స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Thursday, 19 December 2013

గుప్పెడు మల్లెలు-59

1.
ఈ పూట దగాపడ్డా,
రేపటికది పాఠమేలే,
పడ్డాక,లేవాల్సిందే
2.
గాలిలేని బంతి,
గోడక్కొడితే తిరిగొస్తుందా,
సరుకుంటేనే జరుగుబాటు
3.
దోమకుడుతుంటే చిరాకే,
కలత గుండె తొలుస్తుంటే,
మత్తునిద్రైనా కనుమరుగే
4.
బాధకన్నా బాధించేది,
భయం....
బాధలోవున్నామని గుర్తుచేస్తూ
5.
అనుకున్నదానికి,
అయినదానికి మద్యదూరం,
మనకోపం
6.
చెత్తబుట్ట ఎరుగని,
అచ్చుకాగితం,
ఒక్క కరెన్సీయే
7.
మసిబొగ్గు పులిమితేనే,
పాత్రకి మెరుగొస్తుంది,
తప్పెన్నువాడూ, తమ్ముడే
8.
ఫలిస్తుందా వృక్షం,
పచ్చని కొమ్మలు నరికేస్తే,
నిలుస్తుందా మానవత్వం,విలువలు నలిపేస్తే
9.
మెదడు పదునెక్కించే,
మాయా నవాబు,
మన ఖాళీజేబు
10.
అంతగొప్ప సూర్యుడే,
చీకటీపడీతే ఉండడే,
ఇంత మోజెందుకురా పదవంటే
=========================
Date: 19.12.2013

Tuesday, 17 December 2013

గుప్పెడు మల్లెలు-11

1.
తెలిసినట్టేవున్నా పరీక్షల్లో
రాయలేము సమాధానం,
ప్రేమ నిర్వచనంలా...
2.
మనసుకన్నా,
మేధకే పదునెక్కువ,
కదిలేది మాత్రం, మనసే
3.
జీవించడానికి,
మరణించడానికి తేడాలేదు,
ప్రేమలో ఉంటే...
4.
రసమయం ఈ జగత్తు,
రుస,రుసలాడినా పర్వాలేదు,
దేషమూ ప్రేమచెట్టు కొమ్మేలే
5.
సాగరమైనా ఆగుతుందేమో,
మనం ప్రయత్నిస్తే,
ఆపడం సాధ్యమా, మనసు ప్రేమిస్తే
6.
ప్రేమబాధకి విరుగుడేది?
ప్రేమలోపడ్డ పిచ్చోడా...
పెరుగుట విరుగుటకొరకే
7.
అద్దం ముందు నిల్చొని,
ఇద్దరం ఉన్నామంటే ఎలా?
ఎందరున్నా, మనసుభాష ఒక్కటే
8.
పువ్వులకి పొగరు,
అందంగా ఉంటాయని,
నిజానికి,అది నీ హృదయం
9.
వడగళ్లూ కాలుస్తాయ్,
అప్పుడప్పుడు...
ప్రియురాలి ఓరచూపులా
10.
కావాలంటే దొరకదు ఆనందం,
వెదుకూ...
అది అన్నింటా నిక్షిప్తం.
===============================

గుప్పెడు మల్లెలు-58

1.
పచ్చని చెట్టంటే,
పురుగు పంటికి దురదే,
రాజకీయమంటే... మరి అదే
2.
ముసిరే పొగమంచు,
ఫాను విసురుకి వీగదులే,
సంకల్పానికి సంకెళ్ళుండవ్
3.
నదులు కుమ్ముకొచ్చినా,
కడలి కౌగిలించదా,
అరిచాడని ఆప్తుడినొదిలెయ్యకు
4.
నిప్పుకణిక ఒక్కటైనా,
గడ్డికుప్ప కాలిపోదా,
దుర్మతిని దూరం పెట్టు
5.
సాగర గంభీరుడంట,
అయితే ప్రమాదమేనే...
పడవని ముంచేది కడలేరోయ్
6.
తడుస్తున్నా ఆడుతుంది నెమలి,
పరహితం కోరితే,
నిన్నాపదులే నీ ఆకలి
7.
పరదావెనక జరదాతిన్నా,
పళ్లమీద గార పడదా,
తప్పుదాగే జాగా తక్కువేలే
8.
అరిస్తేనో,తొడచరిస్తేనో,
వచ్చినట్టా కోపం? 
మౌనముని ఆగ్రహం మహాప్రళయం.
9.
పితికితే పాలిచ్చిందని,
పొడిస్తే నెత్తురురాదా,
దురాశ ముదిరితే దోపిడి కాదా
10.
ప్రశ్నలేవో మొలకెత్తుతాయ్,
పాతదారినే నడిచినా,
పరీక్షే ప్రతీదినం, జీవితం ఎంత గడిచినా
==========================
Date: 06.12.2013

గుప్పెడు మల్లెలు-57

1.
నిఖార్సైన అబద్ధం,
"ఇక్కడంతా క్షేమం,
అక్కడ క్షేమమని తలుస్తా"
2.
సంకర తెలుగు,
వంకర మాటలా...
డౌటేలేదు, అది యాంకరే
3.
నైరాశ్యం,
ఒక పాడుబడ్డ గొయ్యి,
పడ్డావో... చచ్చావే
4.
మడికట్టి గుడికెళ్లక్కర్లా,
తొడుక్కున్న వ్యక్తిత్వం,
తెల్లగావుంటే చాలు...ఉతుకు
5.
గతాన్ని రీలుగాచెయ్,
వీలుచూసి, రివీల్ చెయ్,
అనుభవం కంటే ఆప్తుడెవరు.
6.
రాసేప్పుడు నిశ్శబ్ధం కావాలి,
కాని చదివేప్పుడు...
శబ్ధం కావాలి... చప్పట్లతో
7.
ఉన్నదున్నట్టుగావుంటే,
విలువుంటుందా దేనికైనా,
కాలంతో ఆవిరవ్వాలి కోపం.
8.
మాటల్లో కొలవగలమా?
పండిన సంతృప్తి,
నిండిన మనసుదైతే
9.
సింహావలోకనం ఆలోచనకే, 
ఆవేశానిక్కాదు,
అడుగేసాక గొణుగుడొద్దు.
10.
పుస్తకం మూసేసినా,
అక్షరం వెంటాడుతోంది,
ఓ శ్రీశ్రీ! ఏం సిరా వాడావ్.
================ 
Date: 01.12.2013

Sunday, 1 December 2013

గుప్పెడు మల్లెలు-49

1.
ఎగిరిదూకే జలపాతానికి,
నిలిచి ఆగే సమయమేది,
విజ్ఞానదాహానికి విరామమేది?
2.
తెరమరుగయ్యారు,
ఎందరో త్యాగధనులు,
పదవున్నోడికే మంగళహారతులు.
3.
పరాయి విజయం,
తనదే అంటుంది,
బడాయి నిండిన నోరది.
4.
హలం అడుగంటా దిగితేనే,
పొలం పదునెక్కేది,
సమస్య లోతెరిగితేనే గెలిచేది.
5.
తేనెలో ముంచినంతనే,
వేప,తీపై పోతుందా,
మోసం ఎప్పుడు హాసం వెనుకే 
6.
నల్లపిల్లి ఎదురొస్తేనే,
వెనక్కెళ్లి పోతావ్,
ఇందరు శకునలతో ఎలాగరోయ్
7.
కొబ్బరి కొరికితేనే
తియ్యదనం,
తరచి చూస్తేనే తాత్పర్యం
8.
"అన్నీ తెలుసు" 
అనేది ఒక బ్రాంతి,
అక్కడితో ఎదుగుదలకు విశ్రాంతి.
9.
సరుకు నిఖార్సైతే
బజారులో నిలుస్తుందిలే,
ప్రతిభకి పట్టం దొరుకుతుందిలే
10.
వయసు మళ్లిందని,
పులి "మ్యావ్" అనదులే,
మనసుకి వార్ధక్యం లేదురోయ్
===================
Date: 24.08.2013

Thursday, 28 November 2013

గుప్పెడు మల్లెలు-56

1.
కత్తి బొడ్లోదాచి,
కమ్మని నిద్ర పోయినట్టే,
నీతిగా బతకడమంటే
2.
పక్షి ఘాతానికే,
పట్టుతప్పిన విమానాలున్నాయ్,
పేదా,గొప్పని తేడాలుండవ్...తెగిస్తే
3.
గిన్నె పెద్దది,గరిటె చిన్నది
వడ్డన మా చెడ్డ కష్టం,
అర్హతుండాలిగా, అందళానికి
4.
గడ్డైనా మొలవదు ఎడారిలో,
వడగళ్లవాన కురిసినా,
డబ్బుంటే డాక్టరంటే...ఎలా???
5.
పెట్టుబడి పిలిస్తే,
పెట్లో డబ్బు పలకాలిరోయ్,
అందుకో అవకాశం,అంబాని నువ్వేనోయ్.
6.
మొదట్లో భలే మజా,మద్యంతో
పోను,పోను ముగిస్తుంది, 
ఆసుపత్రి వైద్యంతో
7.
గాలింపెందుకురా నేతలేరంటూ,
పోలింగులొస్తున్నాయిగా,
నీముందే తిరుగుతారు,కాళ్లీడ్చుకుంటూ
8.
మనమద్యేవున్నా,అదృశ్యం
మహా పవర్ఫుల్...
మొబయిల్ మంత్రం
9.
సచ్చినోడి నోటిమీద,
నోటుతో మూత,
రైతన్న పేణం... సవకే
10.
పచ్చగావుంటేనే పళ్లు,చిగుళ్లు
కొట్టుకుచస్తుంటే
ఎవడిస్తాడ్రా ప్రాజెక్టులు
========================= 
Date: 26.11.2013

Thursday, 7 November 2013

గుప్పెడు మల్లెలు-55

1.
కాలినగుడ్డలో
వాసన దాగేనా,
పగిలిన గుండెలో దుఃఖం దాగేనా
2.
క్షీరం పొంగితే శుభం,
మద్యం పొంగితే విజయం,
మనసు పొంగితే... పూర్ణత్వం.
3.
సానుభూతి ఆశించకు,
అది నీటితుంపర,
తల్చుకో,నువ్వే ఒక కుంభవృష్టి
4.
ఎన్నాళ్లు నడవాలంటూ,
గుణింతాలెందుకోయ్,
నడక ఆగితే,ముఖమ్మీద ఆఖరి పిడకే
5.
కాలం ఇసుకలో కాలిగుర్తులు,
చేదు జ్ఞాపకాలు,
చల్లగాలికే చెరిగిపోతాయ్.
6.
మృత్యువుని తివాచీలా
పరిచినట్లుoది నిశ్శబ్దం,
ఒంటరితనం, మంటేలే
7.
చిల్లుంటే నీళ్లు కారతాయ్,
వంకలేనిదే
వదంతులెందుకొస్తాయ్. 
8.
పురోగతి దిద్దే
తొలి అక్షరం జాగృతి,
తట్టి లేపు.
9.
మేఘాలు కమ్మాలేగాని,
మెరుపులకేం కొదవ,
మనసుండాలేగానీ,కవితలెన్నో రావా.
10.
పెద్దలెవరో గీసిన గీత,
కులం,మతం అంటూ,
చెరిపేద్దాం రా,ప్రేమపాఠం చదువుకుంటూ.
======================
Date: 07.11.2013

గుప్పెడు మల్లెలు-54

1.
భయమెందుకోయ్ సమస్యంటే,
కాలక్షేపం ఏముంది,
లోకంలో అంతకంటే.
2.
వెదక్కు అర్ధం మంచోడంటే,
అది నువ్వేలే...
పక్కోడ్ని అర్ధం చేసుకుంటే
3. 
వేలం వేసినా,
తాళం వేసినా పాటేనా?
తెలుగు బహుక్లిష్టం సుమీ
4.
కలిమి,లేమిల 
మద్య తేడా,
వీపు,పొట్టలమద్య దూరం
5.
గుడి గుర్తొచ్చేది,
బడిలో పరీక్షలుంటేనో, 
సుడిలో చిక్కుకుంటేనో
6.
రాజరికం పోయిందట,
వారసత్వపు నాయకత్వం,
గుర్రపు పందెం నడుపుతూనే
7.
ప్రేమ ఫ్రీ,
పెళ్ళికేరా 
కావాలి డౌరీ.
8.
రాజీలేని జీవితం గడిపేది, 
అయితే మేధావి, 
లేదా పిచ్చోడు 
9.
బస్తీకూడా 
అడివిలాగుంటాది,
భాష తెలీకుంటే 
10.
జీవితమంటే
షేరింగ్ ఆటో,
సర్ధుబాటు తప్పదులే 
====================
Date:31.10.2013

Saturday, 21 September 2013

గుప్పెడు మల్లెలు-53

1.
చచ్చినా బతికేటోడు,
కీర్తిశేషుడు,
చస్తూ,బతికేటోడు మూర్తిశేషుడు
2.
చేదుమందు ఎప్పుడూ చికాకే,
రుచించని సత్యం,
ఏ మనిషికైనా పరాకే
3.
దారంతోనే పూలమాల,
దొడ్డుతాళ్లతో గొడ్డు,
మతినిబట్టే మంత్రముంటుంది.
4.
అరిటాకు చిరిగిపోదా,
ముళ్లకంప పక్కనుంటే,
వంచన,పంచనుంటే కీడేలే
5.
ఒంటిరెక్కతో,
పక్షి ఎగరలేదులే,
ఒక్కడితో ఉద్యమం సాగదులే
6.
కళ్లుమూసుకున్నంత మాత్రాన,
తెల్లవారకుండా ఆగేనా,
తెరకప్పేస్తే సత్యం దాగేనా
7.
ఉరిమితేనే తెలిసేది,
మబ్బులో దాగున్న శక్తి,
గుండె,నెత్తుటి కండే...గర్జించేవరకు
8.
గుండె శబ్ధంలోనే దాగుంది,
లబ్బు తర్వాత డబ్బు, 
చేదనేవాడెవడు,వచ్చాక ఈ జబ్బు
9.
చేయిజారితే విరిగిపోయే
కుండమీద ఎంత మోహం,
స్థిరంకాకున్నా,ఆశచవనివ్వదు దేహం.
10.
మరిగిన మబ్బే జల్లవుతుంది,
విషయం వేడెక్కితేనే
సొల్యూషన్ దొరుకుతుంది.
===================
Date: 18.09.2013

Thursday, 12 September 2013

గుప్పెడు మల్లెలు-52

1.
సుఖంపెరిగితే మెట్టవేదాంతం,
భయం తలుపు తడితే,
తడిసిపోదా సాంతం.
2.
కుప్పగా పోసేస్తే,
రాళ్లు,ఇల్లై పోతాయా?
సేకరించిన విషయం విశ్లేషించు...
3.
చేపల బజారులోచేరి,
చెడువాసనంటే ఎలా?
స్నేహానికి ముందే సరిచూసుకో
4.
నిద్రమాత్రలు ఎక్కువైతే,
తప్పదురోయ్ ఉపద్రవం,
సుఖం మితిమీరితే విషం
5.
పనిచేస్తుంటేనే,
గడియారం కాలసూచి,
మనసు దిక్సూచి
6.
తోకనూపే కుక్క తొడలమీద,
ఆకలికేక వాకిలి బయట,
డబ్బు భలే జబ్బు సుమీ
7.
మూగకొండ రగిలిందా,
మండే అగ్నిజ్వాల,
మౌనం అమాయకత్వం కాదులే
8.
పుఠం పెడితేనే,
పసిడి నిగ్గుతేలేది,
బడిసంచి బరువంటే ఎలా?
9.
మంత్రానికి చింతకాయలా?
చేతిగీతలే నిర్ణయిస్తే,
చేతల అవసరమేముందోయ్
10.
కోతిచేతికి కొబ్బరిస్తే,
కుదురుగా ఉంటుందా?
నిజాయితీకి కుర్చీవెయ్యి.
===================
Date: 12.09.2013

Wednesday, 4 September 2013

గుప్పెడు మల్లెలు-50

1.
పొగ సాగినట్టు,
నిప్పుసెగ సాగదురన్నా, ...
నిందలే వేగం,వందనాలకన్నా
2.
చొరబడే వేళ్లుంటే,
రాళ్లే పొరలవుతాయిలే,
స్థిరమతికి అసాధ్యం లేదులే.
3.
సుగ్రీవుడి బలమంతా,
చెట్టు చాటు రాముడే,
కొనుకున్న డిగ్రీకి, జీతమిస్తే దేవుడే
4.
సీత శీలానికే,
మసిపూసిన మాయాలోకం,
గాసిప్పులు గాలికొదిలేయ్.
5.
గట్టి పునాదులే,
కట్టడాన్ని నిలబెట్టేది,
బడికడదాం, ఇటుకలు పేర్చు.
6.
ఎన్నో మెట్లెక్కావ్,
ఎక్కడుంది కైవల్యం,
కాస్త కూడెట్టు,నీ జన్మ సాఫల్యం.
7.
తేట నీళ్లలోనే,ముఖం కనిపించేది,
మనసుని కడిగేయ్,
ప్రపంచం అందమైనది.
8.
విదురమాట వినివుంటే,
జరిగేదా కురుక్షేత్రం,
చెవికెక్కదులే, చెప్పినంత మాత్రం.
9.
జనవాణికి చెవి ఒగ్గందే,
ఏమౌతుందో తలియదులే,
మూడోకన్ను లేకుంటే శివుడైనా నరుడే
10.
నిప్పు రాజుకోకుంటే,
పొగ గుప్పుమంటుందిలే,
ప్రతిభ కరువైతే అసూయ మామూలే
========================
Date: 29.08.2013

గుప్పెడు మల్లెలు-51

 1.
దున్నను కదిలిస్తుందా, వాన
అందుకే ప్రతీ తప్పుకి,
దేవుడిమీదే ఆన.
2.
బద్దకస్తుడు నిద్దరోతున్నాడని,
తొలిపొద్దు ఆగుతుందా?
మంచికి,ముహుర్తం ఎందుకు?
3.
ముళ్లతో నడుస్తోంది గడియారం,
అంగట్లో ఉల్లినుంచి,
అమ్మడి మెళ్లో తాళిదాక
4.
కొవ్వు కరిగితే,
కాంతి చిమ్ముతుంది,
ఇంట్లోనైనా, నీ... ఒంట్లోనైనా
5.
చలిలో పరిగెడితేనే,
ఒంట్లో వేడిపుట్టేది,
పోరాడి గెలిస్తే, దానికి సాటేది
6.
తాత్కాలికమే అలుపు,
తెలివి, తెగువ ఉంటే
నీదేనోయ్ గెలుపు
7.
వేళ్లెంత కిందున్నా,
వటవృక్షం తలొంచుతుంది,
వచ్చేది సుడిగాలైతే
8.
కొండపైన బండ విడిస్తే,
పడేది కిందోడిమీదే,
పై పదవి, పెదవిజారితే అంతేమరి
9.
చురుక్కుమన్నా,
మిర్చీబజ్జీ రుచేవేరు,
అలిగినా అందమే ప్రియురాలు.
10.
భోజనమ్ముందు భజన బోరు,
సమస్యనొదిలి ప్రసంగిస్తే
వినేవాడు ఎవ్వరు?
====================
Date: 04.09.2013

Thursday, 22 August 2013

సమైక్యాంధ్ర గీతం

పల్లవి:-
రండోయ్... రా రండోయ్...
చేతులు కలిపి రా రండోయ్,
చేవను చూపగ రా రండోయ్,
సత్తా తెలిసేలాగ,
సర్కార్ కదిలేదాక,
జై ఆంధ్ర పోరుతో సాగండోయ్

చరణం 1 :-
ఐకమత్యమే మహాబలం,
ఇది ఎపుడో చదివిన పాఠం,
పదవి మత్తులో మరిచిందేమో,
ఇప్పటి ఢిల్లీ పీఠం,
అందరు కలిసి ముందుకి దూకి,
గొంతులు కలిపి గర్జనచేసి,
సరిహద్దుని చెరిపేద్దాం,
తొలిపొద్దుని పిలిచేద్దాం............ ||రండోయ్||
చరణం 2 :-
ఆదిపత్యమే అలంకారం,
అని తలిచెను ఏదో స్వార్ధం,
ఉద్యమానికే ఊపిరిపోసి,
చెయ్యర దాన్ని వ్యర్ధం,
వేసిన ఎత్తులు చిత్తుగ చేసి,
పెట్టిన ఆంక్షలు, పక్కకుతోసి
శృంఖలాలు తెంచేద్దాం,
శంఖం పూరించేద్దాం...............||రండోయ్||
చరణం 3 :-
తగువులెట్టి, తమాషచూసే,
శకునులు చేసిన తంత్రం,
మాతృభూమినే, ముక్కలుజేసే
ముష్కర మాయామంత్రం,
శక్తులు అన్నీ ఒకటిగజేసి,
యుక్తులు మొత్తం బద్దలుజేసి,
తొడగొట్టి నిలబడదాం,
జయకేతనం ఎగరేద్దాం..............||రండోయ్||
==============================
Date: 20/08/2013



https://soundcloud.com/kodanda-rao/jai-samaikyandhra

Tuesday, 20 August 2013

Sneham-Ghazal

గుప్పెడు మల్లెలు-48

1.
మట్టిలో దాగిన విత్తు,
మహావృక్షమై పోదా,
సత్తావుంటే, పుట్టక అడ్డుగోడా?
2.
ఏటికెదురీదితేనే,
జబ్బ సత్తువ తెలిసేది,
సంఘాన్ని సంస్కరించు
3.
అనుకున్నది దొరికిందా,
అయితే దేవుడున్నట్టే,
స్వార్ధం లేనిదెవ్వరికి?
4.
ఎండు మోడుకెంత,
ఎరువేసినా పళ్లిచ్చేనా,
ప్రతిభని గుర్తించడమూ ప్రతిభే
5.
దాహం తీరదులే,
సాగరం ఎంత పెద్దదైనా,
ఆత్మతృప్తి ఏది,దానమెరుగని కోట్లున్న
6.
పడవెళ్లిపోయిందని,
ఏరు వాపోతుందా?
నీకు,నువ్వే కడదాకా
7.
పడతావని,
భయపడుతూవుంటే,
శిఖరం అందేదెలా?
8.
అగ్గిని,గాలి పలకరిస్తే,
అడివంతా బూడిదే,
కోపానికి, అహం జోడించకు
9.
రోడ్డుపై గతుకులున్నా,
గమనం తప్పదులే,
సమస్యలన్నవి మామూలే
10.
పక్వానికొస్తేనే పండంటారు,
పలికిన మాట సార్ధక్యం,
ఆ పని చేసినపుడే
==================
Date: 18.08.2013

Tuesday, 13 August 2013

గుప్పెడు మల్లెలు-47

1.
ఐకమత్యమే మహాబలం,
మర్చిపోయిన పాఠం,
ఆదిపత్యం కోసం
2.
కర్రగుర్రమెక్కి
కదలట్లేదంటే ఎలారా?
కల్తీ నాయకుల లోకం రా
3.
ఆలి శీలరక్షణకి,
ఒరదాటని కత్తెందుకు?
ఆత్మగౌరవం కాపాడని పదవెందుకు?
4.
అలా పెరిగావెందుకోయ్,
పక్కనున్నోడు ఎదగందే,
ఏడ్చి చస్తున్నాడు,నువ్వేమీ అనందే
5.
చెమట తుడుస్తుందా
చెమికీ రుమాలు,
అలంకారానికే మన నాయకులు
6.
మండాయా మత్తెక్కిన కళ్లు,
ఎంచుకునే ముందే,
దగ్గరుంచుకోవాలి, ఒళ్లు
7.
ఊపిరాగితే అదేం శరీరం,
జనామోదం లేనిదే,
అదేం శాసనం
8.
సూదిలాంటి చూపుంటేనే
సూక్ష్మం అగుపించేది,
మందుపార్టీ నిర్ణయం,ఎవరు భరించేది?
9.
పదవీ వ్యామోహం
స్వార్ధంతో తలకెక్కింది,
ప్రజాజీవనం రోడ్డెక్కింది.
10.
ఐదేళ్లపాలనలో
యాభైయేళ్ల తిరోగమనం,
ప్రజాస్వామ్యానికి మరణం.
============================ 

Monday, 5 August 2013

స్నేహం-గజల్

మల్లె మనసులు కలిపి అల్లే దారమే స్నేహం,
నిండు గుండెలు కలిసిపాడే రాగమే స్నేహం. 

కొండ,లోయలు కంటికొకటే, మంచుతెర ముసిరేసిన
మంచి,చెడులని ఎంచిచూపే అద్దమే స్నేహం.

ఎండమావులు ఎదురుపడుతూ,ఆశలన్ని ఆవిరైతే
ఊతమిచ్చి,ఊపిరిచ్చే క్షీరమే స్నేహం.

పాతబడితే స్వర్ణమైనా,రోతపుడుతుంటుందిలే,
కాలచక్రం,చిక్కబరిచే మధురమే స్నేహం.

తనను తానే తడుపుకుంటూ, వణుకుతున్న పెదవిచూసి
గొంతుకలిపి, చింతదీర్చే నాదమే స్నేహం.

అమ్మ ఎపుడూ తోడురాదని, దైవమే గ్రహించెనేమో?
రాగబంధం, పొదిగివున్న హారమే స్నేహం.

ఒక్కడున్నా ఎక్కువేలే, కోదండ శతృవు,
వేలమంది పాడగల్గిన, వేదమే స్నేహం.
============================
Date: 04.08.2013

Friday, 2 August 2013

గుప్పెడు మల్లెలు-46

1.
పచ్చదనం
పల్లవించేది,
పండుటాకులు రాలినప్పుడే
2.
గాలి,వెలుతురు
లేదంటే ఎలా?
గుండె విండో మూసేసి
3.
మర్చిపోకురా నాన్నా,
కుర్చీకైనా చికాకే,
కదలకుండా కూర్చుంటే
4.
పక్కనోడి కాలుతొక్కితే
ప్రమాదం...
తమ్ముడూ!!! ఇది ప్రయాణం.
5.
చప్పగా ఇంకెన్నాళ్లు?
మలుపంటూ లేకుంటే,
జీవితం... పాసింజర్ రైలు.
6.
వినాలిలికదా వాదన,
అది... ప్రతివాదిదైనా,
ఒకేవైపు పడుకోదురోయ్ ఎద్దైనా
7.
కులం పిచ్చి,
గళం విప్పితే,
తమ్ముడులాంటోడైనా,తోడేలే
8.
నది,గట్టెక్కితే నాశనం,
మూర్ఖత్వం గద్దెనెక్కిందా,
తలతిక్క శాసనం.
9.
ముసిరిన పొగ చెదిరితే,
ముఖం కనిపించేస్తుంది,
ఎన్నాళ్లు తప్పు దాస్తావ్?
10.
కలుపు, వరి కాజేస్తోంది,
అన్నింటా కుట్రాలోచనే,
గెలుస్తోంది.
=================
Date: 31/07/2013

గుప్పెడు మల్లెలు-45

1.
అవసరం ఉన్నప్పుడే,
గుర్తొస్తాడు,
ఆప్తుడు, ఆ పైవాడు.
2.
పరనిందే పాయసం,
కొందరికి...
పెళ్లాంపెట్టే అన్నంతోసహా
3.
నీరేలేకుంటే,
బోరుకొట్టి ఏం లాభం?
సరుకెంతో,సరిచూసుకో
4.
పళ్లెక్కువ కాసాయని,
చెట్టు,బరువు దించదులే,
పనికి భయపడితే ఎలా?
5.
చేతకానితనం,
దాచేస్తున్నారు,
జాతకం ముసుగులో
6.
ప్రార్ధనలో ప్రతీవాడు సాధువే,
ముగిసాకే తెలుస్తుంది,
ఎవడెంత వెధవో
7.
గోళ్లే,కత్తులవుతాయ్
కత్తిరించకపోతే,
కోరికలైనా అంతే
8.
రక్తం పాడైతే,
మనుగడేది మనిషికి,
బడిలోపాఠం,గుడిలోగంట
9.
పొడిచే కాకులమద్య,
పడుకోగలిగితే,
నిన్నుమించిన దేవుడెవ్వడు.
10.
చీమలే ఆదర్శం,
మద్యతరగతికి,
అప్పుల బరువెత్తడంలో...
================
Date: 26.07.2013

గుప్పెడు మల్లెలు-44

1.
ప్రపంచమే 
ఇరుకు మంచం,
స్వార్ధం తలకెక్కితే
2.
తొణికే కుండమీదే
గొణిగే లోకమ్రా,
తడబడిందని అడులాపొద్దు.
3.
తోలినా వాలుతుంది,
మళ్లీ,మళ్లీ ఈగ,
చిక్కుముళ్లు బతుకులో మామూలే
4.
ఒంట్లోనే
ఒదిగుంటుందా,
కదిలే మనస్సు
5.
పొగమంచు కమ్మిందేమో?
మనసుకి,
మనిషికి,మనిషే కనపడ్డంలేదు.
6.
ఊటబావిలో నీటికిలోటా,
జులాయి ఊతపదంలే,
ఐలవ్యూ అనే మాట.
7.
చిచ్చు రగిలితే,
చీడ,చిగురూ ఒకటే,
కోపంలో పెద్దరికం నగుబాటే.
8.
వెలకట్టలేవోయ్,
గుప్పెడేవున్నా...
అది పెట్టే మనసైతే
9.
గునపాఠం నేర్పే,
గురువేనేమో???
ప్రతీ అనుభవం.
10.
కొండమీదెక్కినా,కోతేలే
కోటేసినంత మాత్రాన,
నోటిమాట దాగేనా?
=================
Date: 24.07.2013

Tuesday, 23 July 2013

గుప్పెడు మల్లెలు-43

1.
గుచ్చుకుందని 
నొచ్చుకోకు,
కలిపికుట్టే సూదిమొనది.
2.
వెలుగు,చీకట్లొక్కటే
ఆకాశానికి,
కారణాలు వెతక్కు వైరాగ్యానికి
3.
తమమాటే వేదమట,
పంది పొర్లే బురదే,
దానికి సెలయేరు మరి.
4.
వరదొస్తే పైర్లకే కాదు,
గట్లకికూడా ముంపే,
స్వాభిమానం సరిహద్దులెన్ను.
5.
ఎంత దాస్తావ్?కొంత పంచు,
పౌడరద్దిన ఒళ్లుకూడా,
పోయినాక నీదికాదోయ్.
6.
అడివైనా,గుడినైనా
వెన్నెలొక్కటే,
కొందరికే పై చదువా?
7.
ఎవ్వడురా రైతు,
ఎదిగే అడవికి?
స్కేలుందా విజ్ఞానపు నిడివికి?
8.
పుస్తకం తిరగేస్తేనే,
మస్తకం పదునెక్కదులే,
గుండె తలుపు తట్టాలంతే.
9.
చూపులెక్కడ
పాతేశావ్?
పుట్టినూరు పిలుస్తుంటే.
10.
సముద్రం కళ్లెర్రజేస్తే
ఉలికులికి పడతావ్?
చెమటకూడా ఉప్పునీరేనోయ్.
====================
Date: 22/07/2013

Saturday, 20 July 2013

గుప్పెడు మల్లెలు-42

1.
పువ్వుని తుంచి
అతికించలేవు.
స్నేహంతో పరిహాసాలొద్దు.
2.
శిఖరం పొగరు,
డైనమైట్లతో సరి,
ఏది శాశ్వతం?
3.
ప్రతిపొద్దుకి కోడికూత,
ఎవడి గెలుపో,
మనదన్నట్టు.
4.
కాలం వేలాడితే,
క్యాలెండర్,
తిరగబడితే థండర్.
5.
జుట్టెక్కువుంటే,
జడ కుదిరినట్టు,
గుణంతోనే గుర్తింపు.
6.
అప్పిస్తోంది మబ్బు,
తీరుస్తోంది నది,
ఎండలో మండుతూ
7.
సంతలో సంకీర్తనలా,
మూర్ఖుడికి
ఉపదేశాలేల?
8.
ఏ మందైనా,
తలకిందులే,
మనిషే కాటేస్తే.
9.
గుండె ఆడేంతవరకే,
కోరికల గుర్రం,
ఆటాగితే అంతా శూన్యం.
10.
కాల్చేసే ఆకలిచ్చినా,
దేవుడు
నిద్దరిచ్చి మేల్జేసాడు.
===============
Date:20.07.2013

Wednesday, 17 July 2013

గుప్పెడు మల్లెలు-41

1.
కళ్లన్నీ ఒకేరకం,
కనిపెట్టేదెలా?
కంటి నలుసుని.
2.
మతితప్పితే,
బూతై దిగజారుతుంది,
కోపం...ఒక శాపం.
3.
పేరుకున్న పాపం,
ఏ ఒక్కరి పేరుతోనో లేదు,
నీ ఇల్లు శుభ్రంచెయ్.
4.
కొండెక్కానని
మురిసిపోకు,
కొండ కింద మన్నే.
5.
మర్రివిత్తు చిన్నదే,
నాటితే మహావృక్షం,
ఆలోచన మంచిదైతే.
6.
మనిషన్నోడి,
సంతృప్తి,
మరభూమిలోనే
7.
దూత ఎవడో?
భూతమెవడో?
అంతర్ముఖానికి అద్దమేది?
8.
ఈదే చేతులకు
అలలు అడ్డమా?
కె.కె.కి యతిప్రాసలు కళ్లెమా?
9.
కనకం కాల్చక తప్పదు,
మెరుగులు దిద్దాలంటే,
బడిపంతులు మనవాడే.
10.
పలుకున్న వాక్యం,
దిక్కులు పలికిస్తుంది,
హలో అంటే,పొలోమంటూ...
==================
Date: 17.07.2013

గుప్పెడు మల్లెలు-40

1.
లోతులు తడిస్తేనే,
కొమ్మలు తలలూపుతాయ్,
మాట మనసుని చేరనీ
2.
ఉలికి కళవుంటే,
ప్రతీరాయీ శిల్పమే,
ప్రతీమనిషీ గ్రంధమే
3.
కొండకి తాడేస్తే,
కుదురు ఊడొస్తుందా?
ప్రయత్నించు,పరిణితితో
4.
మన బిందెలోకే,
వీధి కొళాయి నీరంతా,
స్వార్ధానికి సరిహద్దేదీ?
5.
కుళ్లిన శవమైనా,
రాబందుకి ఫలారమే,
లంచం రుచెరగదు.
6.
నీటి బుడగ,
ఏటికి గొడుగా?
ఏ ఒక్కడితో ఏదీ ఆగదు.
7.
దులిపేస్తే,
జలగ వదిలేస్తుందా?
ఉద్యమిస్తేనే ఫలితం.
8.
సింగమైనా మరో
సింగాన్ని ఛీ అనదు,
మనిషి ఏ జంతువో?
9.
అందర్ని నమ్మకు,ప్రమాదం,
అందర్నీ అనుమానించకు,
బ్రతుకు దుర్లభం.
10.
పరీక్షలొస్తేనే,
పరమాత్మ సన్నిధి,
లాభంలేని పనిచెయ్యం కదా!
==================
Date: 16.07.2013

Saturday, 13 July 2013

గుప్పెడు మల్లెలు-39


1.
ఎడారివర్షం,
బడాయికేలే,
వాగ్ధానాలు నమ్మకురోయ్
2.
చుక్కల వెలుగులో,
అక్షరాలు చదివేస్తావా?
మిడి,మిడి జ్ఞానం సరిపోదోయ్
3.
చేవగల్గిన కాళ్లకు
చేతికర్ర ఎందుకు?
ప్రతిభకు సిఫార్సులెందుకు?
4.
తొలకరిజల్లు ముందు,
ఎండ ఎరుపెక్కువే,
మార్పెప్పుడూ తీవ్రంగానే
5.
చిల్లుకుండలో,
నీళ్లు నింపి ఏం లాభం?
లోపం సవరించుకో
6.
తుఫానులో గొడుగా,
విషమించకముందే,
విజృంభించు.
7.
కాగుతుంటే పాలకు
కమ్మదనం,
కదిలే మనసే పరిమళం.
8.
అన్నం వండకపోతే
తిండి ఎలా?
సాధనతోనే ఆస్వాదన.
9.
విసనకర్రతో,
మనసు చల్లారదులే,
పై,పై జాలి కట్టిపెట్టు.
10.
పసరెంత పూసినా,
కసరత్తుండాలి,వాతానికి
అందరూ కలవాలి ప్రతిపధకానికి 
==================
Date: 14.07.2013

Friday, 12 July 2013

గుప్పెడు మల్లెలు-38

1.
సాధన కూడా శ్వాసే,
ఆగిపోతే
చచ్చినట్టే.
2.
తోటమాలే,
పూలు తొక్కితే,
పుష్పవిలాపం వినేదెవ్వడు?
3.
చిగురాకుల మద్య,
చీడపురుగులు,
నేను.. నాది...
4.
చలనంలేని నీట,
క్రిములు జన్మిస్తాయి,
బుద్ది పరిగెత్తనీ...
5.
ఆవిరి పుడితేనే,
అన్నం ఉడికేది,
ఆలోచనలు మదించు.
6.
సంద్రానికే
ఆటు,పోట్లుంటాయి,
నువ్వు,నేను ఎంత?
7.
బలవంతంగా తింటే,
ఒంటికెక్కుతుందా,
నచ్చచెప్పు... హితవు.
8.
చేవున్న చెట్టుకే,
చీడ పట్టేది,
విమర్శ దిష్టిచుక్క.
9.
బుగ్గిని ఊదేస్తేనే,
అగ్గి పుడుతుంది,
చేతనతోనే చైతన్యం.
10.
ఇది ఇండియారోయ్,
ఏదైనా దొరుకుతుంది,
ఇక్కడ వెలకు.
=================
Date: 11.07.2013

గుప్పెడు మల్లెలు-37

1.
పేడకుప్పలో చేయి,
పాడు వాసనేలే...
చర్చెందుకు మూర్ఖుడితో
2.
కుదురుతుందా,
కడలి మద్య కాపురం,
వర్ణన,వాస్తవం...చాలాదూరం.
3.
దక్షిణేస్తేనే,
తీర్ధం,ప్రసాదం,
లంచంతోనే ముక్తి,మోక్షం.
4.
అడుసుని,కడిగేసే తొందర,
అప్పుని తీర్చేందుకు
ఉండదు ఎందుకురా?
5.
ఎక్కడానికే శిఖరం,
ఏ పదవికైనా,
కాలం నిర్ధిష్టం.
6.
ఎండుగడ్డికే పాలోయ్,
దానగుణముంటే,
ఆనకట్టలేముంటాయ్.
7.
అదుపు తప్పితే,
అధోఃగతే,
అది రధమైనా,మదమైనా
8.
దొడ్డమనసైనా,
గుడ్డిదే,
బంధుప్రీతి సోకితే
9.
మద్యం మరిగినోడికి,
నైవేద్యం రుచిస్తుందా?
నీతులంటే,బూతేలే
10.
దిద్దుబాటు ఎరగని
కవిత్వముంటుందా?
సర్ధుబాటులేని జీవితముంటుందా?
=====================
Date: 10.07.2013