స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Monday, 6 May 2013

చీకటి


నవ్వోస్తోందిరా నాకు,
మీ అమాయకత్వాన్ని చూస్తే,
తెల్లారగానే నేనెళ్లిపోతాననుకుంటారు,
నలుపొక్కటే నా రంగు అనుకుంటారు.
పాపం... మీకేం తెలుసు,
వెలుగు దుస్తుల్లో దాగున్నది నేనేనని,
నాలో దాగున్న రంగులు వందలు,వేలని,
పట్టపగలే నా పక్కలో పొర్లే,
పచ్చి వ్యభిచారులెందరో ఉన్నారని,

అసలు నేను లేనిదెక్కడ?
రంగులు మార్చే కండువాల,
ప్రచార ప్రసంగాల గుప్తనిధిలో ఉన్నా,
చట్టం చక్రాలు నడిపే,
నోళ్లు పలికే భాష నాదే,
స్వదేశంలో చోటు చాలక,
విదేశీ బాంకుల్లో నిద్దరౌతున్నా,

దేశాన్ని కొల్లగొట్టే దొంగనాయాళ్లకు,
నల్లకోటు మడతల్లోంచి బెయిల్లుగా మారేది నేనే,
ఆకు పసరుతో పోతేదానికి,
ఆపరేషనంటూ భయపెట్టి,
చిల్లుగుడ్డని కొల్లగొట్టే,
తెల్లకోటు జేబులో సూదిమందుని నేనే,
ఎల్కేజీ చదువులకే ఎకరాలమ్మించే,
కార్పొరేట్ విజ్ఞాన కేంద్రం నేనే,

నేను... నేనే...
చీకటిని నేనే...
పగలే చీకటి,
నీ మాడు పగిలే చీకటి.
=========================
తేదీ: 15.04.2013 

No comments:

Post a Comment