స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Wednesday, 2 July 2014

కడుపా... నీకు సలాం

సమయం 1.30, ఆకలి దంచేస్తోంది. ఖర్మ... ఆదివారంకూడా ఆఫీసు ఏమిటో, బాసు పెళ్లాం ముండమొయ్య. ఆదివారం అలార్మ్ మోగిన వినపడి చావదుగా మనకి... అది మన బద్దకానికి పరాకాష్ట. వెళ్లాలని ముందే తెలిసినప్పుడు ఒక్క అరగంట ముందే పక్కమీదనుంచి లేస్తే, కాస్త టిఫిన్ తిని ఆఫీసుకి తగలడేవాళ్లం. ఈ బండివాడికి ఆదివారం వచ్చేసరికి, బండి ప్రాబ్లంస్ గుర్తొస్తాయి. డ్రాపింగు మాత్రమే చెయ్యగలను సార్ అని, డ్రాప్ చేసి చక్కా ఉడాయించాడు. ఖర్మకాలి వేరేవాడి బండి ఎక్కాల్సి వచ్చింది. ఈ బండివాడు వీధి,వీధి తిరిగే మున్సిపాలిటి ఎద్దులా అన్ని చోట్ల ఆపేస్తున్నాడు. దానితోపాటు పెద్ద సౌండుతో హిందీ పాటలొకటి. ఖర్మ... చెమటకంపుతో చస్తున్నాం ఆ ఏ.సీ. కాస్త పెంచి చావరాదు. ఈ చర్చి రూట్లో తీసుకొచ్చి చచ్చాడు. రోడ్డుమొత్తం జాం అయ్యి చచ్చింది. ఈ బళ్లు తీసేదెప్పుడు? నేనింటికి తగలడేదెప్పుడు? రోడ్లు తవ్వేసారు... వీళ్ల మొహమ్మండ, ఈ పైపులైను వర్క్ వీల్లెప్పుడు చేసి తగలడతారో... అయినా వీటి గురించి ఎంత తక్కువ మాట్టాడుకుంటే అంత మంచిది. ఎవడికైనా బుర్రుండి సస్తేగా. ఒకడు రోడ్డువెయ్యడం, వేరేవాడు తవ్వడం. అబ్బో నాతిట్లు పూర్తవ్వకముందే ఇల్లు చేరుకున్నానే... అబ్బే 2.30 అయ్యింది. తొందరగానే తగలడ్డాం. ఏం వండిందో ఏమో? కాస్త రెండు చెంబుల నీళ్లు ఒంటిమీద పోసుకుని రావాలి. అబ్బో టమాటా పప్పు, వంకాయ కొత్తిమెర కారం,సాంభార్, ఫేవరెట్ ఆవకాయ... గడ్డ పెరుగు. శెహభాష్.

అమ్మయ్య... ప్రాణం కాస్త కుదుట పడింది. ఒక్క దమ్ము వెలిగిస్తే మజాగా ఉంటుంది.


సమయం 3.30 పాపం ఆ బండి ఆయన ఇలా అందరినీ డ్రాప్ చేస్తూ ఆయనెప్పుడు ఇల్లు చేరతాడో? ఆయనెప్పుడు తింటాడో? Happysu సోమవారం మద్యాహ్నం ప్రెసెంటేషన్ రెడీ అయిపోయింది, లేకపోతే బాసుతో సైతం నేనూ పరుగులెత్తాల్సి వచ్చేది. అయినా ఆయన మాత్రం కావాలని ఆదివారం రమ్మన్నాడా? ప్రెషర్ అలాంటిది. ఆయన ఎక్స్పీరియన్స్ ముందు మనమెంత? ఆ కిషోర్ కుమార్ పాట చాలా బాగుంది. మళ్లీ, మళ్లీ గుర్తొస్తోంది. కనీసం ఆ మాత్రం కాలక్షేపమైనా లేకపోతే డ్రైవర్ చిరాకెత్తిపోడు. పాపం అదే ఏ.సీలో వాళ్లూ రోజూ తిరుగుతున్నారు, ఎంత కష్టమో? పాపం చర్చిదగ్గర ప్రార్ధన చేసుకుంటుంటే ఎంత తప్పుగా అనుకున్నాను. మనం చేసే భజనలకి వాళ్లెప్పుడన్నా అలా అనుకున్నారా? మూడు రోజులకో పూజచేసి మనం ఊదర గొట్టెయ్యమూ. మంచినీళ్ల కోసం పైపులైను వేసేవాడు తవ్వక చస్తాడా? మనకు ముందే తెలిసిన ఆఫీసు పనిని సరిగ్గా ప్లాన్ చేస్కోలేదు. ఇంత పెద్ద ఊరికి కావాల్సిన నీళ్లు ప్లాన్ చెయ్యడం అంత సులభమా? ఎంత శ్రమ పడితే వాళ్లు ఈ స్థాయికొచ్చారు. అబ్బా... భుక్తాయాసంగా ఉంది. పాపం నాకు వేడి,వేడి అన్నం వడ్డించి... నేను తిన్నాక తను తిని, అన్నీ కడుక్కుంటోంది. డామిడ్... నేను ఉదయం సరైన టైముకి లేవక, వీళ్లందరినీ ఇన్ని మాటలు అనుకోవడం తప్పుగదూ...
ఓసి నీయమ్మ కడుపుమాడ, జానెడు లేవు... బారెడు మనిషి ఎన్ని తప్పులు చేయించావే. కడుపా... నీకు సలాం.

No comments:

Post a Comment