స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Tuesday, 31 January 2012

బ్రతుకు నౌక

ఎందు కొరకో ...ఎవరి కెరుక??
ఎగుడు,దిగుడుల ఈ బ్రతుకు నౌక

చిగురు పెడితే వసంతమ్మని
ఆ ఘనత నీ సొంతమని
పురుగు పడితే వాసిలేదని
ఆ దేవుని దయ రాసిలేదని
వగచి,వగచి...సొగసిపొవుటేగాని

ఎందు కొరకో ...ఎవరి కెరుక??
ఎగుడు,దిగుడుల ఈ బ్రతుకు నౌక

ఆటు,పోటుల చీట్ల పేకలా
నేసిరెవ్వరో... ఆశ,నిరాశల బ్రతుకు కోకలా
అరుణ కాంతి కౌగిట్లొ...చీకట్లు కమ్ముకొస్తయి
అలముకొన్న కారురేయి లొగిట్లొ... సిరి దివ్వెలు పుట్టుకొస్తయి

ఎందు కొరకో ...ఎవరి కెరుక??
ఎగుడు,దిగుడుల ఈ బ్రతుకు నౌక

బ్రతుకెప్పుడు కాదు వ్యర్ధం
పరికిస్తే ఉంటుంది అర్ధం
మనిషిగ బ్రతుకుటే నీ ధర్మం!!!
 

K.K.

Sunday, 29 January 2012

నేను???

ప్రగతి పథానికి శ్రీకారం నేను
ప్రజాస్వామ్య ప్రాకారం నేను

నవచైతన్యానికి పల్లకి నేను
జనపద జాగ్రుతి పల్లవి నేను

పసి పాపల చిరు నవ్వుని నేను
స్నేహానికి సిరిమువ్వని నేను

మతం మత్తు వదిలించే మాత్రని నేను
గతం గుర్తు చేసె పాత్రని నేను

అవినీతిని వణికించె చురకత్తిని నేను
శ్రమగీతిని పలికించే స్వరకర్తని నేను

మౌనంగ ఉంటూనే అక్రమాన్ని ప్రశ్నిస్తా
మంచితనం మంటల్లో ఆ క్రమాన్ని కాల్చేస్తా

K.K.

Wednesday, 25 January 2012

నీ మనసు లోకానికి దర్పణం

 కరగనిదే కొవ్వొత్తి, కాంతి పంచుతుందా???
 మరగనిదే మంచినీరు, మబ్బు రూపు కడుతుంద???
 
అరగనిదే మంచిగంధం పరిమళం ఇస్తుందా???
విరగనిదే చెట్టు కొమ్మ, సెయ్య ఉద్భావిస్తుందా???  
 
తరగనిదే శిల కడుపున శిల్పం పుడుతుందా???
తిరగనిదే మరయంత్రం, ధాన్యం బియ్యం అవుతుందా???
 
 ఫలితం వచ్చేది ఎపుడూ, పెను ప్రళయం తర్వాతే
 కష్టాలను ఓర్చినపుడే, మనిషిగా గెలిచినట్లు
 
గదిలోన దాక్కుంటే, కాలగమనం ఆగుతుందా???
మదిలోన చోటుంటే, లోకం నీ నుంచి దాగుతుందా???
 
లోకం ఎపుడూ నీ మనసుకి దర్పణం సుమా...
ప్రతిబింబం అందంగుంటే,  దేవునికి అది అర్పణం అని అర్ధం నేస్తమా!!!
 
కే.కే.

Monday, 16 January 2012

నేటి సిని గీతాలు

దీర్ఘం, తలకట్టు లేని అక్షరాలు,
ముచ్చటైన పడికట్టు లేని స్వరాలూ,
మనస్సాక్షి మడికట్టు లేని మంత్రాలు,
ఇవి మన నేటి సిని నేపధ్య గీతాలు

కసరత్తులు చేస్తూ నృత్యాలు అంటున్నారు,
బిసకత్తులు తినే పిల్లలు వాటిని చూస్తున్నారు,
సిగారోత్తులు కాల్చేందుకు పెద్దలు బారులు తీస్తున్నారు,
మరమ్మత్తు తెలీని కార్ఖానా నడిపిస్తున్నారు"
ఇవి మన నేటి సిని నేపధ్య గీతాలు

వాద్యాల హోరుకే ప్రాధాన్యం,
వాక్యాల తీరు, తెన్నూ శూన్యం,
ఎండమావిలా దప్పిక తీర్చే మాధుర్యం,
పాడాలంటే, వాడక తప్పదు 'న' గుణింతం (న, ని, న, నే)
ఇది నేటి మన  సిని నేపధ్య సంగీతం"

కృష్ణ శాస్త్రి పంచి ఇచ్చిన లాలిత్యం,
సముద్రాల వడ్డించిన సుమధుర సాహిత్యం,
శ్రీ శ్రీ పూరించిన విప్లవ శంఖం,
సినారే పూసిన (వ్రాసిన) ఇగిరిపోని గంధం,
వేటూరి అందించిన వెన్నెల వసంతం,
అన్నీ అయినవి చరిత్ర పుటలకే అంకితం..

వెర్రి తలలు వేస్తోంది తెలుగు సాహిత్యంలో  పాశ్చాత్యం
ఇది నేటి మన  సిని నేపధ్య సంగీతం"

ఈ తెగులుకి మందు ఇచ్చే వైద్యం ఎప్పుడో ???
మన తెలుగుతల్లి  పచ్హని చేలో  సేద్యం ఎన్నడో ??? 

K.K.

చెప్పాలనివుంది

చెప్పాలనివుంది... మోసంతో నా ఎద గుచ్చిన ముళ్ళున్నాయని...
చాటాలనివుంది... లోకంలో పొగ చిమ్మే విషనాగుల కళ్ళున్నాయని...

పలకరించే ప్రతివాడు, హితుడేనని తలచా ఇన్నాళ్ళు...
చెప్పాలనివుంది... కాటేసే కౌగిళ్ళున్నాయని...
చాటాలనివుంది... మాటేసె కొడవళ్ళున్నాయని...

బ్రతుకు, నటన రెండూ వేరని భావించాను ఇన్నాళ్ళు...
చెప్పాలనివుంది... వంచించే కన్నీళ్లున్నాయని...
చాటాలనివుంది... ముంచేసే పరవళ్ళున్నాయని..

అడవిలోనే... ఆపదలుండని ... అనుకున్నాను ఇన్నాళ్ళు...
చెప్పాలనివుంది... జడిపించే పొదరిళ్ళున్నాయని...
చాటాలనివుంది... కనిపించే నరకాలున్నాయని...

చెప్పాలనివుంది... మోసంతో నా ఎద గుచ్చిన ముళ్ళున్నాయని...
చాటాలనివుంది... లోకంలో పొగ చిమ్మే విషనాగుల కళ్ళున్నాయని...

K.K.

భక్తీ అంటే???

భక్తీ అంటే???
"రాజ వీదులందు, రతనాల రధమునేక్కి...
 సామాన్యుని జీవితాన్ని, నలు వీధుల నిలుపుజేసి...
 నిర్జీవ పాషాణ విగ్రహంబును నీట ముంచుటయ???"
  
"అగరొత్తుల పొగలతో...కర్పూరపు వాతలతో...
 సిరిగంధపు పూతలతో...విరి పూవుల మాలలతో...
 హాహాకారాలతో...నడివీధిన చిందులేయుటయ  ???"

 "ఉపవాసం పేరుజెప్పి, రెండురెట్లు ఫలహారం ఆరగిస్తూ...
  దీక్షబూని, పాదరక్ష విదిచినానని జెప్పి...
 బహు చక్రపు వాహనాన సవారి జేయుటాయా???"

"అలంకరణ చేస్తామని... విధ్యుత్తుని  వెచ్చిస్తూ...
 అభిషేకం కోసమంటూ... పాలు,నేలపాలు చెస్తూ...
 ప్రసాదాలు దేవునికని...మిటాయిలని నములటయా???"

"చందాలని,హుందాగా...ప్రతి ఇంట వసూల్జేసి...
 దక్షిణలని, హుండీలో దండీగా జమచేసి...
 చిందులేయడానికి...మందుని, మంచితీర్ధంలా సేవిన్చుటయా???"

కాదు, కాదు...
"జగమంతా, హృదయంలో బంధించేదే భక్తీ!!!
 పరులబాధ, మనబాధ గా భావించేదే భక్తీ!!!
 సహజీవుల సేవలో తరించేదే భక్తీ!!!
 ఎదుటవాని కాలి ముళ్ళు గుచ్చుకుంటే,నీ కంట నీరు చిమ్మేదే భక్తీ!!!

"మానవసేవను మించిన, మాధవ సేవ ఉన్నదా ఈ ధరిత్రిలో...
 మానవ జన్మ చరిత్రలో..."
 k.k.

నా అంతరాత్మ హెచ్చరిక

జాగ్రత్త తమ్ముడా!!!!!!
ఇదే నా హెచ్చరిక........
        
       " నేనొక "కవి"నని విర్రవీగి ఏవేవో రచనలు చేస్తే...
         నీ దేశపు దరిద్రాన్ని అక్షరంగా మలిస్తే...
         నీ సమాజం అన్యాయాలను ...కవితగా నువు వినిపిస్తే...
         నీ రాష్ట్రపు మతపిచ్చిని... పాటగా గానం చేస్తే...
         నువు విన్న ఆకలి కేకలు... గేయంగా స్వరపరిస్తే...
         నాయకుల  దురాక్రమణలు ...వ్యాసంగా ప్రశ్నిస్తే..."
 
"దేశభక్తులు ఆగ్రహిస్తారు...
 దేశద్రోహిగా ముద్ర వేస్తారు...
 నీ కాగితాలు చించేస్తారు...
 నీ మేధస్సుని చంపేస్తారు..."
 
"కాలువలై పారే మురికిని...
 నేలపై పరిచిన  పట్టు పరికిణి అని కీర్తించు...
 ఏరుగ పారే నెత్తురు...
 ఎరుపు రంగు అత్తరుగా వర్ణించు..."
 
జాగ్రత్త తమ్ముడా!!!!!!
ఇది నా హెచ్చరిక!!!
ఇదే నా హెచ్చరిక !!!!!
 
కే.కే.

పంచండి మానవత

"కంటితో రాసేదే కవిత,
 మనసుతో చూసేదే మమత"

"తెలియని ఏ అందాన్నో వర్ణిస్తూ..
 ఉహించని పరిణామం ఆశిస్తూ...
 ఉహల్లో చరిస్తూ...
 ప్రేమకథలు స్మరిస్తూ...
 కాలాన్ని గడిపేస్తే...
 మేధస్సుని చంపేస్తే...
 యువతకు మరి భావితెక్కడ...?????
 పురోగతికి తావెక్కడ...????"

"కత్తి కన్నా... పదునైనది కలం,
 గన్ను కన్నా.. చురుకైనది గళం..
 ఒకరిని చంపగలిగేది ఆయుధం..
 ఒక జాతిని జాగృతి చేసేది కవి మేధం"

అందుకనే మిత్రులారా అందుకోండి విన్నపం!!!!!!!

"పెంచాలి మీ కవితలు....సమతా, మమత,
 పంచాలి మీ రచనలు ....మానవత.....
 చూపించాలి  మీ కవితలు యువతకు మార్గ నిర్దేస్యకత ....... 
 అపుడే మీ రచనకు, కవితకు సార్ధకత...

కే.కే.

వన్య వేదన

"ఆకుపచ్చటి  కోకను గట్టి,
 రంగుపూలతో  రైకను చుట్టి,
 సుగంధాల పరిమళాన్ని...
 జగమంత పంచుతూ...
 ఆదరించు వేళ ... మీ నేస్తం గానే???"
 
"తూరుపు తెలవారక ముందే,
 ఇచ్చట నా తల వాకిట నందే,
 తాతలు, తండ్రులు, అమ్మమ్మలు, నానమ్మలు...
 వడి, వాడిగా అడుగులేసి...
 వ్యాయామం చేస్తుంటే...
 ఆదరించు వేళ... మీ కోడలి గానే???"
 
"మండుటెండలో నెత్తి మాడగ...
 వంటి నిండుగా చెమట తోడుగా...
 కార్మిక, కర్షక సోదరుదోక్కడు...
 కునుకు తీయ నా నీడ చేరగా...
 ఆదరించు వేళ... మీ తోబుట్టువు గానే???"
 
"అందమైన ప్రతి సంధ్యలోన...
 పసిపాపలు  ఆడుతువుంటే...
 పచ్చిక పరుపుతో, పచ్చ తివాచి తో...
 వింధ్య మరలతో, మలయ సమీరను అందిస్తూ...
 ఆదరించు వేళ... మీ తల్లిని గానే???"
 
ఆత్మ బంధువులా.. అన్ని వేళలా...
ఆదరించి... ఆశీర్వదించు...
నా గుండె చీల్చి... నా గూడు కాల్చి...
భవనాలెన్నో నిర్మిస్తున్నావ్...
మరణాన్నే నువు రమ్మనుచున్నావ్...
 
అర్ధం అయ్యేదేపుడో  ఈ వన్య వేదన...
నా ఈ అరణ్య రోదన...
 
కే.కే.

బాధ లేని దేవ్వరికీ లోకంలో???

"బాధలేని దేవ్వరికీ లోకంలో???
 బాధలేని దేదీలేదీ లోకంలో!!!"
 
"రైతుకి విద్యుత్ కొరతల బాధ...
          కల్తి విత్తుల బాధ...
 విద్యార్ధికి నెలసరి పరీక్షల బాధ...
             ఫలితాల నిరీక్షణ బాధ...
 కార్మికుడికి వేతన సవరణ బాధ...
               నేతల పిలుపుల బాధ...
 నిర్మాతకు యూనియన్ పాలసీల బాధ...
                అక్రమ పైరసీల బాధ...
 నాయకులకు బినామీ మేడల బాధ...
                  సి.బి.ఐ. దాడుల బాధ...
 
 "కాష్టానికి కర్రల బాధ...
  సత్యానికి కల్లల బాధ...
  దేశానికీ ఎల్లల బాధ...
 
"బాధ లేనిదొక్కటే ఈ లోకంలో...అదే మన బాల్యం..."
"ఏ మూల్యం చెల్లించిన...
 నీ బాల్యం తిరిగోచ్చున..."
 
"అందుకే నే చెబుతున్న...
 చింతలెన్ని ఉన్నా...
 చిరునవ్వుని వీడకన్నా!!!!'
 
కే.కే.
 

ఆలోచించి చూడు!!!

"రెండు నిముషాలు ఆలోచించి చూడు.....
 మీన, మేషాలు పక్కన పెట్టు నేడు......"
 
"చేతకానితనాన్ని, జాతకాలతో.....
 చేవలేని సత్తాని, లక్కు పేరుతో.....
 ముడివేసి సరిపెట్టుకోకు.....
 ఎండమావి వెంట నువ్వు పరుగు తీయకు......"
 
"తెగిన గాలిపటానికి ఎగురుడెంత???
 నూతి గట్టు పైన కప్ప ప్రాకుడెంత????
 నీటి పైన గాలి బుడగ కాలమెంత?????
 నడమంత్రపు సిరి కున్న నిగ్గు ఎంత??????"
 
"ఒడ్డు చేరకున్నా.. కెరటం పరుగాపునా???
 జిడ్డు కారుతున్నా ... గానుగ విసుగేక్కునా????
 గట్టు దాటలేకున్నా...  పసిపాపలు ఆగునా ????
 యత్నిస్తే సృష్టిలో...
 సకలం.. సుసాధ్యం..."  
  
 "ఏటిలోని ఈదులాడు చేప....
  గూటిలోంచి నింగికేగురు  పక్షి....
  కదిలేటి చీమ...   ...
  కావా  మనకి ఆదర్శం... 
  కళ్ళ ముందు నిదర్శనం... "   
 
"శ్రమి ఇస్తే ఉంది ఫలం...
 శ్రామలోనే ఉంది సుఖం...
 స్వేదంతో సాధించే ప్రతి గింజ బలం... బలం..."
 
"కృషితో నాస్తి దుర్భిక్షం"
 
కే.కే.  

మరువకుమా!!!

 
నీవెక్కడ బ్రతుకుతున్నా... నీ వెవ్వరి మధ్యనున్న
మరువకుమా!!!  నువు పుట్టిన, నీ పల్లెలని
పంచిచ్చే, నీ అనుభూతుల మల్లెలని
 
నీవెక్కడ బ్రతుకుతున్నా... నీ వెవ్వరి మధ్యనున్న
మరువకుమా!!! తోడబుట్టిన చెల్లెళ్ళని
బ్రతికి ఉన్న సెలయేల్లని
 
నీవెక్కడ బ్రతుకుతున్నా... నీ వెవ్వరి మధ్యనున్న
మరువకుమా!!! నీ బాల్యపు చేలికాల్లని
నిను మోసిన, వ్యధ తీర్చిన చలువ రాళ్ళని
 
నీవెక్కడ బ్రతుకుతున్నా... నీ వెవ్వరి మధ్యనున్న
మరువకుమా!!! నెత్తురు పంచిన నీ తల్లిని
విత్తును, పైరుగా మార్చిన నీ తండ్రిని
రాతిని, రత్నం చేసిన నీ గురువుని
నిను.. నిన్నుగ... అక్కున జేర్చుకొని.. సేద తీర్చు
నీ మాతృభాషని...
 
కే.కే.