స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Thursday 4 June 2020

అంతర్జాలం
============
ప్రతీ పదేళ్లకు, ప్రపంచం తన రూపురేఖలు మార్చుకుంటోంది. ప్రగతిపధంలో ప్రయాణిస్తోంది. కాలానుగుణంగా పరుగులు తీస్తోంది.
"అంతర్జాలం" అనేది ఒక సాంకేతిక విప్లవంగా అభివర్ణించవచ్చు.
- కాగితపు ఖర్చు తగ్గింది, ఆన్లైన్ డాటా బేస్ తో
-వ్యాధి మూలాంతరాలని తెలుసుకో గలుగుతున్నాం, వైధ్యశాస్త్ర ఆధునిక పరికరాలతో
-ప్రపంచంలో ఏ మూల, ఏం జరిగినా తెలుసుకో గలుగుతున్నాం, మీడియా మాధ్యమంతో
-ఎంత దూరాన్నైనా అవలీలగా ప్రయాణిస్తున్నాం, మోటార్ వాహనాలతో
-రానున్న ప్రకృతి వైపరీత్యాలని ముందే పసిగడుతున్నాం, స్పేస్ టెక్నాలజీతో
-ఎంత దూరాన్నున్నవారితోనైనా మాట్లాడగలుగుతున్నాం, మొబయిల్ ఫోన్ సౌలభ్యంతో
ఇలా చెప్పుకుంటూపోతే సాంకేతిక విజ్ఞాన సౌలభ్యానికి, సౌకర్యానికి అవధులు లేవనే చెప్పాలి.
"ప్రతీరోజూ ఒక కొత్త రూపం... ఇదే సాంకేతికరంగ ప్రస్థుత స్వరూపం"
మనిషి జీవనశైలి సులభతరం అవుతూనే ఉంది, అయినా పరిశోధన కొనసాగుతూనే ఉంది.
అయితే సాంకేతిక విజ్ఞానం రెండువైపులా పదునున్న కత్తిలాంటిది.
ఎవరినైనా ఎలా ఉన్నావ్? అని ప్రశ్నిస్తే... వచ్చే సాధారణ సాంప్రదాయ సమాధానం ఒక్కటే...
ROUTINE MECHANICAL LIFE
-మన మద్యనే ఉన్నా, మనతో కన్నా మొబయిల్ తోనే ఎక్కువగా మాట్లాడుతున్నాడు.
-రెండు,రెళ్లు ఎంత అన్నా, కాలక్యులేటర్ వాడుతున్నాడు.
-కోట్లతో నిర్మించిన సినిమాని, పైరసీతో ఫ్రీగా చూసేస్తున్నాడు.
-కడుపులో బిడ్డని, కనకముందే కనిపెట్టి... కన్య అని తెలిస్తే కడతేరుస్తున్నాడు.
-పక్కవాడి డబ్బుల్ని నకిలీ చెక్కువాడో లేదా కంప్యూటర్ జిమ్మిక్కు వాడో దోచేస్తున్నాడు.
-అమ్మాయిల నగ్న చిత్రాలని, అంతర్జాలంలో ప్రదర్శిస్తూ...ఆడతనాన్ని ఉరేస్తున్నాడు.
-ఏకాంతజీవితాన్ని, అయస్కాంతంలా లాగేస్తున్నాడు.
ఈ పరిస్థితినుంచి బయటకి రావాలి, మార్పు కావాలి. మానవత్వపు విలువలు పరిమళించాలి.
చూపు, స్పర్శ, మాట ఇవే సంఘహితాన్ని, సంఘటితాన్ని కాపాడేవి అని తెలుసుకోవాలి.
మన అన్నవారితో, కాస్త సమయం వెచ్చించాలి.
"మనిషి, మనిషిగా బ్రతకలేనప్పుడు... అది ఎంత గొప్ప విజ్ఞానమైనా, వివేక రహితమే"
"భవిష్యత్తు అంతా సాంకేతిక విజ్ఞానానమే...
కాని, జరగాల్సింది మానవ కళ్యాణమే"
స్పూర్తి
========
ఒలింపిక్ క్రీడల సంబరాలు, అంబరాన్ని అంటుతున్న తరుణంలో...
మనకి దేశభక్తి అప్పుడప్పుడు గుర్తొచ్చే ఆగష్టుమాసంలో...
ఒక గొప్ప క్రీడాస్పూర్తిని తలుచుకోవడం సమంజసం అని ఈ వ్యాసం.
"రెండు వేరు, వేరు గుడ్డల్ని కలిపికుట్టే సూది, తను మాత్రం మద్యలోంచి జారిపోతుంది."
అలాగే క్రీడాస్పూర్తి రెండు వేరు, వేరు జట్లను ఆడుతున్నంతసేపు పోరాడమన్నా, ముగిసాక మనస్పూర్తిగా కొనియాడమంటుంది.
అది ఆగష్టు 15, 1936 అంటే సరిగ్గా స్వతంత్ర్యానికి 11సం. ముందు, ఒలింపిక్ క్రీడల్లో హాకీ ఫైనల్ జరగనుంది. ఒకపక్క ఆతిథ్య దేశం జర్మనీ జట్టు, మరోపక్క అన్యాక్రాంతమైన భారత జట్టు. ఒకపక్క అందరి మనసుల్లో జర్మనీ విజయంపై ధీమా, మరోపక్క భారత్ కు సరిగ్గాలేని క్రీడా సరంజామా. ఈ నేపథ్యంలో ఆట మొదలయ్యింది. భారత్ కు ప్రతికూలంగా ఉండేందుకు గ్రౌండులో నీళ్లు ఎక్కువగా చల్లి తయారు చెయ్యబడింది. బూట్లకు స్పైకులు కూడాలేని పరిస్థితి కావడంతో, పరిగెడుతూ జారిపడడం భారత్ క్రీడాకారుల సహనాన్ని పరీక్షించింది. అయినా మొక్కవోని పట్టుదలతో పోరాడి భారత్ 1-0 ఆదిక్యంతో మొదటి అర్ధబాగాన్ని ముగించింది. జర్మనీ జట్టుని ప్రోత్సహించడానికి స్వయంగా హిట్లర్ రావడం విశేషం.
ఇంతలో రెండో అర్ధబాగం మొదలయ్యింది. తిరిగి అదే పరిస్థితి గమనించిన భారత జట్టు కెప్టెన్ తన బూట్లని విడిచి ఆట ఆడటం ప్రారంభించాడు, అది గమనించిన మరికొందరు సహక్రీడాకారులు అతడిని అనుసరించారు. అంతే.... భారత్ స్వైరవిహారం ముందు జర్మనీ జట్టు తలవంచింది. భారత్ తిరుగులేని ఆదిక్యంతో (8-1) విజయం సాధించింది. బంగారు పతకాలు జట్టు సభ్యుల మెడలో ఆభరణాలయ్యాయి. అప్పటి ఆ స్పూర్తిదాయక కెప్టెన్ మరెవరోకాదు ధ్యాంచంద్. గెలుపుకోసం, భారతదేశపు కీర్తి బావుటాని ఎగరెయ్యటం కోసం అలుపెరగని సూర్యుడిలా, వెన్నుచూపని వీరుడిలా పోరాడిన ధ్యాంచంద్ చిరస్మరణీయుడు.
ఆట పూర్తికాగానే హిట్లర్నుంచి ధ్యాంచందుకి పిలుపొచ్చింది. కాస్త ఆందోళనతోనే హిట్లర్ను కలుసుకున్నాడు. తను భారతదేశం సైన్యంలో సైనికుడిగా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. వెంటనే హిట్లర్ అతడి ఆటకి తను ముగ్దుడినయ్యానని, తమ దేశపు పౌరసత్వం తీసుకుంటే తన సైన్యంలో ఉన్నత పదవిలో నియమిస్తానని, తమ హాకీ జట్టుకి కెప్టెన్గా వ్యవహరించాలని కోరాడు. ధ్యాంచంద్ చిరునవ్వుతో అతడి ఆహ్వానాన్ని మర్యాద పూర్వకంగా తిరస్కరించి, ధన్యవాదాలు తెలియజేసి "భారతదేశం మా అమ్మ, అమ్మ ఒడిలో నేను ఆనందంగా ఉన్నానని" చెప్పి వచ్చేసాడు. అకుంఠిత క్రీడాస్పూర్తికి, అంతులేని దేశభక్తికి ధ్యాంచంద్ ఒక సరైన నిర్వచనం అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో.
125 కోట్ల జనాభా ఉన్న ఎడారిలో, ఒక్క మెడల్ అనే ఒయాసిస్ కోసం అలమటిస్తున్నాం. సగటు మనిషి కట్టిన పన్నులతో ప్రభుత్వ కాలేజీల్లో చదివి, పరాయి దేశాల్లో పైసల సంపాదనకి పరిగెడుతున్నాం. పతకంకోసం ప్రయత్నించే క్రీడాస్పూర్తి కంటే, పదకంతో అధికారాన్ని అందుకోవడానికి , అందలమెక్కడానికే మక్కువ చూపిస్తున్నారు. ఇప్పటి యువతకి ధ్యాంచంద్ చరిత్ర ఒక భగవద్గీతలా వినిపిస్తే బావుంటుందేమో???