ఒక సిల్వర్ జూబిలీ దంపతుల పెళ్లిరోజుకి నేను రాసిన ప్రశంసా పత్రం.
ఓ చిలకా-గోరింకల అంతర్మదనం
************************
ఏమిటో వీళ్ల బడాయి,
లక్ష్మీ,జగదీశ్వరుల పెళ్లయి పాతికేళ్లట,
ఆమాత్రానికే బంధుమిత్ర జయ,జయ ధ్వానాలట,
అవునులే ముచ్చటగా పెళ్లయిన మూడేరోజే,
జుట్టు,జుట్టు పట్టుకొని కొట్టుకు చస్తున్న ఈ రోజుల్లో,
పెళ్లిరోజు వెండిపండగ అంటే మాటలా,
...
అయినా సరే...
ఏమిటో వీళ్ల బడాయి,
ముగ్గురు చెల్లెళ్లకి పెళ్లిల్లుచేసారట,
చెల్లెళ్లంతా మల్లెల్లా ఉన్నా,
తాను దారమై వారిని మాలగా మార్చాడట,
అవునులే...
అమ్మకి అన్నం పెట్టడం నేరం అనుకుంటూ,
ఆలికి చీరకి చీరకొనడం భారం అనుకుంటూ,
బ్రతికేస్తున్న ఈ రోజుల్లో...
పెళ్లి చేయడమంటే... అబ్బో...
అయినా సరే...
ఏమిటో వీళ్ల బడాయి...
ఇతగాడు కోపమే ఎరగడట,
ఆవిడకి చిరునవ్వే ఆభరణమట,
ఆ మాత్రానికే వాళ్ల చెల్లెళ్లు,
ఆ చెల్లెళ్లను చేబట్టిన జతగాళ్లు,
సమయం చిక్కినప్పుడల్లా పొగిడేస్తుంటారట,
అవునులే చల్లని వెన్నెల చల్లే జాబిలికూడా,
పెరుగుతూ,తరుగుతూ
అటు,ఇటూ జరుగుతూ
అప్పుడపుడు ముఖం చాటేస్తుంటాడుగా...
ఎప్పుడూ చిరునవ్వుల మూటలంటే మాటలా,
అయినాసరే...
వాళ్లది బడాయి అంటూ
నోరు పారేసుకుంటున్నాం గానీ,
నిజానికి... ఇది భయం...
ఇకమీదట ఎవరైనా బావుంటే,
చక్కని సంసారం గడుపుతుంటే...
చిలకా గోరికల్లా ఉన్నరని అనడం మానేసి,
లక్ష్మీ,జగదీశ్వరుల్లా ఉన్నరని
అంటారేమో అన్న భయం...
============================