స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Thursday, 23 May 2013

గుప్పెడు మల్లెలు-30

1.
వయసేదైనా
ఒకటే
ఎదగాలనుకుంటే
2.
పూడ్చినా మొలకెత్తుతాయ్
ప్రవచనాలై,
పసవున్న అక్షరాలు
3.
అన్నీ ఊరేగింపులే
తొట్టెతో మొదలు,
పాడెతో ముగింపు.
4.
కష్టం కొలిచే
తూకం రాళ్లు,
చెమట చుక్కలు
5.
నీడకూడా భూతంలావుంది
ప్రతీవాడి చంకలోనూ,
స్వార్ధపు సంచి చూసి
6.
మైత్రీ ధూపం
పరిమళాలు,
నెత్తుటివాసన పోయేందుకు
7.
"నేను" అనేది గానుగ,
నిన్ను తిప్పేది...
అక్కడక్కడే
8.
పల్లెకు భయమేసింది.
అదిచూసి
పట్టణానికి జడుపు జ్వరం
9.
మనిషొక్కడే,
పడే ఊబి
మాదకద్రవ్యం
10.
ఒగురుస్తూనే
భరిస్తున్నాం,
వగరెక్కిన సమాజాన్ని
===================
Date: 17.05.2013

Monday, 6 May 2013

గుప్పెడు మల్లెలు-29

1.
జ్ఞాపకాల నిధులిచ్చి,
నిష్క్రమిస్తుంది.
గతం
2.
నన్నెప్పుడు నగ్నంగా
చూస్తారోనని ఆరాటం,
ఆఖరిపేజీకి
3.
అంబరాన్నీ,అవనీస్థలిని
కలిపే బంధం
చినుకు
4.
పిలిస్తే పలకదు,
చిటికిస్తే రాదు
చేరాల్సిన దూరం
5.
"కారు"కూతలతో
'పిచ్చెక్కీపోతుంది.
ఏకాంతం
6.
అడుగుతో నడక,
నడకతో పరుగు,
అవే కాళ్లు
7.
ఝుమ్మని ఎగిరొస్తూ,
గుమ్మంలో పావురం
వార్తాపత్రిక
8.
దుర్బల జ్ఞాపకశక్తికి
ప్రతీక
క్యాలెండర్
9.
వాతావరణం వడపోస్తే
పార్కు పుట్టింది,
ఖర్మ... అడివి చచ్చింది
10.
చుక్కలెన్నో రాలుతున్నా,
పక్క తిరగేస్తోంది
మేధావి మౌనం.
==================
తేదీ: 03.05.2013

గుప్పెడు మల్లెలు-28

1.
చిగురులా ఉండాలి యోగ్యత,
జిగురులా కాదు,
ఏ పదవికైనా
2.
ముందు నడవడం కాదు,
ముందుకు నడిపించడం,
నాయకత్వం.
3.
అధర్మానికి చతుర్భుజాలు,
అలసినప్పుడే చేతిమార్పు,
మరోపార్టీకి
4.
మైక్ సెట్ల బకెట్లతో,
నినాదాల వేన్నీళ్లు,
దేశభక్తిని కడిగేస్తూ
5.
మాడుకంపు కొడుతోంది,
మానవత్వం,
విలువలు అడుగంటాయ్
6.
వాగ్ధానాల వలల్లో
ఊరపిచ్చుకలు
నువ్వూ,నేను
7.
ఉద్యమాల ప్రవాహం,
మద్యలో కట్టేసారు
పచ్చనోట్ల ఆనకట్ట
8.
లంచంపట్టిన మెడకాయ,
ఉరెయ్యాలోయ్,
చేతులుకలుపు
9.
తప్పొప్పుల పోస్ట్ మార్టం,
కళ్ళగంతలతో,
ఏమిటో ఈ దేశం.
10.
ప్రతీనేరం వెనుకా
వీరే,
కీర్తి,కాంత,కనకం
==========================
తేదీ:30.04.2013

ఆ కళ్లలో

నాగుండెలో వేల సితార్
లుషారుగా మోతపెడతాయ్,
అన్ని సితార్ల తంత్రులొకేసారి,
సుధాశృతిలో ఆలపిస్తాయ్.
విసిరేసిన,
నీఒక్క ఓరచూపుకే...

వెలుగునో, వెన్నముద్దనో,
పూవునో,అమృతాన్నో,
మధువునో,మరేదాన్నో
జడిగానో,చిత్తడిగానో కాక,
పొంగిపొర్లే వరదలా,
పూర్ణకల్లోల ఏరులా,
తాండవిస్తోంది మనస్సు,
ముసి నవ్వుల,
నీ కంటి బాసకే...

దారి దొరకక,
నా గళద్వారసీమ చెంత,
రిక్తహస్తాలతో, విముక్తికోసం
పరుగులెడుతోంది నాపాట,
క్షీరసాగరాన మునుగుతూ,
లయ తప్పని,
నీ కనురెప్పల సవ్వడికే...

శీతాచల శిఖరోజ్వల,
హిమపీఠాగ్రమున కెగసి,
శిరమునెత్తి, కరములెత్తి
ప్రార్ధిస్తుంది నా హృదయం,
విల్లు ఎక్కుపెట్టిన,
నీ కనుబొమ్మలు చూస్తే...

ఇన్ని మాటలేల,
ఆ కళ్లు,
అంబరాన దాగున్న పొదరిల్లు.
చూసిన ప్రతిసారి
స్పురిస్తుంది ఎదో మధురానిభూతి,
కాని అది అర్ధంకాని భావగీతి.
=========================
Date:24.04.2013

చీకటి


నవ్వోస్తోందిరా నాకు,
మీ అమాయకత్వాన్ని చూస్తే,
తెల్లారగానే నేనెళ్లిపోతాననుకుంటారు,
నలుపొక్కటే నా రంగు అనుకుంటారు.
పాపం... మీకేం తెలుసు,
వెలుగు దుస్తుల్లో దాగున్నది నేనేనని,
నాలో దాగున్న రంగులు వందలు,వేలని,
పట్టపగలే నా పక్కలో పొర్లే,
పచ్చి వ్యభిచారులెందరో ఉన్నారని,

అసలు నేను లేనిదెక్కడ?
రంగులు మార్చే కండువాల,
ప్రచార ప్రసంగాల గుప్తనిధిలో ఉన్నా,
చట్టం చక్రాలు నడిపే,
నోళ్లు పలికే భాష నాదే,
స్వదేశంలో చోటు చాలక,
విదేశీ బాంకుల్లో నిద్దరౌతున్నా,

దేశాన్ని కొల్లగొట్టే దొంగనాయాళ్లకు,
నల్లకోటు మడతల్లోంచి బెయిల్లుగా మారేది నేనే,
ఆకు పసరుతో పోతేదానికి,
ఆపరేషనంటూ భయపెట్టి,
చిల్లుగుడ్డని కొల్లగొట్టే,
తెల్లకోటు జేబులో సూదిమందుని నేనే,
ఎల్కేజీ చదువులకే ఎకరాలమ్మించే,
కార్పొరేట్ విజ్ఞాన కేంద్రం నేనే,

నేను... నేనే...
చీకటిని నేనే...
పగలే చీకటి,
నీ మాడు పగిలే చీకటి.
=========================
తేదీ: 15.04.2013