స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Wednesday, 26 February 2014

గుప్పెడు మల్లెలు-67

1.
ఎత్తుని చూస్తే భయం,
ఎక్కేంతవరకే...
అదేలే మనిషి నైజం.
2.
గ్రహాలమద్య భవిష్యత్ వెతక్కు,
కృషి చెయ్,
నీరాత, నీ చేతుల్లోనే...
3.
గతం గుర్తుంచుకో చాలు,
వెనక చూస్తూ నడిస్తే,
ముందుకి సాగలేవు
4.
నిన్ను మించిన,
నమ్మకస్తుడెవరు, నీకు
నలుగురూ నిను నమ్మాలంటే
5.
నువ్వు చూస్తున్న లోకం,
నీ ప్రతిబింబం,
నీ నీడచూస్తే, భయమెందుకోయ్.
6.
చెట్టు విరుగుద్దేమోనని,
పిట్ట భయపడదులే,
రెక్కలకష్టం నమ్ము,చుక్కలైనా చుట్టాలే
7.
సాధించినదానికి గర్వించు,
జీవితం పుష్పకవిమానం,
ఒక సమస్యకి జాగా ఖాయం.
8.
తప్పుదోవ పట్టించే,
ఒక చిన్నమాట,
"నేనేమనుకున్నానంటే"
9.
ఓడాక రెండోచాన్స్ లేదు,
అప్పుడు ఆడిన ఆటకి...
నీక్కాదు.
10.
ఓ మనిషీ!!!
నువ్వెప్పుడూ ఓడిపోయే పందెం,
సమస్యనొదిలి పరిగెత్తడం.
=====================
Date: 21.02.2014

గుప్పెడు మల్లెలు-66

1.
బ్యాగులకు చక్రాలొచ్చాయ్,
ఎర్రచొక్కాలకు కన్నాలు పడ్డాయ్,
రైల్వే స్టేషన్లో...
2.
పనికిరానిదేముంది లోకంలో,
పుట్టగొడుగుల కూరే ప్రత్యేకం,
ఫైవ్ స్టార్ హోటల్లో... ...
3.
కంచెగట్టి కాపలా పెట్టొచ్చేమో,
పూలతోటకి... మరి పరిమళానికో,
ప్రతిభకి అవరోధాలెక్కడివోయ్
4.
కుక్కకూడా భయపడుతోంది,
ముక్క లాక్కుంటాడేమో మనిషని,
పరాకాష్ఠలో స్వార్ధం... అంతటా మని,మని
5.
మార్పు అనివార్యం,
అనుకున్నప్పుడే మొదలవుద్ది,
ఓర్పుకి పరీక్షా ప్రహసనం.
6.
వడదెబ్బ తగిలినోడికి,
నీడనిస్తే చెట్టుకేంటి నష్టం,
ఉన్నప్పుడు లేనోడికిస్తే, ఏంటి కష్టం
7.
కుండైపోద్దా మట్టి,
కుమ్మరి నడుం ఒంచకపోతే,
బాధ్యత తేలికే, బరువనుకోకపోతే
8.
తిరుగుతుంటేనే చూస్తాం గడియారం,
ఎంత గోప్పదైతేనేం వంశం,
పనిచెయ్యకుంటే లేదోయ్ గౌరవం.
9.
అనుకున్నది అవుతుంటే,
అంతా మనసత్తా అనిపిస్తుంటుంది,
ఆగిందో, కర్మసిద్ధాంతం మొదలవుతుంది.
10.
బజారుసరుకా శీలం కొనేందుకు,
నిజాయితీ రక్తంగా మారాలి,
అది పొందేందుకు......
==========================
Date: 16.02.2014

Wednesday, 12 February 2014

గుప్పెడు మల్లెలు-65

1.
మబ్బుని కోసినా, మంచినీరేగా,
మంచోడు బాధపడినా...
పట్టించుకోరు అందుకేగా
2.
కోరికలు, ఊరికుక్కలు,
ఏమిచ్చినా...
వెంటబడుతూనే ఉంటాయ్.
3.
నదిని పాయలో,
పాయని నదిలో చూడగల్గాలి,
పారదర్శకత అంటే.. ఉంటే...
4.
శవాలు తేలే నదిలో,
శివ,శివాంటూ మునక,
ఏమనాలి, భక్తి మించిన మత్తు లేదనక
5.
మాట తడబడదా,
మత్తు తలకెక్కితే,
గద్దెనెక్కాడాయె,తూలుతాడులే
6.
ఇసుకమేడ ఉనికి,
వాన చినుకుతో సరి,
ఎన్నాళ్లోయ్ నడమంత్రపు సిరి
7.
ఎక్కడానికేనోయ్ కొండ,
అక్కడ తొంగోడానికా...
ఎక్కిన పదవే, స్వర్గద్వారమా
8.
చీకటి ముసిరితేనే,
చుక్కలు అగుపడతాయ్,
కష్టాల్లో ఆప్తుల్లా
9.
తలకొట్టినా, జలమిస్తుంది బోండాం
మంచోడంటే ఆడేనోయ్,
పెట్టుకో ఆడికి దండం.
10.
గాలికెగిరే కాగితం గాలిపటమా?
వెనకనుంచి అరిచే ఆకతాయీ,
వేదికమీద చూపు నీ బడాయి.
==================
Date: 05.02.2014

గుప్పెడు మల్లెలు-64

1.
అబద్దం ఆడేందుకో,
పోయాడని చెప్పేందుకో,
గీతాసారం ఎందుకో...
2.
నీ గురించి పూర్తిగా తెలుసుకో,
నీ ఒక్కడీ దగ్గరే,
నీ పాస్వర్డు ఉండేది.
3.
జాగృతి కత్తిని,
పదునుపెట్టే
రహస్యస్థలం...మౌనం
4.
ఆగిపోయినా సాగిపో,
మూగబోయినా మోగిపో,
జాగుచేస్తే ఒరిగిపోతావ్.
5.
అది వెళ్లేదారిలో,
గుర్రం తోలడం మహాసుఖం,
నీ ప్రతిభ ఎక్కడో గుర్తించు
6.
అనుభవాలే అక్షరాలు,
మనమెక్కిన పదిమెట్లు,
ఒక్కంగలో ఎక్కేస్తారులే వచ్చేవాళ్లు
7.
పిచ్చోడవకు,
పిచ్చిని వాడు,
లీడర్ నువ్వే
8.
ప్రేమకై వెదకక్కర్లా...
నలుగురిని,
నువు ప్రేమిస్తుంటే
9.
తప్పొప్పుల వెనకే,
గెలుపోటముల చాటునే,
నీ స్వాతంత్ర్యం.
10.
ఒక ప్రాంతానికో,మతానికో
అతుక్కునుండిపోకు,
నీకు అర్ధమయ్యే నిజం ఎక్కడుందో
=====================
Date: 27.01.2014

గుప్పెడు మల్లెలు-62

1.
నిజాయితీకి,
మిత్రులు తక్కువే,
కానీ... అది వంగని ఇనపచువ్వే 
2.
పూలు పెట్టుకుంటే ఆనందం,
పెంచిన తోటదైతే బ్రహ్మానందం,
ఆనందం నీ చేతుల్లోనే
3.
మరిగే నీళ్లలో,
ముఖం కనిపిస్తుందా,
కోపంలో ఎదుటిమాట వినిపిస్తుందా
4.
ఓడినప్పుడు ఏడ్వకు,
కన్నీరు, నీరు కార్చేస్తుంది,
గెలుపుమీద కసిని...
5.
చితిమీద పడుకున్న చింతేనా,
మనసుకుదుట పడుతుంది,
మరోజన్మ ఉందనుకో...
6.
మట్టిమార్చేస్తే,
పిచ్చిమొక్క పూలిస్తుందా,
అల్పబుద్ధి ఆలోచిస్తుందా
7.
మాంసం అమ్మితే
కసాయి వాళ్లట,
తినేవాళ్లు సాధువులు కాబోలు
8.
గాలి,వెలుతురు కావాలంటూ
కిటికీలు మూసేస్తే ఎలా,
మనసు కవాటం తెరవరోయ్
9.
నలుగురి ఆనందం,
నీ నవ్వులోనే,
నలుగురిలో మెదటోడిని నువ్వే
10.
చెత్తని దాచగలవేమో,
కాని... దుర్ఘందం దాచలేవు,
సూటేసినా, మాట తెలిసిపోద్ది.
===================
Date: 17.01.2014

గుప్పెడు మల్లెలు-63

1.
అందరికీ సాయపడ్డం,
ఏ ఒక్కడికో కాదులే సాధ్యం,
అలా అనే, మానేసారు సాంతం
2.
శ్రమిస్తే రాజౌతానని కూలోడి భావన,
ఆడు శ్రమిస్తుంటే నేను రాజే,
అని ఆసామి ధీమా
3.
వేడిసేస్తే వంగుద్ది,
వదిలేస్తే తుప్పుపడద్ది,
ఎంత ఇనపమనసైనా,ఇసయం ఇంతే
4.
వండేది ఎక్కడైనా,
వడ్డనకేగా డబ్బులు,
అందుకేనోయ్ ఇంగిలీసు క్లాసులు
5.
దిగడం తెలియాలి
ఎక్కడానికి ముందే,
లేదా దూకడమో,దొర్లడమో...
6.
ఆశను శ్వాసించేవాడు,
నీరసపడడులే,
నిరీక్షించాలని...
7.
పనికి పొద్దెంతో,
నిద్దరకి చీకటంతే,
అన్ని వేళలు మనవే
8.
నీ జవాబులేనిదే,
ఆడి జాబుకి విలువేది?
ఏదో అన్నాడని దిగులెందుకు.
9.
ఉన్నదానికన్నా,విన్నదెక్కువ,
విన్నదానికన్నా,ఊహించేదెక్కువ,
ప్రమాదం ముందే తెలిస్తే...
10.
నిర్వచించరా కె.కె.
నీ దృష్టిలో సాహిత్యమంటే,
ఏముంటుందిలే సంఘహితం కంటే
====================
Date: 21.01.2014