స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Thursday 27 September 2018

గుప్పెడు మల్లెలు-91

కె.కె.//గుప్పెడు మల్లెలు-91//
*****************************
1.
దెయ్యం దారి మర్చిపోద్ది,
దరిద్రం కూలబడిపోద్ది,
నవ్వడం తెలిస్తే... కష్టం అయినా
2.
చదివెయ్ ఏదైనా,నువ్వెప్పుడూ శాశ్వతం అన్నట్లు...
బతికేయ్ ఆనందంగా
దునియాలో రేపే  నీకాఖరి రోజైనట్లు
3.
ఎవడిపనో జేసి,మన తృప్తికోసం అన్నామంటే...
ఆడు పిచ్చోడైనా అయ్యుండాలి,
లేదా... పితృసమానుడైనా అయ్యుండాలి.
4.
ఆడ్ని కొట్టు, ఈడికి పెట్టు
అని కొట్టేస్కుంటది ప్రతీ గవర్నమెంటు,
ఈడొక్కడే సపోర్టన్నట్టు...ఈడు ఆడు ఒకటేనెహే.
5.
ఏ తప్పైనా మొదటిసారే మొహమాటం,
అందుకే కంచం పెట్టేముందే...
కాళ్లు, చేతులు కడిగించాలి.
6.
పడిపోవడం జస్ట్ ఒక ప్రమాదం,
పడగొట్టడం,పడుకొనుండడం...
జాతి ప్రగతికే అగాధం.
7.
మంచి,చెడులు ఎంచడం మాత్రమేచేస్తే,
వంచన మాత్రమే కనపడుద్ది,
ప్రేమించడం ఏడ కుదురుద్ది.
8.
చివరకి లెక్కలు తేలనీ,
ఎంతకాలం బ్రతికావని కాదు,
అంత కాలంలో, ఎంత బ్రతికావని
9.
ముందు,వెనక... ఆ పక్క,ఈ పక్క
నీతో పోలిస్తే... నీకెంతుందో తెలుస్తది,
నీ లోపల,బయట పోల్చు... నువ్వేంటో తెలుస్తది.
10.
జీవితం గురించి చెప్పాలంటే,
దీని తస్సాదియ్యా...
దరిద్రాన్ని మించిన గురువేలేదు.
==================================

గుప్పెడు మల్లెలు-90

కె.కె.//గుప్పెడు మల్లెలు-90//
********************************
1.
ఒక టి.వి.,ఒక మొబయిల్ 
చూడలేనివి చూశాం,
చూడకూడనివి చూస్తున్నాం.
2.
గుడి... ఆథ్యాత్మిక కేంద్రం,
అంతర్మదనం జరిగే సంద్రం.
కాని...విషయం గ్రహించం, విషం కక్కుతాం.
3.
ప్రతోడి కోరిక, ఉండాలని స్వర్గంలోనే
ఆడు మాత్రం ప్రవర్తిస్తాడు,
ఉండేదెప్పుడూ సంతలానే
4.
ఆడాళ్లు రాజ్యాలు ఏలుంటే,
జరిగిన యుద్ధాలన్నీ,
అభద్దాలు అయ్యుండేవేమో!!!
5.
చచ్చేక ఏమవుతాం, అనే శ్రద్ధ
బతికుండగా ఏం చేద్దాం,
అని లేదెందుకురా నరుడా!!!
6.
డబ్బు నీ కాలి చెప్పు,
నీ జోడు నెంబరు ఏడైతే,
ఆరేస్తే కరుస్తది, ఎనిమిదైతే పడేస్తది.
7.
నిన్ను తక్కువన్నాడొకడు,
నువ్వు ఒప్పుకోకపోతే,
అది నిజమయ్యేదెప్పుడు.
8.
గుంపులోనే ఉంటే, అది లేకుండా నడవలేవ్,
ఒంటరిగా నడిచి చూడు,
మునుపెవ్వడు రానిచోట, నువ్వుంటావ్.
9.
సమస్య ఒక నీళ్ల బావి,
చుట్టూ తిరక్కు, దూకి చూడు,
ఈతా వస్తది, లోతూ తెలుస్తది.
10.
నేను, నిన్ను చదివేశాను,
అంటాడో మూర్ఖుడు...
నిన్ను, నువ్వు చదివితే చాలంటాడు బుద్ధుడు.
==============================

గుప్పెడు మల్లెలు - 89

కె.కె.//గుప్పెడు మల్లెలు - 89
**************************
1.
చస్తేవచ్చే నష్టం తక్కువే,
పోల్చి చూస్తే...
బతికుండగా లోపలి మనిషి చస్తే
2.
నచ్చిన పనిని పట్టు,
నౌకరీగా దొరకబట్టు,
ఒట్టు... అపుడు కూర్చోబెట్టి, కూలిచ్చినట్టు
3.
స్టాండులేని బండిరా జీవితం,
నడవాలంతే...నడుపుతూ పోదాం,
లేకపోతే... పడతాం.
4.
ఏడిస్తే, నవ్వే లోకం...
నువు నవ్వితే, ఏడుస్తుంది,
అలాగని నిద్దరోకు...వదిలేస్తుంది.
5.
ఎండ కాల్చేస్తొందట,
చలి కొరికేస్తోందట.... ఎందుకట?
అని ఆలోచించరెందుకట
6.
జీవితంలో హాస్యరసం,
బాధలో వచ్చే నీరసం..రెండూ ఔషధం,
కొలిమిలో కాల్చే ఇనుముకోసం
7.
నువ్విచ్చింది, నీకు ఖర్చెట్టడం,
అదేకదా... ప్రభుత్వం,
మరి ఈ దా(దో)చేస్కోడం... ఏంటి చెప్మా!!!
8.
పుట్టుకతో ప్రతోడు పిచ్చోడే,
కొందరికి కలం వైద్యం అందింది,
కొందరికి కులం సోకింది...ఎదుగుదల ఆగిపోయింది.
9.
ఎవడికాడే సీత, ఏదో ఒక బాధ,
ఎడిటింగ్ సేసి సూడండహే...
బాగుంటది... మీ సినీమా కధ
10.
పైనకాసే పండు కావాల,కిందున్న దుంపా కావాలా,
లాజిక్కు మిస్సవ్వకురో...
కావాలంటే... మద్యలో సెట్టుండాలా
====================================

గుప్పెడు మల్లెలు-88

కె.కె.//గుప్పెడు మల్లెలు-88// 
************************
1. 
ఉరి తియ్యొచ్చేమో గానీ,
ఓడించేవాడు లేడు,
మనిషిని... వాడి మనసునీ...
2.
తాడుకి చివరున్న ముడి,
ఆశ అంటే,
తుదకంటూ జారినా, పడనివ్వదు
3.
మార్పు సహజం,
నిజం...
అదొక్కటే సహజం
4.
ఏవడో, ఎవడితోనో పోలిస్తే... నీకేం?
ఆడ్ని, ఈడ్ని కలిపి చదివేయ్...
జ్ఞానం పెరుగుద్ది.
5.
మెదడొక పుష్పకవిమానం,
ఎంత నేర్చిన...
ఇంకాస్త ఖాళీ ఖాయం.
6.
అద్భుతాలు అక్కర్లేదు,
అద్భుతంగా చేస్తే చాలు,
పనులైనా... పలుకైనా...
7.
స్వతంత్ర్యం అంటే,
సంతోషం...
మన స్వతంత్ర్యానికి ఎన్నేళ్లో?
8.
ప్రాణమితృడు పారిజాతం,
దొరకడం కష్టం...
దొరికితే అదృష్టం
9.
జారిపడితే,
లేపుతారు...
కాసేపైనా నవ్వుకున్నాకే
10.
మెదడూ, మొబయిల్ ఒక్కటే
అని ప్రచారం చేస్తే సరిపోద్ది,
ప్రతోడు వాడేస్తాడు.
===========================

గుప్పెడు మల్లెలు-86

కె.కె.//గుప్పెడు మల్లెలు-86//
************************
1.
గెలుపన్నది కాదు శుభంకార్డు,
ఓటమెప్పుడూ కాదు మూసిన గేటు,
ప్రతీ ఆటలో ఇవి ఆటు,పోటు.
2.
విలువలు కాపాడ్డం కన్నా,
విజయం పొందడమే మిన్న...ఎలాగైనా,
లేదంటే టీవీల్లో కనపడ్డం కష్టమ్రా కన్నా
3.
తవ్వుకుంటూ పోతే, దానికంతమేదీ?
నిఘంటువర్ధం ఎక్కడని వెదికేదీ?
బెడ్రూం కెమేరాలేగా ఇప్పటి జర్నలిజం వ్యాధి.
4.
ద్వేషం మిగులుస్తుంది బోల్డు కాలం,
అవసరమే లేదు కనుక్కోవడం,
ఏది నిజం, ఏది అబద్ధం.
5.
కూడు, నీడ, గుడ్డ కనీస అవసరం,
ఎవరికైనా సరే...
ఆడోళ్లైతే ... కాస్త పొగడ్త... కదా!!!
6.
దేవుడు నీకు సోడా ఇస్తే,
ఎవడికో వోడ్కా ఇచ్చేవుంటాడు...
కలిసి పార్టీ సేస్కో ఎహే...
7.
సస్పెన్సు భలేగుంటది,
క్లియరయ్యేదాకా కూర్చోనివ్వదు,
క్లియరైతే మళ్లీ చూడనివ్వదు.
8.
ఎవడిగురించి లేదా చెప్పడానికి మంచి,
అయితే మర్చిపోవడమే బెటరేమో...
మాట్లాడటం గురించి
9.
స్టాక్ మార్కెట్ ఒక కామెడీ,
ఒకడు అమ్ముతాడు, ఇంకోడు కొంటాడు
ఆడు,ఈడూ... రైటే అనుకుంటాడు.
10.
గంట, ఘడియవుద్ది ఆమెతో ఉంటే,
క్షణం, యుగమైపోద్ది ఆమెకై ఎదురుచూస్తుంటే,
కాలం లెక్కేవేరు... ప్రేమలో ఉంటే.
======================================

గుప్పెడు మల్లెలు-85

K.K.//గుప్పెడు మల్లెలు-85//
********************************
1.
తప్పులెన్నో లెక్కచూస్కో నీలో,
అప్పుడదే దొరుకుతుంది,
వాటి దారిమళ్లించే మార్గం
2.
అదుపు తప్పనిది ఏదీలేదు,
ఈడ... జనులెవ్వరిలో,
జరాసా... ఆతృత తప్ప
3.
జోగి,జోగి కలిస్తే బూడిదేనంట,
నాన్సెన్స్... లెక్క తెలీదా,
ఋణం, ఋణం గుణిస్తే ధనం కదా
4.
కళ్లను మించిన వగలాడి లేదు,
కునుకు తీసేప్పుడు తప్ప
కధలు,కబుర్లు మానదు
5.
ఎన్నాళ్లురా ఈ తుచ్చ రాజకీయం,
ఒట్టి గంజి నీళ్లేనా మా జీవితం
ఎన్ని త్యాగాలైనా చేసి, ఉప్పుకూడా సాదిస్తాం.
6.
ఉక్క పోస్తోందని దుఃఖ పడితేనో,
పక్కవాడికి చెప్పి గుక్క పెడితేనో
తగ్గుతుందా మండే ఎండ... ఒక్క మొక్కైనా నాటకుండా
7.
పేదోడంటే మా సెడ్డ ప్రేమ... అందుకే,
ప్రతీ బడ్జెట్ తోనూ ప్రభుత్వం,
ఆళ్ల సంఖ్య పదిరెట్లు పెంచే ప్రయత్నం
8.
మనం దేవుడితో చెబితే
ప్రార్ధన అని అంటున్నామా...
ఆయన చెప్పింది ఒక్కటైనా వింటున్నామా
9.
పంచభూతాలు దేవుడిచ్చాడు,
ఆరో భూతం మనోడు తెచ్చాడు
అది ప్లాస్టిక్ లే ... తమ్ముడూ
10.
ప్రతీరోజూ అదే వింత,
ప్రపంచంలో ఏడుపులన్నీ
సరిగ్గా పేపర్లో సరిపోయేటంత
=========================

గుప్పెడు మల్లెలు-84

కె.కె.//గుప్పెడు మల్లెలు-84
******************************
1.
గెలిచినోడు నోరిప్పడుగానీ,
వెనకదాగిన రహస్యం...
ఆడు మొదలెట్టడమే
2.
పక్కవాడ్ని దాటాలనుకోవడం,
పసవున్న పోటీతత్వం...
నలుగురినీ దాటించడమే దైవత్వం
3.
కళ్లు నెత్తికెక్కితేనే
కొలవగలమోయ్ ఆకాశపు ఎత్తులు...
మరవకుండా నేలమీద కాలి గుర్తులు
4.
"అంతా మన తలరాతే" అంటుంటారంతా,
ఒక పేజీలోనే రాసుంటుంది అదంతా...
రాసుకోవాల్సింది నువ్వే, మిగిలిన పుస్తకమంతా
5.
గీతదాటినోడి చెంప,
మోత మోగించాలనిపిస్తుంది కదా...
అంతా అలా అనుకుంటే నీ బుగ్గ కమిలిపోదా
6.
ఎరువెయ్యకు, అభద్దాల పైరుకి
కర్మకాకి పెరిగిందా...
మరణమే సుఖమనిపిస్తుంది జీవితమంతా
7.
ప్రేమన్నది ఒక ప్రేతాత్మేనంట,
కధలు,కధలుగా చెప్పుకుంటారంతా,
కళ్లతో చూసింది సముద్రంలో కాకిరెట్టంత
8.
వెలుగు నేరుగా చూడవోయ్,
తోడు ఉన్నా, లేకున్నా
నీడ సైతం నక్కదా నీ వెనకన
9.
నిర్లక్ష్యం కూడా నజరానావే,
లేకపోతే...
ప్రతి సమస్యా జరిమానావే
10.
తెలివిగా ఉన్నప్పుడు
నరకంలో ఉంటే,
నిద్దరోయే టైముకి స్వర్గం దొరుకుద్ది.
==========================