మధుబాబు షాడో కాదు,
ఇది మామూలు నీడే,
నీడలకి అసహనం కలిగింది,
ఆగ్రహం వచ్చింది.
ఎప్పుడూ మనం డిపెండెంటేనా అని,
ఎవరో ఒకరి రూపానికి పెండెంటేనా అని,
నా ముందు వాటి గోడు వెళ్ళగకాయ్.
"ఏ గొట్టంగాడో నడిస్తే,
వాడివెనక చట్రంలా వెళతాం,
వర్షానికి తడుస్తాం,
ఎండొస్తే మాడతాం,
వాడుమాత్రం గొడుగుల్లో...
టోపీ తొడుగుల్లో దాక్కుంటాడు.
రోజుకో రంగుడ్రెస్ వాడికి,
గుడ్డల్లేకుండా మేము,
రింగు,రింగుల జుట్టు వాడ్కి,
రాయి,రప్ప మా ముఖానికి,
సెంటుల్లో,డిఫరెంటు సువాసనల్లో వాడు,
మురికి గుంటల్లో,ముళ్ళతుప్పల్లో మేము,
మమ్మల్ని ఎప్పుడూ పట్టించుకోడు.
కానీ మమ్మల్ని వాడేస్తుంటాడు,
వాడేసి, పాడేస్తుంటాడు.
నీ నీడ నేనే, నా తోడు నువ్వే అంటూ...
వాడి అరాచకత్వాన్ని అంతం చెయ్యాలి.
నియంతృత్వాన్ని నిగ్గదియ్యాలి,
నిరంకుశత్వాన్ని బుగ్గిజెయ్యాలి,
మాకూ ఒక రూపం కావాలి."
అని అంటూ ఉండగానే
చీకటి పడింది,
వాటి ఉనికి మాయమయ్యింది.
నీడలు, నీడలే
నిజాలు,నిజాలే.
==============================
Date: 30/09/2012