స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Sunday 20 January 2013

మనిషినెలా ఔతాను?

ఎవేవో గీతలమీద, ఎందరివో తలరాతలమీద,
కవితలు రాసిన, పాటలు కూర్చిన
నా చెయ్యి ఎందుకిలా ఒణుకుతోంది?
ఉక్కుముక్కలాంటి గుండెనిబ్బరం
ఎందుకిలా జావగారిపోతోంది?
నిప్పుసెగమీద పెట్టిన వెన్నపూసలా
ఎందుకు నేనిలా కరిగిపోతున్నాను?

ఆకాశంలోని నాన్న దిగొచ్చి,
చెదిరిన జుట్టు నిమరలేదు.
అ,ఆలు దిద్దించిన గురువు,
ఎదుటపడి గుండెకు హత్తుకోలేదు.
అనురాగం వర్షించే భార్య,
ఊరెళ్ళి చాలాకాలం ఉండిపోలేదు.
అయినా ఒణికిపోతున్నాను,
సుడిగాలిలో మావిడాకులా...
***************************
ఇప్పుడిప్పుడే తెలుస్తోంది,
ఈ శీతల వాతావరణం
నన్నెందుకు చుట్టుముట్టిందో...

చుట్టూ చేరిన మానవాకృతుల
తలలమీదనుంచి కనిపించిన ముఖం.
ఒకేసారి వంద చిరునవ్వులని,
అద్దంలో చూపిన ముఖం.
చిరునవ్వులన్ని చంద్రుడికి అరువిచ్చి,
ముభావంగా ముడుచుకున్న ముఖం.
పడ్డప్పుడే, నిబ్బరంగా నిలబడాలని
ఎన్నోసార్లు నాకు చెప్పిన ముఖం.
నిద్రకాని నిద్రలో, నిశ్చలంగా
మధిర మత్తులో,మౌనంగా పలకరించింది.

ఆ పిలుపుకి నేనెవరో నాకు గుర్తుంటే
నేను మనిషినెలా అవుతాను?
అందుకే పాలకేడ్చే పసివాడినయ్యాను.
ఇంటికైతే చెర్చాను కాని,
పగిలిన ఆ గుండెను ఎలా అతకను???
కారణమైన ఆ ఆడదాన్ని ఎలా క్షమించను???
============================================
తేదీ: 18.01.2013

No comments:

Post a Comment