స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Friday, 29 June 2012

వెలుగు రేఖ

మనసు బాగాలేదని నేనే అనేస్కుని
మా ఊరి కొండెక్కి,శూన్యంలోకి చూస్తూ
సిగరెట్టు ముట్టించి,ఏదో ఆలోచిస్తూ
వేడి నిట్టూర్పులతో గడుపుతున్నవేళ
చూపు శూన్యం నుంచి,మాఊరి మాగాణ్యం
వైపు మళ్ళించా...అప్రయత్నం గా

మెల్లగా...మెల్ల,మెల్లగా మిగిలిఉన్న కాస్త
వెలుగుని ఆకాశానికి రాసిచ్చేసి సూర్యుడు
కొండ వెనక దాక్కుంటున్నాడు
ఆ రోజుకి తన డ్యూటి ముగిసిందన్నట్టు
చూస్తుండగానే చీకటి దోచేసింది
ఆకాశరాజ్యం నాదేనంటూ...
ఆ దర్పం కాసేపే అని తెలిసినా

బొమ్మరిల్లులా అనిపించింది ఆ చిత్రం
ఎన్నో దీపాలు బొమ్మరిల్లు భవనాల్లో
చందమామ కిందనే ఉన్నాదన్నట్లు
అంతలో చిన్న,చిన్న మిణుగురులు
మిణుకు,మిణుకు మంటూ పలకరిస్తున్నాయ్
అవి బొమ్మరిల్లు అందాన్ని భగ్నం చేసే
పూరిగుడిసెల్లో బుడ్డీ దీపాలు

ఇంతందం వాటివల్ల పాడయ్యిందని
సాంతం గుండెల్లో గుబులయ్యింది
గుడిసెల్ని,గుడిసెలోని మడుసుల్ని
ఊరినుంచి వెలెయ్యాలనిపించింది

మరికాసేపు అలాగే చూస్తుంటే
చుక్కల్లా కనిపిస్తున్నాయ్ వీదిదీపాలు
ఆ దీపాల వెలుగులో మండే
చిన్న,చిన్న మట్టిపొయ్యలు,

అప్పుడు నా ఆలోచనలు వేడెక్కాయ్
ఏవేవో సూచనలిస్తున్నాయ్
ఆ బుడ్డిదీపాల్లో చదివేదెందరు?
ఆ మట్టిపొయ్యల్లో వండేదెలా??

ఆవరించిన మత్తు వదిలేసింది
చూపులుండాల్సింది చుక్కల్లో కాదురా
చుట్టుపక్కలున్నదాన్ని మనసుతోటి చూడరా
నిద్రపోతే ఏముంటుందిలే
నిశీధి ఒకటే తేలుస్తుంది
పేద,గొప్పల తేడారా
అని నా గుండె తట్టి చెప్పింది
ఆరోజు వరకు నే చూడని
వెలుగురేఖని చూసా..

Thursday, 28 June 2012

తప్పదుగా నాకు

నేనెదురు పడగానే
పక్కకు జరిగే మీ కళ్ళు
తప్పుకు తిరిగే మీ కాళ్ళు
చిరాకు విసిరే మీ నొసలు
ఇవన్నీ తెలుస్తున్నా
నా మనసుని పొడుస్తున్నా
వెర్రినవ్వు నొకదాన్ని ముఖాన
పులుముకొని పలకరిస్తుంటాను
తప్పదుగా నాకు...

కొత్త పాలసీ,కొత్త స్కీం అని చెప్పడానికి
భయం తో,బాధతో,మొహమాటం తో
ఎన్నిసార్లు కుస్తీ పట్టానో నా మనసుతో
ప్రతీసారీ నేనే నెగ్గి, మనసుని తొక్కి
కొత్త భీమాపథకాన్ని,అందమైన శతకంలా
వివరిద్దామని పిచ్చి ప్రయత్నం చేస్తూ ఉంటాను
తప్పదుగా నాకు...

నాలుగు ఇంగ్లీషు ముక్కలు జోడించైనా
ఆకట్టుకోవాలని నేను ప్రయత్నిస్తుంటే
నా పీకట్టు కోవాలన్నుట్టు మీ చూపులు
అవి నేను గమనించినా
ఆ దాడి తట్టుకోక
తప్పదుగా నాకు...

"నేను పోయాక వచ్చే సుఖం గురించి
నాకే చెబుతావేంటిరా సన్నాసి" అంటూ
మీరు విసిరే చతుర్లకి చిర్రెత్తుకొచ్చినా
నోరెత్తకుండా పాలసీ మెచ్యూర్ అయ్యాకొచ్చే
డబ్బుకోసం నే చెబుతుంటాను
తప్పదుగా నాకు...

దేశం లో ఆర్దికమాంద్యం,
జరుగుతున్న రాజకీయ 'స్కాం'
బోర్డు తిప్పిన ప్రైవేట్ బాంక్.కాం
వీటన్నిటికి నేనే కారణమంటూ
నన్నో దొంగని చేసి మాట్లాడుతుంటే
చెవికింద ఒక్కటిచ్చి చుక్కలు
చూపించాలనిపిస్తుంది
అయినా చిరునవ్వుని కాపాడేస్తుంట
తప్పదుగా నాకు...

బతకడానికి బతిమాలుకుంటున్నానని,
నిరుద్యోగ సంఘం నుంచి
బలవంతంగా బహిష్కరించబడ్డ
చిరుద్యోగి నేనని.. నేనేనని
నీకు తెలిసేదెప్పుడు???

Sunday, 24 June 2012

ఆర్ద్ర మనస్కులు

ఆకాశం పారవశ్యం లో రాల్చిన
అశృ బిందువులేమో వారు
మదర్ గా ఒకరు,ఫాదర్ గా ఒకరు
జగతి గండెల్లో నిండిపోయారు

లేకపోతే ఆ కళ్ళెందుకు
కన్నీటి పరవళ్ళు తొక్కుతాయ్???
పనిచేసే పసికందుని చూస్తే..
కుష్టువ్యాధిగ్రస్తుని చూస్తే

ఆ గుండెలెందుకు బరువెక్కుతాయ్ ???
బిక్షమెత్తే అవ్వని చూస్తే...
బానిసత్వపు జనాన్ని చూస్తే
సానుభూతి సంద్రం లో మునిగిపోయిన
కాగితపు పడవలా ఆ గుండెపొరలు ఆర్ద్రతతో
ఎందుకు నిండిపోతాయ్???

ఆ నిర్మల, నిశ్చల ముఖారవిందం
చిత్రం లో చూసినా
నా మనసెందుకు సంతృప్తితో నిండిపోతుంది???

నీవు కరుణకు మరో రూపం
అవే అశృవులను నా చుట్టూ నిండి ఉన్న
ఈ జనారణ్యం లో చల్లవా
ఈ అర్ధ మనస్కులని, ఆర్ద్ర మనస్కులుగా మార్చవా

గుప్పెడు మల్లెలు-08

1) చిరునవ్వుని నీ ముఖాన చెదరనివ్వకు
    కాలం భయపడుతుంది నిన్ను నిరాశ పరిచేందుకు

2) రాజకీయం చొరబడని చోటున్నదా
    డాక్టరేట్ పట్టాలకి కూడా సిఫార్సులేకదా

3) ఒకడు పొగతాగితే అది పక్కవాడ్ని విసిగిస్తుంది
    ఒక ఇంటి కాపలా కుక్క పక్కింటివాడ్ని కరిచేస్తుంది

4) ఎన్నో శాస్త్రాలు అభ్యసించాడు మనిషి ఎప్పుడో
    క్షమశ్శాస్త్రం మాత్రం మరిచాడు..నేర్చేది ఎన్నడో

5) ఎన్నాళ్ళుంటుంది నడమంత్రపుసిరి
   ఇసుకమేడ ఉనికి వాన చినుకుతో సరి

6) రంగు నిభందన లేనిది రక్తం
    చావు,పుట్టుక లేనిదే సత్యం

7) ఎన్నిసార్లు చదివినా ఎదను కదిలించదా రసరమ్య కావ్యం
    ఎన్నిసార్లు చూసినా, ప్రతీసారి నవ్యం వసంతం

8) ఓ కవీ చుక్కల వెనక ఏముందో చూస్తావ్
    పక్కన కనిపించే నిజాలు ఎందుకు మరుస్తావ్???

9) పరీక్ష లేకుంటే ప్రతిభ అంచనా ఎలా తెలిసేది
    ఎండాకాలం లోనేకదా ఏటి పస తెలిసేది

10)ఇష్టం లేని మనసుకి మాట తలకెక్కుతుందా
    బలవంతపు ముద్ద ఒంట పడుతుందా

కాలం అంటే???

మనిషి దైవం గా ఆరాధించినా,
దెయ్యమంటూ ధూషించినా
ప్రస్థుతించినా,తిరస్కృతించినా
అన్ని భావాలకు,అన్ని బంధాలకు
అతీతమైన యోగమౌని కాలం

నిరంతర ,నిర్విరామ ప్రయాణం
దాని నైజం
కాలమహిమతో మోడు చిగురిస్తుంది
కాలం మందేస్తే గాయం మానిపోతుంది
మనిషిని తన శిశువులా లాలించే మాతృమూర్తి కాలం

అదృశ్యం గా ఉంటూనే అగుపిస్తుంది
ఉదయాస్తమయాలుగా, కదిలే ఋతుచక్రాలుగా
సృష్టిపరివర్తనానికి ప్రత్యక్ష సాక్షియైన
కాలాన్ని ఏ నిద్ర కప్పేయగలదు?
ఏ మత్తు కమ్మేయగలదు???

పంచభూతాల గతులను నిర్దేశించే కాలాన్ని
పంచాంగం లో బంధించాననుకొనే
మనిషి మందమతిని చూసి
తనలో తనే నవ్వుకుంటుంది
అశక్తతను,అదృష్టానికి అంటగట్టి
చేతగానితనాన్ని జాతకాల ముడిపెట్టే
మనిషి నైజానికి మందస్మితురాలవుతుంది

మనిషిని నడిపించే కాలాన్ని
మనిషి క్రమశిక్షణతో నడిపుకోగలిగినప్పుడే
కాలం పరవశిస్తుంది, ఆశీర్వదిస్తుంది
మనిషి మరణించినా, అతడి కీర్తిని బ్రతికిస్తుంది

Tuesday, 19 June 2012

గుప్పెడు మల్లెలు-07

1) సంతలో సరుకు కాదు...కొనేందుకు స్నేహం
   స్వచ్చ స్నేహానికి ఈ లోకమే దాసోహం

2) నక్కే ముల్లుంటాయ్ గులాబితో
   చిక్కని ముళ్ళుంటాయ్ జీవితాలలో

3) మార్చే కంటే మూర్ఖుని మనస్తత్వం
   ఇసుకనుంచి తైలం తీయుట సుఖం..సుఖం

4) ఇల్లైనా, ఒళ్ళైనా
   కూలితే ఖాళీ చేయక తప్పదు

5) అంతరంగాన మురికి ఉండగా
   ఏ గంగలో ములిగినేమి దండగ

6) దుఖాఃన్ని అప్పుడప్పుడు రానీ
   మంచుఎక్కువైనా మనగలగడం కష్టం

7) ఓడినవాడి కారణాలు విననక్కర్లేదు
   గెలిచినవాడు కారణాలు చెప్పక్కర్లేదు

8) మేడలకెక్కడ రూపం,గుడిసెలు చెమటోడ్చనిదే...
   ఎవడూ నాయకుడవ్వడు నలుగురూ నిలబెట్టనిదే...

9) అడుగు వర్గాలేనని తక్కువ చేయకు
   అడుగులు తిరగబడితే నీ నడక సాగేదెలా???

10) ప్రతిభకు కొలమానం కాదు స్థానబలం
     అడవిలోనైనా అందమే కోయిల గానం

గుప్పెడు మల్లెలు-06

1) భయపెడ్తూ ఆదరిస్తుంది అరణ్యం
    ఆహ్వానిస్తూ కబళిస్తుంది నగరం

2) స్థలం మీదే స్థానం విలువ..
   శ్మశానం లో గుడికడితే భక్తుడుండునా???

3) కన్నీళ్ళు ఆపేందుకు రుమాలు సరిపోతుందా
   సానుభూతి చూపిస్తే సమస్య తీరిపోతుందా

4) జాగ్రత్త తమ్ముడా..
   నటించే కన్నీళ్ళున్నాయ్ నీచుట్టూ

5) బావి లోతుని రెండు కాళ్ళతో
   ఒకేసారి కొలవకు... భవిష్యత్ ఉండదు

6) ఏ తరగతి వాడైనా ఇవి
   నేర్వక మానడు... కలలు...కల్లలు

7) పొదుపంటే మిగిలింది దాచడం కాదు
   దాచాక మిగిలింది తినడం

8) నిజాయితీ చాలా విలువైంది...
   నరం లేని నాలిక దగ్గర ఆశిస్తే ఎలా???

9) అవసరం లేకుండా కొంటూంటే
   చివరకి అవి అమ్ముకు బతకాల్సొస్తుంది

10) పాటలో మాట వినిపిస్తే క్లాస్ పాట...
    మోత వినిపిస్తే మాస్ పాట... నేటి సినీ విశ్లేషణ

Tuesday, 12 June 2012

మిత్రమా

అందనిదేదో అందుతుందని అపేక్షించకు మిత్రమా!!!
అందినదాన్ని అందుకునేందుకు ఉపేక్షించకు మిత్రమా!!!

ఒరుసుకుందని రాళ్ళమద్యన ఏటిపయనం ఆగునా
దాతలకోసం చేతులుచాచి నిరీక్షించకు మిత్రమా!!!

సమ్మెటేస్తే బండరాయిలే ముక్కలవ్వక ఆగునా
మాటి,మాటికి మనసునైనా పరీక్షించకు మిత్రమా!!!

తాడుతోటి బిగించి లాగితే కొండకుదురులు వచ్చునా
ప్రజ్ఞలేని ప్రయత్నమెప్పుడు సుభీక్షించదు మిత్రమా!!!

చేదుగుళికలు ఎన్నిమింగిన చెదరకోయ్ 'కోదండ'
గడచిపోయిన పీడకలలను సమీక్షించకు మిత్రమా!!!

జీవితం-గజల్

ఏ జీవితమైనా గడిచిందా ఏదో వేదన లేకుండా!!!
ఏ నాటకమైనా ముగిసిందా ఏదో వాదన లేకుండా!!!

... కలల్లోనే గడిపేస్తుంటే.. కీర్తిశిఖరం అందుతుందా
ఏ దేశమైన పురోగమించిందా ఏదో సాధన లేకుండా!!!

నీళ్ళైనా నిలకడగుంటే.. రాళ్ళల్లో నాచు మొలవదా
ఏ ధర్మమైన జన్మించిందా ఏదో శోధన లేకుండా!!!

యంత్రం ఎంత గొప్పదైనా... తానుగా నడవదులే
ఏ పాపడైనా పుడతాడా ఏదో దీవెన లేకుండా!!!

జాబిల్లి వెన్నెల చల్లితే...కలువ మురియదా "కోదండ"
ఏ మనసైనా ప్రేమిస్తుందా ఏదో స్పందన లేకుండా!!!

Wednesday, 6 June 2012

గుప్పెడు మల్లెలు-5


1.
 ప్రశ్నించే ప్రతీవాడు మేధావి కాడు,
సమాధానం తెలీనోడు
అజ్ఞానీ కాడు
2.
పనికిరానిదంటూ ఏదీ లేదులే లొకంలో,
పిండంవేళ పనిబడదా

మాలకాకితోనైనా
3.
కలముందని కాగితాన్ని నింపెయ్యకు,
సిరాతోటి నరాన్ని మీటు,

జనం గుండెల జాగృతి నాటు
4.
జనం ప్రవాహమైతే,

కొండనైనా కోసేస్తుంది,
రాజకీయమెంత రాతిముక్క.
5.
పద క్లిష్టత కాదు కవితకు ప్రమాణం,
భావం మృష్టాన్నమైతేనే

దానికి సార్ధక్యం.
6.
విమర్శతోనే విజ్ఞానం,
అరగదీస్తేనే

రాయి రత్నం అవుతుంది
7.
అనుభవించి రాస్తేనే కవిత్వమట,
చాలామంది కవులకందుకే,

సానికొంపల సాంగత్యమట
8.
వృధాప్రయాస ఏకాంతానికై,
మళ్ళీ,మళ్ళీ ప్రతిధ్వనించే

నీ జ్ఞాపకాలతో
9.
రసికత ఎరుగని చెవులుంటే రాగమేదైనా వృధా...
వెన్నెల ఎంత చిక్కగా ఉన్నా

అడవికాస్తే అంతేకదా...
10.
కొండమీద కురిసిన వాన నేల చేరక ఆగునా...
విజ్ఞానం వికసిస్తే

జనం మెప్పుకి దాగునా.

గుప్పెడు మల్లెలు-4

1.
నిందారోపణ నిమిషాలే
నీ ప్రేగుల్లో కూడా
మలినముందని తెలుసుకో
2.
అడుగు వర్గాలేనని తక్కువ చేయకు...
అడుగులు తిరగబడితే

నీ నడక సాగేదెలా???
3.
నాకు ఎల్లలు అనంతమనే మనిషి..
ఆరడుగుల నేలతో ముగిస్తాడు

తన ప్రస్థానాన్ని
4.
అపార్ధానికి అరనిమిషం చాలు,
క్షణం లో మేఘం,

సూర్యుని కమ్మినట్లు
5.
చూసిందే అయినా

ప్రతీసారి కొత్తే వసంతం,
రోజూ తినే ఇల్లాలి చేతి భోజనం లా
6.
యుద్ధంచేయనోడు వీరుడౌనా???
సమస్యకి భయపడితే

మనిషేనా...
7.
ప్రార్ధనెందుకు కురిసే మేఘం ఉంటే,
యాచనెందుకు

దానమిచ్చే మనసుంటే
8.
చిరుదోమ కుట్టినా చిరాకే,
చిన్నమాటైనా

అవమానమే అప్పుడప్పుడు
9.
ధరతో పోల్చకు హెచ్చూ,తగ్గూ..
గాలి ఉచితమని వదిలిస్తే

శ్వాస ఎలా???
10.
ఆలోచనలకి విలువెక్కడ

ఆచరణకి రానిదే,
మట్టిముద్దకి వెలవుంటుందా కుండ కానిదే..