స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Wednesday 2 July 2014

గుప్పెడు మల్లెలు-77

1.
కురులు చిక్కగావుంటే,
కొప్పు కుదరడం సులభం,
మంచోడన్నాక...గుర్తింపు సహజం
2.
చెప్పేదెప్పుడూ తెలిసిందేగా,
వినడం మొదలెట్టు... సామిరంగా,
ఒక్క విషయమైనా తెలుస్తుంది...నీ మీదొట్టు. 
3.
ఒంటి సత్తువ తగ్గిందంటే,
ఉండదులే పెదవిమోహం,
కట్టె కాల్తున్నా... చావదులే పదవిదాహం.
4.
సృజనశక్తి నశిస్తే,భజనపాటే శరణ్యం,
రోజూ నువు కొత్తగా పుట్టకపోతే,
నీ ఉన్నతి అన్నది శూన్యం.
5.
తంబాకు నోటికి, జిలేబి సహిస్తుందా?
పెడమాటలు వినే చెవికి,
ప్రియసూక్తి రుచిస్తుందా.
6.
పెరిగిన జుట్టుకి, పెట్టిన విగ్గుకి
తేడా గుర్తించడం ఏమంత కష్టం,
కళ్లలోకి చూడు,తాత్పర్యం స్పష్టం.
7.
పదార్ధాల కల్తీ పాడుచేసేది దేహాన్నే,
పడకండిరా యువతా! మత్తులో...
పూర్తిగా ఆర్పేస్తుంది దేశాన్నే
8.
నటించే చిరునగవుల కన్నా,
నయం సుమా కసిరే బెత్తం,
మాట కాదు... మనసు చూడరా నేస్తం.
9.
అందమైన చందమామది,
మచ్చనెందుకు వెదుకుతున్నావ్?
చచ్చేటంత చిరాకుతో, బ్రతికి ఏం సాధిస్తావ్.
10.
కుక్కలు విస్తరికై కుమ్ముకుంటున్నాయ్,
పదవికోసం నాయకుడొకడు...
'చీ'అంటే అవి పోతాయ్, ఏమనాలో ఇపుడు.
==========================
Date: 17.06.2014

No comments:

Post a Comment