స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Friday 21 June 2013

ఏమో?

వడదెబ్బకి,దడపుట్టి పగుళ్లొచ్చిన నేల,
తొలకరి చినుకుల సాంగత్యంతో,
ఆకుపచ్చ కోక,ఆరుబయట ఆరేసింది.

అడుగంటా నీరింకి, శల్యమై,
డొక్కనిండా,పక్కటెముకలు తేలి,
దిక్కులు చూసే ఏరు,
ఆకాశపు ఆశీస్సుల అక్షింతలతో,
సర్రునలేచి జలతాండవం చేస్తోంది.

పండుటాకులు, పక్కనేవున్న ఎండుటాకులు,
దుడుకుగాలి,దూకుడుతో రాలిపోతే,
నగ్నంగా నిలబడ్డ తరుశాఖ,
వసంతం,ప్రశాంతంగా పలకరిస్తే,
పచ్చ జెండా ఎగరేస్తోంది.

బెణికిన కాలు.. కాస్త వనికించిన,
తర్వాత కాస్త విసిగించినా,
కాలమనే ఔషధాన్ని సేవిస్తూ,
క్రమ,క్రమంగా పునఃస్థితికి చేరుకుంది.

నేలపగులుకి, వానచినుకు,
ఏరు ఎండితే, జోరు వాన,
ఆకురాలితే, నవ్య వసంతం,
కాలు బెణికితే, కాల ఔషధం.
ఎక్కడికక్కడే,ఎప్పటికప్పుడే,
ప్రతీ ప్రశ్నకూ, సమాధానం.

మరి గుండె పగిలితే...
ఒక మనసు విరిగితే...
సమాధానం????????
ఒక జీసస్ నెత్తుటిచుక్కా?
ఒక మహాత్ముడి అమృతవాక్కా?
ఏమో?ఏమో??ఏమో???
===========================
Date:12.06.2013

No comments:

Post a Comment