స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Friday, 26 October 2012

గుప్పెడు మల్లెలు-18

1.
సొమ్ములున్న అత్తకి,
అమ్మప్రేమ తాకట్టు...
ఇల్లరికం
2.
ఆనందానికి
కొలమానం,
మరో ఆనందం
3.
అక్కడక్కడే తిరుగుతుంది కాలం...
గడియారంలో,
అయినా ఆపలేం
4.
"పాపం మంచోడే"అంటారు,
మంచోడు కన్నా ముందే
పాపం
5.
చావు గెలుపు కోసం పరుగు,
గెలిచాడని
పక్కోళ్ళంతా ఏడుపు
6.
ఉప్పునీళ్ళు పుక్కిళిస్తోంది
దశాబ్దాలుగా
సముద్రానికి నోటిపూతేమో,
7.
తప్పించుకోలేము,
తప్పుకోనూలేమూ,
సంసారం
8.
పక్కా ప్లానింగ్ తో
తప్పు చేసేది
మనిషొక్కడే
9.
దుర్మార్గుణ్ణి
సుఖంగా ఉండనీ...
సన్మార్గుడు బ్రతికేస్తాడు
10.
రాక, పోకల మద్య
వారధి
జీవితం...
============================
Date: 24-10-2012

కె.కె.//గుప్పెడు మల్లెలు-19//


1.
నీ ఎత్తుని చూసి గర్వపడకు,
నీ చేతికర్ర పైకెత్తితే 
ఇంకా పొడవు
2.
వ్యక్తంటే ఒకడే అనుకున్నా
ఇద్దరు... 
కనిపించేవాడు,దాక్కొనేవాడు
3.
మానవత్వ పరమాన్నం
మాడుకంపు కొడుతోంది,
విలువలు అడుగంటాయ్
4.
మదిర మత్తు మరురోజు వరకే,
మగువ మత్తు వదిలేది 
మట్టిలో కలిసాకే
5.
గుండె కిటికీ 
తెరిచిచూడు,
లోకమెంత శోకమయమో 
6.
అందం ఆరాధిస్తే
సంస్కారం,
ఆరేసేస్తే వ్యభిచారం
7.
విషాదానికి ఔషధం
సహనం...
దానిలోంచే సంగ్రామం
8.
అద్దం సిగ్గుపడే అందం ఆమె,
అది పగిలిపోయే చూపు
లోకం
9.
ప్రేమించి బాధపడకు,
అవి రెండూ
నాణానికి చెరోపక్కా
10.
గురి ఉంటే సరా???
లక్ష్యం నిర్ణయించుకో ముందు
మానవత్వ పరిధుల్లో
=========================
Date: 26/10/2012

Thursday, 18 October 2012

దసరా పండగ

పండగ..పండగ...పండగ,
దసరా పండగ,
సరదా పండగ,
మనసు పరదాలు విప్పే పండగ

పూలని కురిసే దసరాబాణం,
చిల్లర రాల్చే దసరాకట్నం,
సంతలో తిరిగే రంగులరాట్నం,
కొత్తబట్టలతో,బొమ్మల కొలువుతో
పిల్లల మనసులు కొల్లగొట్టే
పండగ...పండగ...పండగ,
సరదా దసరా పడగ

కోడిపందాల హోరా,హోరీ,
వేటకూరల వాడి,వేడి,
చీట్లపేకలతో ఆడి,పాడి,
నాటకాల పద్యాల సందడి,
యువతమనసు ఎగరేసుకుపోయే,
పండగ...పండగ...పండగ,
సరదా దసరా పడగ

కొత్తల్లుడికో ముత్యపుటుంగరం,
అల్లరిచేసే,మరదళ్ళగారం,
ఆయుధపూజల,నాగళ్ళ సోయగం,
పట్టుచీరల్లో,పుణ్యస్త్రీల పేరంటం,
పండగ...పండగ...పండగ,
సరదా దసరా పడగ
===========*==========
పైనున్నదంత గతవైభవం,
నే చెప్పినదంతా...
మసక,మసకగా కనిపిస్తున్న నా బాల్యం ,
ఇప్పుడంతా పాశ్చాత్య వైభోగం,
టి.వి.తోనే దినం,దినం సంసారం...
పల్లె... ఆ మాటకెపుడో కాలం చెల్లె
======================
తేది:17.10.2012

Saturday, 13 October 2012

అర్ధంకాని ఉద్గ్రంధం

చదువుతున్నా నేను మనుషులని,
చదివేందుకు పయత్నిస్తున్నా మనసులని,
అర్ధం అయినట్లున్నా,
అన్నీ తెలిసినట్లు అనిపిస్తున్నా,
ఇదొక అర్ధంకాని ఉద్గ్రంధం అని గ్రహిస్తున్నా.

కవ్వించే కళ్ళను చూసా,
కౌగిలిలో ఒక ప్రియుడిని దాచి,
నటిస్తున్న కన్నీళ్ళని చూసా,
గుండెల్లో క్రొధం దాచి,
చిరునవ్వుల కౌగిళ్ళను చూసా,
మాటేసిన కొడవళ్ళను దాచి,
అన్నీ తెలిసినట్లు అనిపిస్తున్నా,
ఇదొక అర్ధంకాని ఉద్గ్రంధం అని గ్రహిస్తున్నా.

ఖాదీ బట్టల్లా, సాదా,సీదాగా అగుపిస్తూ
సిల్కు తళుకులు ఒలికిస్తున్నాయ్,
శ్రావ్యమైన కోకిల గొంతుని వినిపిస్తూ
కాకి రొదతో విసిగిసున్నాయ్
గాలివాటపు కాగితంలా
జాలిమాటలు వినవస్తున్నాయ్
అన్నీ తెలిసినట్లు అనిపిస్తున్నా,
ఇదొక అర్ధంకాని ఉద్గ్రంధం అని గ్రహిస్తున్నా.

కఠినశిలలా కనిపించే మంచుహృదయం చూసా,
కాషాయం కట్టిన, కామ పిశాచిని చూసా,
మద్యతరగతి పెద్దపులి,మేకపోతు గాంభీర్యం చూసా,
సారా తాగేందుకు కారణాలు వెతుక్కునే మేధవుల్ని చూసా,
అన్నీ తెలిసినట్లు అనిపిస్తున్నా,
ఇదొక అర్ధంకాని ఉద్గ్రంధం అని గ్రహిస్తున్నా.
=================================
Date:13/10/2012

Tuesday, 9 October 2012

పున్నమి-గజల్

పున్నమి పిలిచింది, సిరిగంధం చల్లినట్లుగా,
వెన్నెల చిలికింది, నా మనసే తుళ్ళినట్లుగా,

అందానికి కొలమానం, అవనిలోన తానే,
చిలిపిగా నవ్వింది, దిక్కులన్ని కుళ్ళునట్లుగా,

నీలిరంగు తెరమీద,చిత్తరువై తానే,
సెలయేటిని నిమిరింది, నిదురలోకి మళ్ళినట్లుగా,

అలివేణి చిరుకోపం, అవధులు దాటేస్తుంటే,
చెలి చెక్కిలి తాకింది, గమ్మత్తుగ గిల్లినట్లుగా,

చెదిరివున్న చెలికాళ్ళకు, చుక్కాని తానై,
తారలన్ని హారమయ్యె, దారంతో అల్లినట్లుగా,

ఆశలపై నీళ్ళు పడితే, కోదండను తానే
మెత్తగా చరిచింది, నైరాశ్యం చెల్లినట్లుగా

Thursday, 4 October 2012

కె.కె.//గుప్పెడు మల్లెలు-17//

1.
అడక్కపోతే అమ్మైనా
పెట్టదు, అడక్కుండానే భానుభిక్ష...ఉదయం
2.
తొందరగా కళ్ళుతెరు,
సగం జీవితం గడిచిపోయిందప్పుడే
3.
పేరు చివర గాంధీ,
మరి పరిపాలనలో గాంధారి
4.
ఎవడిది ఏదారైనా
తప్పక కలిసేది వల్లకాట్లోనే
5.
కంట తడి,గుండె సడి అంటే
తెలుసా... అయితే నువ్వు కవివే
6.
సుదీర్ఘవాక్యం జీవితం,
కామా మంచమ్మీద కునికిపాట్లొద్దు
7.
మనుషులు ఇండియాలో,
మనసులమెరికాలో...ఓ వృద్ద జంట
8.
వర్షించే మేఘమైనా,గర్జిస్తూ
భయపెడుతుంది. నేర్చుకో ప్రకృతినుంచి...
9.
ఎన్ని జాగరణలో
కవిత్వం వెలిగించేందుకు
10.

అక్షరాలు రమిస్తేనే
కావ్యంపై వీక్షనలు చరించేది

కె.కె.//గుప్పెడు మల్లెలు-16//

1.
విడి,విడిగా ఉంటే రాళ్ళే,
చప్పట్లు కొడితే...నిప్పురవ్వలు
2.
చూసేది కళ్ళైతే,
గుండెకెందుకో మద్యలో బాధ
3.
ఆయన కలానికి పదును
ఎక్కువ, అన్నీ ఎర్రకవితలే
4.
ఏడుస్తారు,ఏడిపిస్తారు,ఏడుస్తార
బాల్యం,యవ్వనం,వృద్దాప్యం....జీవితచక్రం
5.
గుండెలో ముల్లు దిగితే గాయం,
గడియారం ముల్లు తిరిగితేనే అది మాయం
6.
జీవిత సాగరమధనంలో,
ప్రేమనే విషం,మరుపనే అమృతం పుట్టాయ్
7.
ఖాళీ కడుపులుగా ఉంచకు,
కాలే కడుపులుగా మారితే... నువ్వుండవ్
8.
అమ్మ ఒళ్ళో ఆర్నెల్లే,
మంచం ఒళ్ళో అరవయ్యేళ్ళు.
9.
భూమి స్ట్రాంగ్ లేడీ,
చంద్రుడు ఎన్ని చక్కర్లు కొట్టినా పడట్లేదు
10.
దేవుడు కనిపించడు,
అలాగని లేడనీ అనిపించడు...జగమే మాయ

గుప్పెడు మల్లెలు-15

1) ఎవడో  పట్టకం పెట్టాడు
తెలుపు రంగు కాస్త ముక్కలవుతోంది

2) నీకు పోటీ నువ్వే,
నిన్నటి కన్నా, ఈరోజు పరిణితి ఎంత?

3) మల్లయుద్ధంలో ఇద్దరూ
విజేతలే...మల్లెలే వాడాయి... కాదు,ఓడాయి...

4) పదిగంటల లైన్లో నించొని
దేవుడ్ని చూసి కళ్ళు మూస్తారెందుకో???

5) చూపు నింగివైపేనా?
ఎంతెత్తున్నా,పునాది కిందేరా నాన్నా

6) గతితప్పిన గాడి,
శృతితప్పిన జోడీ ఆగిపోతేనే క్షేమం

7) బతుకంతా క్రీడలే
ఆది తొట్టెక్రీడ, అంతం పాడె క్రీడ

8) ఇంగ్లీషు పేపరే వాడతాడు
ట్రైన్లో వెళ్ళేప్పుడు...జనరల్ కదా.

9) ఆర్ట్ మూవీస్కి ఆయుష్షు తక్కువ...
అర్ధమయ్యేలా రాయి కవిత్వాన్ని

10) రాజకీయం మంటపెడితే..
ప్రజాస్వామ్యం భగ్గుమంది