్తాం. మొత్తం ఖర్చు 50 అవుద్ది. 25 మనం పెడతాం, జనం ఎడ్వాన్స్ 25 ఇస్తారు. కోటికి మొత్తం అమ్మేస్తాం. 25 నీకు, 25 నాకు. ఎలాగుంది. థింక్ బిగ్గురా...
రాజు: అలాగా, మరి చెప్పావు కాదేం... ఒక 1000 చ.అ. స్లాబుకి ఖర్చు ఎంతవుద్దిరా?
రాం:ఎంతంటే...మరి...అదీ... కొంతవుద్ది. అవన్నీ మేస్త్రినడిగితే తెలిసిపోద్ది. అదేం పెద్ద బ్రహ్మవిద్యా.
రాజు: అవును బ్రహ్మవిద్యే, ఏ పనైనా బ్రహ్మవిద్యే. ఆశక్తితో నేర్చుకుంటేనే వస్తాది. డబ్బు విలువ, కాలం విలువా ఎవడికివాడే తెలుసుకోవాలి. నేనింటికి తిరిగొచ్చాక, మానాన్న పడుతున్న కష్టం చూసాను. రోజులో 12గంటలు షాపులో కూర్చుంటూ, అప్పుడప్పుడు మూటలుకూడా మోస్తూ, బిజినెస్ ఈ లెవెలుకి తీసుకొచ్చారు. అందుకే ఆయనతో నేనూ పనిచెయ్యడం మొదలెట్టాను.
రాం: ఒరే బావా, నీ లెక్చర్లు వినే ఓపికా నాకు లేదు. కలిసి బిజినెస్ చేద్దాం... బుర్రనాది, డబ్బుల్ నీవి. సైయా, నైయా...
రాజు: నువ్వు ముయ్యి. ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే మనకి మంచిది.
రాం: సరే, ఇది తర్వాత మాట్లాడదాం గానీ, పదా... అలా బారుకెళ్లి రెండు పెగ్గులేసుకొద్దాం.
రాజు: ఒరే బాబూ, నువ్వు బయల్దేరు. ఈ 500/- పట్టికెళ్లు. ఇంకెప్పుడూ ఇక్కడికి రాకు. నన్ను కలవాలని ప్రయత్నించకు. బాయ్.
రాం: అదేంటి బావా, అలా అనేశావ్.
రాజు: చైల్డుహుడ్ ఫ్రెండువి కదా, గెటవుట్ అంటే బాగుండదని, ఆ 500/- ఇచ్చాను.
(రాం మౌనంగా అక్కడ్నించి బయల్దేరాడు. చేతిలోనుంచి 500 …)
X==========X LIGHTS-OFF X==========X
(రాం, ఆత్మారాం మళ్లీ ఎదురెదురుగా ఉంటారు)
రాం: హలో!ఆత్మారాం, అందరూ ఇదే తంతు. వీడొక్కడే కాస్త మర్యాదగా చెప్పాడు. మిగిల్నోళ్లైతే... చెప్పుకుంటే సిగ్గుచేటు…, బూతులు తిట్టారు.
ఆత్మారాం: మరేం చేద్దామని ఆలోచిస్తున్నావ్?
రాం: ప్రస్థుతానికి నాన్న పెన్షన్ బ్యాంకులో పడిందో, లేదో కనుక్కుని, ఒకవేళ పడుంటే, ఓ రెండు వేలిమ్మని అడుగుదాం అనుకుంటున్నాను.
ఆత్మారాం: మరి మీనాన్నతో మాట్లాడే సీను చూపించవా...
రాం: అమ్మో, అది భయానక సీను. ఆయన మనల్ని బూతులు తిడతాడు. అందుకే ఎదురుపడను. ఎదురుపడినా, ఏదీ వినను.
ఆత్మారాం: అలా అనుకుంటూనే, మొన్నొకసారి విన్నావ్. కాకపోతే గుర్తులేదు అంతే...
రాం: నేను విన్నానా??? వినికూడా మర్చిపోయానా? అలా, ఎలా?
ఆత్మారాం: ఒక్కసారి చూడు ఇలా....
X==========X LIGHTS-OFF X==========X
(రాం మెల్లగా ఇంట్లో ప్రవేశిస్తాడు. ఎదురుగా తన తండ్రి నిలబడి ఉంటాడు. ఆయన్ని చూసి అవాక్కవుతాడు. కాస్త వణుకుతూ...)
రాం: నాన్న, ఇంకా మీరు పడుకోలేదా? ఇంత లేటుగా పడుకుంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది. వెళ్లి పడుకోండి.
తండ్రి: ఇంత అర్ధరాత్రి కొంపకి తగలడ్డావ్. ఎక్కెడెక్కడ తిరిగొస్తున్నావురా గాడిద. ముడ్డికిందకి ఏళ్లొచ్చినాయి. కానీ, బుద్ధి రాలేదు.
రాం: ఇంటర్వ్యూ ఉంటేను... కొంచెం లేటయ్యింది.
తండ్రి: నీ శార్ధం, నీ పిండాకూడు... అర్ధరాత్రుళ్లు ఇంటర్వ్యూ చేసే అడ్డగాడిదెవరో...
రాం: అంటే, ఇంటర్వ్యూ రేపు, ఇవ్వాళ ప్రిపరేషన్...
తండ్రి: తెలుస్తోంది నీ ప్రిపరేషన్. కంపు ఆరు మైళ్లు కొడుతోంది. ఇలా దున్నపోతులా ఇంటిమీద పడి తినడమేనా,ఇంటి బాధ్యత ఎత్తుకునేదేమైనా ఉందా???
రాం: నేనూ ప్రయత్నం చేస్తున్నాను. కానీ...
తండ్రి: అఘోరించావ్. 32 ఏళ్లనుంచి నీ బరువు మోస్తున్నాను. నీ చెల్లెలు 25 ఏళ్లది అయిపోయింది. దానికి పెళ్లి చెయ్యాలి. నా కంటి చూపు తగ్గిపోయింది. ట్యూషన్లకి పిల్లలు రావడం తగ్గిపోయింది. పెళ్లి చేసుకుని అత్తారింటికెళ్లాల్సిన పిల్ల, చిన్నదైనా ఏవేవో చిన్న,చితకా ఉద్యోగాలు చేస్తూ కష్టపడుతోంది. నువ్వుమాత్రం అడ్డగాడిదల్లే ఊరుమీద బలాదూర్ అని తిరుగుతున్నావ్. నీకెప్పుడు బుద్దొస్తుందిరా...
రాం: ఇప్పుడు లేకపోతే కదా, కొత్తగా రావడానికి... మీరు ఫుల్ ఫాం లో ఉన్నారు. కానీ కొంచెం ఆకలిగా ఉంది, భోజనం చేసొచ్చి మీ తిట్లు వింటాను. సరేనా...
తండ్రి: ఎలాగో చావు. అంతా నా తలరాత.
(రాం అక్కడినించి వెళ్లిపోతాడు. తండ్రి దీనంగా ఆలోచిస్తుంటాడు. ఇంతలో రాం తిరిగొచ్చి, తండ్రి మాటలు వింటూ అలాగే ఉండిపోతాడు.)
తండ్రి: భగవంతుడా! ఏమిటి నాకు దారి. 30ఏళ్లు చాకిరీ చేసి, ఈ ఇల్లు కట్టాను. ఈ ఇల్లు అమ్మితేగానీ, పిల్లకి పెళ్లి చెయ్యలేను. ఈ ఇల్లుకూడా లేకపోతే వాడెలా బ్రతుకుతాడు. నాకేమిటి దారి. (కొంచెం ఆలోచించి)
తండ్రి: ఆ.. ఒక్కటే దారి, నేను ఏ బస్సుకిందో ప్రమాదవశాత్తు పడినట్టు చూపించి చచ్చిపోతే, నా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. దానితో ఎలాగోలాగ బ్రతుకుతాడు. అదొక్కటే దారి... అదొక్కటే దారి....
X==========X LIGHTS-OFF X==========X
(రాం ఒక్కడే మెల్లగా నడుస్తూ ఉంటాడు.)
రాం: ఆత్మారాం....ఆత్మారాం.... (చుట్టూ చూస్తూ ఉంటాడు.) (అంతే ఒక్కసారి మోకాళ్లమీద పడి, వల,వల ఏడుస్తాడు)
రాం: నాన్నా... నాన్నా... నన్ను క్షమించు. నన్ను క్షమించు... నారాయణుడి మరోరూపు నాన్న అని తెలుసుకోలేక పోయాను. అర్ధంలేని అహంకారంతో, అర్హతలేని అధికారాన్ని కోరుకుంటూ కాలం వృధా చేసాను. మిమ్మల్ని బాధ పెట్టాను. నా జీతం కోసం, జీవితంకోసం మీ ఊపిరి పోవడానికి వీల్లేదు. అమ్మనెటూ దూరం చేసుకున్నాను. మిమ్మల్ని వదులుకోలేను. ఇకమీదట మిమ్మల్ని కంటిపాపలా, చంటిపాపలా కాపాడుకుంటాను. ఇంటి బాద్యత, ఇకమీదట నాది. చెల్లి పెళ్లి చేస్తాను. మీ కళ్లకి చూపై నడుస్తాను. ఈ తెల్ల చొక్కాకి, ఎర్రమట్టి వాసన చూపిస్తాను.
నేను వస్తున్నాను. నేను వస్తున్నాను….
(అంటూ నేలమీద మట్టి, చొక్కాకి రాసుకుంటాడు.)
X==========X THE END X==========X

Thursday 1 November 2018

గుప్పెడు మల్లెలు-92

1.
ఆట పట్టిస్తే, నోట ఊటే...
ఎవర్నైనా సరే...
నిన్ను కూడానా...ఆలోచించరొరేయ్
2.
మూర్ఖుడితో వాదించకు,
మూర్ఖత్వం వచ్చేస్తది,
ఆడి సీనియారిటి నిన్ను తొక్కేస్తది.
3.
మెదడు మహా గొప్పది,
పనిచేస్తూనే ఉంటది... నిద్రలోకూడా
పుట్టినప్పట్నించి, ప్రేమలో పడేదాకా
4.
ఎదిగింది చూడు...మలేరియానుంచి డెంగ్యూదాక,
డ్రైనేజీనుంచి టి.వి.కవరేజీదాక...దోమ
సరుకుంటే,సిన్న-పెద్దా తేడాలుండవురా మామా
5.
నల్లబొగ్గే, కార్బన్ అణువులు కలిస్తే,
మెరిసే వజ్రం,ప్రెషర్ పెంచి కలిపితే,
ప్రెషరూ మంచిదే...
6.
మనసేం చెప్తే అదిచెయ్,
కాని... అబ్బాయొరేయ్,
మెదడు కూడా కేరీ చెయ్.
7.
గిన్నీస్ బుక్కులో రాయలా,
నోబుల్ ప్రైజ్ కనిపెట్టలా,
అమ్మా! ఇంత పని ... రెండు చేతుల్తో ఎలా?
8.
ప్రియమైన కర్మ...
కాల్చిపోకుండా, వెయిటింగ్ ఏంటమ్మా,
ఎదవల జాబితా, ఈడ పెరిగిపోతుంటే
9.
బతుకన్నది, బతుకుతున్నది
పిడుగుపడితే పోవడానికి కాదు,
వానపడితే, ఆడటానికి
10.
పేడమీద కాలేస్తే, మూన్ వాకొచ్చినట్టు
పొలిటీషియన్ కొడుకైతే సాలేమో...
పదవి,పవరు తన్నుకుంటూ వచ్చేద్ది.
==============================

Thursday 27 September 2018

గుప్పెడు మల్లెలు-91

కె.కె.//గుప్పెడు మల్లెలు-91//
*****************************
1.
దెయ్యం దారి మర్చిపోద్ది,
దరిద్రం కూలబడిపోద్ది,
నవ్వడం తెలిస్తే... కష్టం అయినా
2.
చదివెయ్ ఏదైనా,నువ్వెప్పుడూ శాశ్వతం అన్నట్లు...
బతికేయ్ ఆనందంగా
దునియాలో రేపే  నీకాఖరి రోజైనట్లు
3.
ఎవడిపనో జేసి,మన తృప్తికోసం అన్నామంటే...
ఆడు పిచ్చోడైనా అయ్యుండాలి,
లేదా... పితృసమానుడైనా అయ్యుండాలి.
4.
ఆడ్ని కొట్టు, ఈడికి పెట్టు
అని కొట్టేస్కుంటది ప్రతీ గవర్నమెంటు,
ఈడొక్కడే సపోర్టన్నట్టు...ఈడు ఆడు ఒకటేనెహే.
5.
ఏ తప్పైనా మొదటిసారే మొహమాటం,
అందుకే కంచం పెట్టేముందే...
కాళ్లు, చేతులు కడిగించాలి.
6.
పడిపోవడం జస్ట్ ఒక ప్రమాదం,
పడగొట్టడం,పడుకొనుండడం...
జాతి ప్రగతికే అగాధం.
7.
మంచి,చెడులు ఎంచడం మాత్రమేచేస్తే,
వంచన మాత్రమే కనపడుద్ది,
ప్రేమించడం ఏడ కుదురుద్ది.
8.
చివరకి లెక్కలు తేలనీ,
ఎంతకాలం బ్రతికావని కాదు,
అంత కాలంలో, ఎంత బ్రతికావని
9.
ముందు,వెనక... ఆ పక్క,ఈ పక్క
నీతో పోలిస్తే... నీకెంతుందో తెలుస్తది,
నీ లోపల,బయట పోల్చు... నువ్వేంటో తెలుస్తది.
10.
జీవితం గురించి చెప్పాలంటే,
దీని తస్సాదియ్యా...
దరిద్రాన్ని మించిన గురువేలేదు.
==================================

గుప్పెడు మల్లెలు-90

కె.కె.//గుప్పెడు మల్లెలు-90//
********************************
1.
ఒక టి.వి.,ఒక మొబయిల్ 
చూడలేనివి చూశాం,
చూడకూడనివి చూస్తున్నాం.
2.
గుడి... ఆథ్యాత్మిక కేంద్రం,
అంతర్మదనం జరిగే సంద్రం.
కాని...విషయం గ్రహించం, విషం కక్కుతాం.
3.
ప్రతోడి కోరిక, ఉండాలని స్వర్గంలోనే
ఆడు మాత్రం ప్రవర్తిస్తాడు,
ఉండేదెప్పుడూ సంతలానే
4.
ఆడాళ్లు రాజ్యాలు ఏలుంటే,
జరిగిన యుద్ధాలన్నీ,
అభద్దాలు అయ్యుండేవేమో!!!
5.
చచ్చేక ఏమవుతాం, అనే శ్రద్ధ
బతికుండగా ఏం చేద్దాం,
అని లేదెందుకురా నరుడా!!!
6.
డబ్బు నీ కాలి చెప్పు,
నీ జోడు నెంబరు ఏడైతే,
ఆరేస్తే కరుస్తది, ఎనిమిదైతే పడేస్తది.
7.
నిన్ను తక్కువన్నాడొకడు,
నువ్వు ఒప్పుకోకపోతే,
అది నిజమయ్యేదెప్పుడు.
8.
గుంపులోనే ఉంటే, అది లేకుండా నడవలేవ్,
ఒంటరిగా నడిచి చూడు,
మునుపెవ్వడు రానిచోట, నువ్వుంటావ్.
9.
సమస్య ఒక నీళ్ల బావి,
చుట్టూ తిరక్కు, దూకి చూడు,
ఈతా వస్తది, లోతూ తెలుస్తది.
10.
నేను, నిన్ను చదివేశాను,
అంటాడో మూర్ఖుడు...
నిన్ను, నువ్వు చదివితే చాలంటాడు బుద్ధుడు.
==============================