స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Friday 30 November 2012

జనకవి

నేనొక జనకవిని,
నిజానికి సుజనకవిని.
మ్రోగే చప్పట్ల కన్నా,
సగటుమనిషి గుండె చప్పుళ్ళే నాలక్ష్యం.

చేతులు పిసుక్కుంటే సమస్య మెత్తబడుతుందా,
చేవతో సంఘర్షించాలి.
అమ్ములపొదిలో శరాలు నిద్దురపోతే,
అవి లక్ష్యాన్ని చేదించలేవు.
అందుకే సానపెట్టిన సంకల్పాన్ని
జనం మద్య ధ్వజంలా నాటేస్తా.

నిజమైన,నిజానికి కాలదోషం పట్టదు.
మబ్బు కమ్ముకుంటే సూర్యునికి మరక అంటదు.
వ్యక్తిత్వం ఉబికి రావాలి,
కొలిమి నిప్పుల్లోంచి శిరసెత్తే సెగలా.

ముసురు పట్టిన పగటి ముఖంలా
మూల్గుతూ బతకొద్దు,
కుండపోత కురిసి,కురిసినా
ఎండలా రొమ్మువిరిచే నిలబడు.

గడ్డికప్పిన గోతులెన్నో...నా నడ్డివిరిచి,
నా ప్రయాణం ఆపాలనుకున్నాయ్.
కానీ సాగిపోతూనే ఉన్నా...
తల గుద్దుకుంటుందని కెరటం ఒడ్డుని మరిచిందా???

"పసవున్న లవంగం నిజం,
కొరికితే చురుక్కుమంటుంది.
కానీ నోట్లో నలిగాక,
నిస్సత్తువనుంచి నిద్దురలేపుతుంది."

అందుకే నేనంటాను... ఓ కవీ
చుక్కల వెనకాల ఏముందో చూస్తావ్,
నీ పక్కనున్నవాడ్ని ఏల మరుస్తావ్.
కవిత్వమంటే వెన్నెల,ఆమనీ కాదోయ్,
ఆకలి చావులకి అధికారులకిచ్చే హెచ్చరిక.
==============================================
తేదీ:28.11.2012

Tuesday 20 November 2012

పరిమళం-గజల్

పరిమళాలు ఎన్నో, ఈ జగతికి సాక్ష్యం,
పరవశాలు ఎన్నో, నీ సుగతికి సాక్ష్యం.

నొప్పులతో మొదలై, నవ్వులతో ముగిసే
పురిటిమంచ పరిమళం, నీ జన్మకి సాక్ష్యం.

ఏటికొక్క తరగతి, మెట్లపైకి ఎక్కించే
నవపుస్తక పరిమళం, నీ ప్రగతికి సాక్ష్యం.

కారణాలు వెతికిస్తూ, కవ్వించే సొగసున్న
మధిర మత్తు పరిమళం, నీ మగతకి సాక్ష్యం.

ఏడడుగులు వేయిస్తూ, ఇరు బతుకు జతచేసే,
అక్షింతల పరిమళం, నవమైత్రికి సాక్ష్యం.

మనసులు ముడివేసే, తనువులు మురిపించే
మరుమల్లెల పరిమళం, తొలిరాత్రికి సాక్ష్యం.

సాధనతో కోదండ, శిఖరం అందేవేళ,
చిరు చెమటల పరిమళం, నీ గెలుపుకి సాక్ష్యం.
=========================
తేది:18.11.2012

Wednesday 14 November 2012

//గుప్పెడు మల్లెలు-21//

1.
వాలుచూపే ఇష్టమట,
సూటిగాచూస్తే
మనసు చదివేస్తుందనేమో?
2.
ప్రార్ధన చేసానంటావ్,
నిజానికి అది అభ్యర్ధన,
మరోలా చెబితే యాచన
3.
కోర్కెలు ఎక్కువుంటే,
ఏడ్పులు
ఎక్కువుంటాయ్.
4.
నిజాలన్నీ నీడలేనా?
నీడలుకూడా నిజాలేనా?
సత్యం ఎప్పుడూ చిత్రం
5.
రాముడొదిలేసిన
రావణసైన్యం,
నేటి రాజకీయం
6.
ఖాళీస్థలమంతా ఖాళీ,
అందుకే
ఒకడినెత్తిమీద ఒకడు
7.
సానుభూతికోసం చూడకు,
సానుకూలంగా చూస్తే,
అది గాయం మీద కారం
8.
వేచిచూసే ఓపికలేకే,
విజేతల సంఖ్య
వేళ్ళమీద
9.
ప్రతీ భావానికీ
ప్రభావముంటుంది,
మనసు తాకితే
10.
ఏ మనిషైనా
ఎక్కువసార్లు మోసపోయేది,
తన చేతిలోనే.
===================================
తేది:14/11/2012

Sunday 11 November 2012

//ప్రేమ//

ప్రేమ...ప్రేమ...అంటారంతా,
దీని దుంపదెగ,
అంటే ఏమిటో,
అర్ధమై చావట్లేదు.

ప్రేమకోసం చచ్చారు కొందరు,
ప్రేమించి చచ్చారు మరికొందరు,
ప్రేమించలేదని గెడ్డం పెంచినోడొకడు,
ప్రేమించలేదని యాసిడ్ పోసినోడొకడు,
మందు తాగేవాడొకడు,
సందులో కాసేవాడొకడు
ఇదేనా ప్రేమంటే...
ఉన్మాదమేమో???

ఖాళీ సినిమాహాల్లో ఏదో ఒక మూలా,
పబ్లిక్ పార్కుల్లో చిట్టచివరి బెంచీలా,
ఊరవతల తోటల్లో పారదర్శ బుడగలా,
ప్రేమా ఇదేనా నీ చిరునామా,
కోరికేనేమో???
***************************
సాగుతున్న ఆలోచనలను,
భగ్నం చేస్తూ ఒక ఆక్రందన.
రోడ్డుపైన అడ్డంగా బస్సు తాకిన బైకు,
రక్తపుమడుగులో జంట..అగుపించింది నాకు.

ఆమెకు స్పృహ లేదు,
అతడికి సత్తువలేదు.
కళ్ళు తెరవని ఆ ముగ్ధ,
ఆతడి కళ్ళల్లో ఆదుర్దా,
శక్తినంతా చేతుల్లోకి చేర్చి,
ఆమెను ఆసుపత్రికి మార్చేవరకు
చెదరని ఆతడి పట్టుదల.

శస్త్రచికిత్స జరిగింది,
అతడికో వేలు తెగింది,
కాని ఆమె కళ్ళు తెరిచింది,
అతడి కళ్ళల్లో నవ్వు విరిసింది.
నా కళ్ళలో చెమ్మ నిలిచింది.
ఇదేనా ప్రేమ...
ఇదేనని నా మనసు చెప్పింది.
===================
తేదీ: 09/11/2012

Tuesday 6 November 2012

//గుప్పెడుమల్లెలు-20//

1. 
ఆయన శృంగారం
ఒలికించేది...
డి"వైన్" మూడ్స్ లోనే
2.
ఎన్ని కలలో...
ఎన్నికలొస్తే
మద్యతరగతి మనసు
3.
ఏ మహానదికైనా,
జన్మస్థలం జానెడే,
ఒకటితోనే అనంతం
4.
చైతన్యానికి పదునుపెట్టే
కర్మాగారం,
మౌనం
5.
తారురోడ్డుపై కూడా కాళ్ళు
చిక్కుకుంటాయ్.
నిరాశ గుండెనంటితే
6.
రంగునిబద్ధత లేనిది రక్తం,
వర్ణ వివక్ష లేనిది
సత్యం
7.
అగ్రరాజ్యమైనా
ఆకాశం ఆగ్రహిస్తే
అదోఃగతే
8.
నిద్రపోతున్న గుండె
తట్టిలేపేది
జ్ఞాపకం
9.
ఫోర్జరీ విద్య
మొదలయ్యేది
ప్రొగ్రెస్ కార్డులనుంచే
10.
గుండెబరువు
తెలిసేది
ప్రేమించిన గుండెకే.
=======================================
తేది:05/11/12

Monday 5 November 2012

ఒకటో తారీఖు సుల్తాన్

"చెల్లియో,చెల్లకో" అంటూ,
ఎప్పుడో,చిన్నప్పుడు...
నాటకాలు చూసేటప్పుడు,
నేర్చిన నాలుగు పద్యాలని,
ఒత్తులు మింగేస్తూ వినిపిస్తాడు.
రసికతనంతా,రంగరించి
రక,రకాల భంగిమల్లో అభినయిస్తాడు.

నేను సోడాలందిస్తుంటే,
నా చేతికి మందిస్తాడు.
నేను దూరంగా జరిగితే 
వెటకారపు నవ్వు విసిరేస్తుంటాడు.
"సహపానం,సమభావనకు సోపానం" 
అంటూ తత్వం వల్లిస్తాడు.

చంటిదేడిస్తే,చిరాకుతో
పంటికింద పెదవి కొరికేస్తుంటాడు.
యం.టివి కొక్కిరాయి అరుపులకి
కంటిపాప పెద్దది చేసి చెవులర్పిస్తాడు.
ఆ బృందఘోషలో,తన మందుగొంతు కలిపి
యా..యా..అని అరుస్తుంటాడు.

మీసం మెలేస్తూ,తొడ చరుస్తూ,
మెడవిరుస్తూ..తానే మహారాజంటాడు.
వచ్చీ,రాని ఇంగ్లీషులో 
చచ్చిపోతున్న తెలుగుభాషపై లెక్చరిస్తాడు.
ఆఫీసులో బాసు,తాను వేసిన 
డోసుముందు బలాదూరంటాడు.
మావీధి అల్లరిమూకల,
తోకలు కత్తిరిస్తానంటాడు.
నాలుగు మెతుకులు కతికి నిద్దరోతాడు.
************XXXXXX************
పొద్దున్నే టిఫిన్ డబ్బాతో,
కొమ్ములకి రంగేసిన ఎద్దల్లే పరిగెడతాడు.
మా ఆయన ఏక్ దిన్ కా సుల్తాన్,
నిన్న "ఒకటో తారీఖు" మరీ.
=======================
తేది: 01/11/2012