స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Tuesday, 29 January 2013

యుద్ధం చేద్దాం

చస్తూ బతకొద్దు ప్రతీక్షణం,
బతకడానికి రోజూ చావాల్సిన పనిలేదు.
బడిపిల్లలం కాదుకదా మనం,
బూచోడున్నాడని జడుసుకు చావడానికి.
ఎవడో కనుబొమ్మ లెక్కుపెట్టాడని,
స్వాభిమాన శిరస్త్రాణం పాదాక్రాంతం చేస్తే ఎలా?

పుట్టుక ఒక్కసారే,చావూ ఒక్కసారే,
ఈ జనన,మరణాల మద్య జీవితం కదనుతొక్కాలి.
చిరిగిన చొక్కాకాదు జీవితం,
కుట్లు వేసుకుంటూ గడిపెయ్యడానికి.
ఆవులుకూడా కొమ్ములెత్తుకునే తిరుగుతాయ్,
కసాయి కత్తి గొంతుకోసేవరకు.
మనకెందుకయ్యా ఇంత భయం,
నిజం నిర్భయంగా చెప్పడానికి.

తప్పెక్కడో... ఈరోజు డిల్లీలో జరిగింది,
రేపు నీ చెల్లే కావొచ్చు,మీ గల్లీలోనే కావొచ్చు,
అందుకే చెబుతున్నాను మిత్రమా...
తప్పు ఎక్కడ జరిగినా తుప్పు వదిలించాలి.
అది ఒక వ్యక్తైనా, ఒక వ్యవస్థైనా.

తిరుగుతున్న ఫాను ఎక్కడ పడుతుందోనని, 
అరగంటకోసారి లైటేసి చూస్తూవుంటే,
అది జాగ్రత్త కాదు, 
జడుపుకత్తితో చేసుకున్న ఆత్మహత్య.

అందరం కాలం విత్తుకి పుట్టిన మొక్కలమే,
కొన్ని కంచెముళ్ళ మొక్కలున్నాయని,
తిరిగి మట్టిపొరల్లోకి వెళతామా???
జనన,మరణాల మద్య స్వచ్చందంగా ఎదగటం మనహక్కు.
బ్రహ్మరాసిన మన తలరాత మీద,
ఎవడో మూర్ఖుడు పిచ్చిగీత గీస్తానంటే
వాడి చేతివేళ్ళని,చీపురుపుల్లల్లా విరిచెయ్యాలిగా...
ఒకడు చంపితే హత్య,
లక్షమంది లక్ష్యంగా చంపితే యుద్ధం.
రండి.... యుద్ధం చేద్దాం.
=============================================
తేదీ: 22.01.2013

భయంకరమైన కామెడీ

అంతటా దురాక్రమణమే,
మద్యతరగతి బతుకుల్లో
ఎక్కడికక్కడే నిజాన్ని తిప్పేస్తున్న,
'నిజం' అని పేరున్న భ్రమవలయం.
ముడులేద్దామంటే ప్రశ్నల కొసలు చేతికందవు.
ఒకవేళ అందినా,చేతులొణికించే వాతావరణం.

అప్పుడప్పుడు మాత్రమే
కొళాయిల పొదుగులు నీళ్ళిస్తాయి,
బిందెల లేగదూడల,
మూతులుతడిపి ఊరిస్తూ.
గంటలకొద్ది,ఊపిరాగిన కరెంటు,
గది గొంతుని పిసికేస్తుంటుంది,చావనివ్వకుండానే.

రోడ్డుపక్కనే నక్కిన కరెంటు స్థంభం,
ఒంగిమరీ లెక్కెడుతుంది విరిగిన వెన్నెముకల్ని.
చాయ్ అమ్మకం జోరుగా సాగుతుంది,
రేషన్షాపుల ముందు, రెండు,మూడు రోజులు మాత్రమే.
నగరం నిండా ఎండమావులే,
ఆశల జలాశయాలు మెరిపిస్తూ.

మద్యతరగతి గడియారం ముళ్ళకంపలో
కాళ్ళు చిక్కుకుపోయి గింజుకుంటుంది కాలం.
సూరీడుక్కూడా చెమటలు పడతాయ్,
అరిగిన ఆ చెప్పులవెంట తిరగలేక,
అయినా ఆశ... ఏదో ఆశ....
చూరుకి వేలాడుతున్న శవంలా.
సృష్టిలో భయంకరమైన కామెడి ఇదే,
మద్యతరగతి బతుకు మహా సుఖం.
******************************
ఓ దేవుడా!!!
పంచభూతాలను సృష్టించిన నువ్వే గొప్పైతే,
ఆటిని అమ్మేస్కుంటున్న మావోళ్ళు ఇంకెంత గొప్ప.
గాలిని గొట్టాల్లో,
నీటిని బాటిల్లో,
నిప్పుని సిలిండరర్లో,
ఆకాశాన్ని ఉపగ్రహాల్లో,
భూమిని గజాల్లెక్కన
==============================
తేదీ: 28.01.2013

Sunday, 20 January 2013

మనిషినెలా ఔతాను?

ఎవేవో గీతలమీద, ఎందరివో తలరాతలమీద,
కవితలు రాసిన, పాటలు కూర్చిన
నా చెయ్యి ఎందుకిలా ఒణుకుతోంది?
ఉక్కుముక్కలాంటి గుండెనిబ్బరం
ఎందుకిలా జావగారిపోతోంది?
నిప్పుసెగమీద పెట్టిన వెన్నపూసలా
ఎందుకు నేనిలా కరిగిపోతున్నాను?

ఆకాశంలోని నాన్న దిగొచ్చి,
చెదిరిన జుట్టు నిమరలేదు.
అ,ఆలు దిద్దించిన గురువు,
ఎదుటపడి గుండెకు హత్తుకోలేదు.
అనురాగం వర్షించే భార్య,
ఊరెళ్ళి చాలాకాలం ఉండిపోలేదు.
అయినా ఒణికిపోతున్నాను,
సుడిగాలిలో మావిడాకులా...
***************************
ఇప్పుడిప్పుడే తెలుస్తోంది,
ఈ శీతల వాతావరణం
నన్నెందుకు చుట్టుముట్టిందో...

చుట్టూ చేరిన మానవాకృతుల
తలలమీదనుంచి కనిపించిన ముఖం.
ఒకేసారి వంద చిరునవ్వులని,
అద్దంలో చూపిన ముఖం.
చిరునవ్వులన్ని చంద్రుడికి అరువిచ్చి,
ముభావంగా ముడుచుకున్న ముఖం.
పడ్డప్పుడే, నిబ్బరంగా నిలబడాలని
ఎన్నోసార్లు నాకు చెప్పిన ముఖం.
నిద్రకాని నిద్రలో, నిశ్చలంగా
మధిర మత్తులో,మౌనంగా పలకరించింది.

ఆ పిలుపుకి నేనెవరో నాకు గుర్తుంటే
నేను మనిషినెలా అవుతాను?
అందుకే పాలకేడ్చే పసివాడినయ్యాను.
ఇంటికైతే చెర్చాను కాని,
పగిలిన ఆ గుండెను ఎలా అతకను???
కారణమైన ఆ ఆడదాన్ని ఎలా క్షమించను???
============================================
తేదీ: 18.01.2013

Thursday, 17 January 2013

మేఘం-మనిషి

ఆగమేఘాలతో ఒక మేఘం వస్తుంది.
పిసినారి తనంతో ఉన్నదంతా దాచుకొని,
గుడ్లు మిటకరిస్తూ వెళ్ళిపోతుంది.

సూకరాలతో,చేతులూపుతూ
నింపాదిగా మరో మేఘం వస్తుంది.
సానుభూతి సందేశాలతో,
కళ్ళాపిచల్లి కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళిపోతుంది.

ఇంకోరకం మేఘం, హుంకరిస్తూ వస్తుంది.
దర్జాగా నడుస్తూ, దర్పాన్ని చూపిస్తుంది.
వాగ్దాన గర్జనలేతప్ప,
మనసు విప్పి ఇచ్చేది శూన్యమే.

ఇంకోరకం మేఘం వస్తుంది.
ఉరిమినట్టే ఉరిమి,
మెరిసినట్టే మరిసి,
కురిసినట్టే కురిసి వెళ్ళిపోతుంది.
నిజానికి అవన్నీ గారడీ చమక్కులే.

నిశ్శబ్ధంగా ఒకమేఘం వస్తుంది.
తన దగ్గరున్న నిధులన్నీ,
అయాచితంగా అర్పిస్తుంది.
నిశ్చల తృప్తితో నిష్క్రమిస్తుంది.

మనుషుల్లోకూడా ఈ మబ్బుల్లాగే రకరకాలు.
గారడీ చూపేవారు కొందరు,
హడావిడి చేసేవారు కొందరు,
శబ్ధం మాత్రమే చేసేవారు కొందరు,
నిశ్శభంగా చూసేవారు కొందరు,
నిస్వార్ధంగా ఉన్నదంతా పంచేవారు కొందరు,
మనకి మార్గదర్శకులు వీరే.
******************************
తేదీ: 15.01.2013