స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Tuesday 23 July 2013

గుప్పెడు మల్లెలు-43

1.
గుచ్చుకుందని 
నొచ్చుకోకు,
కలిపికుట్టే సూదిమొనది.
2.
వెలుగు,చీకట్లొక్కటే
ఆకాశానికి,
కారణాలు వెతక్కు వైరాగ్యానికి
3.
తమమాటే వేదమట,
పంది పొర్లే బురదే,
దానికి సెలయేరు మరి.
4.
వరదొస్తే పైర్లకే కాదు,
గట్లకికూడా ముంపే,
స్వాభిమానం సరిహద్దులెన్ను.
5.
ఎంత దాస్తావ్?కొంత పంచు,
పౌడరద్దిన ఒళ్లుకూడా,
పోయినాక నీదికాదోయ్.
6.
అడివైనా,గుడినైనా
వెన్నెలొక్కటే,
కొందరికే పై చదువా?
7.
ఎవ్వడురా రైతు,
ఎదిగే అడవికి?
స్కేలుందా విజ్ఞానపు నిడివికి?
8.
పుస్తకం తిరగేస్తేనే,
మస్తకం పదునెక్కదులే,
గుండె తలుపు తట్టాలంతే.
9.
చూపులెక్కడ
పాతేశావ్?
పుట్టినూరు పిలుస్తుంటే.
10.
సముద్రం కళ్లెర్రజేస్తే
ఉలికులికి పడతావ్?
చెమటకూడా ఉప్పునీరేనోయ్.
====================
Date: 22/07/2013

Saturday 20 July 2013

గుప్పెడు మల్లెలు-42

1.
పువ్వుని తుంచి
అతికించలేవు.
స్నేహంతో పరిహాసాలొద్దు.
2.
శిఖరం పొగరు,
డైనమైట్లతో సరి,
ఏది శాశ్వతం?
3.
ప్రతిపొద్దుకి కోడికూత,
ఎవడి గెలుపో,
మనదన్నట్టు.
4.
కాలం వేలాడితే,
క్యాలెండర్,
తిరగబడితే థండర్.
5.
జుట్టెక్కువుంటే,
జడ కుదిరినట్టు,
గుణంతోనే గుర్తింపు.
6.
అప్పిస్తోంది మబ్బు,
తీరుస్తోంది నది,
ఎండలో మండుతూ
7.
సంతలో సంకీర్తనలా,
మూర్ఖుడికి
ఉపదేశాలేల?
8.
ఏ మందైనా,
తలకిందులే,
మనిషే కాటేస్తే.
9.
గుండె ఆడేంతవరకే,
కోరికల గుర్రం,
ఆటాగితే అంతా శూన్యం.
10.
కాల్చేసే ఆకలిచ్చినా,
దేవుడు
నిద్దరిచ్చి మేల్జేసాడు.
===============
Date:20.07.2013

Wednesday 17 July 2013

గుప్పెడు మల్లెలు-41

1.
కళ్లన్నీ ఒకేరకం,
కనిపెట్టేదెలా?
కంటి నలుసుని.
2.
మతితప్పితే,
బూతై దిగజారుతుంది,
కోపం...ఒక శాపం.
3.
పేరుకున్న పాపం,
ఏ ఒక్కరి పేరుతోనో లేదు,
నీ ఇల్లు శుభ్రంచెయ్.
4.
కొండెక్కానని
మురిసిపోకు,
కొండ కింద మన్నే.
5.
మర్రివిత్తు చిన్నదే,
నాటితే మహావృక్షం,
ఆలోచన మంచిదైతే.
6.
మనిషన్నోడి,
సంతృప్తి,
మరభూమిలోనే
7.
దూత ఎవడో?
భూతమెవడో?
అంతర్ముఖానికి అద్దమేది?
8.
ఈదే చేతులకు
అలలు అడ్డమా?
కె.కె.కి యతిప్రాసలు కళ్లెమా?
9.
కనకం కాల్చక తప్పదు,
మెరుగులు దిద్దాలంటే,
బడిపంతులు మనవాడే.
10.
పలుకున్న వాక్యం,
దిక్కులు పలికిస్తుంది,
హలో అంటే,పొలోమంటూ...
==================
Date: 17.07.2013

గుప్పెడు మల్లెలు-40

1.
లోతులు తడిస్తేనే,
కొమ్మలు తలలూపుతాయ్,
మాట మనసుని చేరనీ
2.
ఉలికి కళవుంటే,
ప్రతీరాయీ శిల్పమే,
ప్రతీమనిషీ గ్రంధమే
3.
కొండకి తాడేస్తే,
కుదురు ఊడొస్తుందా?
ప్రయత్నించు,పరిణితితో
4.
మన బిందెలోకే,
వీధి కొళాయి నీరంతా,
స్వార్ధానికి సరిహద్దేదీ?
5.
కుళ్లిన శవమైనా,
రాబందుకి ఫలారమే,
లంచం రుచెరగదు.
6.
నీటి బుడగ,
ఏటికి గొడుగా?
ఏ ఒక్కడితో ఏదీ ఆగదు.
7.
దులిపేస్తే,
జలగ వదిలేస్తుందా?
ఉద్యమిస్తేనే ఫలితం.
8.
సింగమైనా మరో
సింగాన్ని ఛీ అనదు,
మనిషి ఏ జంతువో?
9.
అందర్ని నమ్మకు,ప్రమాదం,
అందర్నీ అనుమానించకు,
బ్రతుకు దుర్లభం.
10.
పరీక్షలొస్తేనే,
పరమాత్మ సన్నిధి,
లాభంలేని పనిచెయ్యం కదా!
==================
Date: 16.07.2013

Saturday 13 July 2013

గుప్పెడు మల్లెలు-39


1.
ఎడారివర్షం,
బడాయికేలే,
వాగ్ధానాలు నమ్మకురోయ్
2.
చుక్కల వెలుగులో,
అక్షరాలు చదివేస్తావా?
మిడి,మిడి జ్ఞానం సరిపోదోయ్
3.
చేవగల్గిన కాళ్లకు
చేతికర్ర ఎందుకు?
ప్రతిభకు సిఫార్సులెందుకు?
4.
తొలకరిజల్లు ముందు,
ఎండ ఎరుపెక్కువే,
మార్పెప్పుడూ తీవ్రంగానే
5.
చిల్లుకుండలో,
నీళ్లు నింపి ఏం లాభం?
లోపం సవరించుకో
6.
తుఫానులో గొడుగా,
విషమించకముందే,
విజృంభించు.
7.
కాగుతుంటే పాలకు
కమ్మదనం,
కదిలే మనసే పరిమళం.
8.
అన్నం వండకపోతే
తిండి ఎలా?
సాధనతోనే ఆస్వాదన.
9.
విసనకర్రతో,
మనసు చల్లారదులే,
పై,పై జాలి కట్టిపెట్టు.
10.
పసరెంత పూసినా,
కసరత్తుండాలి,వాతానికి
అందరూ కలవాలి ప్రతిపధకానికి 
==================
Date: 14.07.2013

Friday 12 July 2013

గుప్పెడు మల్లెలు-38

1.
సాధన కూడా శ్వాసే,
ఆగిపోతే
చచ్చినట్టే.
2.
తోటమాలే,
పూలు తొక్కితే,
పుష్పవిలాపం వినేదెవ్వడు?
3.
చిగురాకుల మద్య,
చీడపురుగులు,
నేను.. నాది...
4.
చలనంలేని నీట,
క్రిములు జన్మిస్తాయి,
బుద్ది పరిగెత్తనీ...
5.
ఆవిరి పుడితేనే,
అన్నం ఉడికేది,
ఆలోచనలు మదించు.
6.
సంద్రానికే
ఆటు,పోట్లుంటాయి,
నువ్వు,నేను ఎంత?
7.
బలవంతంగా తింటే,
ఒంటికెక్కుతుందా,
నచ్చచెప్పు... హితవు.
8.
చేవున్న చెట్టుకే,
చీడ పట్టేది,
విమర్శ దిష్టిచుక్క.
9.
బుగ్గిని ఊదేస్తేనే,
అగ్గి పుడుతుంది,
చేతనతోనే చైతన్యం.
10.
ఇది ఇండియారోయ్,
ఏదైనా దొరుకుతుంది,
ఇక్కడ వెలకు.
=================
Date: 11.07.2013

గుప్పెడు మల్లెలు-37

1.
పేడకుప్పలో చేయి,
పాడు వాసనేలే...
చర్చెందుకు మూర్ఖుడితో
2.
కుదురుతుందా,
కడలి మద్య కాపురం,
వర్ణన,వాస్తవం...చాలాదూరం.
3.
దక్షిణేస్తేనే,
తీర్ధం,ప్రసాదం,
లంచంతోనే ముక్తి,మోక్షం.
4.
అడుసుని,కడిగేసే తొందర,
అప్పుని తీర్చేందుకు
ఉండదు ఎందుకురా?
5.
ఎక్కడానికే శిఖరం,
ఏ పదవికైనా,
కాలం నిర్ధిష్టం.
6.
ఎండుగడ్డికే పాలోయ్,
దానగుణముంటే,
ఆనకట్టలేముంటాయ్.
7.
అదుపు తప్పితే,
అధోఃగతే,
అది రధమైనా,మదమైనా
8.
దొడ్డమనసైనా,
గుడ్డిదే,
బంధుప్రీతి సోకితే
9.
మద్యం మరిగినోడికి,
నైవేద్యం రుచిస్తుందా?
నీతులంటే,బూతేలే
10.
దిద్దుబాటు ఎరగని
కవిత్వముంటుందా?
సర్ధుబాటులేని జీవితముంటుందా?
=====================
Date: 10.07.2013

గుప్పెడు మల్లెలు-36

1.
అంతరంగం 
మురికిగుండం,
ఏ గంగమునిగి,ఏం లాభం 
2.
ప్రతీ ముఖం,
అందమైనదే...
అద్దం భలే వంచకిలే
3.
ఒట్టి రెక్కలతోనే పక్షి,
గట్టికాళ్లున్నా...
పడతాడెందుకో మనిషి.
4.
ఎవరిమీద ఈ చిరాకు?
దుర్గంధం అంటూ...
కుళ్లిన సమాజంలో ఉంటూ
5.
తొణకని మనస్సు,
తూకం తప్పని మాట,
మనిషంటే...
6.
ఇల్లైనా,ఒళ్లైనా
కూలితే
ఖాళీ చెయ్యాలిలే
7.
మరిగిన మబ్బే,
కరిగి జల్లవుతుంది.
దుఃఖాన్ని దాచకోయ్
8.
మనసు గుర్రం,
అదుపు తప్పితే...
మచ్చ మిగిలిపోతుంది.
9.
అంతా మంచైతే
భరించలేవోయ్,
సుఖానికీ సెలవియ్యి.
10.
స్వంతగొంతు మోజే,
మేధ పదునెక్కుతుంది,
పరులవంతూ వింటే
==============
Date: 08.07.2013

Friday 5 July 2013

Kanipiste

గుప్పెడు మల్లెలు-34

1.
గుడ్డిగా నమ్ము ఎవడోకడ్ని,
ఐతే గుణపాఠం,లేదా 
స్వచ్చస్నేహం నీసొంతం.
2.
విశ్వమంతా గాలివున్నా,
పంఖా కావాలి. 
అన్నిచోట్ల దేవుడున్నా గుళ్లందుకే
3.
ఎక్కువ వాడుకలో
ఉన్న భాష...
మౌనమే...
4.
గుడ్డు పగిలితే జననం,
పగలగొడితే మరణం,
నీలోంచే రా...
5.
ఒంటరితనం ఒక బడి,
అన్నీ నేర్పుతుంది.
బడిదాటితే అన్నీఉన్నట్టే
6.
నీకు తెలియని గొప్ప వేస్ట్.
నువ్వున్న స్థితి,
ఉండాల్సిన స్థితిలమద్య తేడా.
7.
మరుస్తావ్ వింటే,
గుర్తుంటుంది చూస్తే,
కానీ...అర్ధమవుద్ది చేస్తే.
8.
ఎక్కేస్తే నీదైపోదు కొండ.
గాలేస్తే కాలిముద్రల్లా...
అంతా అశాస్వతం.
9.
సమస్యలు చుట్టుముట్టాయా?
అంతా మన మంచికే,
ఎదురుదాడి ఎటువైపైనా పర్లేదు.
10.
ఇష్టమైన కష్టం,
స్వయంకృత నష్టం,
బాధించని బాధలు.
===================
Date:01.07.2013

గుప్పెడు మల్లెలు-35

1.
క్రాంతికీ,బ్రాంతికి
మద్య గీత,
నీ మనసు.
2.
వెల్లివిరిసే
ఉత్కంఠకు ప్రతీక,
ఎదురుచూపు.
3.
కొలతలకి
అందని ఎత్తులు
ప్రేమికుల ఊహలు.
4.
అక్కునజేర్చుకుంటాయ్.
అందం అగుపిస్తే,
అక్షరాస్యతున్న చూపులు.
5.
రింగుల జుట్టుకు,
పాపట కుదరనట్టు,
మనసు వినదు,ప్రేమిస్తే.
6.
పారేఏరు ఆగదు,
పసవున్నోడు...
విశ్రాంతి కోరడు.
7.
కల్తీలేని వెలుగు,
కళ్లముందే...
చీకట్లను వడబోస్తే.
8.
చెట్టు మోడు,చేను బీడు,
ఇదంతా తాత్కాలికం.
ప్రశ్న-జవాబు,ఆలు,మగలు.
9.
నోటిదురద
పరిసమాప్తం.
పీడితశ్రోత అంతర్ధానంతోనే
10.
చూపులొక అయస్కాంతం,
విసిరేయ్...
రంగుల దృశ్యాలొస్తాయ్.
===================
తేదీ: 05.07.2013