స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Saturday, 21 September 2013

గుప్పెడు మల్లెలు-53

1.
చచ్చినా బతికేటోడు,
కీర్తిశేషుడు,
చస్తూ,బతికేటోడు మూర్తిశేషుడు
2.
చేదుమందు ఎప్పుడూ చికాకే,
రుచించని సత్యం,
ఏ మనిషికైనా పరాకే
3.
దారంతోనే పూలమాల,
దొడ్డుతాళ్లతో గొడ్డు,
మతినిబట్టే మంత్రముంటుంది.
4.
అరిటాకు చిరిగిపోదా,
ముళ్లకంప పక్కనుంటే,
వంచన,పంచనుంటే కీడేలే
5.
ఒంటిరెక్కతో,
పక్షి ఎగరలేదులే,
ఒక్కడితో ఉద్యమం సాగదులే
6.
కళ్లుమూసుకున్నంత మాత్రాన,
తెల్లవారకుండా ఆగేనా,
తెరకప్పేస్తే సత్యం దాగేనా
7.
ఉరిమితేనే తెలిసేది,
మబ్బులో దాగున్న శక్తి,
గుండె,నెత్తుటి కండే...గర్జించేవరకు
8.
గుండె శబ్ధంలోనే దాగుంది,
లబ్బు తర్వాత డబ్బు, 
చేదనేవాడెవడు,వచ్చాక ఈ జబ్బు
9.
చేయిజారితే విరిగిపోయే
కుండమీద ఎంత మోహం,
స్థిరంకాకున్నా,ఆశచవనివ్వదు దేహం.
10.
మరిగిన మబ్బే జల్లవుతుంది,
విషయం వేడెక్కితేనే
సొల్యూషన్ దొరుకుతుంది.
===================
Date: 18.09.2013

Thursday, 12 September 2013

గుప్పెడు మల్లెలు-52

1.
సుఖంపెరిగితే మెట్టవేదాంతం,
భయం తలుపు తడితే,
తడిసిపోదా సాంతం.
2.
కుప్పగా పోసేస్తే,
రాళ్లు,ఇల్లై పోతాయా?
సేకరించిన విషయం విశ్లేషించు...
3.
చేపల బజారులోచేరి,
చెడువాసనంటే ఎలా?
స్నేహానికి ముందే సరిచూసుకో
4.
నిద్రమాత్రలు ఎక్కువైతే,
తప్పదురోయ్ ఉపద్రవం,
సుఖం మితిమీరితే విషం
5.
పనిచేస్తుంటేనే,
గడియారం కాలసూచి,
మనసు దిక్సూచి
6.
తోకనూపే కుక్క తొడలమీద,
ఆకలికేక వాకిలి బయట,
డబ్బు భలే జబ్బు సుమీ
7.
మూగకొండ రగిలిందా,
మండే అగ్నిజ్వాల,
మౌనం అమాయకత్వం కాదులే
8.
పుఠం పెడితేనే,
పసిడి నిగ్గుతేలేది,
బడిసంచి బరువంటే ఎలా?
9.
మంత్రానికి చింతకాయలా?
చేతిగీతలే నిర్ణయిస్తే,
చేతల అవసరమేముందోయ్
10.
కోతిచేతికి కొబ్బరిస్తే,
కుదురుగా ఉంటుందా?
నిజాయితీకి కుర్చీవెయ్యి.
===================
Date: 12.09.2013

Wednesday, 4 September 2013

గుప్పెడు మల్లెలు-50

1.
పొగ సాగినట్టు,
నిప్పుసెగ సాగదురన్నా, ...
నిందలే వేగం,వందనాలకన్నా
2.
చొరబడే వేళ్లుంటే,
రాళ్లే పొరలవుతాయిలే,
స్థిరమతికి అసాధ్యం లేదులే.
3.
సుగ్రీవుడి బలమంతా,
చెట్టు చాటు రాముడే,
కొనుకున్న డిగ్రీకి, జీతమిస్తే దేవుడే
4.
సీత శీలానికే,
మసిపూసిన మాయాలోకం,
గాసిప్పులు గాలికొదిలేయ్.
5.
గట్టి పునాదులే,
కట్టడాన్ని నిలబెట్టేది,
బడికడదాం, ఇటుకలు పేర్చు.
6.
ఎన్నో మెట్లెక్కావ్,
ఎక్కడుంది కైవల్యం,
కాస్త కూడెట్టు,నీ జన్మ సాఫల్యం.
7.
తేట నీళ్లలోనే,ముఖం కనిపించేది,
మనసుని కడిగేయ్,
ప్రపంచం అందమైనది.
8.
విదురమాట వినివుంటే,
జరిగేదా కురుక్షేత్రం,
చెవికెక్కదులే, చెప్పినంత మాత్రం.
9.
జనవాణికి చెవి ఒగ్గందే,
ఏమౌతుందో తలియదులే,
మూడోకన్ను లేకుంటే శివుడైనా నరుడే
10.
నిప్పు రాజుకోకుంటే,
పొగ గుప్పుమంటుందిలే,
ప్రతిభ కరువైతే అసూయ మామూలే
========================
Date: 29.08.2013

గుప్పెడు మల్లెలు-51

 1.
దున్నను కదిలిస్తుందా, వాన
అందుకే ప్రతీ తప్పుకి,
దేవుడిమీదే ఆన.
2.
బద్దకస్తుడు నిద్దరోతున్నాడని,
తొలిపొద్దు ఆగుతుందా?
మంచికి,ముహుర్తం ఎందుకు?
3.
ముళ్లతో నడుస్తోంది గడియారం,
అంగట్లో ఉల్లినుంచి,
అమ్మడి మెళ్లో తాళిదాక
4.
కొవ్వు కరిగితే,
కాంతి చిమ్ముతుంది,
ఇంట్లోనైనా, నీ... ఒంట్లోనైనా
5.
చలిలో పరిగెడితేనే,
ఒంట్లో వేడిపుట్టేది,
పోరాడి గెలిస్తే, దానికి సాటేది
6.
తాత్కాలికమే అలుపు,
తెలివి, తెగువ ఉంటే
నీదేనోయ్ గెలుపు
7.
వేళ్లెంత కిందున్నా,
వటవృక్షం తలొంచుతుంది,
వచ్చేది సుడిగాలైతే
8.
కొండపైన బండ విడిస్తే,
పడేది కిందోడిమీదే,
పై పదవి, పెదవిజారితే అంతేమరి
9.
చురుక్కుమన్నా,
మిర్చీబజ్జీ రుచేవేరు,
అలిగినా అందమే ప్రియురాలు.
10.
భోజనమ్ముందు భజన బోరు,
సమస్యనొదిలి ప్రసంగిస్తే
వినేవాడు ఎవ్వరు?
====================
Date: 04.09.2013