స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Monday 20 February 2012

నా తెలుగుతల్లికి భక్తితో

గుచ్చెద ..నే..జాతిముత్యపు నిండు దండ నవకవనాలతో...
ఇచ్చెద.. నా..తెలుగుతల్లికి..భక్తితో..అనురక్తితో...
...

నవ్య వనమున..నవ వసంతమ్మున..
మావికొమ్మల చివురున..
కమ్మని ఎలపాటపాడే...
కోయిలమ్మని ఎవరాపులే???

గుచ్చెద ..నే..జాతిముత్యపు నిండు దండ నవకవనాలతో...
ఇచ్చెద.. నా..తెలుగుతల్లికి..భక్తితో..అనురక్తితో...

కారుచీకటి కమ్మినా...చుక్కలన్నియు సోలినా...
చంద్రమెక్కడో నక్కినా..
మిణుగురైనను మెరయకున్నా...
ప్రపంచ పటమను రంగవల్లిక మధ్యన...
ప్రచండ తేజము తోడ..
నా ఆంధ్రదేశము మెరియునట్లు...

గుచ్చెద ..నే..జాతిముత్యపు నిండు దండ నవకవనాలతో...
ఇచ్చెద.. నా..తెలుగుతల్లికి..భక్తితో..అనురక్తితో...

దశాబ్దాల నుండి మ్రోగెడి..
విశ్వగాన వియత్తరంగిణి యందు...
తెలుగుతేజ తరంగమై...
గగన సీమల నెగురు విహంగమై...

గుచ్చెద ..నే..జాతిముత్యపు నిండు దండ నవకవనాలతో...
ఇచ్చెద.. నా..తెలుగుతల్లికి..భక్తితో..అనురక్తితో...

కె.కె.

Tuesday 14 February 2012

చేదు సత్యం

 
అందలేనిదేదో అందుతుందని అపేక్షించకు మిత్రమా!!!
అందుబాటున ఉన్నది నీది కాదని ఉపేక్షించకు నేస్తమా!!!
నీలికంట్లో, నలక పడినంతనే చూపు పోదని తెలుసుకో...
చీకటింట్లో గడుపు కంటే, చిరు దీపం మేలని తెలుసుకో....

రాని అద్రుష్టాని కోసం నిరీక్షించకు మిత్రమా!!!
రాతినైనా మాటి,మాటికి పరీక్షించకు నేస్తమా!!!
వేడి పెంచితే, ఉక్కునైనా వంచవచ్చని తెలుసుకో...
ఆడి,తప్పితే సన్నిహితుడే శత్రువౌనని తెలుసుకో...

గుండెలో నిరాశనెప్పుడు ప్రతిక్షేపించకు నేస్తమా!!!
గుడిలోన దైవం ఏమివ్వలేదని ఆక్షేపించకు నేస్తమా!!!
మనషి జన్మే దేవిడిచ్చిన వరమని నువు తెలుసుకో...
వెదికి చూస్తే ప్రతి బ్రతుకులోన అర్ధముందని తెలుసుకో...

ఈ చేదు సత్యం మింగగలిగితే జీవితం ఒక వైద్యాలయం...
నీ బ్రతుకు పుటలని చదవ గలిగితే లోకం ఒక విద్యాలయం...

కె.కె.

Sunday 12 February 2012

జ్ఞాన దీప్తి

కనికర ముంచరా, కరుణాoతరంగా!!
అధములము, నీ తనయులము ...
అందరి మారుగా నే యాచించు చున్నాను!!!

నేరము లన్నియు, నీ ముంగిట వినిపింప..
ద్వారముకడ వేచినాను, నీదే భారము!!!

పెంజీకటి దారులలో... పరుగులెడుతున్నాము..
పైశాచిక చేతలతో... కసాయిలుగా మారినాము!!!

కలచిన హృదయానితో.. కన్నీటి పరదాలతో..
పిలువ లేకున్నాను, విలపించుచున్నాను!!!

హీనులమై, నీచులమై, ఎంత చెడిన గాని
నీ నందనులమే గాన... నిన్నే వేడుకొనుచున్నాను!!!

మలిన పంకము నుండి జనియించు నలినము వలె...
మా కలుష హృదయాల నందు వెలిగించవయ్య జ్ఞానదీప్తి...
అరిషడ్వర్గాల దాస్య సృంఖలాల నుంచి కలిగించ రావయ్య విముక్తి!!!

కే.కే.

మావ ఎప్పుడొస్తడో???

మావ ఎప్పుడొస్తడో.... సందురోడా...
మనసు ఆగనంటోంది ఇంటికాడ....

కూడు మీన మనసుపోదు...
పూవులేవి నచ్చలేదు...
సందెనుంచి పక్క మీన పొర్లినా
పొద్దుగూకిన కన్నంటలేదు...

మావ ఎప్పుడొస్తడో.... సందురోడా...
మనసు ఆగనంటోంది ఇంటికాడ....

మల్లె పూల పందిరేమో.. ఈల వేసి తూనలాడే...
కన్నుగీటి సుక్కలన్ని...మబ్బు ఎనకనుంచి ఎక్కిరించే...
నిన్ను పిలిసి అడుగుతుంటే ...సిలిపిగ నువు నవ్వుతుండెనాయే....

మావ ఎప్పుడొస్తడో.... సందురోడా...
మనసు ఆగనంటోంది ఇంటికాడ....

ఘల్లు మంటు... ఏ సవ్వడయ్యినా...
మావ ఎద్దు గంట లనిపించెనే...
గడప మీన ఏ అలికిడయ్యినా...
మావ కిర్రు సెప్పు లనుకొంటినే...
జాబు రాసి గుండె బరువు తగ్గింతమంటే...
సదువు, సంజ లేని మొద్దు నాయినే....

మావ ఎప్పుడొస్తడో.... సందురోడా...
మనసు ఆగనంటోంది ఇంటికాడ....

K.K.

Monday 6 February 2012

బిడ్డ ఎట్లా ఉన్నాడో???


నౌకరీని చేసి మా బతుకులుద్దరిస్తనని ...
బస్తీకి పోయిండు బిడ్డ...
ఏమి తిన్నడొ??? బిడ్డా ఎట్లా ఉన్నడొ???
...
పూటకు పదిమారులు పిలిచి,పిలిచి బువ్వ పెడితే...
నాలుగు మెతుకులు...కతికి ఒదిలెసెటోడు...
పరుల పంచ, కంచమెట్టి...కూడు తింటుండట...
ఏమి తిన్నడొ??? బిడ్డా ఎట్లా ఉన్నడొ???

నిద్దరొయే ఏలల్లొ...పక్క మడిసి తగిలితే...
సిరాకు పడి... సిందులేసెటొడు...
ఇరుకు కొంపలొ బసకై...ఇపుడు కిరాయి ఇస్తుండట...
ఏమి తిన్నడొ??? బిడ్డా ఎట్లా ఉన్నడొ???

ఏవేవొ బాసలట... ఇంగిలీసు మాటలట....
బాస తెలియనోల్లకి బస్తీ ఒక అడవట....
ఏమి తిన్నడొ??? బిడ్డా ఎట్లా ఉన్నడొ???
ఏమి తిన్నడొ??? బిడ్డా ఎట్లా ఉన్నడొ???
కె.కె