స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Sunday, 24 June 2012

కాలం అంటే???

మనిషి దైవం గా ఆరాధించినా,
దెయ్యమంటూ ధూషించినా
ప్రస్థుతించినా,తిరస్కృతించినా
అన్ని భావాలకు,అన్ని బంధాలకు
అతీతమైన యోగమౌని కాలం

నిరంతర ,నిర్విరామ ప్రయాణం
దాని నైజం
కాలమహిమతో మోడు చిగురిస్తుంది
కాలం మందేస్తే గాయం మానిపోతుంది
మనిషిని తన శిశువులా లాలించే మాతృమూర్తి కాలం

అదృశ్యం గా ఉంటూనే అగుపిస్తుంది
ఉదయాస్తమయాలుగా, కదిలే ఋతుచక్రాలుగా
సృష్టిపరివర్తనానికి ప్రత్యక్ష సాక్షియైన
కాలాన్ని ఏ నిద్ర కప్పేయగలదు?
ఏ మత్తు కమ్మేయగలదు???

పంచభూతాల గతులను నిర్దేశించే కాలాన్ని
పంచాంగం లో బంధించాననుకొనే
మనిషి మందమతిని చూసి
తనలో తనే నవ్వుకుంటుంది
అశక్తతను,అదృష్టానికి అంటగట్టి
చేతగానితనాన్ని జాతకాల ముడిపెట్టే
మనిషి నైజానికి మందస్మితురాలవుతుంది

మనిషిని నడిపించే కాలాన్ని
మనిషి క్రమశిక్షణతో నడిపుకోగలిగినప్పుడే
కాలం పరవశిస్తుంది, ఆశీర్వదిస్తుంది
మనిషి మరణించినా, అతడి కీర్తిని బ్రతికిస్తుంది

No comments:

Post a Comment