స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Friday 30 November 2012

జనకవి

నేనొక జనకవిని,
నిజానికి సుజనకవిని.
మ్రోగే చప్పట్ల కన్నా,
సగటుమనిషి గుండె చప్పుళ్ళే నాలక్ష్యం.

చేతులు పిసుక్కుంటే సమస్య మెత్తబడుతుందా,
చేవతో సంఘర్షించాలి.
అమ్ములపొదిలో శరాలు నిద్దురపోతే,
అవి లక్ష్యాన్ని చేదించలేవు.
అందుకే సానపెట్టిన సంకల్పాన్ని
జనం మద్య ధ్వజంలా నాటేస్తా.

నిజమైన,నిజానికి కాలదోషం పట్టదు.
మబ్బు కమ్ముకుంటే సూర్యునికి మరక అంటదు.
వ్యక్తిత్వం ఉబికి రావాలి,
కొలిమి నిప్పుల్లోంచి శిరసెత్తే సెగలా.

ముసురు పట్టిన పగటి ముఖంలా
మూల్గుతూ బతకొద్దు,
కుండపోత కురిసి,కురిసినా
ఎండలా రొమ్మువిరిచే నిలబడు.

గడ్డికప్పిన గోతులెన్నో...నా నడ్డివిరిచి,
నా ప్రయాణం ఆపాలనుకున్నాయ్.
కానీ సాగిపోతూనే ఉన్నా...
తల గుద్దుకుంటుందని కెరటం ఒడ్డుని మరిచిందా???

"పసవున్న లవంగం నిజం,
కొరికితే చురుక్కుమంటుంది.
కానీ నోట్లో నలిగాక,
నిస్సత్తువనుంచి నిద్దురలేపుతుంది."

అందుకే నేనంటాను... ఓ కవీ
చుక్కల వెనకాల ఏముందో చూస్తావ్,
నీ పక్కనున్నవాడ్ని ఏల మరుస్తావ్.
కవిత్వమంటే వెన్నెల,ఆమనీ కాదోయ్,
ఆకలి చావులకి అధికారులకిచ్చే హెచ్చరిక.
==============================================
తేదీ:28.11.2012

No comments:

Post a Comment