స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Thursday 22 August 2013

సమైక్యాంధ్ర గీతం

పల్లవి:-
రండోయ్... రా రండోయ్...
చేతులు కలిపి రా రండోయ్,
చేవను చూపగ రా రండోయ్,
సత్తా తెలిసేలాగ,
సర్కార్ కదిలేదాక,
జై ఆంధ్ర పోరుతో సాగండోయ్

చరణం 1 :-
ఐకమత్యమే మహాబలం,
ఇది ఎపుడో చదివిన పాఠం,
పదవి మత్తులో మరిచిందేమో,
ఇప్పటి ఢిల్లీ పీఠం,
అందరు కలిసి ముందుకి దూకి,
గొంతులు కలిపి గర్జనచేసి,
సరిహద్దుని చెరిపేద్దాం,
తొలిపొద్దుని పిలిచేద్దాం............ ||రండోయ్||
చరణం 2 :-
ఆదిపత్యమే అలంకారం,
అని తలిచెను ఏదో స్వార్ధం,
ఉద్యమానికే ఊపిరిపోసి,
చెయ్యర దాన్ని వ్యర్ధం,
వేసిన ఎత్తులు చిత్తుగ చేసి,
పెట్టిన ఆంక్షలు, పక్కకుతోసి
శృంఖలాలు తెంచేద్దాం,
శంఖం పూరించేద్దాం...............||రండోయ్||
చరణం 3 :-
తగువులెట్టి, తమాషచూసే,
శకునులు చేసిన తంత్రం,
మాతృభూమినే, ముక్కలుజేసే
ముష్కర మాయామంత్రం,
శక్తులు అన్నీ ఒకటిగజేసి,
యుక్తులు మొత్తం బద్దలుజేసి,
తొడగొట్టి నిలబడదాం,
జయకేతనం ఎగరేద్దాం..............||రండోయ్||
==============================
Date: 20/08/2013



https://soundcloud.com/kodanda-rao/jai-samaikyandhra

Tuesday 20 August 2013

Sneham-Ghazal

గుప్పెడు మల్లెలు-48

1.
మట్టిలో దాగిన విత్తు,
మహావృక్షమై పోదా,
సత్తావుంటే, పుట్టక అడ్డుగోడా?
2.
ఏటికెదురీదితేనే,
జబ్బ సత్తువ తెలిసేది,
సంఘాన్ని సంస్కరించు
3.
అనుకున్నది దొరికిందా,
అయితే దేవుడున్నట్టే,
స్వార్ధం లేనిదెవ్వరికి?
4.
ఎండు మోడుకెంత,
ఎరువేసినా పళ్లిచ్చేనా,
ప్రతిభని గుర్తించడమూ ప్రతిభే
5.
దాహం తీరదులే,
సాగరం ఎంత పెద్దదైనా,
ఆత్మతృప్తి ఏది,దానమెరుగని కోట్లున్న
6.
పడవెళ్లిపోయిందని,
ఏరు వాపోతుందా?
నీకు,నువ్వే కడదాకా
7.
పడతావని,
భయపడుతూవుంటే,
శిఖరం అందేదెలా?
8.
అగ్గిని,గాలి పలకరిస్తే,
అడివంతా బూడిదే,
కోపానికి, అహం జోడించకు
9.
రోడ్డుపై గతుకులున్నా,
గమనం తప్పదులే,
సమస్యలన్నవి మామూలే
10.
పక్వానికొస్తేనే పండంటారు,
పలికిన మాట సార్ధక్యం,
ఆ పని చేసినపుడే
==================
Date: 18.08.2013

Tuesday 13 August 2013

గుప్పెడు మల్లెలు-47

1.
ఐకమత్యమే మహాబలం,
మర్చిపోయిన పాఠం,
ఆదిపత్యం కోసం
2.
కర్రగుర్రమెక్కి
కదలట్లేదంటే ఎలారా?
కల్తీ నాయకుల లోకం రా
3.
ఆలి శీలరక్షణకి,
ఒరదాటని కత్తెందుకు?
ఆత్మగౌరవం కాపాడని పదవెందుకు?
4.
అలా పెరిగావెందుకోయ్,
పక్కనున్నోడు ఎదగందే,
ఏడ్చి చస్తున్నాడు,నువ్వేమీ అనందే
5.
చెమట తుడుస్తుందా
చెమికీ రుమాలు,
అలంకారానికే మన నాయకులు
6.
మండాయా మత్తెక్కిన కళ్లు,
ఎంచుకునే ముందే,
దగ్గరుంచుకోవాలి, ఒళ్లు
7.
ఊపిరాగితే అదేం శరీరం,
జనామోదం లేనిదే,
అదేం శాసనం
8.
సూదిలాంటి చూపుంటేనే
సూక్ష్మం అగుపించేది,
మందుపార్టీ నిర్ణయం,ఎవరు భరించేది?
9.
పదవీ వ్యామోహం
స్వార్ధంతో తలకెక్కింది,
ప్రజాజీవనం రోడ్డెక్కింది.
10.
ఐదేళ్లపాలనలో
యాభైయేళ్ల తిరోగమనం,
ప్రజాస్వామ్యానికి మరణం.
============================ 

Monday 5 August 2013

స్నేహం-గజల్

మల్లె మనసులు కలిపి అల్లే దారమే స్నేహం,
నిండు గుండెలు కలిసిపాడే రాగమే స్నేహం. 

కొండ,లోయలు కంటికొకటే, మంచుతెర ముసిరేసిన
మంచి,చెడులని ఎంచిచూపే అద్దమే స్నేహం.

ఎండమావులు ఎదురుపడుతూ,ఆశలన్ని ఆవిరైతే
ఊతమిచ్చి,ఊపిరిచ్చే క్షీరమే స్నేహం.

పాతబడితే స్వర్ణమైనా,రోతపుడుతుంటుందిలే,
కాలచక్రం,చిక్కబరిచే మధురమే స్నేహం.

తనను తానే తడుపుకుంటూ, వణుకుతున్న పెదవిచూసి
గొంతుకలిపి, చింతదీర్చే నాదమే స్నేహం.

అమ్మ ఎపుడూ తోడురాదని, దైవమే గ్రహించెనేమో?
రాగబంధం, పొదిగివున్న హారమే స్నేహం.

ఒక్కడున్నా ఎక్కువేలే, కోదండ శతృవు,
వేలమంది పాడగల్గిన, వేదమే స్నేహం.
============================
Date: 04.08.2013

Friday 2 August 2013

గుప్పెడు మల్లెలు-46

1.
పచ్చదనం
పల్లవించేది,
పండుటాకులు రాలినప్పుడే
2.
గాలి,వెలుతురు
లేదంటే ఎలా?
గుండె విండో మూసేసి
3.
మర్చిపోకురా నాన్నా,
కుర్చీకైనా చికాకే,
కదలకుండా కూర్చుంటే
4.
పక్కనోడి కాలుతొక్కితే
ప్రమాదం...
తమ్ముడూ!!! ఇది ప్రయాణం.
5.
చప్పగా ఇంకెన్నాళ్లు?
మలుపంటూ లేకుంటే,
జీవితం... పాసింజర్ రైలు.
6.
వినాలిలికదా వాదన,
అది... ప్రతివాదిదైనా,
ఒకేవైపు పడుకోదురోయ్ ఎద్దైనా
7.
కులం పిచ్చి,
గళం విప్పితే,
తమ్ముడులాంటోడైనా,తోడేలే
8.
నది,గట్టెక్కితే నాశనం,
మూర్ఖత్వం గద్దెనెక్కిందా,
తలతిక్క శాసనం.
9.
ముసిరిన పొగ చెదిరితే,
ముఖం కనిపించేస్తుంది,
ఎన్నాళ్లు తప్పు దాస్తావ్?
10.
కలుపు, వరి కాజేస్తోంది,
అన్నింటా కుట్రాలోచనే,
గెలుస్తోంది.
=================
Date: 31/07/2013

గుప్పెడు మల్లెలు-45

1.
అవసరం ఉన్నప్పుడే,
గుర్తొస్తాడు,
ఆప్తుడు, ఆ పైవాడు.
2.
పరనిందే పాయసం,
కొందరికి...
పెళ్లాంపెట్టే అన్నంతోసహా
3.
నీరేలేకుంటే,
బోరుకొట్టి ఏం లాభం?
సరుకెంతో,సరిచూసుకో
4.
పళ్లెక్కువ కాసాయని,
చెట్టు,బరువు దించదులే,
పనికి భయపడితే ఎలా?
5.
చేతకానితనం,
దాచేస్తున్నారు,
జాతకం ముసుగులో
6.
ప్రార్ధనలో ప్రతీవాడు సాధువే,
ముగిసాకే తెలుస్తుంది,
ఎవడెంత వెధవో
7.
గోళ్లే,కత్తులవుతాయ్
కత్తిరించకపోతే,
కోరికలైనా అంతే
8.
రక్తం పాడైతే,
మనుగడేది మనిషికి,
బడిలోపాఠం,గుడిలోగంట
9.
పొడిచే కాకులమద్య,
పడుకోగలిగితే,
నిన్నుమించిన దేవుడెవ్వడు.
10.
చీమలే ఆదర్శం,
మద్యతరగతికి,
అప్పుల బరువెత్తడంలో...
================
Date: 26.07.2013

గుప్పెడు మల్లెలు-44

1.
ప్రపంచమే 
ఇరుకు మంచం,
స్వార్ధం తలకెక్కితే
2.
తొణికే కుండమీదే
గొణిగే లోకమ్రా,
తడబడిందని అడులాపొద్దు.
3.
తోలినా వాలుతుంది,
మళ్లీ,మళ్లీ ఈగ,
చిక్కుముళ్లు బతుకులో మామూలే
4.
ఒంట్లోనే
ఒదిగుంటుందా,
కదిలే మనస్సు
5.
పొగమంచు కమ్మిందేమో?
మనసుకి,
మనిషికి,మనిషే కనపడ్డంలేదు.
6.
ఊటబావిలో నీటికిలోటా,
జులాయి ఊతపదంలే,
ఐలవ్యూ అనే మాట.
7.
చిచ్చు రగిలితే,
చీడ,చిగురూ ఒకటే,
కోపంలో పెద్దరికం నగుబాటే.
8.
వెలకట్టలేవోయ్,
గుప్పెడేవున్నా...
అది పెట్టే మనసైతే
9.
గునపాఠం నేర్పే,
గురువేనేమో???
ప్రతీ అనుభవం.
10.
కొండమీదెక్కినా,కోతేలే
కోటేసినంత మాత్రాన,
నోటిమాట దాగేనా?
=================
Date: 24.07.2013