స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Wednesday, 5 June 2013

అలక ఆడవారి జన్మహక్కు

నా చూపులు రోడ్డుని కొలుస్తున్నాయ్,
మా మేడ మీదనుంచే...
నిర్మానుష్యం,గ్రీష్మతాపం కదా.
ఇంతలో అవి ఎదురింటి డాబా
పిట్టగోడ మీదకెక్కాయ్.

పేరుకి తగ్గట్టు అది పిట్టగోడే,
అక్కడో పావురం మెడరిక్కించి,
ఆదిక్కు,ఈదిక్కూ చూస్తోంది.
ఆచూపులో నిరీక్షణ,నాచూపు తాకింది.
సహచరుడికై తహ,తహలాడుతున్నట్టుంది.
అప్పుడప్పుడు,బొంగరంలా
ఉన్నచోటే తిరుగుతోంది.
మెడని కరుచుకుంటోంది.
రెక్కలు దులుపుకుంటోంది.
అబ్బో.. నిరీక్షణకి
అసహనం ఎక్కువే అనుకున్నాను.

వేచిచూసిన సహచరుడు
తటాలున చేరుకున్నాడు.
ఆనందంతో ఉప్పొంగి,
అతిశయాన్ని ప్రకటించింది.
అంతలోనే అలక ఆరంభించింది.
కాస్త దూరంజరిగి పెడముఖం పెట్టింది.

సహచర పక్షికి దిక్కుతోచక,
ప్రదక్షిణలతో ప్రసన్నం చేసుకునేందుకు,
ప్రయత్నం మొదలెట్టింది.
అయినా అలక,ఒక కొలిక్కి రాలేదు.
బహుసా ఇదంతా అలవాటే కాబోలు,
విప్పారిన రెక్కలతో విన్నపాలు సమర్పించింది.
దానిముందు సాగిలపడింది.

ఇంకేముంది...అలక దూదిపింజ అయ్యింది.
జంటముక్కుల జాతర మొదలయ్యింది.
జోరు,జోరుగా హోరువానలా మారింది.
వెంటనే కింద గదిలోకి నా ప్రయాణం మొదలయ్యింది.
అవునులే...
నా ముందు చాలా ప్రపంచం,
మా ఇల్లాలికి నేనే ప్రపంచం.

అయినా
అలక ఆడవారి జన్మహక్కు.
అది తీర్చడంలో ఉన్న సుఖం,
అనుభవించాలే తప్ప...
అధిక్షేపించడానికి మనమెవ్వరం.
వాట్ డూయూ సే ...
మై డియర్ కె.కె.
===========================
Date:31.05.2013

No comments:

Post a Comment