స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Thursday, 8 May 2014

గుప్పెడు మల్లెలు-73

1.
నిన్న భూతం,రేపు అనుమానం,
నేడొక్కటే నిజం, అందుకే...
అది కాలం అందించిన "వర్తమానం"
2.
అందరికీ తెల్సిందే జీవితం చిన్నదని,
అయినా వీళ్ల దుంపతెగ,
తొంగి చూడ్డమెందుకో పక్కోడి జీవితంలోకి...
3.
అడిగింది లేదని చెప్పకుండా,
ఉన్నదేదో తెచ్చేసే హోటల్ సర్వర్లా,
అదృష్టం బహుచిత్రం సుమీ
4.
బాల్యంతోనే బతుకు ముగిసిపోద్ది,
మిగిలిందంతా చావే,
కప్పెట్టడమో,తగలెట్టడమో లేట్... అంతే
5.
ఇప్పటి బిజీలైఫ్ 120లో పరిగెడుతోంది,
చమురుకోసం చూసి 40లోకి తెచ్చామో,
చెమట చమురుతో నడపాల్సొస్తోంది.
6.
ప్రతీ కుక్కకి ఓ రోజుందట,
ఆ రోజు ఎప్పుడొచ్చిందో,
ఎప్పుడు పోయిందో తెలీలా... పాపం.
7.
పిల్లల బతుకుల కోసం,
బిల్డింగులు కడుతున్నారు,
చెట్లునరికి సమాధులూ కడుతున్నారు.
8.
"బాలు" మైకు బదులు బ్యాటు పట్టుకుంటే,
ఆయనా తిట్టుకునేవాడు నీలాగే,
అందరూ ప్రతిభున్నోళ్లే... ఎక్కడుందో తెలీదంతే
9.
పుస్తకాల్లో ఆరోగ్యం చదవకు,
అచ్చుతప్పు పడిందో...
అనుమానంతోనే పోతావ్.
10.
చాతీ సంకోచ,వ్యాకోచాలు పీల్చే దమ్ము మీదే,
జీవితంలో చీకటి,వెలుగులు
కె.కె. నువ్వు చూపించే ధైర్యమ్మీదే
=====================
Date: 05.05.2014

Monday, 5 May 2014

గుప్పెడు మల్లెలు-72

1.
దీపం ఉంటేనే వెలుగివ్వగలమా?
దీపాన్ని అద్దంలో చూపించినా వెలుగే,
మనసుండాలంతే... మార్గాలెన్నో
2.
పచ్చిమాంసం తినేవాడికి,
బచ్చలికూర రుచిస్తుందా?
వాగ్దానాలు ఎన్నిజేసినా......
3.
అర్ధంకాని పద్యంలో
అలంకారాలు ఎన్నుండి ఏం లాభం?
పై,పై మెరుగులతో రాదులే ఆత్మసౌందర్యం
4.
చీకట్లను తోలే పొద్దంటే,
గుడ్లగూబకు చిరాకే,
మంచిజేసినా మాటొస్తది, ఒదిలేయ్.
5.
సుష్టుగాతిని తొంగుంటే అది భోగం,
పక్కనోళ్లు కాకుల్లా పొడుస్తున్నా,
పక్కమీద ఒళ్లుమరిస్తే, అదే యోగం.
6.
జుట్టన్నాక చిక్కుపడుతుంది,
సర్దుకుంటే పాపట కుదురుతుంది,
అదేపనిగా దేవుడ్ని చిరాకెట్టీక
7.
చెట్టు పచ్చగుంటుందా, చీడ వేరుచేరాక,
బడికెళ్లే బచ్చాగాడికెందుకోయ్,
కులం కాలమ్మ్... చెరిపేయ్.
8.
దొంగరాకుండా కట్టడిచేస్తావ్,
దుస్వప్నం రాకుండా ఏం జేస్తావ్?
మంచోడిగా బతకాలంతే... వేరే దారేలేదు.
9.
ఎద్దు వీపుమీద పుండుని,
గెద్ద,కాకి ఎందుకు పొడుస్తాయ్?
నోటిదురదకి మందులేదు, ఎదవల్ని వెలేసెయ్.
10.
పుట్టిన బిడ్డని, కుట్టిన గుడ్డని
చూసినప్పుడు ఎవరికైనా తృప్తే,
ఎవరు ఆనందించరోయ్ కె.కె, మంచిమాట చెప్తే.
==========================
Date: 07.04.2014