స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Monday, 29 December 2014

గుప్పెడు మల్లెలు - 81

1.
రుద్దిన ప్రతీసారీ,
నొప్పని ఏడిస్తే... మెరుగు ఎలా?
మణి కైనా... మనకైనా...
2.
మనిషెంత ఎదిగితే,
దాక్కునే ప్రదేశం అంత తగ్గిపోతుంది,
అందుకేనేమో... మానేసారు చాలామంది.
3.
ఓడ భద్రమే... ఒడ్డునుంటే,
అక్కడే ఉంటే....
నవ్విపోరా... దాన్ని ఓడ అంటే
4.
ఒక్క గెలుపొస్తే ఆపేస్తామా,
ఒక్క ఓటమికే మానేస్తామా,
ఏది, ఏమైనా... ఆడక చస్తామా
5.
నిన్ను,నువ్వు వెతుక్కోవడమో,
కనుక్కోవడమో కాదు జీవితం,
అది...నిన్ను,నువ్వు సృష్టించుకోవడం.
6.
ఒక తలుపు మూసుకుపోతే,
వేరేది తెరిచే ఉంటుంది,
మనమే... మూసిన దగ్గరే ఉండిపోతుంటాం.
7.
హర్రర్ సినిమా చూసాక,
మిర్రర్ చూసినా పుడుతుందోయ్ భయం,
కానీ...ప్రతీ సినిమాలో దేవుడిదేనోయ్ జయం.
8.
ప్రతీవాడు కళాకారుడే,
గీసేస్తుంటాడు, ఊహాచిత్రాలు,
అవున్లే...విజ్ఞానికేగానీ, ఊహలకేవీ హద్దులు
9.
సుఖంగా బతకాలంటే ...
కన్ఫ్యూజనొద్దు,కనిపించినవన్నీ అద్భుతమనుకో...
లేదా... అద్భుతమన్నది అస్సలు లేదనుకో
10.
అమాయకత్వంలో అందం,
పిచ్చిలో తత్వం దాగుంటాయ్...అందుకే...
లోకాన్ని వాటికి నచ్చినట్టు చూస్తుంటాయ్.
==================================
Date: 28.12.2014

Saturday, 15 November 2014

చాకిరేవు-09

"బాబాయ్, ఓ రెండు,మూడు ఫేమిలీలు కలిసి అలా ఏదైనా పిక్నిక్ వెళ్లొద్దాం. చాలా బోరు కొడుతోంది. ఎప్పుడూ అవే కాలేజీ గోడలు, అవే లెక్చరర్ ఫేసులు, అవే సినిమాలు... బోర్... చాలా బోర్..." అన్నాడు అబ్బాయ్ స్నానం చేసివస్తూ...
"మన ఇంటి సుట్టుపక్కల ఎవరైనా అమ్మాయిని గిల్లేవేట్రా... పిక్నిక్కులు గట్రా అంటన్నావ్" అన్నాడు బాబాయ్ చదువుతున్న పేపరు మూసేస్తూ...
"ఛా... ఛా... ఈ మొహాల్న.... మన రేంజే వేరు బాబాయ్. అయినా నేనేం చెప్పినా అందులో ఎప్పుడూ తప్పులెతుకుతావేంటి నువ్వు." అన్నాడు అబ్బాయ్ అలిగినట్టు ఫేస్ పెడుతూ...
"ఏం లేదులే, సటుక్కున అంత మంచి ఆలోసన ఒచ్చింది కదా, దానెనకాల ఏదైనా కుట్రాలోసన ఉందా... అని సిన్న రాయి ఇసిరేను అంతే... ఇంతకీ ఎక్కడెకెల్తే బాగుంటదంటావ్?" ఆశక్తిగా అడిగాడు బాబాయ్.
"అబ్బా... ఇవ్వాళ వర్షం పడుతుంది. మొదటిసారి నువ్వు నా ఆలోచన మంచిది అని సర్టిఫికేట్ ఇచ్చినందుకు చాలా హేప్పీసు... సింలా, ఊటీ, డార్జిలింగ్ ఇందులో ఏదైనా ప్లేసుకి వెళదాము." అన్నాడు అబ్బాయ్.
"ఒరేయ్, అంతంత దూరాలు ఇప్పుడు అవసరమేట్రా?" అన్నాడు బాబాయ్.
"మనింటెనకాల ఎర్ర చెరువు దగ్గర కాసేపు కూర్చొని ఒచ్చేద్దాం... సరేనా... " అన్నాడు అబ్బాయ్ వెటకారంగా
"మరీ అంత ఎకసెకాలు అక్కర్లేదు లేవోయ్. ఇప్పుడు పరీక్సలు గట్రా ఉంటాయి అంటారేమో అని. అందరూ ఇంజనీరింగ్ సదివే కుర్రోల్లే కదా... నీకు,నాకూ అంటే పనీ,పాటా లేదు కాబట్టి ఏ ఊరు అన్నా లగెత్తుకు ఎలిపోతాం." అన్నాడు బాబాయ్.
"అవునవును, అందరూ ఇంజనీర్లే... ఈ ఇంజనీరింగ్ అంటే అంత పిచ్చి ఎందుకో అర్ధం కాలేదు. పుట్టడం పాపం కొడుకైతే ఇంజనీరు, కూతురైతే డాక్టర్... మిగిలినవి ఉద్యోగాలు కాదు మరి. అందుకే "త్రీ ఈడియట్స్" సినిమాలో వాయించి పడేసాడు అమీర్ ఖాన్." అన్నాడు అబ్బాయ్.
"ఆడి మొహం, ఆడికేటి తెలుసురా. ఎవడికైనా సలహా జెప్పడం అంత సులభం మరొకటి లేదు. సలహా చెప్పినంత ఈజీ కాదు, బతుకు బండి లాగడం అంటే..." అన్నాడు బాబాయ్ తాపీగా...
"అంటే, ఆ సినిమాలో చెప్పినదంతా తప్పే అంటావా? ఆ సినిమాకి ఎన్ని అవార్డులు, రివార్డులు వచ్చాయో తెలుసా? అయినా నీకు హిందీ అర్ధం అవ్వక అలా మాట్లాడుతున్నావ్?" అన్నాడు అబ్బాయ్.
"అబ్బాయ్, సినీమా అర్ధం అవ్వాలంటే బాస రావాలి అన్నది నిజమే అయినా, పూర్తిగా తెలవక పోయినా ఇసయం ఏటో తెలిసిపోద్ది. అయినా అది తెలుగులో కొడా నేను సూసాను. సినీమాలో సెప్పిందంతా నేను తప్పనడం లేదురా, కానీ అందులో సెప్పిందానికి బతుకులో జరుగుతున్నదానికి సాలా తేడా ఉంది." అన్నాడు బాబాయ్.
"ఏమిటో మాకు అర్ధం అవ్వని ఆ ఇసయం." అన్నాడు అబ్బాయ్, బాబాయ్ భాషలోనే...
"పిచ్చోడా, మన సమాజంలో మూడు రకాల తరగతులు ఉన్నాయి. మొదటిది డబ్బున్నోడు... ఆల్ల అమ్మా,బాబులు సంపాయించి పెడితే ఈ నాకొడుకు దాన్ని ఎలా కర్సుబెట్టాలా అని ఆలోసిస్తుంటాడు. రెండోది పేదోడు... ఆడికి ఆరోజు తిండి ఎలాగ అని ఆలోసన తప్ప, ఏరే ఏ ఆలోసన ఉండదు. మూడోది మద్య తరగతోడు ఈడి ఆలోసన ఎప్పుడూ ముందు తరగతిలోకి ఎప్పుడు ఎల్దారా అనే ఉంటది. మొదటి రెండు తరగతులకి టెన్సన్ ఉండదు. మొత్తం సికాకు అంతా మూడో తరగతోడితోనే... ఆడు కొనే బట్టలు తక్కువలో రావాలి, సూడ్డానికి డాబుగా ఉండాలి. ఈ ఆలోసనలతోనే ఆడు ఒక ముప్పై దుకాణాలు తిరిగి, ఒక సొక్కా కొంటాడు. ఆడు సేసే పెతీ పనీ అంతే. అందుకే మినిమం గేరంటీ ఎక్కడుంది అని సూస్తాడు. ఆల్ల కుర్రోడికో, కుర్రదానికో ఈడు పడే బాదలు రాకూడదని అలోసిస్తనే ఉంటాడు. ఆడు సైకిల్ తొక్కితే, కొడుకు స్కూటర్ నడపాలనుకుంటడు. ఆడు స్కూటర్ తొక్కితే, కొడుకు కారెక్కాలనుకుంటడు. ఆడి ఆస్తి మొత్తం, ఆడి పిల్లలే అనుకుంటడు. ఇప్పుడన్న కాలమాన పరిస్తితులు బట్టి, ఆ ఇంజనీరు సదువు అయిపోతే ఏదో ఒక నౌకరీ దొరుకుద్ది... అదీ గేరంటీగా, అన్నది ఆడి ఆలోసన. ఒక వేళ నిజంగా ఆ గుంటడికి ఏరే ఏదో ఇంట్రెష్టు ఉందనుకో, ఈడు ఎంత కష్టపడి సదువు సెప్పించినా ఆ ఎదవ ఆడి రూట్లోనే పోతాడు. ఇక ఆ సినీమా అంటావా... అది సచిన్ టెండుల్కరో, బాలు లాటి కొంతమంది పెత్యేకమైన మనుసుల కోసం. మన సుట్టూ ఏవరేజీ మనుసులే ఎక్కువరా అబ్బాయ్. ఆడు ఇంజనీర్ అయ్యాడనుకో, శతకోటి లింగాల్లో ఒక బోడి లింగం. అయినా ఆ లింగానికి అబిసేకం ఉంటది. ఆడు బొమ్మలు బాగా ఏస్తున్నాడనో, పాటలు బాగా పాడతున్నాడనో సదువు, సంజ మానేసి ఆటెనకాల పడితే సంక నాకి పోతారు. ఆటి సక్సస్ రేటు 2% మాత్రమే. ఇంజనీరు అంటావా, గుంపులో గోవింద కొట్టుకుంటూ బతికేస్తారు. దీని సక్సస్ రేటు 50 కన్నా ఎక్కువే. ఎవరు అవునన్నా, కాదన్నా... మద్యతరగతోడు సదువుకునేది మాత్రం, ఒక మంచి ఉద్యోగం సంపాయించడానికే. మద్యతరగతి మనస్తత్వం అంతే."
"సరే ఈ సోదంతా నువ్వు ఒప్పుకోవు గానీ, పదా మీ పిన్నిని, పాపల్ని అడిగి ఎదో ఒకటి ప్లాన్ సేద్దాం." అని లోపలికి దారి తీసాడు బాబాయ్.
=============================
Date: 02/09/2014  

Friday, 14 November 2014

గుప్పెడు మల్లెలు - 80

1.
ప్రపంచమంతా విద్యార్ధులే,
జీవితంలో పరీక్షలొచ్చాయో...
నైట్ అవుట్లే
2.
దేవుడిచ్చాడు మగాడికి,
మెదడు,మర్మాంగం ఒక్కొక్కటే
నెత్తురు మాత్రం... పనిజేసేందుకు ఒక్కటే
3.
ఉండాలోయ్ అమ్మాయికి మంచి గతం,
అబ్బాయికి మంచి భవితం,
అవిలేని పెళ్లికి, ఎందుకోయ్ కులం,మతం.
4.
మనిషి, తాను తప్పుచేసానని,
చప్పున ఒప్పుకునేది...
మరుపు మెదడు తట్టినప్పుడే
5.
నరకం స్పెల్లింగు
నూరుసార్లు దిద్దినట్టే,
భాషరాని చోట, భావం ప్రకటించాలంటే
6.
గిట్టుబాటుకాని పట్టింపులు,
అసందర్భంగా ఢీకొనే అభిప్రాయాలు,
ఇవే... మద్యదూరాల కొలమానాలు
7.
అలోచిద్దాంలే, జుట్టు తెల్లబడ్డాక...
అనుకుంటూ ఉంటారు అంతా,
రంగు పూసేస్తారు తెలుపు కనబడకుండా
8.
పగటిపూట పట్టుదప్పి కిందపడ్డ కాలు,
రాత్రంతా ఎత్తులో మహరాజులా...
బళ్లు,ఓడలౌతాయ్... నమ్మకతప్పదు.
9.
కప్పు నిండుగా కాఫీ ఉండగా,
తుమ్మొస్తే భలే ఉండదా,
నిస్సహాయ స్థితికి నిదర్శనం ఇదేకదా!
10.
విచక్షణన్నది మనలో వాణి ,
హెచ్చరిస్తుంటుంది ఎల్లప్పుడూ
మనల్నెవరో వాచ్ చేస్తున్నారని.
===========================
తేదీ: 06.11.2014

Tuesday, 26 August 2014

చాకిరేవు-08

"ఏట్రా అబ్బాయ్ టి.వి. చూస్తన్నావా, ఇయ్యాల కాలేజీ సెలవా?" అడిగాడు బాబాయ్ బయటనుంచి వస్తూ...
"లేదు బాబాయ్, కాస్త ఒంట్లో నలతగా ఉన్నాది. అందుకే కాలేజీకి వెళ్లలేదు." అన్నాడు అబ్బాయ్.
"అయ్యో,అదేట్రా... నువ్వు మాంచి ప్లేయరువి, నీకు జొరమేటెహె... మరి డాక్టరు కాడికి ఎల్లకపోయావా?" అన్నాడు బాబాయ్.
"లేదులే బాబాయ్, ఇప్పుడే టేబ్లెట్ వేసుకున్నాను. పిన్ని మిరియాల కషాయం ఇచ్చింది. సాయంత్రం కల్లా తగ్గిపోతుందిలే. అప్పటికి తగ్గకపోతే అప్పుడు వెళతాను." అన్నాడు అబ్బాయ్.
"సరే... సరే... మరి రెష్టు తీసుకోకుండా టీ.వీ.కాడ కూకున్నావెందుకురా" అన్నాడు బాబాయ్.
"బోర్ కొడుతోంది బాబాయ్... అందుకే టీ.వీ. చూస్తున్నాను. ఈ ప్రోగ్రాములు చూస్తుంటే మరింత బోరు కొడుతోంది." అన్నాడు అబ్బాయ్.
"అదేట్రా, ఐదేల్ల గుంటడి కాడ్నించి... అరవయ్యేల్ల ముసిలోడు వరకు టీ.వీ.కాడ రోజు మొత్తం కూకొనే ఉంటన్నారు. ఆడోల్లకి సీరియల్ కతలు, సిన్న గుంటలకి కార్టూన్ బొమ్మలు, నీలాటి కుర్రోల్లకి ఆటలు, పాటలు, సినీమాలు, కిరికెట్టు మాచీలు, నాలాటి ముసిలోల్లకి వార్తలు... ఇలాగ సుమారు వంద సానల్లలో ఆల్లు ఫోగ్రాములు ఎడితే, నువ్వు పుసుక్కుమని బోరు అనీసేవు. బోరైతే సానల్ మార్చాలా, అంతేగాని సిరాకు అడిపోకూడదు." అన్నాడు బాబాయ్.
"సినిమాల గురించే బాబాయ్, నేను చెప్పేది. ఇప్పటికీ ఆరు చానళ్లు మార్చి చూసాను. అన్నింటిలోని చంపుకోవడం, నరుక్కోవడం. చంపడంలో వింత,వింత పద్దతిలు చూపిస్తూ జనాల్ని చెడగొడుతున్నారు. హింస ఇంతలా పెరిగిపోయింది అంటే దానికి 90% కారణం ఈ సినిమాలే... సెన్సార్ బోర్డ్ నిద్రపోతోంది అనుకుంటా. అసలు ఇప్పుడున్న ప్రొడ్యూసర్లకు సామాజిక బాధ్యత లేదు. దానికి తోడు ఈ టీ.వీ.ల్లో ప్రోగ్రాములు అలాగే ఏడ్చాయి." అని తన బాధ మొత్తం వెళ్లగక్కేసాడు అబ్బాయ్.
"అంటే ఇప్పుడు జరుగుతున్న దొంగతనాలు, దోపిడీలు, రేపులు ఇయ్యన్నీ సినీమాలవల్ల, టీ.వీ.లవల్లేనంటావ్" అన్నాడు బాబాయ్.
"అవును, అదే ముమ్మాటికి నిజం. ఈ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు అందరూ కలిసి సమాజాన్ని నాశనం చేసేస్తున్నారు. మంచి సినిమాలు రావడమే లేదు. ఒక శంకరాభరణం, స్వాతిముత్యం, రుద్రవీణ, సాగర సంగమం, ఆ నలుగురు లాంటి సమాజానికి ఉపయోగపడే సినిమాలు రావడం లేదు. అన్నీ హింస పూరితమైన సినిమాలు లేదా వెకిలి చేష్టలతో కామెడీ చేసే సినిమాలు. సమాజం నాశనం అయిపోతోంది అనే ఆలోచన లేకుండా పోయింది ఎవ్వరికీ..." అన్నాడు ఆవేశంగా అబ్బాయ్.
మళ్లీ తనే చెబుతూ "ఇక టీ.వీ.ల్లో అవే కార్యక్రమాలు. డబుల్ మీనింగ్ డైలాగులుతో కామెడీ షోలు, పిచ్చి గెంతులతో డాన్స్ ప్రోగ్రాములు, డబ్బులతో ఆటలు, అన్ని సీరియల్సులో ఒక్కో మగాడికి ఇద్దరో, ముగ్గురో ఆడోళ్లతో లింకు... ఇవే కధలు. అసలు సమాజం ఏమి అవుతుందో అన్న కనీస బాధ్యత లేకుండా పోతోంది." అన్నాడు అబ్బాయ్.
"ఓరి పిచ్చోడా, సినీమాల వల్లో, టీవీల ఫోగ్రాముల వల్లో ఏ ఒక్కడూ బాగుపడ్డమో, పాడైపోవడమో జరగదురా అబ్బాయ్.
అదే గనక జరిగితే ....
-సినీమాలో హీరోలాగ, పతీ తప్పుని నిలదియ్యాల, మనం ఆ సుట్టుపక్కల ఆగమన్నా ఆగం.
-లంచం తీసుకున్నోడిని కనుక్కుని మరీ సంపియ్యాల, కానీ మనమే ఆ సినీమా టిక్కెట్టు బ్లాకులో కొంటాం.
-కులం, మతం అనే మాటలు సెరిపియ్యాల. కానీ అది రోజులో ఒక్క పాలి కూడా తలుసుకోకుండా నిద్దరవ్వం.
-కష్టపడి పనిజేసి అమ్మ,బాబుల్ని పోసించాల. మరి ఓల్డేజీ హోములు ఎన్నున్నాయో నేను సెప్పక్కర్లేదు.
-పెద్దోడి దగ్గర దొంగతనాలు సేసి, పేదోడికి ఎట్టాల. మరి ఈ జనం కనిపించిన ముష్టోడికి ఒక రూపాయి ఇవ్వడానికి అరగంట ఆలోసిస్తారు.
-పోనీ కనీసం ఇలన్ సేసే ఎదవపనులన్నీ సేస్తూ కూకోవాల. కానీ అదీ సెయ్యరు, కూకొని దానిగురించి ఇస్లేసన మాత్రం సేస్తారు.
అంచేత నేను సెప్పొచ్చిదేటంటే సినీమా అనేది కాలక్సేపానికేగానీ, పాఠాలు చెప్పడానిక్కాదు." అన్నాడు బాబాయ్.
"అదేంటి బాబాయ్, అలా మాట్లాడుతున్నావ్? అంటే ఎలాంటి సినిమా తీసిన పర్వాలేదా? ఆ భాష వల్ల తెలుగు మర్చిపోయే స్థాయికి వచ్చేసారు అందరూ... చివరికి సినిమా పేర్లు కూడా ఇంగ్లీషులోనే." అన్నాడు అబ్బాయ్.
"అబ్బాయ్, సినిమా అనేది ఒక యాపారం. జనాలు సూసేది ఆల్లు తీస్తారు, ఆల్లు తీసేది జనాలకి నచ్చితే సూస్తారు. ఒక సినీమా హిట్టైతే, అలాంటియి మరో పది తీస్తారు. ఒక రెడ్డి బాగుందన్నారని, మరో పది రెడ్లొచ్చాయి. టీ.వీ.ల్లో అయినా అదే పిలాసఫీ... ఒక కామెడీ సో నచ్చిందన్నారని, మరో పది తీసేరు. సూసీవోడు లేడనుకో ఆల్లు సేసీది కూడా ఏటుండదు. ఈ మద్య ఒక ముసిలమ్మ, ముసిలాయన్ని ఎట్టి మిధునం అని ఒక సినిమా తీసేరు, ఆహా... అచ్చతెలుగు సినిమా అని కబుర్లు సెప్పే ఎంతమంది టిక్కెట్టు కొనుక్కుని హాల్లో ఆ సినిమా సూసేర్రా? ఆ మద్య లవకుశ మల్లీ తీసేరు, అదెంతమంది సూసేరు? అంచేత సినీమానో, టీవీనో తిట్టుకుని ఉపయోగం లేదురా అబ్బాయ్. ఏం చేసినా, అది జనం... అంటే మనం. సినీమా సూసి ఎవడు రేప్ సెయ్యాలనుకోడు, రేప్ సేద్దాం అనుకున్నోడు సినీమా సూసినా/సూడకపోయినా సేస్తాడు. కాకపోతే అది సినిమా పక్కీలో జరిగిందని ఇదిగో నీలాటి కుర్రకారు కబుర్లాడతారు. ఇలాటియ్యి బాగా ఇంటన్నారని, టీ.వీ.లో బొమ్మ సూపిస్తన్నారు. అప్పుడెప్పుడో అన్నగారు, మందు దొరక్కుండా ప్రొహిబీసన్ ఎట్టేరు. అప్పుడు జనాలు, బీదర్ ఎల్లో, యానాం ఎల్లో, ఒరిస్సా ఎల్లో తాగొచ్చీవోరు. ఆడు తాగుదాం అని డిసైడ్ అయ్యాక, ఎవడు సేసేది ఏటీ ఉండదు. అంచేత నేను సివరాకరుగా సెప్పేది ఏటంటే, ఏ తప్పైనా ఏ ఒక్కడో సెయ్యడు. అందులో నువ్వు, నేను జనాలంతా కలిసే ఉన్నాం. కాకపోతే ఎవడికి ఆడే గులివింద గింజ." అని బాబాయ్ అక్కడ్నించి భోజనానికి వెళ్లిపోయాడు.
============================================
Date: 25.08.2014

Friday, 22 August 2014

గుప్పెడు మల్లెలు-79

1.
పదార్ధాల కల్తీ పాడుజేసేది దేహాన్నే,
ఇక్కడంతా ఆశయాల కల్తీ
పాతరేస్తోంది దేశాన్నే
2.
పూలమాటున కత్తికన్నా,
ఎంతో నయం... కసిరే బెత్తం,
ఆలోచించవోయ్... అది ఆప్తుల కోపం
3.
తలపైకదా చల్లాలి...
కళ్లలోకి విసిరితే ఎలా అక్షింతలు,
గుండె రక్కి చెప్తే ఎలా సూక్తులు
4.
ఎంత గడ్డేసినా ఎద్దు పాలిస్తుందా?
అది పిసినారి చెయ్యరా నాయనా,
పొగిడినంత మాత్రాన జాడిస్తుందా
5.
నడిపే రక్తం కుళ్లిపోతే...
నడక ఎలా శరీరానికి,
ప్రతీచోట కోటా,ప్రగతి ఎలా సమాజానికి
6.
అది ఈగ...పాలైనా,పేడైనా
వాలడం దానికి పసందే,
కొందరంతే... సహజగుణం పరనిందే
7.
పెద్దపులైనా తోకతెగితే కామెడీలే,
ఆం ఆద్మీ! పదవి మద్యలోనే ఊడిపోతే,
పరిహాసం తప్పదులే
8.
నాటిన మొక్కకి నీరందకపోతే,
ఫలం చేతికందొస్తుందా...
ప్లాన్ చేసి ఊరుకుంటే ఫలితం వచ్చేస్తుందా
9.
కాలమొక అనంతవాహిణి,
క్యాలెండర్లో ఇమడదులే
స్పందించే హృదయం,తనువులో ఒదగదులే
10.
పదుగురూ నమ్మిస్తేనే పదవి,
వెధవ్వేషాలెయ్యకురోయ్,
గరిమను, చులకన చెయ్యకురోయ్
========================
Date: 21.08.2014

Wednesday, 13 August 2014

కె.కె.//తెలిసేది-గజల్//

గెలుపెంత గొప్పదో తెలిసేది, ఓటమితోనే
పిలుపెంత చల్లనో తెలిసేది,ఓదార్పుతోనే
......
ఎదముల్లుని తీసేది, గడియారం ముల్లేలే
మరుపెంత మంచిదో తెలిసేది,వేదనతోనే
......
ఆరడుగుల మనిషైనా,అన్నానికి లోకువేలే
ధనమెంత సత్తువో తెలిసేది, ఆకలితోనే
......
పలకరింపు నవ్వులన్నీ,స్నేహగీతి కాదులే
మనసెంత తెల్లనో తెలిసేది,అనురాగంతోనే
......
పలుగాకుల లోకమేమో,పదిమాటలు మామూలే
చిత్తమెంత చిక్కనో తెలిసేది,సఫలాలతోనే
......
నివురుతోటి "కోదండ",నిప్పుసెగ ఆగదులే
ప్రేమెంత స్వచ్చమో తెలిసేది,పోరాటంతోనే
=================================
తేదీ: 13.08.2014

Monday, 11 August 2014

కె.కె.//చాకిరేవు-07//

"బాబాయ్, ఒక విషయంలో నీ సాయం కావాలి. నువ్వు తప్ప, ఇంకెవ్వరూ ఈ పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకోలేరు." అన్నాడు అబ్బాయ్ ఆదుర్దాగా...
"ఏమైందిరా, ఏటా కంగారు?" అన్నాడు బాబాయ్ ఉలిక్కిపడుతూ...
"నువ్వు సాయం చేస్తానని మాటిస్తే చెబుతాను" అన్నాడు అబ్బాయ్...
"సరే, నేను చెయ్యగలిగిందే అయితే, తప్పకుండా జేస్తాను." అన్నాడు బాబాయ్.
"మరేంలేదు బాబాయ్, మా సుబ్బుగాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి వాళ్లింట్లో తెలిసిపోయింది, వాళ్లన్నయ్య,నాన్న మరో ఊరు పంపించేద్దామని నిర్ణయించారట. వేరే ఊరు వెళ్లిపోతే కష్టం కదా, పైగా ఏవో మాయమాటలు చెప్పి వేరే పెళ్లి చేసేస్తారేమో అని భయపడి ఆ అమ్మాయిని రేపు ఉదయాన్నే తీసుకొచ్చేద్దామని నిర్ణయించాం. తర్వాత ఏ గుళ్లోనో పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం." అన్నాడు అబ్బాయ్.
"సెబాసు, ఇంతకీ ఇందులో నా రోలు ఏటో... నేను సెయ్యాల్సింది ఏటో... కాస్త ఇవరంగా సెప్పు" అన్నాడు ఆదుర్దా నుంచి పూర్తిగా రిలాక్స్ అవుతూ బాబాయ్.
"అదే బాబాయ్, వాళ్లు పోలీస్ కంప్లైంట్ ఇస్తారేమోనని భయంగా ఉంది. అందుకే... ముందే ఒకసారి స్టేషన్ సి.ఐ. తో మాట్లాడతావని..." అంటూ నసిగాడూ అబ్బాయ్.
"ఏం ఆ అమ్మాయికి ఇంకా మైనార్టీ తీరలేదా?" అన్నాడు బాబాయ్.
"లేదు, బాబాయ్. ఇంకా ఐదు రోజులు బాకీ. తర్వాత ఇంక ప్రోబ్లం ఉండదు. అంతేకాదు, ఆ ఐదు రోజులు ఆ అమ్మాయికి మనింట్లోనే షెల్టర్ కూడా ఇవ్వాలి. పమ్మి వాళ్ల రూములో అడ్జస్ట్ అవుతుంది. పమ్మీకి ఆల్రెడీ చెప్పాను." అన్నాడు అబ్బాయ్.
"ఓహో, మరి ఏమంది? ఓకే అనేసి ఉంటదిలే... మీరంతా యూత్ కదా..." అన్నాడు బాబాయ్.
"ఒప్పుకుంది కానీ, నీ పర్మిషన్ తీసుకోమంది." అన్నాడు అబ్బాయ్.
"మరి ఆ కుర్రోడు... అదే, మీ ఈరో సుబ్బుగాడు?" అన్నాడు ప్రశ్నార్దకంగా బాబాయ్.
"వాడు, ఏదో ఫ్రెండ్ రూములో అడ్జస్ట్ అవుతానన్నాడు." అన్నాడు అబ్బాయ్.
"మరి, ఆ కుర్రోడి ఇంట్లో తెలుసా?" అడిగాడు బాబాయ్.
"లేదు బాబాయ్, వాళ్లనాన్న అసలే స్కూటర్ మెకానిక్... తోలు తీసేస్తాడు." అన్నాడు అబ్బాయ్.
"ఆళ్లింటికాడ, ఇంకెవరెవరు ఉంటారో?" అడిగాడు బాబాయ్.
"వాడికి ఒక అక్క, ఒక చెల్లి... అక్కకి ఈ మద్యే పెళ్లి కుదిరింది." అన్నాడు అబ్బాయ్.
"పెళ్లి సేసుకున్నాక ఎక్కడుంటారు? ఎలాగుంటారు? మరి ఇయ్యన్నీ ఆలోసించేడా మీ సుబ్బరమణ్యం" అన్నాడు బాబాయ్.

"ఏముంది బాబాయ్, మరో ఆరు నెలల్లో మా పరీక్షలు అయిపోతాయి. తర్వాత ఏదో ఉద్యోగం వెతుక్కుంటాడు. ఆ అమ్మాయి చదువు పూర్తయ్యాక, తనుకూడా ఏదైనా జాబ్ వెతుక్కుంటుంది. అందాక ఒక ఫ్రెండ్ వాళ్ల ఇల్లు ఉంది, అందులో ఉంటారు. మేమంతా ఉన్నాం కదా, ప్రస్థుతానికి కాస్త ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాం." అన్నాడు అబ్బాయ్.
"ఓహో, మీరు సెందాలేసి డబ్బులు పోగేసి ఆడికిస్తే... ఆడు కాపురం ఎలగబెడతాడన్నమాట." అన్నాడు బాబాయ్.
"అదేంటి బాబాయ్ అలాగంటున్నావ్, అది ప్రేమ బాబాయ్. తనకోసం, సుమారు ఆరునెలలనుంచి సిన్సియర్ గా ట్రై చేసి, ఫైనల్ గా ఒప్పించి లైన్లో పెట్టాడు. వాళ్లప్రేమ నిజమైన ప్రేమ బాబాయ్." అన్నాడు అబ్బాయ్.
"ఓహో, మరీ అంత సీరియస్సు, సిన్సియరు అయిన పేమ గురించి ఆల్ల బాబుకి సెప్పడానికి ఎందుకురా భయం." అన్నాడు బాబాయ్.
"పెద్దోళ్లు ఎప్పుడు ఒప్పుకున్నారు గనక పిల్లల ప్రేమల్ని... సలీం,అనార్కలీ నుంచి, మా సుబ్రమణ్యం, అంజలి దాక అదే స్టోరీ... కులాలు,మతాలు, డబ్బులు,డాబులు, అప్పులు,గొప్పలు, ఇవేగా మాట్లాడే చెత్తంతా" అన్నాడు అబ్బాయ్.

"అది చెత్త కాదురా అబ్బాయ్, బాధ్యత. ఎవడికాడు, ఎవడికి నచ్చినట్టు ఆడు బతకడానికి మనమున్నది అడివిలో కాదురా అయ్యా, ఒక ఊరిలో... అప్పుడెప్పుడో ఆకులు సుట్టుకుని బతికే రోజుల్లో ఏటి సేసినా సెల్లీది. ఇప్పుడు కొన్ని కట్టుబాట్లు, పద్దతులు మనమే ఎట్టుకున్నాం. ఆటిని ఏ ఒక్కడికి నచ్చినట్టో మార్సేద్దారంటే కుదురెద్దేంట్రా. ఎవడికి నచ్చినట్టు ఆడు బండి నడిపితే ట్రాఫిక్కు జాం అయిపోద్ది. అందుకే ట్రాఫిక్ రూల్సు." అన్నాడు బాబాయ్.
"అందుకని, మనసు చంపుకుని బతికితే జీవితాంతం బాధపడాలి. అయినా ఎవరి మనసుకి నచ్చినట్టు వాళ్లు బతకడం తప్పంటావా? ప్రేమన్నది నేరమంటావా? ప్రేమన్నది మనసుకి సంబందించిన విషయం బాబాయ్. నీలాంటివాళ్లకి అర్ధం కాదు" ఆవేశంగా ప్రశ్నించాడు అబ్బాయ్.

"పేమన్నది చాలా గొప్పదిరా అబ్బాయ్, కాని దాని దుంపతెగ... ఎవడికీ దాని డెపినిసను సెప్పడం సేత గావట్లేదు... అంచేత కనిపించిన పతీది పేమలాగ కనిపిస్తది. నువ్వు సెప్పే పేమకి అసలుపేరు మోజు... కాస్త ఎర్రగా,బుర్రగా ఎవర్తైనా కనపడితే సాలు... దానెనకాల హచ్చి కుక్కలాగ కాపుగాసి, ఎదవ సినీమా డైలాగులు సెప్పి, అవసరమైతే సెయ్యో,కాలో కోసుకుని దాన్ని ముగ్గులోకి లాగుతారు. కొంతమంది నాలుగురోజులు తిరిగి ఒగ్గేస్తారు, కొందరు పెల్లిదాక లాక్కెల్తారు. పేమగురించి ఇన్ని ఎదవ కబుర్లు సెప్పే మీ కుర్రకారంతా... నల్లగా,లావుగా అందవికారంగా ఉన్నోల్లని ఎంతమంది లవ్వు సేసేరంటావు? నాకు తెలిసి అలాటి కేసు ఒక్కటీ లేదు. ఇది లవ్వు కాదురా అబ్బాయ్, కొవ్వు." అన్నాడు బాబాయ్.
"బాబాయ్, ఇది పెద్దవాళ్లకి,పిల్లలకీ ఎప్పట్నించో జరుగుతున్న యుద్ధం. మీరు కాదంటున్న అవి జరుగుతూనే ఉన్నాయి." అన్నాడు అబ్బాయ్.
"కరట్టేరా అబ్బాయ్, మరి ఇన్నాళ్లనించీ జరుగుతున్నా... ఆ పిల్లలే పెద్దోల్లయ్యి, ఆల్ల పిల్లల సంగతి ఒచ్చినా ఎందుకు ఒద్దంటున్నారు అంటావ్? అంతెందుకు మీ సుబ్బిగాడి ఇసయంలోనే నేను కొన్ని ప్రస్నలు ఏత్తాను జవాబు సెప్పు.
1. 6 నెల్ల ఆ పిల్ల పేమకోసం, 20 ఏల్లు పెంచిన ఆల్లమ్మా,నాన్న పేమని ఒగ్గీడం కరట్టేనా?
2. ఈడు ఈ పిల్లని లేపుకుపోతే, దానివల్ల ఆల్లక్క పెల్లి ఆగిపోతే ఆ తప్పు ఎవడిది?
3. సెందాలేసుకుని ఆడ్ని మీరంతా పోసిత్తారని ఏటి గేరంటీ? అదెన్నాల్లు?
4. రేప్పొద్దున్న, ఆల్ల సెల్లికి పెల్లవుద్దా? మంచి సంబందం ఒస్తదా?
5. ఆల్లమ్మా,బాబూ రోడ్డు మీదెల్తుంటే సూటీ,పోటీ మాటలు ఇనిపిస్తాయి. ఏ తప్పు సెయ్యని ఆల్లెందుకు పడాలి?
6. ఆల్లు తిన్నా,తినకపోయినా ఈడికి పెట్టి, కాలేజీ ఫీజులు కట్టి, ఈడ్ని కంటిపాపలాగ సాకిన ఆ కన్నోల్లని ఒక పిల్లకోసం ఒగ్గీడం నాయమేనా?
7. పెల్లయ్యాక ఇద్దరూ ఏడిమీద ఉంటారు కాబట్టి, ఏ పిల్లో,పీసో పుడితే ఆల్లకి కూడా మీరు సెందాలేత్తారా?
8. పోసించే సత్తువ లేనప్పుడు, ఆల్లని కనే హక్కు ఎవడిచ్చాడు? 
9. రేప్పొద్దున్న, సుట్టాల్లో పెల్లికి,పేరంటానికి ఈల్లని రనీకుండా ఎలేసేత్తే ఆ తప్పు ఎవరిది?
10.ఆ అవమానం తట్టుకోలేక ఆల్లు ఏ మందో,మాకో తాగేత్తే ఈడి పేమ ఏం జవాబు సెబుతాది?
ఇలాటివి సాలా జవాబులేని ప్రస్నలు ఉంటాయిరా అబ్బాయ్. అసలు ఇదే పేమ అయితే... మొత్తం పెపంచకంలో పేమ పెల్లిల్లు మాత్రమే అవ్వాలి కదా, కానీ పెద్దోల్లు సేసే పెల్లిల్లుకూడా ఎందుకు జరుగుతున్నాయ్?" అని ప్రశ్నించాడు బాబాయ్.
"నువ్వెప్పుడూ ఇంతే ఏదో ఒకటి చెప్పి, టాపిక్ డైవర్ట్ చెయ్యడానికి చూస్తావ్." అన్నాడు అబ్బాయ్.

"నేను టాపిక్ మార్సట్లేదురా అబ్బాయ్. నాలుగు సొక్కాలు సెలక్టు సేసి, అందులో రెండు తొడుక్కు సూసి, ఒకటి కొనుక్కోడానికి బట్టల బిజినెస్సు కాదురా బతుకంటే.... ఒక్క తప్పటడుగు ఒక్కోసారి తిరిగి ఎనక్కి రాలేనంత అగాదంలోకి తోసేస్తది. అసలు పేమంటే ఏటో, అన్నమెట్టీటప్పుడు ఆల్లమ్మ కల్లల్లోకి సూడమను కనిపిస్తది. నెత్తురు సెమటసేసి ఆడిని పెద్దసేసిన ఆల్ల నాన్న గుండె సప్పుడు ఇనమను తెలుస్తది. అయినా ఆ గుంటకి బుద్దిలేదు, మీ అందరికీ అసలు బుద్దిలేదు... ఆ అమ్మాయికోసం ఆల్లమ్మా,బాబుల్ని కుటుంబాన్ని గాలికి ఒగ్గీసి ఒచ్చేస్తానంటున్నాడు, రేప్పొద్దున్న ఇంకోదానికోసం ఈ అమ్మాయిని ఒగ్గీడని ఏటి గేరంటీ? అప్పుడు ఆ అమ్మాయి గతేటి? ఇలాటి ఎదవలకోసం ఇంకోపాలి నాకాడికి సాయం,గీయమని రావొద్దురా అబ్బాయ్." అన్నాడు బాబాయ్.
అబ్బాయ్ సౌండు మ్యూట్ లోకి వెళ్లిపోయింది.
మళ్లీ తనే చెబుతూ "అంతగా ఆడిపేమ నిజమైతే రెండు వైపుల కుటుంబాల్ని ఒప్పించాల, ఒప్పుకునీదాక ఆగాల, ఒప్పుకునీ అంత గొప్పగా ఎదగాల. ఈ ఇసయాలన్నీ, మీ సుబ్బుగాడికి... ఆడి సెవి తుప్పు ఒదిలీదాక సెప్పు." అని నిద్రకి బయల్దేరాడు బాబాయ్.
అబ్బాయ్ ఆలోచనలో పడ్డాడు...
========================
Date: 10.08.2014

Monday, 4 August 2014

కె.కె.//చాకిరేవు-06//

"ఏట్రా అబ్బాయ్ కాలేజీలో గొడవ పడ్డారట, పైగా కొట్టుకున్నారట, పోలీసులుకూడా వచ్చారట, ఏం జరిగింది?" అడిగాడు బాబాయ్.
"ఏంలేదు బాబాయ్, ఫ్రెండ్షిప్ డే కదా అని ఫ్రెండ్స్ అంతా ఒకచోట కలిసాం, సరదాగా మాట్లాడుకుంటున్నాం, ఫేస్బుక్కులో పోస్టులు దగ్గర మొదలయ్యింది, అందులో కొంతమంది తెలంగాణ విడిపోవడం వగైరా గురించి మాట్లాడుతూ ఏదో అన్నాడు, ఇక అంతే... గొడవ మొదలయ్యింది, తర్వాత ఆపుదామన్న ఆగలేదు. పక్కనే ఉన్న కర్రలు తీసి బుర్రలమీద కొట్టుకునేదాకా వెళ్లింది. అదే సంగతి." అన్నాడు అబ్బాయ్.
"అరెస్టులు ఏమైనా జరిగాయా?" అన్నాడు బాబాయ్.
"లేదు, పోలీసులు వార్నింగ్ ఇచ్చారంతే" అన్నాడు అబ్బాయ్.
"కాలేజీలో మేష్టార్లకి ఇసయం తెలిసిందా?" అడిగాడు బాబాయ్.
"ఆహా, వైస్ ప్రిన్సిపల్ లొకేషనుక్కూడా వచ్చాడు, అందరినీ తిట్టి వెళ్లిపోయాడు, పోలీసుల్తో ఆయనే ఏదో మాట్లాడాడు." అన్నాడు అబ్బాయ్.
"ఏముంటది, గుంట ఎదవలు... ఏళ్లొచ్చేయి కాని బుద్ది రాలేదు, బొక్కలో ఏస్తే... ఆళ్లమ్మా,బాబులు ఏడుత్తారు, ఈపాలికి గట్టిగా నాలుగు దొబ్బులెట్టి వొగ్గియ్యండి. మాముఖం సూసైనా ఆ ఎదవల్ని క్సమించండి అని అడిగుంటాడు." అన్నాడు బాబాయ్.
"నీకు బాగా వెటకారం ఎక్కువయ్యింది బాబాయ్ మా స్టూడెంటులంటే" అన్నాడు అబ్బాయ్.
"ఇందులో ఎటకారం ఏముందరా అబ్బాయ్, కళ్లముందు కనపడతన్న నిజం... కూతంత కామెడీగా సెప్పీసరికి నీకు ఎటకారం అనిపిస్తుంది. బాగా తిని, కొవ్వెక్కి, తెగబలిసి కొట్టుకుంటున్నారు. జరగాల్సిన పుణ్యకార్యం ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడాడు కుక్క అని, నువ్వాడ్ని నక్క అని, అక్కడ ముక్యమంత్రిని ఈడుతిట్టి, ఇక్కడ ముక్యమంత్రిని ఆడు తిట్టి... అబ్బాయ్ ఇంటన్నావా... నోటి దురద తీరుద్దేమో గానీ, ఈ రాష్ట్రాలకి పట్టిన బురద మాత్రం ఒదలదురా" అన్నాడు బాబాయ్.
"అంటే వాళ్లు కుక్క అన్నా, దొంగలు అన్నా, మనం నోరుమూసుకొని కూర్చోవాలా?" ఆవేశంగా ప్రశ్నించాడు అబ్బాయ్.
"ఇసయమేటంటే అబ్బాయ్, నిన్న,మొన్నటిదాక అందరూ కలిసి ఒకే కొంపలో ఉన్నాం, అప్పుడే ఆళ్లు, మనం అని ఏరుసేసి మాట్టాడతున్నాం. ఆడేమైనా సైనానుంచో, పాకిస్తాన్నుంచో ఒచ్చాడా? పక్కూర్నుంచి ఒచ్చాడు. ఇక తిట్టుకోడమంటావా... పనిలేని సన్నాసులు సేసే పనికిమాలిన కార్యక్రమాలు. అదిసూసి మీలాటి కుర్రకారు... ఇదిగో ఇలా కర్రలట్టుకు బయల్దేరతారు." అన్నాడు బాబాయ్.
"అంటే ఆ తిట్టినవాడికి ఏం పనిలేదంటావా, అందులో చదువుకున్న మేధావులు ఉన్నారు, ఉద్యోగస్తులున్నారు, స్టూడెంటులున్నారు, కొంతమంది నువ్వన్నట్టు పనిలేని ఎదవలున్నారు. వాళ్లందరికీ సరైన గుణపాఠం చెప్పాలికదా, అది మన బాధ్యత." అన్నాడు అబ్బాయ్.
"ఏడ్సినట్టుంది, ఆడెంత సదువుకున్నోడు అయినా, ఎంత తెలివైనోడు అయినా నోరు జారేడంటే ఆడు ఎదవే. ఎంచేతంటే... ఇద్దరు వాదించుకుంటున్నప్పుడు, మనకాడ సరుకు అయిపోతే ఆటోమేటిగ్గా బూతులొచ్చేత్తాయి. ఎదుటోడు గనక ఎదవైతే... అసలు ఇసయం ఒగ్గీసి, ఆడు నన్ను తిట్టాడని లబో,దిబో మంటాడు. దానివల్ల పైసా ఉపయోగం లేదు. నా సిన్నప్పుడు ఒకపాలి... మొదటిసారి పట్నం వచ్చిన ఒక మేధావి సాయంత్రం 7గం.లకి ఆకాశం వైపు సూస్తూ నిలబడిపోయాడు, అది సూసి నలుగురు ఆడి పక్కనే నిలబడి అటేపే సూడ్డం మొదలెట్టారు. అది సూసి మరో పదిమంది ఆల్ల పక్కన జేరేరు. టైము 8 అయ్యింది. ట్రాఫిక్ జాం అయ్యిపోతుంటే, ఒక స్కూటరతను తప్పుకోండయ్యా నేను వెళ్లాలి అన్నాడు. ఇంతకి ఏముంది అక్కడా అని సిరాగ్గా అడిగాడు, అప్పుడు ఆ సదరు మేధావి... మా ఊర్లో ఉన్న సందమామ ఇక్కడికెలాగొచ్చిందా అని సూస్తన్నాను అని అన్నాడంట. అది ఇన్న అక్కడ సేరిన భజనమండలి థూ,థూ అని తిట్టుకుంటూ అక్కడ్నించి బయలెల్లిపోయారంట. ఇక్కడకూడా ఆ బాపతు మడుసులే ఎక్కువ, మీలాటి కుర్రకారంతా భజనమండ్లి. అసలు స్టూడెంట్ కుర్రోళ్లనే ఎందుకు ఎంచుకుంటారంటే, ఎప్పుడు ఆవాలన్న సెలవెట్టొచ్చు. కంపూటర్లు అయ్యి బాగా తెలుసు. ఒకడు కుక్క అని తిడితే... ఈ కుర్ర ఎదవలు దానికి ఓ బొమ్మేసి, ఒక పాట రాసి, పనికి మాలిన కార్టూన్లు గీసి ఊదర గొట్టేస్తారు." అన్నాడు బాబాయ్.
"అంటే స్టూడెంటులందరూ పనికిమాలినోళ్లనా నీ ఉద్దేశ్యం" అన్నాడు ఉక్రోషంగా అబ్బాయ్.
"ఎంతమాట అన్నావురా, ఆణిముత్యాల్లాటి కుర్రోళ్లున్నారు, ఈల్లు రెండు రకాలు. ఒకలు ఆల్ల సదువులుతప్ప ఏదీ పట్టించుకోరు,ఇంకొకల్లు అన్నీ పట్టించుకుంటారు. అన్నీ పట్టించుకునీవోల్లతోనే సికాకు. కాకపోతే ఆల్ల తెలివితేటలన్నీ 500సం క్రితం హైదరాబాదు ఎవరిది? మనకి నచ్చని పార్టీ నాయకుడు ఎప్పుడెప్పుడు నోరు జారాడు? తెలంగాణ హీరో ఎవడు/ ఆంధ్ర హీరో ఎవడు? ఎన్ని సినిమాలు తీసేడు? ఇలాటి సెత్తంతా పోగు సేస్తారు. ఈల్ల పిచ్చి ఏ రేంజుకి సేరుకుందంటే, ఎవలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వానలు పడ్డాయి? ఎన్ని పడ్డాయి అని కూడా లెక్కలు తయారుజేస్తారు. అదిగో ఎనకమాలే ఈ టీ.వీ.లు, పేపర్లు కావల్సినంత పెట్రోలు పోస్తారు. బ్రిటీసోడు కట్టించేడు కదా అని గోదావరి బిజ్జీని పడగొట్టేస్కుంటామేట్రా? ఈ బాధలు పల్లేక, నోరు ఇప్పి ఏదీ సెప్పలేక ఏదడిగినా పబుత్వం దాని పనది సేసుకుపోద్ది, సట్టం దాని పనది సేసుకుపోద్ది లాటి పనికి మాలిన డైలాగులు సెబుతున్నారు మంత్రులు, సినీమా యాట్టర్లు. గత పదేల్లలో ఒక ప్రాజెక్టుకూడా ఆంధ్రాలో జరగలేదు, ఈ గొడవల వల్లే... మీలాటి కుర్రోల్లు రాయాల్సింది ఇయ్యి కాదురా అబ్బాయ్.
1. కొత్త రాజధాని ఎక్కడుంటే బాగుంటది. నీ బూమి రేటు పెరుగుద్దని మీ ఊరని సెప్పకుండా... ఇది మన రాష్టం అని ఆలోసించి సెప్పాలి.
2. కేంద్రం డబ్బులిచ్చినా, మనకాడ కూడా కొంత పోగేస్కోవాలి కాబట్టి... అదెలాగ.
3. పోలవరం ఆనకట్ట కడితే ఒచ్చే లాబాలేటి? ఇబ్బందులేటి? సేస్తే మంచిదైతే, ఎన్ని రోజుల్లో అది సెయ్యొచ్చు?
4. కరంటు కట్ లేని రాష్టంగా మార్సాలంటే ఏటి సెయ్యాల?
5. ఏ,ఏ కంపెనీలు ఇక్కడ కట్టుకోవచ్చు. ఏ యాపారం లాబసాటిగా ఉంటది?
6. రేట్లు తగ్గాలంటే ఏటి సెయ్యాలి? బ్లాక్ మార్కెట్, నల్లడబ్బు తగ్గాలంటే ఏటి సెయ్యాలి?
7. అందరికీ కూడు,గుడ్డ, కొంప, గొడ్డు అందాలంటే ఏటిసెయ్యాల?
8. 10కి.మీ. దూరంకూడా కారుమీద 2గం. పట్టే ఈ ట్రాఫిక్కుని ఎల సరిజెయ్యాల?
9. రైతు నవ్వుతూ నాలుగు ముద్దలు తినేలా సెయ్యాలంటే, ఏటిసెయ్యాల?
10. ఈ రోడ్లు, మురికి కాలవలు, చెట్లు, ఇయ్యన్నీ ఎల సరిజేస్కోవాల?
ఇలాటి ఎన్నో ఇసయాలు ఒగ్గీసి, మా మనోభావాలు... మట్టిగడ్డలు అని సెత్తకబుర్లు రాస్తూ కూకుంటే, అబ్బాయ్... ఇంకో పాతికేల్లు పోయినా ఎక్కడేసిన గొంగలి అక్కడే. ఆడికి కరెంటులేదని నువ్వు, నీకు నీల్లు లేవని ఆడు కుల్లు జోకులేసుకుని సంకలు గుద్దుకోవడమే మిగులుద్ది. మన పోటీ ఉండాల్సింది పక్కనున్నోడితో కాదురా అబ్బాయ్, పెపంచకంలో బెష్టు అని అన్నావోడితోటి... " అని చెప్పి వెళ్లిపోయాడు బాబాయ్.
తానెంత తప్పుగా ఆలోచించానా అని ఆలోచనలో పడ్డాడు అబ్బాయ్.
========================
Date: 03.08.2014

Thursday, 31 July 2014

కె.కె.//చాకిరేవు-02//

"ఏరా అబ్బాయ్, పాటలు ఇంటన్నావా? మేడమీద సీకట్లో సైలెంటుగా కూకుంటే సిగిరెట్టు కాలుస్తున్నావేమో అనుకున్నాను. ఇంకా ఆ లెవెలికి ఎదగలేదన్నమాట. అయితే మంచిదే." అన్నాడు బాబాయ్ తాపీగా దగ్గరకొస్తూ...
"ఎప్పుడు చూసినా నామీద డిటిక్టివ్ పనులు తప్ప, వేరే పనిలేదా బాబాయ్ నీకు?" అన్నాడు అబ్బాయ్ చెవిలో ఇయర్ ఫోన్స్ తీసేస్తూ...
"మరి తప్పుద్దేంటి, అన్నయ్య నామీద నమ్మకంతో నిన్ను నాకాడ ఒగ్గీసాడు. అయినా ఒక మడిసికి సరైన టైము ఇదే... బాగుపాడ్డానికైనా, సెడిపోడానికైనా..." అన్నాడు బాబాయ్.
"నువ్వు చెప్తేగాని తెలుసుకోలేని పరిస్థితిలో నేను లేనుగానీ, ఏంటి ఇలా వచ్చావ్?" అన్నాడు అబ్బాయ్.
"పిన్ని వన్నానికి రమ్మంది. నువ్వు దొరబాబువి కదా... ఆడ్ని, ఈడ్ని పంపకూడదంట. అందుకని నన్నే పిలుసుకి రమ్మంది. అమ్మగారి ఆడ్రయ్యేక తప్పుద్దా... అందుకే నువ్వు ఎగస్పార్టీవోడివే అయినా నువ్వొస్తేనేగానీ నాకు కూడెట్టదు కాబట్టి, సచ్చినట్టు వచ్చాను." అన్నాడు బాబాయ్.
"అవునుగానీ ఎప్పుడు చూసినా ఈ నిక్కర్లేసుకుని తిరుగుతావ్, మంచి బట్టలు కొనుక్కోవచ్చుగా? ఇంత సంపాదించావ్. ఏం చేసుకుంటావ్ ఇదంతా. ఇద్దరు ఆడపిల్లలు తప్ప ఎవరూ లేరు కదా. నిన్ను ఈ నిక్కర్లో చూస్తుంటే పొద్దున్నే చెంబు తీసుకెళ్లేవాడు గుర్తొస్తాడు నాకు." అన్నాడు అబ్బాయ్.
"ఓసోస్ మరీ అంత కలరిచ్చీక, పొట్టి,పొట్టి నిక్కర్లేసుకొని ఆడ,మగా తేడాలేకుండా మీరు బస్సులు,రైళ్లు, ఇమానాలు ఎక్కేస్తే లేదుగానీ... నేను నా ఇంట్లో ఏసుకుంటే తప్పొచ్చిందా? మీరేసుకుంటే పేసనూ, నేనేసుకుంటే మోసనా? అయినా నేను బయటికెళ్లేటప్పుడు పంచి కట్టుకొనే ఎల్తాను. మా అయ్య నాకు అలా సెప్పేడు మరీ." అన్నాడు బాబాయ్.
"సరేలే నీతో ఈ సోది తేలేది కాదుగానీ పద భోజనం చేద్దాం" అని కదిలాడు అబ్బాయ్.
భోజనంచేసి చెయ్యి కడుగుతుంటే అబ్బాయ్ చేతికున్న ఉంగరాన్ని చూసాడు బాబాయ్.
"ఏట్రా అబ్బాయ్, ఈ ఉంగరాలు... ఇంతకుముందెప్పుడూ సూల్లేదు. పచ్చ, నీలం, ముత్యం అబ్బో... ఇయ్యన్నీ ఎందుకు పెట్టావురా?" అన్నాడు బాబాయ్.
"మొన్నొక జోతిష్యుడి దగ్గరకెళ్లాను, ఇప్పుడు నాకు చాలా బాడ్ పీరియడ్ నడుస్తోందంట. ఈ ఎమరాల్డ్ పెట్టుకుంటే పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ ఖాయం అని చెప్పాడు. నీలంతో మంచి ఉద్యోగం వస్తుందని చెప్పాడు. రానున్న 5 ఇయర్స్ నేను పట్టిందల్లా బంగారమని చెప్పాడు." అన్నాడు అబ్బాయ్.
"పైగా మంచి అమ్మాయితో ప్రేమలో పడతాననికూడా చెప్పాడు, దానికి ఈ ముత్యం పెట్టుకోమన్నాడు. అది విన్న దగ్గర్నించి అన్నీ ప్రేమపాటలే వింటున్నాను. ఇంకా గిటార్ ప్రక్టీస్ చెయ్యాలని అనుకుంటున్నాను. గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది బాబాయ్" అన్నాడు కళ్లుమూసి తన్మయంగా...
"నువ్వుకూడా రేపు పంచె కట్టుకుని నాతో వస్తే, నిన్నుకూడా తీసుకెళ్తాను. అప్పుడు నీ గేలానికి ఈ పిత్తపరిగిలు కాకుండా పులస పడే మార్గం చెపుతాడు. ఏమంటావ్?" అన్నాడు అబ్బాయ్.
"నాకు గేలం ఎలగెయ్యాలో, ఏటి పట్టుకోవాలో తెలుసుగానీ... ఇంతకీ ఎంత ముట్టజెప్పావో, కూతంత సెప్పు" అన్నాడు బాబాయ్.
"ఆయన కన్సల్టింగ్ ఫీస్ తీసుకోడు, అంతా ఫ్రీ సర్వీసు. జనాల్ని ఉద్దరించడానికి పుట్టిన మహానుభావుడు. అన్నీ జరిగిన తత్వాత,ఆయనకి ఒక మంచి సన్మానం చెయ్యాలి, ఒక బంగారు కడియం తొడగాలి అని నేను అనుకుంటున్నాను." అన్నాడు అబ్బాయ్.
"కాకపోతే ఈ రాళ్లు చాలా కాస్టులీ, వాటికోసం 50,116లు తీసుకున్నాడు. అవికూడా ఎవరికో ఇవ్వాలట." అన్నాడు అబ్బాయ్.
"అదేకదా, ఫ్రీ ఏట్రా బాబూ అని నా బుర్ర బద్దలు కొట్టుకుంటన్నాను. 50యేలు లాగేడన్న మాట. అవునొరేయ్ అబ్బాయ్, ఆడికి ఈ రాళ్లు,రప్పలు గురించి ఇంతబాగా తెలుసుగాదా, మరి ఏదో ఒక రాయెట్టుకుని ఆడే సినీమా యాట్రో, చీప్ మినిష్ట్రో అయిపోవొచ్చుగదా ఎందుకు అవలేదంటావ్?" అన్నాడు బాబాయ్ తాపీగా
"వారు అవతార పురుషులు, వాళ్లకి తుచ్చమైన పదవులమీద మోజు ఉండదు" అన్నాడు అబ్బాయ్ ఆవేశంగా
"ఓహో, మరి ఇల్లు,కారు గట్రా ఏమైనా ఉన్నాయా, మీ అవతార పురుసుడికి?" అడిగాడు బాబాయ్.
"ఓ యెస్, ఆయనకి కారుంది,హోండా సిటీ. ఒక ఫ్లాట్ తీసుకున్నాడు,మొత్తం ఏ.సీ. నాలాంటి వాళ్లకి జ్యోతిష్యం చెప్పడానికి. అంతేకాదు, ఎప్పుడూ ఫ్లైటులోనే వెళ్తూ ఉంటాడు ప్రసంగాలు ఇవ్వడానికి. పెద్ద,పెద్ద వాళ్లంతా ఆయనకోసం అపాయింటుమెంట్ తీసుకుంటారు. నేనుకూడా చాలా ఇనుఫులెన్స్ వాడి ఆయన్ని కలిసాను." అన్నాడు గొప్పగా అబ్బాయ్.
"మరి ఆయనగారికి తుచ్చమైన ఏటిమీద మోజులేనప్పుడు, కార్లు,ఏ.సీలు ఎందుకురా?" అన్నడు బాబాయ్.
"మరి ఇంత ఎండలున్నప్పుడు, ఏ.సీ... ఎక్కడికైనా వెళ్లాలంటే కారు వద్దేంటి?" అన్నాడు అబ్బాయ్.
"అయ్యన్నీ ఎక్కడ్నించి ఒచ్చేయి? నీలాంటి సన్నాసికి ఎదవ కబుర్లు జెప్పి డబ్బులు గుంజి సంపాయించేడు. ఆడికి సుఖాలు గావాలి. అసలు మీలాటి కుర్రకారు... చెయ్యాల్సిన పనొగ్గీసి, పనికిమాలిన తిరుగుళ్లు తిరిగి... సివరాకరికి ఉంగరాలు,బొంగరాలు అని తిరగడం వల్లే ఇలాటి ఎదవలు బతికేస్తన్నారు." అన్నాడు బాబాయ్. అబ్బాయికి చిరాకేసింది.
"అసలు నీకేం తెలుసు ఆయన గురించి, ఆయన ఎంత గొప్పవాడో తెలుసా?" అన్నాడు అబ్బాయ్.
"ఆడిగురించి తెలుసుకోవడానికి పెద్ద డిగ్రీలు సదవాలేట్రా. ఆడో ఎదవ, జనాల ఈక్ పాయింట్ మీద కొట్టి డబ్బులు సంపాయించడం ఆడి వృత్తి. ఇది కలికాలం రా అబ్బాయ్. ఇప్పుడు దేవుడు వేరేగా ఎక్కడోలేడు, నీలోని,నాలోని ఉన్నాడు. ఆడికిచ్చిన డబ్బుల్తో పదిమందికి అన్నమెట్టుంటే నువ్వే ఆళ్లకి దేవుడివి. సేతగానోడే, జాతకాలు అని పరిగెట్టీది." అన్నాడు బాబాయ్.
"అంటే, జాతకాలే లేవంటావా. నవగ్రహాలు, అష్ట దిక్కులు ఇవేమీ లేవంటావా?" అన్నాడు అబ్బాయ్.
"గ్రహాలు 9లేవు, ఎనిమిదే ఉన్నయి. ప్లూటో గెహం కాదని ఆమద్య పేపర్లో వచ్చింది సూల్లేదేట్రా. అయ్యన్నీ ఎప్పుడికీ మారవని ఈల్లంతా పిక్సు అయిపోయాక, అయ్యికూడా మారిపోతున్నా ఈళ్ల బుద్దులు మాత్రం మారలేదు. గెహసారం, గోసారం అని ఎదవ కబుర్లు సెప్పి డబ్బులు సంపాదిస్తన్నారు. ఆల్లకీ తెలుసు, అన్నీ బాగున్నోడు ఆల్లకాడకి రాడని. అందుకే ఒచ్చినోల్లందరికీ నీకు అది బాగోలేదు, ఇది బాగోలేదు అని సెప్తారు. ఓ ఎదవ సామీజి ఆడోల్లతోటి ఈడియోలు దిగాడు. ఇంకోడి ఇంట్లో కోట్లు దొరికేయి, ఒకడు బట్టలేసుకోకుండా కుక్కల్ల వరసలు మర్సిపోయి బతమన్నాడు, ఒకడు నల్లమందు కలిపి పెసాదం పంచుతున్నాడు... ఇలాగ ఎన్నిసార్లు పేపరోల్లు సెప్పినా, టీవీల్లో సూపించినా ఈ పిచ్చి మాత్రం తగ్గట్లేదు. అందుకే నూటపాతిక్కోట్లు జనమున్నా ఈ దేశంలో, 11 మంది ఫుట్టుబాలు ఆడివోల్లు దొరకడంలేదు, పెపంచంలో ఉన్న 100 బెష్టు కంపెనీల్లో ఒక్కటీలేదు, ఒక ఆస్కారు బగుమానం లేదు. సదువులేనోల్లు, అడుక్కుతినీవోల్లు ఇంటికిద్దరేసి, పక్కోడ్ని,అమ్మబాబుల్ని పీక్కు తినేవోల్లు ఈదికి ముగ్గురేసి ఉన్నారు."
"మా నాన్న సెప్పీవోడు, రాములోరు రావనాసురుడ్ని సంపీసాక, మిగిలిన రాక్షస నాకొడుకులందరూ మరి మా పరిస్థితేటి అని అడిగితే... బారద్దేశంలో బాబాజీలై పుట్టండ్రా అని వరమిచ్చాడు. ఆల్లు అలాగేనా రామా,కిష్నా అని బతుకుతారని... కానీ ఆల్ల బుద్దులు మారలేదురా." అన్నాడు బాబాయ్.
అబ్బాయికి ముచ్చెమటలు పోసేసాయి.
"పతోడు అడ్డదార్లో, ఆసనం ఎక్కీడానికే సూస్తున్నారుగానీ... ఉంగరమెడితేనే కింగైపోతే, ఇన్ని బళ్లెందుకు, కాలేజీలెందుకు, ఉద్యోగాలెందుకు?
"గాంధిజి ఏ ఉంగరమెడితే జాతిపిత అయ్యాడు? అల్లూరి ఎన్ని ఉంగరాలెట్టి తెల్లోడ్ని పరిగెత్తించాడు?"
"కాబట్టి అబ్బాయ్, మీ అమ్మనాన్న బొమ్మున్న ఒక లాకెట్టు మెల్లో ఏసుకో... బుర్రెట్టి సదువూ... మాంచి ఉద్యోగం సంపాయించు... అమ్మాయేటి ఆల్ల అమ్మా,బాబు కూడా నీ ఎనకాలొస్తారు. అప్పుడు నీ జాతకం ఆడు,ఈడు కాదు... నేనే సెప్తాను. కింగేటెహె... ఆల్లమ్మ మొగుడైపోతావ్. అంటే సక్కరవర్తి అన్నమాట." అన్నాడు బాబాయ్.
అంతే అబ్బాయి మబ్బు విడిపోయింది. ఉంగరాలని డ్రెస్సింగ్ టేబుల్ డెస్కులో పడేసి స్టడీ రూములో కెళ్లిపోయాడు.

కె.కె.//చాకిరేవు-03//

"ఏరా అబ్బాయ్, ఏటి కత... మాంచి స్పీడుమీద ఉన్నావ్? ఏటో తెగ రాసేస్తున్నావ్?" అన్నాడు బాబాయ్ స్టడీ రూములోకి అడుగుపెడుతూ...
"ఏం లేదు బాబాయ్, చచ్చిపోతున్న తెలుగుని ఎలా బతికించాలా అని మా ఫెండ్సు మొత్తం నిన్న డిస్కస్ చేసాం. దానిగురించే ఏం చేద్దామా... అని ప్లానింగ్ చేస్తున్నాను." అన్నాడు అబ్బాయ్ పుస్తకాన్ని పక్కన పెడుతూ...
"ఏటి తెలుగు సచ్చిపోతుందా? ఆ తెలుగుని బతికిస్తారా? అబ్బో... పెద్ద ఫోగ్రామే..." అన్నాడు బాబాయ్.
"వెటకారాలెందుగ్గానీ, ఇంతకీ విషయం చెప్పు." అన్నాడు అబ్బాయ్.
"నాదెగ్గిర ఏటుంటాయిరా అబ్బాయ్ ఇసేసాలు. నీ దగ్గిరున్న ఇవరాలే... నేను తెలుసుకునే, తలుసుకునే ఇసేసాలు." అన్నాడు బాబాయ్ నింపాదిగా...
"అవే నన్ను మింగేసే పిశాచాలు." మనసులో అనుకున్నాడు అబ్బాయ్.
"అసలు ఇంతకీ మీకొచ్చిన అబ్జెక్సను ఏటి? తెలుగు సచ్చిపోతుంది అని ఎలా డిసైడింగు సేసారు? ఆ ఇవరాలు కూతంత ఇడమర్సి సెప్పు. నాకూ జెనరల్ నాలెజ్జి కావాలి గదా" అన్నాడు బాబాయ్.
"నీకెప్పుడూ పక్కోడి విషయాలేగా కావల్సింది. ముఖ్యంగా నా పని చెడగొట్టడం నీ పని" అన్నాడు అబ్బాయ్ చిరాగ్గా... మళ్లీ తనే మొదలెడుతూ...

"మూడేళ్ల పిల్లల్నించి కాన్వెంట్ లో పడేసి, తెలుగు మాట్లాడితే కొడతాం అని భయపెడుతున్నారు. అన్నీ టెక్నికల్ స్టడీసు ఇంగ్లీష్ లోనే నేర్పిస్తున్నారు. టీ.వీ. యాంకరింగ్ ఆ వెధవ ఇంగ్లీషులోనే, ఆఫీసుల బయట నోటీసులు, నింపాలనుకున్న ప్రతీ అప్లికేషనూ ఇంగ్లీషులోనే, డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షను, చివరికి పలకరింపులుకూడా ఇంగ్లీషులోనే, ఇద్దరూ తెలుగువాళ్లే అయినా వచ్చీ,రాని ఇంగ్లీషులో మాట్లాడతారే తప్ప తెలుగు వాడరే... మరి ఇది తెలుగు చచ్చిపోవడం కాదా?" అని ఆవేశంగా ప్రశ్నించాడు అబ్బాయ్.

"ఓహో... ఈటన్నిటి వల్ల తెలుగు సచ్చిపోతుందన్నమాట, మరి బతికించాలంటే ఏటి సేస్తే బాగుంటాదో... అది కూడా ఏమైనా ప్లానింగు సేసేరా? లేదా?" అన్నాడు బాబాయ్.

"అదే ప్లానింగ్ చేస్తున్నాను. ఇప్పటికే చాలా పాయింట్లు నోట్ చేసి పెట్టాను.
1) చదువులు తెలుగులోనే కొనసాగాలి. అవి ఎంత పెద్ద చదువులైనా సరే...
2) ఇంగ్లీషు న్యూస్ పేపర్లు, ఇంగ్లీషు చానెల్స్ బంద్ చెయ్యాలి. తెలుగువి మాత్రమే చాలు.
3) టీ.వీ.ప్రోగ్రాముల్లో తెలుగు మాత్రమే మాట్లాడాలి.
4) ప్రతీ నోటీసు తెలుగులోనే డిస్-ప్లే చెయ్యాలి.
5) డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ తెలుగులోనే రాయాలి.
6) ప్రతీ అప్లికేషన్ తెలుగులోనే ఉండాలి.
7) ముఖ్యంగా ప్రతీవాడు తెలుగులోనే మాట్లాడాలని ఒక చట్టం తేవాలి.
ఇలాంటివి చాలా ఉన్నాయి. బాబాయ్, ఇలాగ కనక చేసామంటే తెలుగు వెలిగిపోదా మన రాష్ట్రమంతా..." అన్నాడు అబ్బాయ్.
"తెలుగు వెలిగిపోద్ది, రాష్ట్రం తగలడిపోద్ది" అన్నాడు బాబాయ్.
"అదేంటి బాబాయ్, అంత మాటనేసావ్" అన్నాడు ఆశ్చర్యంగా అబ్బాయ్.

"మరింకేట్రా అబ్బాయ్, నా సిన్నప్పుడు ఎవడూ ఊరు దాటేవోడు కాదు. పదో క్లాసు సదివితే... ఆడేదో కలెట్రు అయిపోయినట్టు ఆలమ్మ,బాబూ సంకలు గుద్దీసుకునేవోరు. మరిప్పుడో... ఊర్లేటి, రాష్టాలు కూడా దాటేస్తున్నారు. కొందరైతే దేశాలే దాటెల్లిపోతున్నారు. అప్పుడు ఒక్కడు సంపాయిత్తే, పది మంది తినీవోరు. ఇప్పుడు ఇద్దరు నాలుగు సేతుల్తో సంపాయిత్తే నలుగురు తిండి కష్టంగా గడుస్తుంది. మరింకో దేశమెల్లాక నీ గొడవేటో, ఆడికి... ఆడి బాదేటో నీకు తెలవొద్దేట్రా. వండినదానికి ఇచ్చే డబ్బులుకన్నా, ఆడు ఒడ్డించేదానికే డబ్బులిస్తార్రా అబ్బాయ్. మన వరాలమ్మ ఇడ్లీ కొట్టుకి, పైవ్ స్టార్ ఓటేలుకి తేడా ఏటుండదు... ఆడు అదే మినప్పప్పు, ఉప్పుడు నూక వాడతాడు. కాకపోతే మంచి గుడ్డలేసుకుని, రెండు సెంచాలు ఎట్టి, ఇడ్లీ ఒక ప్లేటులోని... సెట్నీ, సాంబారు సెరో కప్పులోని ఇస్తాడు. అంతే తేడా. కేవలం బాస తెలీక, తెలిసిన ఇసయాల్ని నలుగురికి సెప్పలేక, ఆడెవడో నవ్వుతాడని ఈడు పీలింగు అయిపోయి ఎదుగు,బొదుగులేని జీవితాలు సాలామంది గడుపుతున్నారు. ఇప్పుడిప్పుడే కూతంత ఆలోసన మొదలయ్యింది.ఆడి కాలికి దెబ్బ తగిందనుకో అమ్మా అనే అరుస్తాడు, అప్పుడు తెలుగు మాట్టాడని సెప్పక్కర్లేదు. ఎంచేతంటే బాధ, ఆనందం బయటికి సెప్పాలంటే, దగ్గరోల్లతో పంచుకోవాలంటే మాత్రు బాసే అనువుగా ఉంటదని ఆల్లకీ తెలుసు." అన్నాడు బాబాయ్. మళ్లీ తనే...

"అంతెందుకు ఇప్పుడు నువ్వు సెప్పిన మాటలన్నీ... ఇంగిలీసు లేకుండా మాట్టాడి సూడు, నీగ్గనక అర్దమయితే నాకు సెప్పు. బాసంటే నాటకాల్లో పద్యాల్లాగ మాట్టాడ్డం కాదురా... నువ్వేటి సెప్పాలనుకుంటన్నావో ఎదుటోడికి పూర్తిగా సెప్పగలిగేది బాస. మూడేల్ల గుంటడికి కూడా ఇంగిలీసు నేర్పిస్తన్నారంటే, దానవసరం ఎంతుందో తెలవాలి గదా. హెలిమెట్టు ఎట్టుకోపోతే పైను ఏస్తాం అంటే, ఆల్లకేదో నష్టం అనిగాదు. భయంతోనైనా బతికుంటారని. అందుకే తెలుగు మాట్టాడితే కొడతాం అంటారు. ఎదుటోడు తెలుగోడైనా, ఇంగిలీసు మాట్టాదేది... గొప్పకోసం కాదురా, నాలుగుసార్లు అలా మాట్టాడితే కూతంత అలవాటవుద్ది, తప్పులేవైనా వుంటే ఆడు సరిసేస్తాడని... " అన్నాడు బాబాయ్.

"ఇంజినీరు, డాట్రు, లాయరూ తెలుగులో సదువుకుంటే... అబ్బాయ్, మన సదువులు మనకి తప్ప ఇంకోడికి అర్దం కావు. డాట్రు రాసిన సీటీలో మందులు మనూర్లోనే తయారు సేసుకోవాల్సొస్తాది. అంటే ఆకు పసర వైద్యం లాగన్నమాట." అన్నాడు బాబాయ్. మళ్లీ తనే...
"ఒకప్పుడు పక్కూర్లోవాడు ఉత్తరం రాస్తే, మనూరికి రావడానికి వారం పట్టీది. మరిప్పుడు మన సిన్నపాప ఇక్కడ కంపూటార్లో కొడితే, అక్కడ ఆల్ల పెద్దమ్మ కూతురు బెంగులూర్లో సదివి జవాబిచ్చేత్తంది. కాలం పరిగెత్తీటప్పుడు, మారీటప్పుడు మనల్ని మనం మార్సుకోవాల. టీ.వీల్లో ఎక్కడో జరిగే కిరికెట్టు మాచి, అక్కడెక్కడో జరుగుతున్న యుద్దాలు, డిల్లీలో పెదానమంత్రి మాటలు ఇయన్నీ సూపించీటప్పుడు తెలుగో,తెలుగో అంటే కుదురుద్దేట్రా... ఇయన్నీ కావాలి అన్నప్పుడు మనంకూడా మారాలి. లేదంటే అదుగో ఈదరుగుమీద కూసొని గవ్వలాట, ఈదిసివర కులాయికాడ కుమ్ములాట, సారా సాపుకాడ బూతుపాట తప్పా మనకింకేటి తెల్దు." అన్నాడు బాబాయ్. అబ్బాయ్ ముఖం నల్లగా మారిపోయింది.

"అందుకే పుట్టినూరు మీద ఇష్టమున్న, అక్కడ పాడి,పంట ఉన్న అయ్యన్నీ ఒగ్గీసి ఇలా పట్నం ఒచ్చేను. పిల్లల్ని సదివిస్తన్నాను. మీ నాన్న నువ్వు దూరంగా ఉన్నావని ఎన్నిసార్లో నాకాడ ఏడ్సాడు, అయినా నువ్వు నాలుగు ముక్కలు నేర్సుకోవాలని గుండె రాయిసేసుకున్నాడు. అలాగని ఒగ్గీకుండా మీ పిన్ని పాపలిద్దరికీ తెలుగు రాయడం,సదవడం నేర్పించింది. నువ్వు ముందే నేర్సుకున్నావు. ఇలాగ నేర్సుకోవాల... అప్పుడు తెలుగు సచ్చిపోదురా, నువ్వన్నట్టు ఎలుగుతూనే ఉంటది. తెలంగాణ తెలుగులో కాస్త ఉరుదూ కలుసుద్ది, అక్కడ నిజామోల్లు ఏలేరు కాబట్టి... సీమ తెలుగులో కూతంత అరవం కలుసుద్ది,ఆల్లతో యాపారాలు సేస్తారు కాబట్టి... మనకి కూతంత ఒడ్డి బాస ఒస్తది, ఒడ్డోల్ల ఒడ్డునే ఉన్నాం కాబట్టి... ఇయన్నీ సర్దుకుపోయే ఇసయాలేగానీ, తన్నుకుసచ్చే యవ్వరాలు కాదు. సచ్చిపోతుంది బాస కాదురా అబ్బాయ్, బతకాలన్న ఆశ... మనిసికీ,మనిసికీ మద్య బందం... మనుసుల మద్యే ఉన్నా మనిసి అనేవోడు కనపడతాడనే ఆశ... ఆటిని బతికించండ్రా." అన్నాడు బాబాయ్ ఒణుకుతున్న కంఠంతో
"జంగిల్ అనేది హిందీ పదం, దాన్నిప్పుడు ఇంగిలీసులో వాడుకోవచ్చు అంటన్నారంట... అలాగ పదాలు కలుపుకుంటూపోతే అన్ని బాసలు ఒక్కటేరా అబ్బాయ్." అని అక్కడ్నించీ వెళ్లిపోయాడు బాబాయ్.
ఆలోచనలో పడ్డాడు అబ్బాయ్...
=====================
Date: 12.07.2014

కె.కె.//చాకిరేవు-04//

"బాబాయ్... బాబాయ్..." గట్టిగా పిలుస్తూ వెదుకుతున్నాడు, అబ్బాయ్.
"ఏట్రా అబ్బాయ్, ఎప్పుడూ నేను నిన్ను ఎదికేవోడిని, ఇయ్యాల కొత్తగా నువ్వు నన్ను పిలుస్తున్నావ్, ఏటి కత..." అన్నాడు బాబాయ్.
"నీ కారు కావాలి. చాలా అర్జంటు, వారం రోజులకి కావాలి. మళ్లీ భద్రంగా నీకు తిరిగి తెచ్చిచ్చే పూచి నాది. నువ్వు కాదనడానికి కుదరదు అంతే..." అన్నాడు అబ్బాయ్.
"ఏటి వారం రోజులకా? మరి నా పరిస్థితేటి ఈ వారం రోజులు, ఆహాః తెలీక అడుగుతున్నాను, నేను మన ఆపీసుకి ఎలాగెల్లాల అని..." అన్నాడూ బాబాయ్.
"ఇంట్లో ఇంకో కారుంది కదా, అది నువ్వు తీసుకెళ్లు. పిన్నికి ఆల్రెడీ నేను చెప్పేసాను, పిన్నికి ఏదైనా అవసరమైతే నీకు ఫోన్ చేస్తానని చెప్పింది." అన్నాడు అబ్బాయ్.
"ఓహో, ఆ ఏర్ఫాటుకూడా చేసేసావన్నమాట. సెబాసు... నీలో నాకు నచ్చేది ఈ స్పీడేరా అబ్బాయ్, ఇంతకీ అంత అర్జంటుగా, వారం రోజులకి కారెందుకో?" ప్రశ్నించాడు బాబాయ్.
"మా ఫ్రెండ్సు అందరూ కలిసి దక్షిణ భారత పుణ్యక్షేత్రాలు మొత్తం ఒక ట్రిప్ వేద్దామని డిసైడ్ చేసాం. రెండు కార్లు సెట్ అయ్యాయి, ఇంకో కారుంటే సరిపోతుంది. కారు హైర్ చేస్తే చాలా డబ్బులు అవుతున్నాయి. మళ్లా అక్కడ హుండీలో డబ్బులు వెయ్యాలి, మొక్కులు తీర్చాలి. అలాగని బస్సు/ట్రైను అంటే టైం సరిపోవడం లేదు. అందుకే మన కారు తెస్తానని మాట ఇచ్చేసాను. తప్పదు మరి" అన్నాడు అబ్బాయ్.
"పైగా స్పెషల్ దర్శనాలు, హోటల్ స్టే ఇవన్నీ కూడా కలిపితే బడ్జెట్ బాగా పెరిగి పోతోంది. అందుకే మన కారు ఉంటే కొంత కలిసి వస్తుంది. ఈ వారం రోజులు కాలేజీ సెలవులు ఇలా ఓ పుణ్య కార్యానికి వాడితే బాగుంటుందని..." అన్నాడు అబ్బాయ్ కొనసాగింపుగా
"ఓహో, తలకెంత పడతుందో?" అడిగాడు బాబాయ్.
"ఏం?" అన్నాడు అబ్బాయ్.
"ఏం లేదురా నేను కూడా ఒస్తే బాగుంటాదేమో అని..." అన్నాడు బాబాయ్.
"అమ్మో... కారివ్వాకపోయినా పర్వాలేదు ఆనీ, నువ్వు మాత్రం రావొద్దు" అన్నాడు అబ్బాయ్ ఉలిక్కిపడుతూ
"సర్లే రానుగానీ, ఒక అగ్జాయింపుకి పనికొస్తది కదా... అందుకని, తలకేమాత్రం" మళ్లీ అడిగాడు బాబాయ్.
"ఆ.. ఎంత, యాభై నుంచి అరవై అనుకుంటున్నాం" అన్నాడు అబ్బాయ్.
"ఏటి వందలా..." అన్నాడు బాబాయ్.
"కాదు... ఒకట్లు" అన్నడు వెటకారంగా అబ్బాయ్.
"అమ్మబాబోయ్,వేలా... "అని ఆశ్చర్యపోయాడు బాబాయ్.
"మరీ... స్పెషల్ దర్శనానికి టికెట్లు, అక్కడ ఏ.సీ.లాడ్జులు, ఇప్పుడంతా వేలల్లోనే... లేదంటే జీవితం మొత్తం లైన్లో నిలబడ్డం తోనే అయిపోతుంది." అన్నాడు అబ్బాయ్.
"నువ్వన్నది నిజమేరా అబ్బాయ్, దేవుడుకూడా మాసెడ్డ తెలివైనోడు, డబ్బున్నోడికే డబ్బులిస్తాడు, డబ్బున్నోడికే దర్శనం ఇస్తాడు." అన్నాడు బాబాయ్.
"నిజమే బాబాయ్, పాపం జనరల్ టికెట్లు కొన్నవాళ్లు అంతసేపు లైన్లో ఎలా నిలబడతారో?" అని విచారం వ్యక్తం చేసాడు అబ్బాయ్.
"ఆ పాపం ఆళ్లది కాదురా అబ్బాయ్, ఈ గవర్నమెంటోళ్లది. దొరికిన సోట దొరికినట్టు దండుకోవడం అలవాటైపోయింది. ఈ పిచ్చి జనం తలలూపడం అలవాటుజేసుకున్నారు." అన్నాడు బాబాయ్.
"అంటే, ఈ టికెట్లు పెట్టడం తప్పంటావా? అదే లేకపోతే ఆలయం డెవలప్మెంట్, స్టాఫ్ జీతాలు, ప్రసాదాలు, మిగిలిన సదుపాయాలు ఇవన్నీ ఎలా?" అని సూటిగా ప్రశ్నించాడు అబ్బాయ్.

"అయ్యన్నీ అవసరమే అయినా... న్యాయం ముందు, దేవుడి ముందు అందరూ సమానమే అని బాపూజి సెప్పేడు. అది కరట్టే అని సాలామంది పెద్దోల్లూ సెప్పేరు... అయినా ఈల్ల ఇష్టారాజ్యానికి డబ్బులు దోసేత్తున్నారు. ఉండీలో ఏసిన లచ్చల్లచ్చల డబ్బులు ఏటవుతున్నాయో ఒక్క నాకొడుకు సెప్పడు. తిరపతి దేవస్థానం చైర్మన్ గిరీకి పతీవోడు ఎగబడతాడు, మిగిలిన సోట కిమ్మనరు. ఎంచేత... అక్కడ కలెక్సన్ ఎక్కువ. ఇయ్యన్నీ సూసే... ఆ దేవుడిక్కూడా సిర్రెత్తుకొచ్చి వానలు లేకుండా, కూడు గుడ్డా దొరక్కుండా దురద కట్టించేస్తున్నాడు. సిమ్మాద్రి అప్పన్న అయినా, తిరపతి ఎంకన్న అయినా, యాదగిరి నర్సిమ్ముడైనా, బద్రాద్రి రాములోరు అన్నా, అందరూ ఇష్ణుమూర్తి అవతారాలే... అయినా ఈ ఎర్రి జనాలకి అర్ధం కాదు. ఒకసోటే ఎగబడతారు. అసలు దేవుడు ఎక్కడ లేడురా, తిరపతిలోనే దేవుడుంటే... మరి మన ఈది సివర రామాలయంకాడికి ఎందుకెల్లాలి? అక్కడికెల్లి కూడా దన్నం ఎట్టుకుంటే మనసు పెసాంతం గా ఉంటదా, లేదా. కానీ... అబ్బే, మనం ఇంటామేటి? దేవుడితో బేరం ఆడతాము. సామీ నాకు ఈ సారాపాట ఒచ్చిందంటే నీకు ఓ లచ్చ ఇచ్చుకుంటాను అనీ... ఇంకోడు నేను పరిచ్చ పాస్ అయిపోతే బొచ్చు ఇచ్చుకుంటాను అని... మొదటోడు ఐదువేలెట్టి స్పెసల్ టిక్కెట్టు కొంటాడు, రెండోవోడు ఐదు రుపాయలెట్టి జనరల్ టిక్కెట్టు కొంటాడు. ఒకడికి గర్భగుడి దర్సనం, ఇంకోడికి దూరన్నుంచే దర్సనం. డబ్బుల్తో అన్నీ మారిపోతున్నాయి, పెసాదం సైజుతో సహా... " అన్నాడు బాబాయ్.

" తప్పు ఆల్లది కూడా కాదురోయ్, డిమాండు అలా సేయిస్తది. కిరికెట్టు ఆడేవోల్లు డబ్బులు తీసుకుని ఓడిపోతున్నారు అని టీ.వీలో వంద సార్లు సెప్పినా, ఆట మొదలవడం పాపం... స్కూల్లు, ఆపీసులు మానీసి మరీ సూస్తారు. ఒక్కపాలి మేము ఇంక కిరికెట్టు సూడం... అని జనమంతా ఒక్క మాటంటే ఆల్లు అడుక్కు తిని పోతారు. అలాగే ఒకే రకం దర్సనం, ముసిలి ముతకా లేదా సెయ్యి, కాలు లేనోల్లకి మాత్రమే వేరే దర్సనం ఉండాలి. లేదా మేము రాము అని జనరల్ టికెట్టు జనాలంతా బీస్మించుకుని కూసున్నారనుకో... మొత్తం పద్దతి అంతా లైన్లోకి ఒచ్చేస్తది. అందుకే నేను జనాల్లేని టైములో, డిమాండు లేని గుడికెల్లి దన్నం ఎట్టుకొస్తాను. ఈ మద్య ఏ.సీ. గుళ్లుకూడా కడతన్నారు. డబ్బుల్తో దొరికే భక్తిని ఏమంటారో ఈ పిచ్చి పెజానీకమే సెప్పాలి. పెతీ ఆదివారం మీ పిన్ని పులిహారో, గార్లో, సక్కెర పొంగలో ... ఏదో ఒకటి సేస్తది. ఓ 20 మందికి ఆల్లు సాలు అనేవరకూ, నేను ఆకులో వడ్డిస్తాను. ఇందులో నాకొచ్చిన సుఖం, ఏ కొండెక్కినా రాలేదురా అబ్బాయ్. అయినా కారే గదా కావల్సింది, తీసికెల్లు... కానీ నువ్వెల్తంది గుడిక్కాదురోయ్, నువ్వెల్తంది పిక్నికి... సెయ్యి గుండెమీదెట్టి ఆలో సించు... నీకే తెలిసిపోద్ది." అని వెళ్లిపోయాడు బాబాయ్.
==========================
Date: 20.07.2014

చిన్ననాటి ముచ్చట్లు - గజల్

ఎలా మరిచిపోనూ, చిన్ననాటి ముచ్చట్లు
ఎదను మోగుతుంటే, ఆ జ్ఞాపకాల చప్పెట్లు
.......
చెరుకుమడిని దాటుకుంటూ, బడికి ఉరకలేస్తుంటే
మువ్వలసడి వినిపిస్తూ, సాగిన ఆ జోడెడ్లు
.........
జడివానలో చిందులేసి,కేరింతలు కొడుతుంటే
తుమ్ములతో ఆవిరికై, దూరిన ఆ దుప్పట్లు
..........
రాజుగారి తోటల్లో, మావిళ్లని కోస్తుంటే
తోటమాలి అదిరింపుకి, పరిగెత్తిన ఇక్కట్లు
.......
చదువులన్ని ఎగవేసి, బ్యాటుతో ఆటకెడితే
చింతకర్ర సాక్షిగా, నాన్నేసిన చీవాట్లు
.......
ఏటిలోన ఈతలతో, వేసవి తాగేస్తుంటే
మితృని మరణంతో, కమ్ముకున్న చీకట్లు
.......
కాలమెంత కఠినమో, క్షణమైనా ఆగదు
దాటక తప్పదులే, "కోదండ" ఈ మెట్లు
============================
Date: 23/07/2014

కె.కె.//చాకిరేవు-05//

"ఏట్రా అబ్బాయ్, ఇయ్యాల కాలేజీకాడ ఏదో గలాటా అయ్యిందట" అడిగాడు బాబాయ్ రాగిచెంబు నీళ్లు తాగుతూ...
"ఏంటి అప్పుడే నీదాక వచ్చేసిందా మెసేజ్" అన్నాడు అబ్బాయ్ తాగేసిన పాలగ్లాసు పక్కన పెడుతూ
"మనకి ఏరే పనేముందిరా, నలుగురి మంచీ,సెడ్డా కనుక్కోడం తప్పా... ఇంతకీ ఎవరా అబ్బాయి? ఏటా కత?" అడిగాడు బాబాయ్.
"అతను మా సీనియర్...పేరు సూర్యనారాయణ శర్మ, చాలా బాగా చదువుతాడు. కాలేజీ ఫస్ట్ వచ్చాడు, చదువంటే మహా పిచ్చి... వారాలు చేస్తూ చదువుకున్నాడు. రెండు సంవత్సరాలనుంచీ కాలేజీ హాస్టల్లోనే కొంతమంది జూనియర్సుతో కలిసి ఉంటున్నాడు, వాళ్లకి ఫ్రీగా పాఠాలు చెబుతూ... సాయంత్రం వేళ ట్యూషన్లు చెబుతూ... మిగిలిన టైమంతా ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతుంటాడు. ఈ రెండేళ్లలో సుమారు 7 గవర్నమెంటు ఉద్యోగాలు చేతికి వచ్చినట్టే వచ్చి పోయాయి, స్వంత బిసినెస్ కోసం ప్రయత్నించి అందులోను ఫెయిల్ అయ్యాడు. దానిముందు పీ.జీ. చదవడానికి స్కాలర్ షిప్పుకోసం ప్రయత్నిస్తే అక్కడా చుక్కెదురయ్యింది. అందుకే ఒక సూసైడ్ లెటర్ రాసి హాస్టల్ మేడమీదనుంచి దూకేసాడు. ఆ లెటర్లో రాసిన ఒక ముఖ్యమైన మాట... దేవుడా, కులాన్ని చూసి ఉద్యోగాన్ని, చదువుల్ని ఇచ్చే నా దేశాన్ని ప్రతిభని గుర్తించే దేశంగా ఎదిగేలా ఆశీర్వదించు అని రాసాడు. గవర్నమెంటు ఉద్యోగిగా పనిచేసి,నిజాయితీకి కొందరికైనా ఒక ఉదాహరణగా మిగలాలని చాలా కలలు కన్నాడు. అర్ధాంతరంగా బతుకు ముగించేసాడు." అని చెప్పాడు అబ్బయ్ నిట్టూరుస్తూ...
"మరి, ఆ కుర్రోడి తరుపు మడుసులకి కబురు అందించేరా?" అడిగాడు బాబాయ్...
"అతనికున్నది ఒక్క అమ్మ మాత్రమే, ఉద్యోగం వచ్చాక ఆవిడ్ని తీసుకు రావాలనుకున్నాడు. కానీ ఆవిడకూడా ఈమద్యే అనారోగ్యంతో కళ్లు మూసింది. ఒక రకంగా అతని ఆత్మహత్యకి అది కూడా ఒక కారణం. ప్రస్థుతానికి నాకు తెలిసి అతనికెవరూ లేరు." అన్నాడు అబ్బాయ్.

"అమ్మమ్మామ్మా... ఈ రిజర్వసన్ లెట్టి ఇలాటి ఎందరో సూరీడ్లకి గ్రహనం పట్టించేస్తన్నారు. నువ్వొక్క మాట నాకు సెప్పుంటే మనం సదివించేవోల్లం కదరా..." అని బాధపడ్డాడు బాబాయ్.

"నాకూ ఈ వివరాలన్నీ, ఇవ్వాళే తెలిసాయి బాబాయ్. అయినా రిజర్వేషన్స్ వల్లే అంటే ఎలా... వెనకబడినవాళ్లు ఎదగాలి అని ప్రభుత్వం ఇవన్నీ అమలు చేస్తోంది. ఇలాంటివాళ్లు ఎవరో,ఎక్కడో ఉంటారు. దానికోసం సిస్టం తప్పంటే ఎలా?" అన్నాడు అబ్బాయ్.

"మరేట్రా అబ్బాయ్, ఒక్క ఇసయం అడుగుతాను సెప్పు... సొతంత్రం వచ్చి 67 ఏళ్లు దాటింది, ఈ రిజర్వేసన్లకి 63 ఏల్లు దాటింది. ఇంకెన్నాల్లు ఇలా గడిత్తే ఆల్లు ముందుకొస్తారు? మనకీ బీ.సీ. రిజర్వేసను ఉంది. నీకుగానీ, మన పాపలకి గానీ ఏటి తక్కువ? మీకెందుకు రిజర్వేసన్లు? ఇలాటోల్లు ఎంతమంది ఉన్నారు? పదోక్లాసు పదిసార్లు డింకీ కొట్టి తర్వాత ప్యాసు అయ్యి, తర్వాత ఏవో పరిక్సలు అలాగే పేసయ్యి, ఆడు స్కూల్ టీచరైతే... ఆడేం పాటాలు సెబుతాడు? ఇల్లేటి వింటారు?" అన్నాడు బాబాయ్.

"అందుకనీ... ఇప్పుడిప్పుడే కాస్త చదువు విజ్ఞానం సంపాదిస్తున్నవాళ్లు, ఈ తెలివైన వాళ్లతో పోటీ పడగలరా? అందుకే రిజర్వేషన్సు ఉన్నవి. ఈ విషయం తెలుసుకోవాలి బాబాయ్." అన్నాడు అబ్బాయ్.

"అబ్బాయ్, ఇదే మన దేశ దౌర్భాగ్యం, అక్కులకోసం మాట్లాడే ఏ ఎదవా బాద్యతలకోసం మాట్లాడ్డు. ఇంట్లో బాత్ రూముని పదిసార్లు పినైలేసి మరీ కడుగుతారు, అదే రైలుబోగీలో మనం చేసిన పెంట ఎనకొచ్చినోడు శుబ్రం సేసుకుంటాడులే అని ఒదిలేస్తారు. మనకి రిజర్వసన్లు కావాలి, స్కాలర్ సిప్పులు కావాలి, తెల్ల కార్డులు కావాలి... అన్నీ కావాలి, ఈటన్నిటికోసం పోరాట సేస్తాం. కానీ ఒకసారి మనకి ఎదిగే అవకాశం దొరికి బాగుపడ్డాక, ఇంక నా కుటుంబానికి ఇయ్యన్నీ అక్కర్లేదు అని సెప్పడానికి నోరు రాదు. 50శాతం ఈ రిజర్వేసన్లలో పోతే, మిగతా 50శాతానికి ఒకట్లో పదో ఒంతు మార్కు కోసం కొట్టుకు సస్తున్నారు. 90 మార్కులొచ్చినోడు, 40 మార్కులొచ్చినోడు కలిసి సదువుతున్నారు. 80 ఒచ్చినోడు ఏ ఇల్లు తాకట్టెట్టో ప్రైవేటుగా సదువుతాడు, అది లేనోడు ఏ సిన్న ఉజ్జోగానికో పోతాడు. ఎనకబడినోడిని బాగుసెయ్యాలంటే పద్దతి ఇది కాదురా అబ్బాయ్, అసలు నిజానికి ఎనకబడినోడు, ఎదిగినోడు అన్నది ఈ కులాల వారీగా కాదురా సూడాల్సింది. నిజానికి మూడే కులాలు ఉన్నాయి, ధనవంతుడు, మద్యతరగతోడు, పేదోడు. ఆటి పెకారమే ఏ పదకాలైనా, రిజర్వసన్లైనా అమలు జరగాల. లేదంటే మరో 100 ఏల్లు గడిసినా అబివృద్ది సెందుతున్న దేశమేగానీ, సెందిన దేశం గా మారదు. పెపంచంలో సాలా దేశాలు బట్టల బదులు ఆకులు సుట్టుకున్నప్పుడే, ఇక్కడ పట్టుసీరలు నేసేరు. అలాటిది ఈ దేశంలో ఎంతోమంది గోసీ గుడ్డతోనే అడుక్కు తింటన్నారు. దుబాయి సేకు వాడీసిన కొత్త,కొత్త టీ.వీలు మెసీన్లు మోడల్లు పదేల్ల తర్వాతగానీ ఇక్కడ కనబడవు. తెలివైనోల్లు పక్కదేశాలు పోతారు. మనం ఇదిగో,ఇలాగ ఓట్లుకోసం, నోట్లుకోసం ఇలా జాతిగొంతు కోసే రాజకీయ నాయకులకి జేజేలు కొట్టేస్తూ దేశం గొంతు నొక్కేద్దాం." అని బాబాయ్ అక్కడినుంచి వెళ్లిపోయాడు.

గుప్పెడు మల్లెలు-78

1.
ఎదుటివాడు శతృవనా,సైనికుడి యుద్ధం, 
కాదు...వెనకున్నది మనవాడని,
చాలా సార్లు మనమూ అంతే.
2.
ఆడి చావుకి నువ్వెళ్లావని,
నీ చావుకి ఆడు రావడం కుదురుద్దా?
లైఫ్ అంటే వ్యాపారం కాదురోయ్.
3.
చేసిన పనే చేస్తూ,
కొత్త రిసల్టు కావాలంటే ఎట్టా?
కల నిజమవ్వాలంటే, కృషి చెయ్యాలోయ్
4.
చూపుడు వేలెత్తేముందు,
కడుక్కో ఒకసారి నీ చేయి,
మురికిలేని చేతులు లేవోయ్
5.
జీవితం ఒక నాటకరంగం,
దేవుడికి బోరుకొడితే,
ఆ పాత్రకి చావే... కొత్తగా బతుకు.
6.
ప్రతీపనీ,రేపు చేద్దామంటే ఎలా?
జాగ్రత్తరా నాన్నా...
ఎల్లుండకి అస్సలు పనే ఉండదు.
7.
బతుకు సుఖం,చావు శాంతి
ప్రతీవాడి నొప్పీ...
ఈ మద్యలో ప్రయాణమే.
8.
దేవుడ్ని పళ్లిమ్మంటే,
నిమ్మ పళ్లిచ్చాడని,
పక్కోడి కంట్లో పిండేస్తే ఎట్టా?
9.
మనఖర్మేంటంటే... సైన్సు మహావేగం,
అది అందుకోలేని సమాజం,
అందుకేనోయ్, చాలాచోట్ల అంధకారం.
10.
ఒక్కోసారి ప్రశ్నలే కష్టం,
సమాధానాల కంటే...
మూడక్షరాలతో పోద్ది, "తెలీదు" అంటే
========================
Date: 30.07.2014

Monday, 7 July 2014

ఇల్లాలు-గజల్

పూవు పూసినప్పుడేలే తావికి ధరహాసం,
ఇల్లాలు వచ్చినప్పుడే, జీవితాన మధుమాసం

ఎగుడు,దిగుడు రహదారిది, ఎదగాయా లెన్నెన్నో,
ఓదార్పు కోరినప్పుడే, తానేగా తొలిస్నేహం

గెలుపు పిలుపు, తలుపు తడితే పులకింతే ప్రతినిమిషం
తాను ఇంటి బరువులాగితే, తిరిగెను నీమీసం

లోకమెంత పెద్దదైనా, నీవేలే తనలోకం,
అలిగిన ఆ చూపులెప్పుడూ, వెదుకును నీకోసం

నీకొచ్చిన చలిజ్వరం,తనకాయే ఉపవాసం
మాయలేని పిచ్చిమనసునీ, చెయ్యకోయి పరిహాసం

మూడుముళ్ల కెంత బలం, అనుకున్నా "కోదండా"
ఆడవారి సహనంతోనే, శోభించె ఈదేశం
===============================
Date: 07.07.2014

Wednesday, 2 July 2014

నేను ముఖ్యమంత్రిగా తలకాయ ప్రవేశం చేస్తే

ఆంధ్ర ప్రదేశ్ అనే ఒక సంద్రంలో నేనొక సింధువునై రాస్తున్న నా అభిప్రాయం. ఎప్పుడో మూడు నెళ్ల క్రితం ఒక మిత్రుడితో పంచుకున్న భావాలు. తప్పులుపట్టే విష సంస్కృతి కన్నా, తర్కిస్తూ ఒక జవాబువెదికే సంస్కారం మంచిదని నమ్ముతూ...
అ) రాజధాని:
రాజధానిగా బెజవాడ,గుంటూర్ల మద్య ప్రాంతం. ఎక్కడనుంచైనా సున్నా నుంచే మొదలవ్వాలి, అటువంటప్పుడు ఉన్నదాన్ని, పడగొట్టి కట్టే కట్టడం కన్నా కొత్తగా నిర్మించడం సులభం. కావాల్సినట్టు ఉంటుంది. రెండు నగరాల మద్యలో నిర్మాణం కనుక మరింత సులభం. ఆ నగరాలు మరో జంట నగరాలుగా వెలుగుతాయి. రాష్టానికి మద్య ప్రాంతం కావడం, విమానశ్రయ నిర్మాణానికి అనువుగా ఉండటం అదనపు అర్హత. ఇక ఉత్తరాంధ్రనుంచి వస్తే...
ఆ) చిన్న పరిశ్రమల కేంద్రం:
ఒరిస్సా, చత్తీస్ గఢ్ లకు ఉమ్మడిగా సరిహద్దు కలిగిన జిల్లా. ఎప్పటినుంచో చిన్న పరిశ్రమలకి అలవాటు పడ్డ జిల్లా. కార్మిక వర్గం ఎక్కువగా ఉన్న జిల్లా, ప్రత్యేక అర్హత.
ఇ) లలిత కళా కేంద్రం:
పూర్వ వైభవం ఈ విషయంలో విజయనగరం జిల్లాకి అర్హత కలిగిస్తుంది. విజయనగరం, విశాఖ జిల్లాల మద్య ప్రాంతం సినీ, సాంస్కృతిక వికాసానికి, అభివృద్ధికి అనువైన స్థలం. రెండు స్టూడియోలు నిర్మాణం ఈ విషయాన్ని మరింత బలపరుస్తాయి.
ఈ) ఐ.టి. కేంద్రం:
రాజధాని కాకున్నా, అంతటి ధీటైన విషయమున్న ఒకే,ఒక్క నగరం (బహుశా దేశంలోనే). ఐ.టి. కేంద్రంగా,హైదరాబాద్ తర్వాత ఎదుగుతున్న నగరం. మేనేజ్ మెంట్ కోర్సులకు మంచి అవకాశమున్న అనువైన ప్రదేశం. సహజ వనరులతో నిర్మించబడ్డ నగరం. ఖరీదైన జీవితాన్ని చవగ్గా ఇవ్వగలిగే అవకాశమున్న ప్రదేశం.
ఉ) హరిత కేంద్రం:
ఉభయ గోదావరి జిల్లాలకి మించిన అర్హత ఇంకెక్కడుంటుంది. ఆకుపచ్చతో అవనికి చీర కట్టచ్చు.
ఊ)వ్యాపార కేంద్రం:
పశ్చిమ గోదావరిలో కొంత ప్రాంతం, బెజవాడ కలిస్తే వ్యాపార, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి సాధించే అవకాశాలు చాలా ఎక్కువ. రాజధాని పక్కనే ఉండటం అదనపు అర్హత.
ఋ) న్యాయ కేంద్రం:
గుంటూరులో హైకోర్టు నిర్మాణం జరగాలి. వాణిజ్య పరంగా మంచి అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి.
ౠ)పవర్ ప్లాంట్ కేంద్రం:
థర్మల్ విద్యుత్ కేంద్రాలు నెల్లూరు, ఒంగోలుల్లో నిర్మించడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. కృష్ణపట్నంలో విద్యుత్ కేంద్రం ఒక ఉదాహఋఅణ. ఇలాంటివి మరొక్క నాలుగు సాధించ గలిగితే (3000MW) ఇక రాష్ట్రానికి తిరుగు లేదు.
ఎ) ఆధ్యాత్మిక కేంద్రం:
తిరుపతి, కాళహస్తి, కాణిపాకం .... సాక్షాత్ వైకుంఠం. మెరుగైన వసతులు కల్పిస్తే చిత్తూరు జిల్లా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఈ జిల్లాలో మధ్యం నిషేదించాలి.
ఏ)వృత్తి విధ్యా కేంద్రం:
కడపలో ఇంజనీరింగు కాలేజీలతో పాటు, ఒక విశ్వవిధ్యాలయ నిర్మాణం జరగాలి. వృత్తి,విధ్యలని విశేషంగా విస్తృత పరచడానికి తగిన సదుపాయాలు ఉన్న ప్రాంతం.
ఐ) భారీ పరిశ్రమల కేంద్రం:
భూ వనరులు ఎక్కువగా ఉన్న ప్రదేశం, కర్నూల్, అనంతపూర్ జిల్లాలు. మైనింగుకి అవకాశం, స్టీల్ ప్లాంట్ల నిర్మాణం జరపవచ్చు. భారీ పరిశ్రమలు నిర్మాణం జరిపితే ఈ ప్రాంతాలు విస్తృతంగా అభివృద్ధి చెందుతాయి. సోలార్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం జరపడానికి అవకాశమున్న ప్రదేశాలు.
అక్కడితో ఆగిపోకుండా...
1) కాకినాడ-వైజాగ్ మద్య తీర ప్రాంతాన్ని ఆయిల్ & గ్యాస్ బెల్టుగా అభివృద్ధి చెయ్యాలి.
2) వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి ప్రభుత్వ పర్యవేక్షణలో వ్యవసాయం కొనసాగించాలి.
3) ప్రభుత్వ స్కూళ్లలో 1వ తరగతినుంచి ఇంగ్లీషు మీడియం అమలుపరచి, తెలుగు తప్పనిసరి చెయ్యాలి.
4) కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్లు ఎలా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం అమలు పరిచే రిజర్వేషన్లలో ఉపాధ్యాయ, పోలీసు, వైద్య రంగాలలో రిజర్వేషన్లు అమలు పరచరాదు.
5) భూ చట్ట సవరణలు చెయ్యాలి, ఒక భూమికి రిజిస్ట్రేషన్ జరిగాక కనీసం సంవత్సరం వరకు మరొక రిజిస్ట్రేషన్ జరకుండా నిషేధించాలి.
6) ప్రతీ మండలానికి కనీసం ఇద్దరు డాక్టర్లతో 50 పడకల వైద్యకేంద్రం ఉండాలి, ప్రతీ ఆరు మండలాలకు ఒక మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షకుడిగా ఉండాలి.
ఇలాగ కనక జరిగితే నా సామిరంగా హాంకాంగ్ తయారయిపోదా...
(ఇలా జరిగితే బావుంటుందని ఒక ఆశ... అంతే... )
అక్కడితో ఆగిపోకుండా...1) కాకినాడ-వైజాగ్ మద్య తీర ప్రాంతాన్ని ఆయిల్ & గ్యాస్ బెల్టుగా అభివృద్ధి చెయ్యాలి. 2) వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి ప్రభుత్వ పర్యవేక్షణలో వ్యవసాయం కొనసాగించాలి.3) ప్రభుత్వ స్కూళ్లలో 1వ తరగతినుంచి ఇంగ్లీషు మీడియం అమలుపరచి, తెలుగు తప్పనిసరి చెయ్యాలి.4) కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్లు ఎలా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం అమలు పరిచే రిజర్వేషన్లలో ఉపాధ్యాయ, పోలీసు, వైద్య రంగాలలో రిజర్వేషన్లు అమలు పరచరాదు.5) భూ చట్ట సవరణలు చెయ్యాలి, ఒక భూమికి రిజిస్ట్రేషన్ జరిగాక కనీసం సంవత్సరం వరకు మరొక రిజిస్ట్రేషన్ జరకుండా నిషేధించాలి.6) ప్రతీ మండలానికి కనీసం ఇద్దరు డాక్టర్లతో 50 పడకల వైద్యకేంద్రం ఉండాలి, ప్రతీ ఆరు మండలాలకు ఒక మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షకుడిగా ఉండాలి.
ఇలాగ కనక జరిగితే నా సామిరంగా హాంకాంగ్ తయారయిపోదా...

ఇదిగో బెదరూ!!! నీ తెలుగు తెలుసుకో

ఇదిగో బెదరూ!!! నీ తెలుగు తెలుసుకో
=========================
ఈ మద్య తెలుగు సినిమాలలో, టీవీ సీరియళ్లలో .... ముఖ్యంగా యాంకరింగులో వాడే కొన్ని తెలుగు పదాల విశ్లేషణ... క్లుప్తంగా... 
ఎవ్వరు పుట్టించకపోతే అసలు మాటలెలా పుడతాయి, వేసుకో వీడికి రెండు.... అన్న చందాన కొన్ని మాటలు అలా పుట్టేస్తుంటాయి, అంతే. వాటి పుట్టు పూర్వత్రాలు పక్కనబెడితే... మీ అసలు ప్రశ్నకి సమాధానంలోకి వెళదాం.
1. తొక్క:- సహజంగా వొలిచి పారేసేదాన్ని తొక్క అంటారు, ఇక్కడ సదరు వ్యక్తికి రుచించని/నచ్చని ప్రతీ విషయం గురించి తొక్క అనే పదం ఉపయోగిస్తారు.
2. తొక్కలోది:- తొక్కలోనిది పండో లేక కాయో ఒలిచేవరకూ తెలియదు ఎవ్వరికైనా... అలాగే సందిగ్ధంలో సదరు వ్యక్తి ఉంటే వారు తొక్కలోది అనే పదప్రయోగం చేస్తారు.
3. పీకావులే:- కలుపు పీకితేనే పంట ఏపుగా పెరుగుతుంది అన్న సత్యం నుంచి ... పరిస్థిని మన అదుపులోకి తెచ్చుకుంటే పీకాడని, లేదంటే ఏమీ పీకలేకపోయాడని ప్రయోగం జరుగుతుంటుంది.
4.బొంగు:- వెదురు బొంగు పైకి దృఢంగా కనపడినా లోపలంతా డొల్లే అనేది ఇక్కడ అర్ధం.... పైకి తెలిసినట్టు కనపడి తర్వాత నిర్ఘాంతపోయే సందర్భంలో ఈ ప్రయోగం జరపబడుతుంటుంది.
5.అదుర్సు:- సహజంగా కంపించేది విపరీత పరిణామాలు లేదా ఊహించని మార్పులు జరిగినప్పుడే... అలాంటి సందర్భంలో ఈ ప్రయోగం.
6.చింపావులే:- తప్పురాస్తే కాగితాన్ని చింపేస్తాంగా... నువ్వు తప్పు చేసావోచ్ అని చెప్పడానికి ఈ ప్రయోగం.
7.ఇరగదీసావ్:- పొయ్యిలో పెట్టే కట్టెల్ని చిన్నవిగా/అనువుగా చెయ్యడానికి విరిపినట్లే... విషయాన్ని అతి సునాయాసంగా ఎదుటివాడికి అర్ధం అయ్యేలా చెప్పగలిగితే ఈ ప్రయోగం చెయ్యవచ్చు.
చివరగా నేను ఇరగదీసాను అని మీరు ఈ సందర్భంగా అనవచ్చు. తెలుగు దేదీప్యమానంగా వెలుగుతోంది. అందరికీ జేజేలు. మీరు ఇద్దామనుకున్న పుణ్యం మొత్తం ఇచ్చేయ్యండి సార్ (కొరియర్ చేసినా/ ఆన్లైన్ ట్రాంజాక్షన్ చేసినా అంతా మీ ఇష్టం

హల్లో స్టూడెంటుగారూ

మేము చదువుకునే రోజుల్లో, అబ్బో! మా కాలేజీ రోజుల్లో ఎంత అల్లరిచేసేవాళ్లమంటే" అని చాలామంది చెబుతూ ఉంటారు. ఆ జ్ఞాపకాలు, ఆ మధుర స్మృతులు మరొక్కసారి మిమ్మల్ని పలకరించి పోవాలని నా ఈ చిన్న ప్రయత్నం ఈ పాట ద్వారా... ఇది నిజానికి పాట కాదు, మిమ్మల్ని పలకరించే జ్ఞాపకాల ఊట...
కె.కె.//హల్లో స్టూడెంటుగారూ...//
*******************************
పల్లవి:-
హల్లో స్టూడెంటుగారూ... తగ్గాలి మీ జోరు...(2)
ఖాళీ బస్సులో సైతం వేలాడేస్తుంటారు,
క్లాసు మాస్టార్లపైనే కార్టూన్లే గీస్తారు,
(మీ)ఫ్రంట్ బెంచిలో అమ్మాయుంటే...(2)
ఈలేసి గోల్జేస్తారు
****************************************//హల్లో//
చరణం:-
క్రికెట్ మ్యాచులు చూస్తూ మీరు చిందులు వేస్తారు,
సినిమా టికెట్లకోసం మీరే ఫీజులు తీస్తారు,
పికునికులంటూ మీరు తెగ తిరిగేస్తుంటారు,
బైకు పెట్రోలుకోసం ఫాదర్ పర్సే కోస్తారు,
(మీ)ప్రోగ్రెస్ కార్డ్ ఇంటికి ఇస్తే...(2)
సంతకాలే చేసేస్తారు.
**********************************//హల్లో//
చరణం:-
ఎలెక్షన్సులో మీరు హీరోలమే అంటారు,
జోడీ సెలెక్షన్సులో ఎపుడు మీరు ముందే ఉంటారు,
కొత్త స్టూడెంట్ ని చూస్తే ర్యాగింగులు చేస్తారు,
లేడీస్ హాస్టల్ ముందే జాగింగులు చేస్తారు,
(ఫైనల్) పరీక్ష డేటుని ఎనౌన్సు చేస్తే...(2)
గుళ్లో అర్చన చేసేస్తారు.
*******************************//హల్లో//
(స్టూడెంటులంటే అబ్బాయిలేనా??? అందుకే...)
చరణం:-
ముఖసౌందర్యం కోసం మేకప్పులు వేస్తారు,
ప్రతీవాడికి మీరే నిక్ నేములు పెడతారు,
చిలిపిగ నవ్వే కళ్లే రింగుటోనుగా పెడతారు,
షాపింగ్ మాల్ బిల్లే బాయ్ ఫ్రెండుకి తోస్తారు,
(ప్రేమతో) గ్రీటింగ్ కార్డ్ చేతికి ఇస్తే...(2)
రాఖీతో బాయ్ అంటారు.
******************************//హల్లో//
Date: 16/05/2014